Wednesday, July 27, 2011

తెలుగుబాట ఇంకా భవిష్యత్తు లో తెలుగు కై చేయవలసిన కార్యక్రమాలు

వచ్చేనెల ఆగష్టు 28 వ తేదీన జరగబోయే తెలుగుబాట కార్యక్రమానికి నాందిగా ఈ రోజు జరిగిన సమావేశంలో 


ఈ క్రింది ప్రతిపాదనలు చేశాము... 
1. ఒక కొత్త తెలుగు ఖతి (ఫాంట్) రూపొందించాలి. ఈ ఫాంట్‌తో ఈ-పుస్తకాలు తయారు చేసుకుంటే, ఆ పుస్తకాల్లోని అక్షరాలు అందంగా కనిపించాలి.
2. తెలుగు బాట జరగటానికి ఒక వారం రోజులు ముందుగా అందేలా టీ షర్టులు తెలుపు, నలుపు రంగుల్లో తయారు చేయించాలి. ఈ టీ షర్టులను ముఖ్యంగా అక్కడ బాటలో పాల్గొనేవాళ్ళు ధరించాలి. ఈ టీ షర్టులకు ఎవరైనా చక్కని డిజైన్ చేస్తే, వారికి ఒక టీ షర్టు ఉచితంగా ఇవ్వబడుతుంది.
3. వెంటనే స్టిక్కర్లు, కరపత్రాలు తయారు చేయించి అందరికీ పంచాలి. తెలుగుబాట గురించి ప్రస్తావిస్తూ ఈ స్టిక్కర్లు, కరపత్రాల కోసం ముద్రించవలసిన మంచి విషయాలను తెలియజేసిన వారికి కినిగెలో పుస్తకాలు కొనడానికి రూ.50/- విలువైన గిఫ్ట్ కూపన్ ఇవ్వబడును.
4. తెలుగుబాటలో ప్రదర్శించటానికి ఒక పెద్ద బ్యానర్ తయారు చెయ్యాలి. దానికి కావలసిన ఒక చక్కని నినాదాన్ని సూచించినవారికి కినిగెలో పుస్తకాలు కొనడానికి రూ.50/- విలువైన గిఫ్ట్ కూపన్ లుఇవ్వబడును.
5. తెలుగుబాటకు సహాయకంగా ఉండటానికి వీలైనవారు Laptops, Data cards పట్టుకొని రావాలి.
---------------------------x--------------------------------------x----------------------------------------------------

భవిష్యత్తులో చేపట్టాలనుకుంటున్న ప్రకరణాలు.... (ప్రకరణం = ప్రాజెక్ట్)

1. ఒకటవ తరగతి నుంచి పదవతరగతి వరకు గల తెలుగు మీడియం పుస్తకాలలోని పాఠ్యాంశాలను డిజిటల్ రూపంలో అంతర్జాలంలో అందుబాటులో తేవాలి. ప్రస్తుతమున్న కష్టతరమైన భాషలో కాకుండా సరళతరమైన భాషలో అందించాలి. ఆ పాఠ్యాంశాలకు చక్కని రంగుల బొమ్మలు జత చేస్తూ, విద్యార్థులకు సులభంగా అర్థమవ్వడానికి యానిమేషన్లు కూడా జతచెయ్యాలి. కేవలం సిలబస్‌లో ఉన్న విషయాలు మాత్రమే కాకుండా, ఇంకా ఎక్కువ విషయాలను ప్రొందుపరచాలి. వీలైతే, నిపుణులతో వీడియోలు తయారు చేయించాలి....

2. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీషు సులభంగా నేర్చుకునే ఉపకరణాలను అంతర్జాలంలో అందుబాటులోకి తేవాలి... అంటే తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా ఉండాలి.

3. మనకున్న చట్టం ప్రకారం, ప్రతి వస్తువుపై నిబంధనలు, ఆ వస్తువు తయారు చేసిన కంపెనీ పేరు వగైరా విషయాలను తప్పనిసరిగా అది అమ్మబడే ప్రాంతంలోని భాషలోనే ముద్రించాలి. దీనికి చేయవలసిందల్లా ఆ వస్తువుపై ముద్రించిన email address లేదా ఫోన్ నెంబర్ లేదా వారి కంపెనీ వెబ్ సైట్ ద్వారా మనం తెలియజేస్తే చట్టంలోని రూల్ ప్రకారం వాళ్ళు స్థానిక భాషలో ఆయా సమాచారాలను అందించాలి. దీనిద్వారా పరోక్షంగా తెలుగులోనే చదువుకున్నవారికి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది..

-----------------------------------x------------------------------------x-------------------------------------------------------

కొన్ని చర్చించవలసిన ప్రశ్నలు...

1. ప్రపంచభాషలతో పోలిస్తే తెలుగు భాష యొక్క గొప్పతనం ఏమిటి?

2. ఇంజనీరింగ్‌లో తెలుగు ఒక సబ్జెక్ట్ గా ఉండాలి. దీనివల్ల తెలుగులో పి.హెచ్.డీ లేదా పీజీ చేసినవారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

3. కనీసం పదవతరగతి వరకు తెలుగు మీడియంలో చదవడం వల్ల విషయాలపై ఎక్కువగా అవగాహన ఉంటుంది. ఇంకా మన సంస్కృతి, సాంప్రదాయాలకు పరిరక్షించినవాళ్ళం అవుతాం.

4. ప్రస్తుతకాలంలో చదువు ఒత్తిడి వలన ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల్లో తెలుగు మీడియం విద్యార్థులు ఎక్కువా? లేదా ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు ఎక్కువా?