Wednesday, September 29, 2010

సంగీత ప్రియులకోసం......

ఈ టపా చదివిన పిదప ఒక మారు ఈ వెబ్సైటును చూడండి , మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళతారు 
మన దక్షిణ భారతాన్ని మొత్తాన్ని ఒక తాటిపై నిలిపింది సంగీతమనే చెప్పాలి.
మనం అధ్యయనం చేసెడి సంగీతం - దీనినే కొందరు దక్షిణ భారత సంగీతం అని, మరికొందరు కర్ణాటక సంగీతమని అంటారు.
కన్నడ రాజుల ద్వారా పోషించబడింది కాబట్టీ ఆ పేరు వచ్చి ఉండవచ్చు అని నేననుకుంటున్నాను, నేనైతే ఎప్పటికీ కర్ణాటక సంగీతం అని మాత్రం పలుకాలంటే ఒక రకంగా ఉప్పుపలుకులు నములుతాను(ఆ భావన వల్లనే). శాస్త్రీయ సంగీతమనో, మరీ అనవలసి వస్తే కార్నాటిక్ (carnatic not karanatik) అని దాటవేస్తాను.
ఇందులో ఉన్న ప్రత్యేకలేమిటంటే, ఈ శాస్త్రమునకు ప్రధాన వాగ్గేయకారులంతా మన తెలుగువారే, పాడేవారు(ఒకప్పుడు రాజుల కొలువుల్లో-ఇప్పుడు కాదు) కూడా మనవారే ఉండేవారేమో కానీ ఈ మధ్య పాశ్చాత్యుల ప్రభావంతో మొదట పాప్, ఆ పై హిప్-హాప్, ఇప్పుడు రాక్, మెటల్ ఇంకెక్కడికో ఈ పయనం????

అయితే మన దక్షిణ భారత సంగీతకళ చాలా ప్రాచీనమైనది, ప్రపంచంలోనే!!!
ఇది చాలా జటిలమైనందువల్ల సాంకేతికంగా,కళాపరంగా కూడా చాలా నేర్పరితనం కావాలి. మన ఈ కళకు మూలం రాగం, మరియు తాళం.
రాగం అనేది స్వరముల గంభీరత్వాన్ని కొలుస్తే, తాళం అనునది వాటి రూపాంతరములను కొలుస్తుంది.
మనకి ఏడు తాళాలు మరియు డెబ్బదిరెండు మూలమైన రాగములు కలవు.
మిగితా రాగాలన్నీ వీటిపై ఆధారపడి ఉంటాయి లేదా వీటి నుండి ఉద్భవించబడ్డాయి. ఈ ౭౨ రాగాలను మేళకర్తరాగములంటారు.
౧౯ వ శతాబ్దానికి చెందిన త్యాగబ్రహ్మ(త్యాగరాజులవారు), ముత్తుస్వామి దీక్షితులవారు మరియు శ్యామశాస్త్రి గారు, కొన్ని వేల కృతులను అందించిన మహా వాగ్గేయకారులు.
మన ఈ సంగీత శాస్త్రం ముఖ్యంగా భక్తిరసప్రధానముగా ఉంది.
మనం సరిగమలు అని వాడుక భాషలో చెప్పే స్వరాలే ఈ సంగీతశాస్త్రానికి పునాది.
అన్ని రాగములు ఈ సప్తస్వరముల నుండే ఉద్భవించాయి.
ఈ సరిగమలకు గల పూర్తి నామాలు.
  • స - షడ్జమం
  • రి - రిషభం
  • గ - గంధర్వం
  • మ - మధ్యమం
  • ప - పంచమం
  • ద - దైవతం
  • ని - నిషాదం
ప్రతి  స్వరమునకు మూడు విధములు గలవు, ఇది షడ్జమమునకు మరియు పంచమమునకు వర్తించదు.
అలాగే మధ్యమమునకు కూడా రెండే విధములు కలవు.
ఒక  పక్క సౌందర్యమును మరో పక్క భక్తిని చక్కగా మేళవిస్తే తయరైన కృతులు అత్యంత మధురంగా ఉంటాయి.
భగవంతుని  సాక్షాత్కారమే ధ్యేయంగా రచింపబడిన ఈ సంగీతం ఎంతో సుందరంగా ఉంటుంది.
భగవంతుడికి, భక్తికి, భక్తునకు, సంగీతానికి అవినాభావ సంబంధం ఉంది. శివుడ్ని నాదం యొక్క ప్రతిరూపంగా
కొలుస్తాము. ఎందరో దేవతల వద్ద సంగీత వాద్యాలు ఉండటం కూడా గమనించాము.
కృష్ణుడు కూడా వేదానాం సామవేదోస్మి అన్నాడు కదా! (సామవేదం సంగీత-శృతి-గాన ముఖ్యం)
పార్వతి లాస్యానికి ప్రతిరూపం. ఎల్లప్పుడూ జ్ఞానదేవత అయిన సరస్వతిని వీణాధారిణిగానే చూస్తాం. అసలు వీణలేనిదే ఆమెను సరస్వతి అని కూడా పోల్చుకోలేము. వీణను విపంచి అని కూడా అంటారండోయ్.
లక్ష్మీ దేవి సంగీతప్రియ. శ్రీమహావిష్ణువు ఎక్కడ పడితే అక్కడ డోలు వాయించేస్తాడు.
నంది లయకు అధిష్టాన దైవం. ఇహ నారద-తుంబురులు సంగీతలోకంలో ప్రఖ్యాతులు. వారిని వైనిక-గాయకులుగా మనం గుర్తించాలి.
మొన్నామధ్య  ఎస్వీ గారి సినిమాలో కూడా ఘటోత్కచుడ్ని వీణాపాణిగా చూపారు.
ఇక గంధర్వులు, కిన్నరులు, కింపురుషులైతే ఈ విద్యకు పెట్టింది పేరు.
మన ధర్మశాస్త్రాల్లో ఈ విద్యను గంధర్వవిద్యగా చెప్పారు.
మారుతి అయిన ఆంజనేయ స్వామి హనుమద్వీణ వాయించడంలో దిట్ట. ఈనాటి చిత్ర వీణ ఈ హనుమద్వీణకు రూపాంతరం.

ఇంతటి విశిష్టత కలిగిన మన సంగీతాన్ని మనం అర్థంకాలేదనో
నాకు వంటపట్టదనో వదిలెయ్యవచ్చా!!!
పాశ్చాత్య పోకడలకు పోయి మన అరుదైన ఈ సంపదను వదులుకోగలమా.
ఇప్పటికే మన నిర్లక్ష్యం వల్ల మన దైన ఈ విద్యను అరవలు తమ కాపీరైట్లు పెట్టుకోవటం మొదలెట్టారు.
ఇది ఏమి బీసీ కాలం నాటిది కూడా కాదే
అన్నమయ్య , రామదాసుల వారికాలానిది కూడా కాదు.
నన్నడిగితే నాకు తెలిసినంత వరకూ భారతీయుడిగా మనం నేర్చే అత్యంత మోడర్న్ విద్య ఈ శాస్త్రీయ సంగీతం.
ఇందులోని మెళకువలు , ఛలక్కులు, జుగల్బందీలు, ఏ హిప్-హాప్ కు మెటల్ కు తీసిపోవు.
అనుభవించడం మొదలెట్టాక రొజుకో వింత అనుభూతి కలుగుతుంది.

అయితే ఏమిటి అంటారా....
ఇదంతా పెద్ద ఖర్చుతో పని అంటారా.
మీరు నేర్చుకోకపోయినా వినండి వినిపించండి, నక్కాబోయే భార్య "గిమ్మీ మై తాళి మై లైఫ్ ఇజ్ ఖాళీ ఖాళీ" అని
పాడేకన్న అరకొరగా ఏ త్యాగబ్రహ్మ కృతే పాడినా నేనెంతో ఆనందిస్తాను.
అలా అందరం మొండిపట్టు పట్టామంటే మన నుంచి తరలిపోతున్న వోక్స్వాగన్, డెల్, తిరిగిరాకపోయిన సంగీత ప్రియులం మనమే నన్న ట్రేడ్ మార్కు మనకు మిగిలిపోతుంది.
ఎంతో కష్టపడి రాత్రీ పగలూ ఒకటి చేసి మనకు సంపాదించారు మన త్యాగబ్రహ్మ ఈ పేరుని
దీన్ని అప్పణంగా అరవలకు వదిలివేయాలా?
ఆలోచించండి.....

ఈ వెబ్సైట్ ఖచ్చితం గా చూసి అక్కడ ఉన్న పాటలను డౌన్లోడ్ చేసి వినండి.
అదొక అలవాటు గా మార్చు కోండి.
కనీసం రోజుకొకటి వినండి. ఉచితంగా మీకు పాటలు వస్తున్నా మీరొద్దంటే మిమ్మల్ని ఎవ్వరం మార్చలేం. మన
తెలుగుజాతి ఖర్మ అని వదిలెయ్యటం తప్ప.

సంగీతప్రియుల వెబ్సైటు - sangeetha priya