Saturday, December 4, 2010

లినక్స్ వాడకపోవటానికి గల కారణాలు

చాలా రోజులైంది బ్లాగు లో ఒక టపా రాసి. నా శిక్షణకాలం కావటం వలన నాకు సమయం అస్సలు కుదరటం లేదు.
ఇన్ని రోజులకి సమయం కూర్చుకుని ఈ బ్లాగు రాస్తున్నా!

తెలుగు వాడకాన్ని మన సంగణక యంత్రాల్లో పెంపొందింప చెయ్యటం అనేది ఇప్పుడు నా ముఖ్య లక్ష్యం
అందుకు లినక్స్ వాడకం ఒక మంచి దారి. మరి చాలా మంది లినక్స్ వాడాలంటే భయపడతారు.
ఇందుకు నేను మన ఈ-తెలుగు వారు నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన స్టాల్ లో ఒక చిన్న ప్రదర్శన మరియు అంకోపరిని తెచ్చుకునే వారికి లినక్స్ స్థాపన వంటివి ఒక రోజు నాకు ఖాళీ ఉన్న రోజు చెయ్యాలనుకుంటున్నా.
ఇది నేను ఇంకా ఈ-తెలుగు వారితో సంప్రదించి ఏ రొజు జరుగుతుందో తరువాత చెపుతాను.
అయితే సంగణక యంత్ర వాడుకర్లు లినక్స్ ను ఎందుకు వాడరో.
లేక లినక్స్ వాడకంలో వారికి ఏమి ఇబ్బంది గలదో వారు నా బ్లాగాభిముఖంగా తెలిపితే
ఆయా అంశాలను నా ప్రదర్శన లో చేర్చి వాటిపై అవగాహన కలిపిస్తాను
వృత్తిరీత్యా నిబద్ధులు ఏమీ చెయ్యలేరు వారు వారి కంపెనీ చెప్పిన నిర్వహణ వ్యవస్థనే వాడాలి
అలా కాకుండా మిగతా వారు మీ మీ అభిప్రాయాలను మీ వ్యాఖ్యలుగా ఇక్కడ పెట్టండి
అలానే ఎన్నో లినక్స్ మరియు ఇతర స్వేచ్ఛామృదోపకరణాల యొక్క డాక్యుమెంటేషన్ తెలుగులోకి అనువాదం కావలసి ఉంది అందువలన ఇటువంటి వాటికి ఎన్తమంది ఉత్సాహంగా ఉన్నారో తెలుపగలరు

॥ సత్కృతాయాస్తు మంగళం ॥

Saturday, October 23, 2010

ఉబుంటు పంపకంలో తెలుగు ఖతులను స్థాపించే విధానం

ఉబుంటు పంపకంలో by default, పోతన మరియు వేమన ఖతులు ముందుగానే స్థాపితమై ఉంటాయి. అవి కొందరికి నచ్చవచ్చు మరికొందరికి నచ్చకపోవచ్చు.
ఒకవేళ మీరు కొత్త ఖతులు స్థాపన చేయదలచుకుంటే, అదెంతో సుళువు.
ముందుగా ఆయా ఖతులను డౌన్లోడ్ చేసుకుని ఆ టీటీఎఫ్ దస్త్రాలను su గా 
/usr/share/fonts అనే ఫోల్డర్ లోకి కాపీ చేస్కోండి ఆ పై ఈ కమాండ్ ను రన్ చెయ్యండి 
fc-cache -fv
ఇది రన్ చేసాక మీ యంత్రంలోకి ఆయా ఖతులు స్థాపితమవుతాయి 
లేదా పై కమాండ్ ను రన్ చెయ్యకుండానే సిస్టంను రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది 
కొన్ని మంచి తెలుగు ఖతులు :

Tuesday, October 5, 2010

కొత్తవారికి లినక్స్ పంపకం

ఇదివరకే  లినక్స్ పంపకాల గురించి ఇక్కడ చర్చ జరిగింది చూడగలరు.
అయితే విండోస్ కంటే ఎన్నో రెట్లు మేలయినదని అనుకుంటున్నాం కదా లినక్స్ ను
అందుకని లినక్స్ కు మారదామా అంటే ఒక పెద్ద చిక్కుప్రశ్న ఏపంపకం వాడాలి అని
పక్కింటి శ్రీను డెబియన్ ది బెస్ట్ అంటాడు ఎదురింటి రాజు ఫెడోరా బెటర్ దాన్ ది బెస్ట్ అంటాడు ,
ఇక మన హేచోడీ లేదా ప్రొఫెసర్ ఆయన వాడిన రెడ్ హ్యాట్ మాత్రమే ఒక అసలైన పంపకమనీ
మిగతావి వేస్ట్ అని కొట్టిపారేస్తాడు.
అయితే లినక్స్ వాడే వారికి అన్నిరకాల వేసులుబాట్లూ ఉంటాయి.
ఇన్ని చాయిస్లు ఉన్నయ్యంటే అది ఎంత బెస్ట్ అన్నది మీరే చెప్పగలరు
ఆ మధ్య ఒక టపాలో ఎవరో ఫ్రీ సాఫ్ట్వేర్ అంటున్నారు జీవితం లో అన్ని ఫ్రీగా రావు కదా అని
ఆయనకు ఈ టపా ఎలాగోలా చేరాలి ఆయన దీన్ని చదవాలి
ఆంగ్లం చాలా చిన్ని భాష, వారి దేశం ఎంత చిన్నదో బ్రిటీష్ వారి భాష కూడా అంటే చిన్నది
వారికి ఎక్కువ పదాలు లేవు
మనం స్వాతంత్ర్యం అన్నా, స్వేచ్ఛ అన్నా, ఉచితం అన్నా
ఈ మూడింటికీ వారి దగ్గర ఒక ఫ్రీ అన్న పదమే ఉంది
(ఇంకా చెప్పాలంటే మాకు ఒక ౬ పేజీల పాఠం హిందీ ౮వ తరగతిలో ఉంది అందులో కూడా ఇండెపెండెన్స్ డే అంటే  అపరతంత్ర దినోత్సవం అన్న అర్థం వస్తుంది కానీ మనం స్వాతంత్ర్యదినోత్సవం అంటాం అంటూ ఆరు పేజీల సుత్తి)
చెప్పొచ్చేదేమిటంటే ఫ్రీ అంటే అర్థం ఉచితం కాదు తండ్రీ, ఫ్రీ అంటే స్వేచ్ఛ


అయితే నా స్వంత పూచీ మీద మీరు ఉబుంటు ని కళ్ళు మూస్కుని సారీ కళ్ళు తెరిసే అనుసంధానం చేసేస్కోండి
ఒక వేల మీరు పూణే వాసులైతే నేనే మీ వద్దకొచ్చి ఉచిత(ఫ్రీ)ముగా చేసి పెడతాను
ఉబుంటు డెబియన్ ఆధారిత పంపకం
మనం గమనించాల్సిన విషయాలు ఏమిటంటే
ప్రతీ పంపకానికి కొన్ని ప్యాకేజేస్ ఉంటాయి
అవి ఎప్పుడెప్పుడు అప్డేట్ అవుతున్నాయి
వాడుకరులు ఎంతమంది ఉన్నారు వీరిలో ఎంతమంది అంతర్జాలంలో సహాయం చేస్తున్నారు
మనకు కావాల్సిన సాఫ్ట్వేర్లు ఆ పంపకంలో ఉన్నాయా
ఇవన్నీ ముందు తెలుసుకోండి
ఇక పొతే నా సలహా ఏమిటంటే ఒక వేల మీ వద్ద అంతర్జాలం అనుసంధానించి ఉంటే ఉబుంటు మేలు
లేదా డెబియన్ బావుంటుంది.
ఉబుంటూ లో మీరు కావాల్సిన అన్ని ప్యాకేజ్లను డౌన్లోడ్ చేస్కొని మీ డెస్క్టాప్ తో ఎన్నో చెయ్యవచ్చు
తెలుగు స్థానికీకరణ కూడా ఉబుంటు లో బాగుంటుంది
నేను ప్రస్తుతం 9.10 వాడుతున్నాను
ప్రతి ఏడు ఏప్రిల్ మరియూ అక్టోబర్లలో కొత్త వెర్షన్ వస్తుంది
ప్రస్తుతం 10.04 చలామణి లో ఉంది
ఇవాలో రేపో 10.10 రాబోతోంది
అయితే చాలా మంది 10.04 లో కొన్ని అవగుణాలున్నాయని చెప్పారు
సో 9.10 లో నాకేమి గ్లిచెస్ కనపడలేదు
మీరూ అదే వాడండీ !!!!

Monday, October 4, 2010

మధురానుభూతి (ఎవరో కనుక్కోండి చూద్దాం!!)

నిజంగా ఇవాళ నా జీవిత్ంలో మరిచిపోలేని రోజు
ఒక నిష్కల్మషమైన మనిషిని కాదు కాదు దంపతుని ఇవాళ నేను కలవటం జరిగింది.
దాదాపు ఆరేళ్ళుగా బ్లాగులోకం నాకు పరిచయం, అయితే నేను ముఖాముఖీ కలిసింది ఒక వీవెన్ గారినే
అయితే ఇన్నేళ్ళకు ఒక బ్లాగ్దంపతిని కలిసాను, అదీ పుణె లో!!!!
కలవటం ఒకెత్తైతే వారి అనురాగం, ఆప్యాయతలు మరో ఎత్తు.
మన బ్లాగర్లు ఎంత సన్నిహితంగా ఉంటారో, దానికిదొక తార్కాణం.
అసలు కొన్ని సంవత్సరాల పరిచయమా లేక మరీ దగ్గర బంధువులా అన్న స్థాయిలో వారితో మాటలాడాను నేను.
పుణే వచ్చినప్పట్నుండి వీరిని కలుద్దాం అనుకున్నా, అడగక ముందే ఆయన ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు.
పైగా మా గురువు గారు, ఆచార్య రాకేశ్వర గారు కూడా వీరిని కలువమన్నారు, నాకేమో కొంచెం సిగ్గాయె, ఎలా గొలా ధైర్యం చేసి, బయలుదేరాను. ముందే ఫోన్ చేసి చిరునామా,దారి కనుక్కున్నాను.
అక్కడ వెళుతుండగా, వారు ఎలా ఉంటారో, ఎలా నన్ను స్వీకరిస్తారో అన్న భయం, బిడియం.ఎట్టకేలకు వారింటికి చేరాను. తెలుగు బ్లాగర్ల జాబితాలోకి చేరాక మొట్టమొదటి ముఖాముఖీ కలయిక వీరితోనే!!! రాకేశ్వర గారితో కలిసే అవకాశం వచ్చినా కానీ వర్షం ఒకరోజు, నా పనులతో ఒక రోజు, కలవలేక పోయాను.
ఆ విధంగా వీరిని కలిసానన్నమాట.
వెళ్ళగానే కరచాలనం తో పరిచయం, ఆ పై వారి పూర్తి కుటుంబం తో నాకు పరిచయం
వారు నాకప్పుడే ప్రముఖ బ్లాగరు అనే బిరుదు కూడా ఇచ్చేసారు( నాకున్న పాతిక పోస్టులకే???)
సరే ఆ పై మాటా మంతీ, దాదాపు ఒక ౨(రెండు) గంటల పాటూ మాటలు సాగాయి.
మన తెలుగు సంస్కృతి నుండి మొదలు, తెలుగు వాళ్ళ భావాలు, భావనలు, తీరు-తెన్ను, అన్నీ మాట్లాడేసాం. ఆ పై వారు నేను పుణె పై కొత్తలో రాసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, పుణె యొక్క గుణ-గణాలను తెలిపారు.
అప్పుడనిపించింది, నిజంగానే నేను కొన్ని విషయాల్లో మరీ సూక్ష్మంగా పరిశీలిస్తూ పుణె లోని మంచి గుణాలను దాటవేసానేమో అని.
సరే ఆ తర్వాత అతిథి సపర్యలు చేసారు.
వారి కొడుకూ, కోడలూ, మనుమడు, మనుమరాలు చూడచక్కనైన కుటుంబం వారిది.
మొత్తానికి వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు కానీ వారితో అలా మాటలాడుతూనే ఉందిపోవాలనిపించింది.
నేను వెళుతున్నప్పుడు ఆయన నాతో తోడు వస్తానంటే అప్రయత్నంగానే సరే అనేసాను.
ఆయనతో మాటలాడేందుకు మరి కొంత సమయం దొరుకుతుంది కదా అని!
అలా మేము నడుస్తూ, మాటలాడుతూ ఉన్నాము, నా గురించి, వారి స్నేహితుల గురించీ, చర్చిస్తూ, రాజకీయాల దాకా విషయాలను తీస్కెళ్ళాం. వర్షం మొదలయి జోరుగా కురుస్తోంది, బస్ స్టాప్ ఇంకా చాలా దూరంగా ఉంది, ఆయన్ని చూస్తే నేమో వయసులో చాలా పెద్దవారు, ఆ వర్షంలో ఎలా నడిచారో నాతో పాటు!!!
అక్కడ్నుండీ బస్ స్టాప్ చేరేసరికీ, వర్షం మరీ ఉద్ధృతమయింది, ఇక వారినీ కష్ట పెట్టడం ఇష్టం లేక మాటా-మంతీ పూర్తి చేసి బస్ ఎక్కాను, ఈ వర్షంలో ఆయన ఇంటికి ఎలా చేరారో ఏమో.
నాకు ఇంత బాగా కబుర్లు చెప్పే వారు ఇప్ప్టివరకూ ఎవరూ దొరకలేదు
మాటలాడితే బూతులొస్తాయి కొందరికి
మాటలాడితె ఎదుటివాడ్నో, లేక మరొకరినో వీపు చాటున నిందిస్తాడు మరొకడు.
కానీ ఇలా నిష్కల్మషంగా మాటలాడే వారు చాలా అరుదుగా దొరుకుతారు, అదీ దేశం కాని దేశంలో అయితే అది ఎంత అదృష్టం!!!
మరో రెండు రోజుల్లో కలవడానికి అపాయింట్మెంట్ తీస్కొని మరీ ఆయన్ను వదల్లేదు నేను!!
సరే ఇంతకీ ఆయనెవరో చెప్పలేదు కదూ
సస్పెన్స్
మీరె కనుక్కోండి!!!

Wednesday, September 29, 2010

సంగీత ప్రియులకోసం......

ఈ టపా చదివిన పిదప ఒక మారు ఈ వెబ్సైటును చూడండి , మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళతారు 
మన దక్షిణ భారతాన్ని మొత్తాన్ని ఒక తాటిపై నిలిపింది సంగీతమనే చెప్పాలి.
మనం అధ్యయనం చేసెడి సంగీతం - దీనినే కొందరు దక్షిణ భారత సంగీతం అని, మరికొందరు కర్ణాటక సంగీతమని అంటారు.
కన్నడ రాజుల ద్వారా పోషించబడింది కాబట్టీ ఆ పేరు వచ్చి ఉండవచ్చు అని నేననుకుంటున్నాను, నేనైతే ఎప్పటికీ కర్ణాటక సంగీతం అని మాత్రం పలుకాలంటే ఒక రకంగా ఉప్పుపలుకులు నములుతాను(ఆ భావన వల్లనే). శాస్త్రీయ సంగీతమనో, మరీ అనవలసి వస్తే కార్నాటిక్ (carnatic not karanatik) అని దాటవేస్తాను.
ఇందులో ఉన్న ప్రత్యేకలేమిటంటే, ఈ శాస్త్రమునకు ప్రధాన వాగ్గేయకారులంతా మన తెలుగువారే, పాడేవారు(ఒకప్పుడు రాజుల కొలువుల్లో-ఇప్పుడు కాదు) కూడా మనవారే ఉండేవారేమో కానీ ఈ మధ్య పాశ్చాత్యుల ప్రభావంతో మొదట పాప్, ఆ పై హిప్-హాప్, ఇప్పుడు రాక్, మెటల్ ఇంకెక్కడికో ఈ పయనం????

అయితే మన దక్షిణ భారత సంగీతకళ చాలా ప్రాచీనమైనది, ప్రపంచంలోనే!!!
ఇది చాలా జటిలమైనందువల్ల సాంకేతికంగా,కళాపరంగా కూడా చాలా నేర్పరితనం కావాలి. మన ఈ కళకు మూలం రాగం, మరియు తాళం.
రాగం అనేది స్వరముల గంభీరత్వాన్ని కొలుస్తే, తాళం అనునది వాటి రూపాంతరములను కొలుస్తుంది.
మనకి ఏడు తాళాలు మరియు డెబ్బదిరెండు మూలమైన రాగములు కలవు.
మిగితా రాగాలన్నీ వీటిపై ఆధారపడి ఉంటాయి లేదా వీటి నుండి ఉద్భవించబడ్డాయి. ఈ ౭౨ రాగాలను మేళకర్తరాగములంటారు.
౧౯ వ శతాబ్దానికి చెందిన త్యాగబ్రహ్మ(త్యాగరాజులవారు), ముత్తుస్వామి దీక్షితులవారు మరియు శ్యామశాస్త్రి గారు, కొన్ని వేల కృతులను అందించిన మహా వాగ్గేయకారులు.
మన ఈ సంగీత శాస్త్రం ముఖ్యంగా భక్తిరసప్రధానముగా ఉంది.
మనం సరిగమలు అని వాడుక భాషలో చెప్పే స్వరాలే ఈ సంగీతశాస్త్రానికి పునాది.
అన్ని రాగములు ఈ సప్తస్వరముల నుండే ఉద్భవించాయి.
ఈ సరిగమలకు గల పూర్తి నామాలు.
  • స - షడ్జమం
  • రి - రిషభం
  • గ - గంధర్వం
  • మ - మధ్యమం
  • ప - పంచమం
  • ద - దైవతం
  • ని - నిషాదం
ప్రతి  స్వరమునకు మూడు విధములు గలవు, ఇది షడ్జమమునకు మరియు పంచమమునకు వర్తించదు.
అలాగే మధ్యమమునకు కూడా రెండే విధములు కలవు.
ఒక  పక్క సౌందర్యమును మరో పక్క భక్తిని చక్కగా మేళవిస్తే తయరైన కృతులు అత్యంత మధురంగా ఉంటాయి.
భగవంతుని  సాక్షాత్కారమే ధ్యేయంగా రచింపబడిన ఈ సంగీతం ఎంతో సుందరంగా ఉంటుంది.
భగవంతుడికి, భక్తికి, భక్తునకు, సంగీతానికి అవినాభావ సంబంధం ఉంది. శివుడ్ని నాదం యొక్క ప్రతిరూపంగా
కొలుస్తాము. ఎందరో దేవతల వద్ద సంగీత వాద్యాలు ఉండటం కూడా గమనించాము.
కృష్ణుడు కూడా వేదానాం సామవేదోస్మి అన్నాడు కదా! (సామవేదం సంగీత-శృతి-గాన ముఖ్యం)
పార్వతి లాస్యానికి ప్రతిరూపం. ఎల్లప్పుడూ జ్ఞానదేవత అయిన సరస్వతిని వీణాధారిణిగానే చూస్తాం. అసలు వీణలేనిదే ఆమెను సరస్వతి అని కూడా పోల్చుకోలేము. వీణను విపంచి అని కూడా అంటారండోయ్.
లక్ష్మీ దేవి సంగీతప్రియ. శ్రీమహావిష్ణువు ఎక్కడ పడితే అక్కడ డోలు వాయించేస్తాడు.
నంది లయకు అధిష్టాన దైవం. ఇహ నారద-తుంబురులు సంగీతలోకంలో ప్రఖ్యాతులు. వారిని వైనిక-గాయకులుగా మనం గుర్తించాలి.
మొన్నామధ్య  ఎస్వీ గారి సినిమాలో కూడా ఘటోత్కచుడ్ని వీణాపాణిగా చూపారు.
ఇక గంధర్వులు, కిన్నరులు, కింపురుషులైతే ఈ విద్యకు పెట్టింది పేరు.
మన ధర్మశాస్త్రాల్లో ఈ విద్యను గంధర్వవిద్యగా చెప్పారు.
మారుతి అయిన ఆంజనేయ స్వామి హనుమద్వీణ వాయించడంలో దిట్ట. ఈనాటి చిత్ర వీణ ఈ హనుమద్వీణకు రూపాంతరం.

ఇంతటి విశిష్టత కలిగిన మన సంగీతాన్ని మనం అర్థంకాలేదనో
నాకు వంటపట్టదనో వదిలెయ్యవచ్చా!!!
పాశ్చాత్య పోకడలకు పోయి మన అరుదైన ఈ సంపదను వదులుకోగలమా.
ఇప్పటికే మన నిర్లక్ష్యం వల్ల మన దైన ఈ విద్యను అరవలు తమ కాపీరైట్లు పెట్టుకోవటం మొదలెట్టారు.
ఇది ఏమి బీసీ కాలం నాటిది కూడా కాదే
అన్నమయ్య , రామదాసుల వారికాలానిది కూడా కాదు.
నన్నడిగితే నాకు తెలిసినంత వరకూ భారతీయుడిగా మనం నేర్చే అత్యంత మోడర్న్ విద్య ఈ శాస్త్రీయ సంగీతం.
ఇందులోని మెళకువలు , ఛలక్కులు, జుగల్బందీలు, ఏ హిప్-హాప్ కు మెటల్ కు తీసిపోవు.
అనుభవించడం మొదలెట్టాక రొజుకో వింత అనుభూతి కలుగుతుంది.

అయితే ఏమిటి అంటారా....
ఇదంతా పెద్ద ఖర్చుతో పని అంటారా.
మీరు నేర్చుకోకపోయినా వినండి వినిపించండి, నక్కాబోయే భార్య "గిమ్మీ మై తాళి మై లైఫ్ ఇజ్ ఖాళీ ఖాళీ" అని
పాడేకన్న అరకొరగా ఏ త్యాగబ్రహ్మ కృతే పాడినా నేనెంతో ఆనందిస్తాను.
అలా అందరం మొండిపట్టు పట్టామంటే మన నుంచి తరలిపోతున్న వోక్స్వాగన్, డెల్, తిరిగిరాకపోయిన సంగీత ప్రియులం మనమే నన్న ట్రేడ్ మార్కు మనకు మిగిలిపోతుంది.
ఎంతో కష్టపడి రాత్రీ పగలూ ఒకటి చేసి మనకు సంపాదించారు మన త్యాగబ్రహ్మ ఈ పేరుని
దీన్ని అప్పణంగా అరవలకు వదిలివేయాలా?
ఆలోచించండి.....

ఈ వెబ్సైట్ ఖచ్చితం గా చూసి అక్కడ ఉన్న పాటలను డౌన్లోడ్ చేసి వినండి.
అదొక అలవాటు గా మార్చు కోండి.
కనీసం రోజుకొకటి వినండి. ఉచితంగా మీకు పాటలు వస్తున్నా మీరొద్దంటే మిమ్మల్ని ఎవ్వరం మార్చలేం. మన
తెలుగుజాతి ఖర్మ అని వదిలెయ్యటం తప్ప.

సంగీతప్రియుల వెబ్సైటు - sangeetha priya

నృత్య నాటిక

నృత్య నాటిక అనునది ఒక విశిష్టమైన నృత్య కళ. ఈ కళారూపంలో గాయకులు, సంగీతకారులు, నర్తకులు కలిసి ఒక కథను లేక ఒక ఘట్టాన్ని ఒక నృత్యరూపంలో ప్రదర్శిస్తారు. ఇందులో పాటలకే కాక పద్యాలకు, పదములకు కూడా స్థానం ఉంది. ఈ కళ యందు హావ-భావాలు, నటన, దుస్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అప్పుడప్పుడూ మాత్రమే నాట్యం ప్రధానాంశం అవుతుంది. ప్రతి వాగ్గేయకారుడు తన కృతిలలో ఖచ్చితంగా ఒక నృత్యనాటకాన్ని రచించడం కద్దు. మన రంగస్థల నాటకములు, కన్నడిగుల యక్షగానము, ఇదే కోవకు చెందినవి. అయితే త్యాగరాజులు వారు రాసిన నౌకా ఛరితము అను నృత్యనాటిక చాలా ప్రసిద్ధమైనది. ఇంకా ఇదే కోవలో వస్తాయి- భామా కలాపము.

Tuesday, September 21, 2010

గ్నూ/లినక్స్ పరిచయం

గ్నూ/ లినక్స్ గురించి :-(ఇందులో చాలా సాంకేతిక పదాలను తెలుగులోనే వాడాను వాటిని కింద వాటి మూల పదాలతో సహా జాబితా ఒకటి కింద ఇచ్చాను ఏమైనా మార్పులు ఉంటే దయచేసి కామెంట్ గా ఇవ్వండి)

మనం ప్రస్తుతం విస్తృతంగా వాడుతున్న సంగణక యంత్రం గురించి చాలా తక్కువ తెలుసు మనకి.
ఈ యంత్రం కనిపెట్ట బడిన తొలినాళ్ళలో దీని ఆకారం చాలా పెద్దదిగా ఉండెడిది. ఎంత పెద్దది అంటే ఒక మొత్తం గదిని నింపేంత.
ఈ సంగణక యంత్రం లో మనకు బాహ్యంగా కనిపించే కఠినాంత్రం మరియు దానిని సక్రమంగా పని చేయించే కోమలాంత్రమూ ఉంటాయి.
కోమలాంత్రము అనేది మనకు కనబడదు.
అయితే తొలి రోజుల్లో సంగణకాన్ని నడిపే కోమలాంత్రంయొక్క మూలసంజ్ఞావళి బాహ్యంగా ఉండేవి.
కోమలాంత్రాన్ని అందరూ తమకు నచ్చినట్టుగా అనుసంధానం చేస్కునే వారు(మూలసంజ్ఞావళిని మార్పిడి చెయ్యటం ద్వారా).
కానీ 6౦ వ దశకం రాగానే , సార్థవాహకాలు (స్వార్థవాహక???) కొన్ని, కోమలాంత్రం యొక్క మూలసంజ్ఞావళిని వాడుకరికి గోప్యంగా ఉంచటం మొదలెట్టాయి. దీని వల్ల సార్థవాహక సార్తవాహకాలకు బోల్లెడు ప్రయోజనాలు కానీ, ఎటొచ్చీ ఒక వాడుకరి ఆ కోమలాంత్రపు లోలోపల గల మూలసంజ్ఞావళిని పరిశీలించడం, మార్చడం కుదురేవి కావు.
అందువల్ల వాడుకరులు స్వేచ్ఛ కోల్పోయారనమాట.
అయితే ఇది ఒక ఇరవయ్యేళ్ళు అలాగే కొనసాగింది, సార్థవాహకాలు మరీ మితిమీరిపోయి అన్ని కోమలాంత్రాల్ని వాడుకరులకు, నిపుణులకు దూరం చేసాయి.
అయితే 8౦వ దశకం లో రిచార్డ్ మ్యాథ్యూ స్టాల్మాన్ అనే ఒక నిపుణుడు ఈ అరాచకత్వాన్ని ఎదిరిస్తూ
స్వేచ్ఛాపూరితకోమలాంత్ర ఉద్యమాన్ని మొదలెట్టారు.
తద్వారా అప్పట్లో పేరొందిన అత్యంత జనాదరణ పొందిన యూనిక్స్ కు వికల్పముగా కొన్ని కోమలాంత్రాలను తయారు చేసి వాటిని ఉచితంగా వాటి మూలసంజ్ఞావళి తో సహా పంచిపెట్టటం మొదలయింది - ఇది స్వేచ్ఛాపూరితకోమలాంత్రోద్యమానికి తొలి మెట్టు. అలా పుట్టిందేగ్నూ (ఆంగ్ల అక్షరాలైన G-N-U లతో తయరయింది, దాని విస్తార పదం - GNU=GNU Not Unix, ఇది ఒక ముహుర్పదము ఇందులో GNU పదే పదే పునరావృతమౌతుంది).
అలా గ్నూ కై చాలానే కోమలాంత్రాలు తయారు చేయబడ్డాయి, వాటిలో ముఖ్యమైనవి గ్నూ సి కంపైలర్(GCC), గ్నూ డిబగ్గర్(GDB), మొదలగునవి.
ఇక 9౦వ దశకం మొదల్లో లినస్ టొర్వాల్డ్స్ అనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి యూనిక్స్ యొక్క నుంగు ను అనుకరించి లినక్స్ అనే కొత్త నుంగును కనిపెట్టారు.
ఈ నుంగుపై జీ ఎన్ యూ ద్వారా ఉత్పత్తి చేసిన కోమలాంత్రాల్ని పేర్చి తయారైనదే మన గ్నూలినక్స్ నిర్వహణా వ్యవస్థ.
అందుకనే మనం ఈ నిర్వహణావ్యవస్థను గ్నూ/లినక్స్ నిర్వహణా వ్యవస్థ అనాలి. చాలా మంది లినక్స్ అని మాత్రమే సంబోధిస్తారు, ఇది చాలా తప్పు , లినక్స్ అనేది నుంగు మాత్రమే.
ఇక ఆ పై మొదలు ఇది అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండటంవలన(మూలశాసనపదాలతో సహా), ఎవరికి నచ్చినట్టూ వారు దీనిని మార్చుకోవచ్చు.
అందువలననే గ్నూ/లినక్స్ కు ఇన్ని రకాల పంపిణీలు ఉన్నాయి. రెడ్ హ్యాట్, ఫెడోరా, మాండ్రివా, ఉబుంటూ, ఓపెన్ సూసీ, డెబియన్, అచ్చంగా మన తెలుగులో తయారైన పంపిణీ-స్వేచ్ఛ. మున్నగువి ఇంకా చాలా చాలా ఉన్నయి.
ఈఎక్స్టీ-2, ఈక్ష్టీ-3 మరియు ఈ ఎక్స్టీ-4 అను విశిష్టమైన దస్త్ర వ్యవస్థ ను వాడటం వల్ల గ్నూ/లినక్స్ వాడుకర్లకు అసలు చాలా ఉపయోగాలున్నాయి.
ఇంకా ఇదే కాకుండా గ్నూ/లినక్స్ వాడుకర్లు, వారిలోనిపుణులు, కలిసి ఈ గ్నూ/లినక్స్ వ్యవస్థ కోసం చాలా కోమలాంత్రాలను రాసారు, రాస్తున్నారు, రాస్తారు కూడా.
మూలసంజ్ఞావళి (ఉచితంగా) అందుబాటులో ఉన్నందున స్థానికీకరణ కూడా చాలా సులువైంది.
తెలుగులోనే పూర్తి స్థాయి నిర్వహణా వ్యవస్థలు ఉన్నాయి.
ఉదాహరణకు: స్వేచ్ఛ, ఉబుంటు-తెలుగు, డెబియన్-తెలుగు మున్నగునవి.
మీరూ మీ వంతు సహాయాన్నీ అందిచవచ్చు. లాంచ్ప్యాడ్ వంటి ప్రదేశాలలో మీరు ఏ కార్యక్రమించడం తెలియకపోయినా స్థానికీకరణకు సహాయం చెయ్యొచ్చు, తద్వారా చాలా మేలు చేసిన వారవుతారు మన భాషకు.
అయితే ఈ టపా లో అర్జున్ గారు చెప్పినట్టు ఇంకా చాలా చెయ్యవలిసి ఉంది నిపుణులు, వాడుకర్లు ముందుకు వచ్చి మీ ప్రోత్సాహాన్ని అందిస్తే చాలా చెయ్యవచ్చు మనం.

'తెలుగుదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగువల్లభుండ, తెలుగొకండ, ఎల్లనృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స'

list of tech jargons in telugu:

  • సంగణక యంత్రం : Computer
  • కఠినాంత్రం : hardware
  • కోమలాంత్రము: Software
  • మూలసంజ్ఞావళి : source code
  • శాసనపదం : command
  • సార్థవాహకాలు (స్వార్థవాహక????): company
  • వాడుకరి : user
  • నిపుణుడు : developer
  • స్వేచ్ఛాపూరితకోమలాంత్ర ఉద్యమాన్ని : Free Software Movement
  • నుంగు : kernel
  • నిర్వహణా వ్యవస్థ : Operating System
  • పంపిణీ(used as a noun here) : Distro (Distribution)
  • దస్త్ర వ్యవస్థ : file సిస్టం
  • కార్యక్రమించడం : programming

Wednesday, September 15, 2010

ఆనంద్ -- మంచి కాఫీ లాంటి సినిమా

ఇప్పటికే అర్థమైపోయుంటుంది, నా తదుపరి టపా, నా ఇష్టమైన సినిమా ఆనంద్ గురించి.....
మొదట నేను కొన్ని బ్లాగ్లను జల్లెడ పట్టాను, ఎవరైనా ఆనంద్ గురించి రాసారా అని, అక్కడ నాకు ఏ బ్లాగులోనూ పూర్తి స్థాయి సమీక్ష దొరక్క నేనే రాద్దాం అని మొదలెట్టాను.

ఆనంద్, ఒక మంచి కాఫీ లాంటి సినిమా
ఈ చిత్రం పై ఒక టపా సరిపోదు, మన జీవితం లో జరిగే ప్రతి సంఘటనతోనూ నాకు ఈ సినిమాలో ఏదో ఒక సీన్ తో సారూప్యత కనిపిస్తుంది.
హైదరాబాద్ లో ని లైఫ్ స్టైల్ ని ఈ సినిమాలో చక్కగా చూపించారు కమ్ములగారు.
పద్మారావ్ నగర్ లోని ఒక ఇల్లు, ఆ ఇంటి చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణం ఒక ఎత్తైతే
కథానాయికను సంగీతాధ్యాపకురాలిగా చూపడం మరో హైలైట్
అసలు అందరూ శాస్త్రీయ సంగీతాన్ని మర్చిపోతుండగా ఈ సినిమా మళ్ళీ ఒక్క సారి అందరినీ మురిపించింది
పొద్దున్నే భావయామి, ఇంతకన్నా
Get this widget | Track details | eSnips Social DNA


ఇత్యాది పాటలతో రోజుని ఆరంభించాలి అని చెప్పకనే చెప్పారు
ఇక కాఫీ తెలుగు వారికే బ్రాండ్ పానీయం, ఇంటికి ఎవరైనా ముందు రాంగానే (మా ఇంట్లో) అడిగే మాట - "కాఫీ తెమ్మంటారా?"
ఇక యౌవ్వనంలో ఎలా ఉండాలో - తమ బాధ్యతల్ని గుర్తించి వాటికి అనుగుణం గా నడుచుకోవటం - ఎలా నడుచుకోవాలో బాగా చూపించారు.
నర్సరీ కి వెళ్ళటం మొక్కల్ని పెంచుకోవటం ఇవి బై డీఫాల్ట్ ప్రతి హైదరాబాదీ లోను ఉండే క్వాలిటీస్


మొత్తం మీద చెప్పొచ్చేదేంటంటే ఈ సినిమాని దాదాపు ఒక ౩౦౦(మూడు వందల) సార్లు నేను చూసాను, అయినా విసుగు రాదు, ప్రతీ వీకెండ్ ఈ సినిమా చూడాల్సిందే!!!
ఇక పాటలైతే , నా ఐ పాడ్, నా స్నేహితుల ఐ పాడ్ లలో ఖచ్చితంగా ఉంటాయి.

Saturday, August 21, 2010

పుణె

ఇక పోతే

.

.

.

ఎవరూ పోలేదు, సమయం కొంచెం గడిస్తే,

క్రితం టపాల్లో ఏదో మొదటివి కదా అనేసి ఏదో ఆవేశ పడిపోయి ఏమేంటో రాసేశాను.

ఈ టపా నేను ప్రస్తుతం నివసిస్తున్న పుణ్య మహా నగరం, పుణె గురించి రాద్దామని నిర్ణయించుకున్నాను

నేను పుట్టి, పెరిగింది తెలుగునాడు, ఏదో సందర్భంలో ఇంజనీరింగ్ చదివే రోజుల్లో, చెన్నపట్నం, పాండ్యనాడు(మదురై), బెంగుళూరు తదితర ప్రదేశాలకు పోవటం జరిగింది. చెప్పొచ్చేదేంటంటే ఊహ తెలిశాక దక్షిణాపథం దాటి నేను పోలేదనమాట.

అయితే మెత్తవేరు (సాఁఫ్టువేరు) మళ్ళీ గట్టి పడటం వల్ల నేను తంత్రమహీంద్రుని కొలువులో నర్తకుడ్నయ్యాను. నాట్యం లో కొన్ని నేర్పులు చేర్పులు ఉంటాయిరా కన్నా అని కొలువు వారు నన్ను పుణ్యనగరికి వచ్చి ఆ నేర్పులు నేర్చమన్నారు.

ఇంకేముండి 4 యేళ్ళు తంత్ర విద్య గురుకులానే ఉండి చదివి, ఇలా ఇంటికి చేరానో లేదో మళ్ళీ ఇల్లు వదిలి వీధిన పడ్డానన్నమాట.

ఇక పోతే

మళ్ళీ ఎవరూ పోలేదు నేనే నా స్పృహలోకి వచ్చాను

మొత్తానికి 2 నెల్ల క్రితం ఖాళీ చేసిన బ్యాగ్ని మళ్ళీ నింపుకొని, ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కి పుణె చేరాను.


చేరీ చేరక ముందే ఇంకా ట్రెయిన్ దిగక ముందే నా ఆజన్మ శటృవులైన వడాపావ్ మరియూ రొట్టె దర్శనమిచ్చాయి

ఏ తిండినయితే నేను ఈ జన్మలో చూడననుకున్నానో అది నా ఉద్యోగపర్వం లో మొదటి రోజు టిఫిన్ అయింది.


మొత్తానికి పుణె చేరుకున్నాం.

మాకు పుణె లో ఎవరూ బంధువులు లేరు. సో మా బడిలో చదువుకున్న ఒక సీనియర్ పుణెలోనే ఉన్నాడని తెలిసి అతన్ని ఆశ్రయించాను, ఆయన కూడా ఇక్కడే టాటా మోటర్స్ లో పని చేస్తున్నాడు. ఆయన ఉండేది పింప్రి అనే ఒక శివారులో ఉన్న ఆర్థిక మండలి. అక్కడికి పుణె-లోణావలా లోకల్ ట్రెయిన్ లో వెళ్ళాలి.

మన హైదరాబాద్ ఎంఎంటీఎస్ మాదిరిగానే ఉన్నా ఈ బండి దుమ్ము ధూళి తో కప్పబడి ఉంది, అప్పుడు అర్థమయింది హైదరాబాద్ బెటర్ అని

జనం కూడా బాగానే ఉన్నారు, 2వ స్టేషన్ శివాజి నగర్ రాంగానే నుంచోటానికి కూడా స్థలం మిగలకుండా ట్రెయిన్ జనం తో నిండిపోయిండి. రద్దీ ఎంత అంటే, తదుపరి స్టేషన్ లో దిగాలంటే ఈ స్టేషన్ నుంచే తలుపు వద్ద పడిగాపులు కాయాలి, ఈ విషయం తెలియక నా పరిస్థితి 'అమెరికన్ టూరిస్టర్' వాణిజ్య ప్రకటన సదృషమయింది.

పింప్రి లో దిగాక ఆటో ఎక్కే ధైర్యం చేశా, ఆ ఆటో వాడేమో 2 కి.మీ. దూరానికి 40 బిల్ వేశాడు. అలా 9 కి పుణె లో బయలుదేరిన నేను 11:30 కి పింప్రి లోని కాలేవాడి అనే ప్రదేశంలో మా సీనియర్ ఫ్లాట్ కి చేరాను. ఆ రోజుకి ఇక రెస్ట్.

మరుసటి రోజు ఉదయాన్నే, "టెక్ మహీంద్ర" ఆఫీసుని అన్వేషిస్తూ అలానే పుణె కూడా తిరిగినట్టు ఉంటుంది కదా అని బయలుదేరాను. అన్నట్టు మరిచాను, అప్పటికి నేను అన్నం(వరి-ధాన్యం) తినక సరిగ్గా 24 గంటలు.

మా సీనియర్ ది ఎంపీ, సో ఆయన అన్నం తినరు.

అప్పటికే నా జీర్ణ నాడులు ఆకలి అనటం మానేసి అన్నం అనటం మొడలెట్టాయి.

వాటికి సర్దిచెప్పి, నేను వీధి చివర ఉన్న బస్ స్ఠాప్ వద్ద నుంచుని బస్ కోసం నిరీక్షిస్తూ పక్కన ఉన్న మనిషిని పలకరించి , నా సంగతి చెప్పి, ఏ బస్ వెళుతుందో అడిగాను, అతను కాసేపు ఆలోచించి ఏదో రూట్ చెప్పాడు, అతను చెప్పిన స్థలాల పేర్లు అదో రకం ఇటాలియన్ వంటకాల పేర్లను గుర్తు చేశాయి, ఇటువంటి పేర్లు కూడా ఉంటయా అని అనుకున్నా, అంతలో బస్ వచ్చింది, బస్ ఎక్కాక కండక్టర్ ని అడిగితే, అతను చెప్పాడు, పుణె లో మొత్తం 4 చోట్ల కంపెనీ ఆఫీసులున్నాయని. నా ఆఫర్ లెటర్ తీసి అతనికి చూపించి ఫలానా అన్నాను, ఏ నంబర్ బస్ వెళుతుంది అని అడిగాను, అతను గట్టిగా నవ్వి(అక్కడికేదో నేను జోక్ చెప్పినట్టు) మరాఠీ లో గొణుక్కొని, మళ్ళీ హిందీ లో నాతో, ఇక్కడ బస్సుల్ని నంబర్ తో కాదు గమ్య స్థానం తో కనుక్కోవాలని చెప్పాడు. అప్పుడు మన ఏ పీ యస్ ఆర్ టీ సీ మీద మరీ గౌరవం పెరిగి పోయింది.

మొత్తానికి బస్సులు మారుతూ ఆఫీస్ చేరుకుని, పరిసరాలు గమనించి తిరుగు ప్రయాణం పట్టాను, మరుసటి రోజు ఉదయమే జాయినింగ్.

ఇక బస్సులో తిరిగి వస్తూ, గమనించాను, ఇక్కడ లేడీస్ సీట్ అని రాసి ఉన్నా ఆ రూల్ రాతల వరకే అని.

బయట ఏ వీధి చూసినా మన మొత్తం జాతి గర్వించ దగ్గ మరాఠా పులి, శివాజి విగ్రహాలే.

డెక్కన్ అనే ఒక ఏరియా లో వీర్ సావర్కర్ జ్ఞాపిక ఉంది.

ఇక అక్కడ్నించీ చాలా దూరం మేరకు ఆర్మీ క్యాంప్.

ఆ తర్వాత కాసర్వాడి అనే ప్రాంతం నుండి పుణె యొక్క మునిసిపాలిటీ కాకుండా పింప్రీ చించ్వడ్ మునిసిపాలిటీ మొదలవుతుంది.

ఇక్కడంతా ఐటీ కంపెనీల ఉద్యోగుల మకాం అనమాట.

టాటా, ఇంఫోసిస్, విప్రో, సీ టీ యస్, ఐ బీ యం అన్నీ ఈ ఏరియాలో ఉన్నవి, ఆయా కంపెనీల ఉద్యోగులు కూడా ఇదే ప్రాంతం లో ఉండటంవల్ల ఇది పుణె కన్నా కొంచెం విభిన్నం గా ఉంటుంది.

పుణెలో వర్షం మొదలయిందంటే ఒక పట్టాన ఆగదు.

చినుకులూ పడుతూ ముసురు కమ్ముకొని వారాల తరబడి అలా ఉండిపోతుంది.

మరుసటి రోజు జాఁయినింగ్ ఫార్మాలిటీస్ తర్వాత తెలిసింది, హింజవడీ సెంటర్లో ఉన్న ఆఫీస్ లో నా ట్రైనింగ్ అని.

ఇక ఏముంది హింజవడీ లో రూమ్ తీస్కుని మకాం అక్కడికి మార్చాను.

(సశేషం)