Wednesday, May 11, 2016

యూరప్ డైరీ - ౧

ఈ సీరీస్ కి యూరప్ డైరీ అనిపెట్టాల లేక మధ్య ఐరోపా యాత్రలు అని పేరు ఉంచాలా లేక బెర్లిన్ లోఎక్కువ రోజులున్నాను కాబట్టీ బెర్లిన్ డైరీ అ వ్రాయాలా అన్న సంశయంలో ఉన్నాను. అది ఎలాంటి సంశయం అంటే, మళ్ళీ యూరప్ యాత్ర చేసి తిరిగి వచ్చి ఇది వ్రాసేంత.
వృత్తికి సంబంధించిన పని మీద గానీ, ప్రవృత్తి వలన కలిగిన పరవశంలో గానీ యూరప్ కి సంవత్సరానికి ఒకసారైనా వెళ్ళక తప్పదు అన్న విషయం నాకర్ధమైంది. అందువలన యూరప్ లో ఉండే ఆ నాలుగైదు రోజుల గురించీ మన బ్లాగ్మిత్రులకి తెలియచేద్దామన్న చిన్న ఆశతో ఈ టపాల వెల్లువ మొదలెట్టాను.

ఈ బ్లాగు టపా వ్రాస్తున్న సమయానికి నేను యూరప్ లోని ఐదు నగరాలను రెండు దఫాలుగా పర్యటించి వచ్చాను.
రెండు సార్లూ బెర్లిన్ లో జరిగే వృత్తిపరమైన కాన్ఫరెన్స్ కోసం వెళ్ళినా సమీప భవిష్యత్తులో సొంత ఖర్చులతో యూరప్ వెళ్ళి ఒక వారం ఉండేలా ఈ యాత్రలు నన్ను ప్రేరేపించాయి.
అక్కడి జనం, సంస్కృతి, దినచర్య తీరుతెన్నులు నన్ను బాగా ఆకర్షించాయి. మరి నేను ఇతర దేశాలు వెళ్ళి చూడలేదు. అమెరికా, జపాను, సింగపురం లలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చునుగాక, కానీ ప్రస్తుతానికి నాకు ఐరోపా బాగా నచ్చేసింది. ఎంత అంటే ఈ జీవితాంతం ఐరోపా లోని వివిధ ప్రాంతాలను అర్ధం చేసుకుంటూ బ్రతికెయ్యాలనే ఆలోచనలు వచ్చేంత. వియెన్నాలోని ఒక మ్యూజియంలో ఒక చిన్న గదిలో ఉంచిన పెయింటంగులను చూస్తూ సంవత్సర కాలం గడిపెయ్యొచ్చేమో అన్నంత పరవశం కలిగించాయి అక్కడి చిత్రకళలు, వాటిని కాపాడుతూ కూడా అందరికీ ప్రదర్శించే తీరు.
డైరీ మొదటి పేజీ కనుక. అందరూ చదివేలా వ్రాస్తున్న డైరీ పేజీలు కనుక. నెలలు-సంవత్సరాలు వ్యత్యాసంతో వ్రాస్తున్న అంశాలు గనుక.
ఇందులో అన్ని నిష్పూచీలే ఉంటాయి. వ్యక్తిగత విషయాలు ఉండవు, ఉన్నా కాకతాళీయం అనేసుకోండి. దినచర్యలా కాకుండా నన్ను అత్యంత ప్రభావితం చేసిన కొద్ది విషయాలే పంచుకోబోతున్నాను.
మిగితా విషయాలు రెండో పేజీలో...