Monday, April 16, 2012

భాషాభిమానం మితిమీరిన వేళ కూడా తెలుగు అక్షరం అ-క్షరమే

ఈ మధ్య ఒక వింత పోకడ మొదలయింది. భాషాభిమానం పేరు చెప్పుకొని, లిపి సంస్కరణలు అంటూ ఎక్కడలేని చెత్తను తెచ్చి మన తెలుగు లిపికి అంటిస్తున్నారు. విజయ లిపి అయిన తెలుగు లిపి, పద్య సాంప్రదాయం ఆ పై వచ్చిన శతక సాంప్రదాయం తరువాత వచ్చిన ప్రబంధ సాంప్రదాయం మొదలు నేటి గద్య మరియు కవిత సాంప్రదాయం వరకూను రాసేప్పుడు అతి తక్కువ శ్రమ కలిగే విధంగా, అదే సమయంలో స్పష్టంగా, దోష రహితంగా అతి తక్కువ సమయంలో రాసే విధంగా తీర్చిదిద్ద బడింది. అయితే తెలుగు లిపికేనా ఈ ప్రత్యేకత? అవును ముమ్మాటికి ఇది సత్యం. మిగితా భాషా సాంప్రదాయాల్లో రాతప్రతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు, అక్కడ గురు-శిష్య పరంపరలో ఒక తరానికి ముందు తరం వొప్పజెప్పే విధానంలో జ్ఞానం పాకేది. ఒకానొకప్పుడు జ్ఞానాన్ని పుస్తకాలుగా భద్రపరచటం నేరంగా కూడా పరిగణించేవారు(చాణక్యుని నీతి శాస్త్రం నుండి). కానీ అది ఉత్తరాది భాషలకే పరిమితం అనుకుంటాను, అందుకే చాలా వరకూ తులసీదాస్, సూర్‍దాస్,కబీర్‍దాస్,రహీమ్‍దాస్ ఇత్యాదుల దోహాలు జనాల నోట విని సంకలనం చేసినవ్ కానీ రాతప్రతులుగా వారు చెప్పిన కాలంలో చేయబడలేదు. వివరాలకు : www.esamskriti.com/essays/docfile/14_395.doc 
ఇందుకు కొన్ని కారణాలు : ౧. ప్రామాణిక లిపి లోపం, ౨. మాటకు రాత ఉండవలసిన అవసరం లేదన్న భావన, ౩. ఒకవేళ రాతలో ఉన్నా, పరదేశిల దండయాత్రలలో ఆయా రాతప్రతులు నాశనం అవడం. లేదా ౪. నోటి ద్వారా జ్ఞాన ప్రసారానికి పెద్ద పీట వెయ్యడం. 
అయి ఉండవచ్చు.
మొదటి కారణం - కొన్ని విధాలుగా సమంజసమే, అవధీ, భోజ్పురీ మున్నగు మాటలకు సరియయిన లిపి లోపం నేటికీ ఉంది.
రెండవ కారణం కూడా నిజం అవ్వవచ్చు - సమాజంలో ఒక వర్గమే చదువు నేర్చి, మిగితా వర్గాలు చదువుకు దూరంగా ఉండేవి, చదువుకునే వారి లోపం వల్ల రాతకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదేమో?
మూడవ కారణం - ఉత్తరాదిన జరిగిన అన్ని దాడులలోనూ ప్రతి సారీ ధనసంపద కొల్లగొటారే గానీ పద సంపదను నాశనం చేసింది తక్కువే అనవచ్చు, పైగా చాలా వరకు రాతప్రతులను పర్షియన్ కు తర్జుమా చేసారు కూడా.(పై లంకెలో ఇచ్చిన డాక్ ఆధారంగా)
ఇక నాలుగవ కారణమే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. 
గంగా నదికి ఇచ్చే హారతిలో పాడే పాటతో సహా ఉత్తరాదిన అన్నీ నోటి ద్వారానే నేర్పబడతాయి. పుస్తక రూపేణా ఏమీ అందుబాటులో ఉండదు.
అయితే ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం ఉత్తరాదిన రాతలిపికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. లిపి సంస్కరణలు చాలా తక్కువ. శిలాఫలకాలే అందుకు సాక్ష్యం.
ఇక దక్షిణాదిన హెచ్చు సాహిత్యం రాతప్రతుల ద్వారానే తరాలు దాటేదీ, దేశాలూ దాటేది. లిపి సంస్కరణలూ ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో జరిగాయి. 
హిందుస్తానీ సంగీతం(ఉత్తర భారత సాంప్రదాయం)లో స్వరాలను నేటికీ రాసి నేర్చుకున్ ప్రక్రియ కనబడదు. 
అదే కర్ణాటక సాంప్రదాయంలో అది కనిపిసుంది.
శిలా శాసనాలు పరిశీలించినా, తాళపత్ర గ్రంథాలు పరిశీలించినా తెలిసేది ఒకటే, మన వద్ద మాటక్కూ రాతకూ ఒకే ప్రాతిపదికన సమాన ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఒకింత ఎక్కువ రాతకే పెద్దపీట వేసారు. రాత కూడా కొన్ని తరాలకు అదే విధంగా అందాలి అన్న దూరదృష్టితో ఏర్పరిచారు. నేటికీ అన్నమయ్య మొదలు వాగ్గేయకారుల కృతులు ఆ నాడు ఎలా పాడారో అదే రీతి నేటికీ పాడగలుగుతున్నామంటే అది రాతకు మన వారు ఇచ్చిన ప్రాధాన్యతను తెలియబరుస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన గమ్మత్తయిన విషయమేమంటే, ఇతర భాషల్లోలా కాకుండా తెలుగులో శబ్దానికి అత్యున్నత స్థానం ఉంది. 
శబ్దానికో అక్షరం మనకు కలదు. తిరుక్కార్తి అయిన వెంటనే జరిగే ప్రబంధ పఠనం అపుడు ழ అనే ఒక వింత అక్షరం తెలుగు అక్షరాల్లో దూరి వచ్చినపుడు కలిగే ఆశ్చర్యం, భయం,  దుఃఖం అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఆ సందర్భం నేనూ చిన్నప్పుడు ఎదుర్కున్నాను. అయితే దానికీ తెలుగులో అక్షరం ఉందని ఈ మధ్యనే సురేశ్ కొలిచాల గారి వద్ద తెలుసుకుని మిక్కిలి సంతోషపడ్డాను కూడా. తెలుగులో ఆ ప్రకారంగా ఏ శబ్దమైనా అక్షరరూపేణా ఉంది అన్న నిర్ధారణకు వచ్చాను.

కురాన్ చదివేప్పుడు మూడు రకాల లు పలకాలి ఒక క సాధారణంగా వచ్చే శబ్దం(ک), మరొకటి నాభి నుండి గాలిని తెచ్చి పలకాలి(ك), మూడవది కంఠం నుండి వచ్చే గాలిని నాలుక మధ్య భాగం ద్వారా అడ్డుపెట్టి పలకాలి(ق). 
కానీ ఇవి మూడు తెలుగ్లో ఉన్నాయి. అయితే నేటి అక్షరమాల పరిమితికి వీటిని క కగా వాడుకోవచ్చు.
అలానే జల్లెడ అన్నపుడు డ మరియు జ కలిపిన శబ్దం వస్తుంది. జడ అన్నపుడు మామూలు జ, కఁజు అన్నపుడు ద మరియు జ కలిపిన శబ్దం వస్తుంది. వీటిని కూడా ౨ మరియు ౩ లు చేర్చి చూపవచ్చు. 
ఇది బ్రౌణ్యంలో చాలా చక్కగా చెప్పబడి ఉంది.
అలానే స్త్రీ అన్న పదం రాయటానికి చాలా సులభం. అదే స్త్రీని దేవనాగరి లో రాస్తే स्त्री అవుతుంది, అదే అరవంలో ஸ்த்ரீ అవుతుంది. అంటే తెలుగులో అది మీకు ఒకే అక్షరం అయితే నాగరిలో ఒకటీముప్పావు(దాదాపు రెండు), అరవంలో మూడు అక్షరాలు పట్టే స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఇదే విధంగా ఇంకా ఎన్నో లెక్కలేనన్ని ఉదాహరణలు ఇవ్వవచ్చు. అయితే అదే సమయంలో ఘడియలో ఘ, ఝటలో ఝ చాలా క్లిష్టంగా అనిపించవచ్చు గానీ, వాటి వాడుకను అనుసరించి, వీటిలో సంస్కరణ అవసరం లేదని పెద్దలు వాటిని అలానే ఉంచేసారన్నది నా నమ్మకం. 
అయితే ఈ రాత విధానం, తెలుగులో రాత పద్ధతి కంప్యూటర్లొచ్చాక మారాల్సిన అవసరం ఉందా?
ఏం లేదు.
కారణం, ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక ఆంగ్ల ఆల్బం పాటకు లిరిక్స్ రాసేప్పుడు ఆంగ్లం వాడుతూ, రాసినపుడు, నంబ్ అనే లింకిన్ పార్క్ పాటకి నేను పాటను పది సార్లు రివైండ్ చేసి రాస్కున్నాను. పాట మరీ అంత వేగంగా ఉండదు. 
అదే సమయంలో తెలుగులో రాస్తూ ఆనతినీయరా అను పాటను నేను మూడవ సారి ప్రూఫ్ రీడ్ గా విన్నాను! 
అదనమాట మన లిపి గొప్పతనం.
ఎంతటి మాటనయినా/పాటనయినా ఎవరయినా ఆశువుగా చెబుతూంటే రాసేందుకు వీలుగా మన లిపి ఉన్నది. 
కేవలం మాటను రాతగా పెట్టేందుకు కాదు, మాటను సునాయాసంగా-శుద్ధంగా-శుభ్రంగా-తక్కువ స్థలము-తక్కువ శ్రమ వెచ్చిస్తూ రాసే విధంగా ఉంది మన భాష. 
ఇక్కడ వరకు చదివారా! హమ్మయ్యా, నా బాధ అర్ధం చేస్కున్నారని ఆశిస్తున్నాను. ఇదంతా రాసింది ఎందుకూ అంటే - మొన్నా మధ్య అచంగుడు ఒక లంకె పంచారు. అది చూసినపుడు నా కోపం గొంతు దాకా వచ్చి ఆగిపోయింది. ఆ వ్యాసానికి లంకె ఇక్కడ : http://www.namasthetelangaana.com/news/Article.asp?category=1&subcategory=5&contentid=58696 
కానీ పోన్లే ఏదో భాషపై అమితమయిన ప్రేమ అనుకుంటూ వదిలేసాను. అయినా ఏదో ఒక రోజు ఆ వ్యాసం, దానికి తోడుగా అతను రాసిన ఒక పుస్తకం ఉంది, అదీ పట్టుకుని అతని వద్ద అన్నిటికీ సంజాయిషీ తీస్కోవాలని ఎలాగు అనుకున్నాను. 
భాషను నేనొక వ్యక్తిగా, ఇంకా చెప్పాలంటే మాతృసదృశంగా చూస్తాను. కొన్ని అక్షరాలను తీసెయ్యటం అంటే ఆ అమ్మకు చేతులు, కాళ్ళు విరగ్గొట్టమనడమే. మాట్లాడే భాషలో లేని రాత భాషలో ఉన్న అక్షరాలు కేవలం కాల్పనికాలు. నేను మాట్లాడేదే ప్రామాణిక భాష అనీ, దానికి సరిపడా అక్షరాలుంటే రాతకు చాలు అనటం చాలా పెద్ద పొఱపాటు. 
అయితే స.వెం. రమేశ్ గారు ఈ నెల నడుస్తున్న చరిత్రలో ఒక వ్యాసం రాసారు. 
అక్కడ ఆయన చెప్పినదేమిటంటే, మన తెలుగు వ్రాలు(వ్రాత కు ఆయన వాడిన నామవాచకం - నాకయితే బాగా నచ్చింది, ఇకపై వాడదామనుకుంటున్నాను)లో అక్షరాలు చిన్న పిల్లలకు నేర్పించటానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని, వాటిని తత్‍క్షణమే మార్చాలనీ. 
ఆ వ్యాసంలో కొన్ని అంశాలు ఇక్కడ రాస్తూ, వాటికి నా ఆలోచనలు జోడిస్తున్నాను.
౧. ఆఅ, ఉఊ,ఋౠ,ఎఏఐ,ఒఓఔ, ఒకే వర్గంలో ఉంటూ చూడటానికి ఒకేలా ఉన్నాయి, మరి ఇఈ లు ఎందుకు వేరుగా ఉన్నాయి? - భాషలో ఉచ్చారణకి పెద్దపీట వెయ్యాలి. స్పష్టత పలుకులో ఉండాలి. రాత అనేది కేవలం పలుకులను దాచే ఒక అత్యంత న్యూనతమయిన విధానం. నేటి సాంకేతికతవలన పలుకులను మనం ఆడియోలో కూడా భద్రపరచవచ్చు, అలాంటప్పుడు సారూప్యతలు వెతకనక్కరలేదు. ఇఈ లు ఒకలా లేవని అవి నేర్చుకోను అనే వాడు a ని u ని ఒకేలా పలకటానికి ఎందుకు సిద్ధమవుతున్నాడు? నాకు తెలుగు ప్రాథమికంగా బడిలో నేర్పబడలేదు. కానీ ఇంటి వద్దనే నేర్చుకోవలసి వచ్చింది. కారణం వాడుక, బడి మినహా ఇంటా బయటా అంతా తెలుగే ఉండేలా మా అమ్మా-నాన్నలు జాగ్రత్త పడ్డారు. ఆ వాడుకని బట్టీ అవసరం ఏర్పడి తెలుగు వ్రాత, మాట నేర్చుకున్నాను. నాలా ఎంతో మంది ఉన్నారు. భాష నేర్చుకోవాలంటే అందులోని మీనమేషాలు ఎంచరాదు.
౨. అ పక్కన సున్నా పెడితే అమ్ అని చెబుతున్నారు కదా. అంమ అని రాస్తే తప్పు ఎలా అవుతుంది? 'బమ్‍గారు పమ్‍టలే పమ్‍డుతాయి' అని అన్నారు ‍- ఆ కొద్ది మందికీ తెలుగు వర్ణమాల అర్ధం కాలేదు. ప్రతి వర్గానికి పఞ్చమ అక్షరం ఉంది. ఆ వర్గం మొత్తం అనునాసికం వచ్చినపుడు ఆ పఞ్చమ అక్షరాన్ని పలుకుతాము. అందుకని ఆ పఞ్చమ అక్షరం ఉన్నది. 
ఎంత ప్రయత్నిఞ్చినా గంగ గఙ్గ అవుతుందే తప్ప గఞ్గ, లేదా గణ్గ, గన్గ,గమ్గ అవ్వదు. 
ఇది ఉచ్చారణ సక్రమఙ్గా చేసే ఎవరయినా సులువుగా చెప్పగలరు. 
బమ్‍గారు పమ్‍టలే పమ్‍డుతాయి అని ఏ తెలుగు వాడూ చచ్చినా పలకడు, బఙ్గారు పణ్టలే పణ్డుతాయి అన్నది అప్రమేయ ఉచ్చారణ. 
౩. ౠ తో మాటల్లేనపుడు దానిని ఎందుకు చేర్చుకోవాలి?- ఇక్కడ మరలా ఇదే విషయం వక్కాణిఞ్చి చెప్పాలి, భాషకి రాత ఉన్నది అన్ని శబ్దాలను రాత రూపంలో చూపేందుకు. నోటిలోండి గాలి నాభి గుండా వచ్చేప్పుడు పెదాలను వృత్తాకారం చేసి, నాలుక కొనతో ఆ గాలికి రాపిడి చేస్తే వచ్చే శబ్దమే ౠ. భాష రాతలో ఒక శబ్దం లేకున్నా అది వైకల్యం గల భాషే. పైన చెప్పబడిన ழ ప్రబంధాల్లో వచ్చినపుడు ఒక తెలుగు పిల్లవాడు ఒకింత బాధ పడేది తెలుగు రాతలో ఈ శబ్దం లేదనే. ఈ అక్షరానికి తెలుగులో పదాల్లేవని ఈ అక్షరాన్ని తీసిపారెయ్యలేము. 
౪,౫ కూడా పై వాటిని పోలి ఉన్నవే.
౬. య గుణింతములో యి యీ లకు గుడిని ఎందుకు తగిలించడంలేదు? - పైన చెప్పిన విధంగా తెలుగు లిపి అత్యల్ప సమయంలో అత్యధికంగా రాసేందుకు సంస్కరించబడిన లిపి. అందువలన రాయటానికి వీలుగా ఉండాలని ఎక్కువ సార్లు వాడే వాటిని ఇలా మార్చుకుని రాసారు. అంచేత వీటిని పెద్దవారిమాట చద్దన్నం మూటలా మనమూ పాటిస్తున్నాం. ఇది సులువైన విధానం కాబట్టే జనం మారలేదు. గుడి జోడించి రాయటమే సులువయితే, ఈ అక్షరాలు రాసేవారము కాదు.
౭. క కింద ష పెట్తినపుడు క్‍ష అవ్వలి కానీ క్ష ఎందుకు అవుతుంది? - ఇదే ప్రశ్నకు దగ్గరగా జంపాల చౌదరి గారు నన్నొకసారి అడిగారు, చౌదరి గారి ప్రకారం తెలుగులో క్ష ఉంది, అలానే క్‍ష కూడా ఉంది. ఆయితే కక్ష, రిక్షా లాంటి పదాల్లో క్ష ఉంటుందని ఫిక్‍షన్, డికాక్‍షన్ వంటి పదాల్లో క్+ష వస్తుందని వారు చెప్పారు. మొదటిది పలకటంలో క-ష కలిపి ఒకే స్వరంలో పలికేస్తాము, రెండవ రకంలో క పలకటానికి ష పలకటానికీ మధ్య కొంత అత్యల్ప సమయం వస్తుంది. అందువలన క కింద ష వత్తు పెడితే అది క్ష కాదు. క మరియు ష కలిపి ఒక శ్వాసలో పలికితేనే అది క్ష, కొద్దిపాటి తేడాతో రెండు శ్వాసలలో పలికితే అది క్‍ష. అదృష్టమో ద్దురదృష్టమో రెండవ జాతి పదాలు క్‍ష ఉన్నవి తెలుగులో లేవు.
మిగితా అంశాలపై చర్చ తదుపరి టపాలో...

అందాకా అందరూ చూసి విశ్లేషించుకునేందుకు స.వెం. రమేశ్ గారు ప్రతిపాదించిన అక్షరమాల :