Friday, September 20, 2013

వికీపీడియా అంటే ఏమిటి?

http://te.wikipedia.org , తెలుగు వికీపీడియా - 50 వేల పైబడి వ్యాసాలు, 100 కు పైగా సంపాదకులు, వేలల్లో బొమ్మలు, ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతీ గ్రామానికీ, తెలుగులో విదుదలయిన ప్రతి చలనచిత్రానికీ ఇక్కడ ఓ పేజీ ఉంది. ఎవరయినా రాయగల స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వంగా చెప్పబడుతున్న ఈ వెబ్సైటులో ఎవరయినా రాసివేస్తే మరి సమాచార ప్రామాణికత ఏమిటి? మనం రాసినది మరొకరు తీసివేసి ఆ స్థానే ఇంకేదో రాసేసే వెసులుబాటు ఉన్నపుడు వికీపీడియాలో విషయాన్ని ఎందుకు చేర్చాలి?
ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వికీపీడియాను మొదటి సారి సందర్శించే వారికి ఉంటాయి.
మరి నిజానిజాలు ఏమిటి?
ఇవి తెలుసుకోవాలంటే వికీపీడియా మూలస్థంబాల గురించి తెలుసుకుందాం. చేర్చిన సమాచారం ఈ అయిదిటిలో ఏ ఒక్క నియమానికి కట్టుబడి లేకపోయినా అది నిర్వాహకులు/అధికారులు/ఇతర వాడుకరులు తీసివేయవచ్చు.
మూలస్థంబాల గురించి ఇక్కడ చూడండి.
ఇక మనకు ఇష్టమొచ్చింది ఏదయినా రాసేయవచ్చా?
మనకు నచ్చిన విషయాల రాసుకునేందుకు బ్లాగులు ఇప్పటికే ఉన్నాయి. వికీపీడియాలో ఒక విజ్ఞానసర్వస్వంలో ఉండాల్సిన విషయాలు మాత్రమే చేర్చాలి. మీరు రాసే ప్రతి వాక్యం-పదం ఐదు మూలస్థంబాలకు జల్లెడ పట్టండి. అలా మెరుగయి వచ్చిన సమాచారం ఏదయినా మీరు చేర్చవచ్చు.
ఆంగ్ల వికీపీడియాలో చేర్చే ప్రతి వాక్యానికీ ప్రామాణికత కోసం ఏదో ఒక ఋజువును ఉదహరించాలి. ఇది తెలుగుకు కూడా అన్వయించుకోవాలి. కానీ మూలాలుగా ఋజువు చూపేందుకు మన తెలుగు పత్రికలు/వనరులకు అంతర్జాలంలో శాశ్వతలంకెలు అందుబాటులో ఉండవు. మహా అయితే ఓ సంవత్సరం పాత వార్తలు వరకూ అందుబాటులో ఉండొచ్చు. అందువలన ఈ నిబంధన తెలుగుకు సహజంగానే సడలించబడింది.
తెలుగులో మీరు విషయాలను చేర్చవచ్చు. అవి సార్ధకంగా ఉన్నంత వరకూ మార్పులకు లోను కావు!
ఆయా విషయాలు కాలానుగుణంగా మారినపుడు, సహజంగానే వ్యాసాలలో మార్పు వస్తుంది.
అయినా ఒకవేళ ఎవరయినా అనవసరంగా మీరు రాసిన విషయాన్ని మార్చినా, అది తిరిగి యధాస్థానానికి తీసుకొచ్చే వెసులుబాటు తెవికీలో ఉంది.
అందుకని అపోహలు మాని తెవికీలో సమాచారం చేర్చడం ప్రారంభించండి.



Tuesday, September 10, 2013

వేయి పడగలు-విశ్వనాథ మరియు నేనూను

ఒక చిన్ననాటి జ్ఞాపకం
ఒక చిన్న పుస్తకం, మామయ్య పుస్తకాల్లో కనిపించింది. అందులోని కొన్ని; కాదు కాదు చాలా పదాలు నాకు అర్ధమవలేదు, ఆ పుస్తకాన్ని ఒక పక్కన పెట్టేసాను.
***
పాత పుస్తకాల దుకాణంలో ఒక లావుపాటి పుస్తకం ఉంది, తెరిచి చూడాలేదు తెలుగు కాబట్టీ - ఇది నేను తొమ్మిదో తరగతి చదివే రోజుల సంగతి. స్కూల్ లో తెలుగు లేదు కాబట్టీ తెలుగు చదవాలనే ఆసక్తి - ఎక్కువ బొమ్మలున్న చందమామలాంటి పుస్తకాలకే పరిమితం, బొమ్మల్లేని పుస్తకాలు సుద్ద-దండగ అనిపించేవి. ఆ పుస్తకం వేయిపడగలు! అదే మొదటి సారి చూడటం.
***
దూరదర్శన్ లో సుమ ఒక సీరియల్ లో వచ్చేది. అందులో భర్త ఉప్పివ్వమన్నప్పుడు లవణం అని అంటుంది. ఈమేంటి ఉప్పుని లవణం అంటుంది అని హేళనగా చెప్పుకున్న రోజులు; ఉన్నట్టుండి ఒకమ్మాయి జుట్టు విరబోసుకొని వేపమండలతో పరుగెడుతున్న సన్నివేశం చూసి భయపడటం - పదో తరగతి పరీక్షల తరువాతి శెలవు దినాలు. అది వేయి పడగలు సీరియల్!
 ***
ఇంజనీరింగ్ చదువుతున్న రోజులు, కాలేజీ ఉన్న ఊళ్ళో ఇతర వ్యాపకాలు లేకపోవడంతో జిల్లా గ్రంథాలయంలో చేరి అన్ని రకాల తెలుగు పుస్తకాలు చదువుతున్న రోజులు. స్నేహితుల ప్రభావం వల్ల ఎన్నో విలువయిన పుస్తకాలు తెలుగువీ-ఇంగ్లిష్ వీ కనుగొని చదివి మురిసిపోతున్న రోజులు. వేయి పడగలు పుస్తకం గురించి ఇక్కడ స్నేహితులలో ఒకడు కచ్చితంగా చదవాల్సిన పుస్తకం అనడంతో పుస్తకంపై కాస్త ఆసక్తి కలిగింది, కానీ పుస్తకం ఎప్పుడూ ఎవరో ఒకరి ఖాతాలో ఉండేది - మళ్ళీ అనాసక్తి.
***
2009 పుస్తక ప్రదర్శన, మొదటిసారి ఇలాంటి ప్రదర్శనకు రావటం జరిగింది. ఈ-తెలుగు సభ్యులను కలవడం - వీవెన్ ని అంతకు ముందే కలిసినా, సుజాతగారినీ, సతీశ్ యనమండ్ర గారినీ, చక్రవర్తి గారినీ కలిసింది మొదట అక్కడే, పక్కనే నవోదయ స్టాల్ లో మొట్ట మొదటి సారి పూర్తి పుస్తకం చూసాను - వేయి పడగలు విశ్వనాథ సత్యనారాయణ అనే పేర్లను, కొందామని పుస్తాం చేతులోకి ఎత్తుకొని, ధర చూసి తిరిగి పెట్టేసాను. విద్యార్థులకు కథల పుస్తకాలు చదువుకునేందుకిచ్చే డబ్బుకు ఆ పుస్తకం అందలేదు మరి-ఆ రోజుల్లో!
***
2010 పుస్తక ప్రదర్శన సంపాదన చేతికొచ్చిన రోజులు, ఈ-తెలుగు స్టాల్ కి ఇంతకు ముందు ఒక రోజు వెళితే, ఈ మారు వారం రోజులు వెళ్ళిన సందర్భం, కానీ ఏ స్టాల్ లోనూ వేయిపడగలు దొరకలేదు, జీతం అందిన మొదటి రోజు నుండీ సరిగ్గా ఆరు నెలలు, పుస్తకం కొందామని తెచ్చిన డబ్బుతో హ్యారీ పాటర్, మరికొన్ని పుస్తకాలు కొని నిరాశతో ఇంటికి చేరాను.
ఒక రోజు పుస్తక ప్రదర్శనకు భరణి గారు రావడం, నా ల్యాపీలో కౌటిల్య తన బ్లాగులో విశ్వనాథ గారి పై రాసిన విషయాలు సిగ్గుపడుతూ భరణి గారికి చూపించడం గమనించాను. ఈ కుఱచబ్బాయితో స్నేహం చేసి ఎలాగయినా వేయిపడగలు సాధించి చదవాలనుకున్నాను. 
తరువాతి రోజు అడిగితే ప్రస్తుతం నా వద్ద లేదు గుంటూరొస్తే ఇస్తా అన్నాడు. 
లేదు నాకిప్పుడే కావాలి అని నిలదీస్తే నాగ ప్రసాద్ అనే సాములోరు వద్ద ఉంది తీసుకో అన్నాడు.
***
పుస్తక ప్రదర్శన ముగిసింది. ఈ నాగ ప్రసాద్ విలాసం అగమ్యగోచరంగా ఉంది.
మొత్తానికి ఒక రోజు సాములోరు ఉండే స్థావరానికి దగ్గరలో ఉన్న హాస్టల్లో నేను చేరడంతో ఏ జన్మ సుకృతి ఫలమో వేయిపడగలు మొదటి సారి నా చేతికందింది. అందిందే తడవుగా మొదటి మూడు అధ్యాయాలు చదివేసాను.
భాష కొత్తగా-వింతగా ఉంది, చదవగా చదవగా మరింత రుచించింది. కానీ నాలుగవ-అయిదవ అధ్యాయాలు కొంచెం మందచదువుగా చప్పగా సాగాయి. ఎనిమిదో అధ్యాయం వరకూ చదివాక పుస్తకం కొన్ని రోజులు కనపడకుండా పోయింది.  చెప్పలేనంత దిగులు వచ్చింది. రోజువారీ పనుల్లో మళ్ళీ పడిపోయి పుస్తకం సంగతి మరిచాను.
మళ్ళీ కొన్ని రోజులకి పుస్తకం దొరికింది మందకొడిగా చదువుతూ ఆసక్తిగానే మొత్తానికి ఒక ఆరు నెలల్లో పుస్తకం చదవడం ముగించాను.
గుంటూరు తరచు వెళ్ళడం మొదలయ్యాక కుఱచబ్బాయిని కలవటం ఎక్కువయింది. విశ్వనాథ గురించిన జ్ఞానమూ పెరిగింది. డీఎల్ఐ, కౌటిల్య, పాత పుస్తకాల కొట్ల పుణ్యమా అని విశ్వనాథ వారి సాహిత్యం మరింత చదవగలిగాను.
వేయిపడగలు ఎంత నచ్చిందంటే, ఇప్పటికీ ఎవరయినా ఏదయినా తెలుగు పుస్తకం చదవడానికి సలహా అడిగితే మొదటగా ఈ పుస్తకాన్నే చదమంటాను.
మా ఇంట్లో మామయ్యతో-అమ్మతో చదివించాను. ఓ మూడు కాపీలు కొని మరీ స్నేహితులకిచ్చాను కూడా.
ఇప్పటికీ ఏదో ఆలోచిస్తూ వేయిపడగలు తెరిచి చదివితే ఆ రోజు తలతొలిచేస్తున్న సమస్యకు సమాధానం దొరుకుతుంది.
విశ్వనాథ వారు రాసిన ఎన్ని గ్రంథాలున్నా, అన్నిట్లో పెక్కు గొప్పదీ వేయి పడగలు.
నా అవగాహనలో పుస్తకం చదవకుండానే పుస్తకం పై విమర్శలు గుప్పించొచ్చు అని నిరూపించిన పుస్తకాలలో వేయిపడగలు మొదటిది, రెండవదయిన చెలియలికట్ట కూడా విశ్వనాథ రచనే అవటం గమనార్హం. 
వేయిపడగల రచనా శైలి చాలా సులువు, భాష అలవాటయ్యాక చదవనలవవుతుంది.
పాత్రలు మనకూ, మన జీవితాలకూ ఎంతో దగ్గరగా ఉంటాయి. ఒక్కో పాత్రపైనా మరో పుస్తకమే రాయవచ్చు. 
ప్రతి సన్నివేశాన్ని ఊహించుకొని సంతోషించి, నాలో నేనే నవ్వుకున్న రోజులున్నాయి.
ఒక తెలీని ఉద్వేగం వేయిపడగలు చదివిన ప్రతి సారీ నాలో కలుగుతుంది.
ఒకానొక వ్యక్తి ఒక రచయిత రచనొకటి చదివి మిగితా రచనలు దీనికి తీసిపోయేవిగా ఉంటే ఆ రచయితను నిందించవచ్చనే భయంతో సదరు రచయిత మిగితా రచనలు చదవలేదుట. వేయిపడగల విషయంలో నేను మొదట అదే అనుకున్నాను. కానీ కామకోటి వారి సైట్ లో నా రాముడు చదివాక అలాంటి ఆలోచనలకి దూరంగా నిలవాలనుకున్నాను.

హాహాహూహూ, విష్ణుశర్మ ఇంగ్లిష్ చదువు, మా స్వామి, ఆంధ్ర ప్రశస్తి, ఏకవీర, ప్రళయనాయుడు, చిన్న కథలు ఇప్పటి వరకూ చదివిన ఇతర రచనలు.
2011 లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు విజయవాడ వెళ్ళినపుడు, కస్తూరి మురళీకృష్ణ గారు, కోడిహళ్ళి మురళీమోహన్ గారూ, శ్రీకాంత్ గారూ, నేను ఇంకా కుఱచబ్బాయి కౌటిల్య కలిసి విశ్వనాథ గారి ఇంటిని సందర్శించాము కూడా. అక్కడ మురళీకృష్ణ గారూ, మురళీమోహన్ గారి నుండి విశ్వనాథ వారి గురించి మరింత తెలుసుకోగలిగాను.
ఆ ఇంటిని స్మారకం చేయాలని కృష్ణాజిల్లా రచయితల సంఘం వారు ప్రతిపాదిస్తే, అది తిరస్కరించి అక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్ ను నడుపుతూ ఇటివలే విశ్వనాథ వారి జైవిక వారసులు ఆ ఇంటి వద్దే ఉంటున్నారని తెలిసింది. త్వరలో వారి రచనలు అందరికీ అందుబాటులో తెస్తామని మాటిచ్చారట కూడానూ!
ఆ మహానుభావుడి రచనలు జనబాహుళ్యానికి చేరేలా చేయటం ప్రతి తెలుగువాడీ కర్తవ్యం.
కొన్ని కారణాల వలన వారి రచనలు అన్నీ చదవలేకపోయాను.
మిగితా రచనలు కూడా కుఱచబ్బాయి దయతో చదవగలనని ఆశిస్తున్నాను.

సద్గురు ఒడిలో

ఈశా యోగాలోకి ప్రవేశించాక జీవితంలో ఎన్నో కొన్ని అద్భుతాలు చూడగలిగాను.
ఆధ్యాత్మికంగా, ఆలోచనాపరంగా, విశ్వాసాలపరంగా మరింత పరిణితి చెందగలిగానని అనుకుంటున్నాను.
పరిచయమయిన రోజు నుండే నాకూ, అన్నయ్యకీ రాముడు-కబీర్ కీ మధ్య జరిగినంత తీవ్రంగా చర్చలు జరిగేవి, మధ్య మధ్యలో సద్గురు గురించి ప్రస్తావిస్తూ, ఈశాలోకి రమ్మని ఎన్నో మార్లు ఆహ్వానాలంపాడు కూడా.
నేను చూసీ చూడనట్టూ వదిలేసేవాడిని.
ఒక సందర్భంలో సీరియస్ గా చెప్పి ఈ ప్రోగ్రాం కి వెళ్ళు లేదంటే... అనే స్థాయికి వచ్చాడు, నొప్పించడం ఇష్టం లేక ఒప్పుకున్నాను. ఆ ఒక్క అంగీకారమే ఎన్నో అద్భుతాలను ఆవిష్కృతం చేసింది. ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం అనమాట! ఆగస్టు 2011 లో. ఒక పాశ్చాత్య అమ్మాయి మాకు అధ్యాపకురాలు, అయిదు రోజుల కార్యక్రమం; ప్రతి రోజూ మూడు గంటలు, ఓ గంట యోగాసనాలకు సంబంధించిన విషయంపై కార్యశాల, మరో రెండు గంటలు ఆధ్యాత్మిక, ప్రాపంచిక విషయాలపై చర్చ/ఆట/ప్రవచనం ఉండేవి. అసలే ఈ పడమరమ్మాయి ఏం మనకేమి చెప్పిద్ది అన్న విసుగుతో మొదటి రెండు రోజులూ కొంచెం గర్వంగా నిర్లక్ష్యంగా ఉండే వాడిని - అంటే ఆలస్యంగా వెళ్ళటం, చెప్పినది అనాసక్తిగా పాటించడం, కానీ మూడో రోజు నన్ను గమనించి నా వద్దకు చేరి ప్రత్యేకంగా మాట్లాడిందా టీచరమ్మ! ఆ మాటల్లో తెలీకుండానే ఆమె అంటే ఓ గౌరవం వచ్చింది. సద్గురు చెప్పే ప్రవచనాలు కూడా రుచించాయి, ఆదివారం మొత్తం రోజూ రావాలన్నారు. ఆ రోజు మరొక ముఖ్యమయిన పని, అది మానుకుని ఇటు వస్తన్నానే అని మరొక అనాసక్తి. పొద్దున్నే ఆరింటికి రమ్మన్నారు, సైబర్ టవర్స్ ముందున్న ఎన్ఐఎఫ్టీకి రమ్మన్నారు. సరే కదా, ఏదో పూజో సూర్య నమస్కారమో చేయిస్తారని వెళ్ళాను. వెళ్ళాక నాకు షాక్, అందరూ గెంతులేస్తున్నారు, ఆడతన్నారు, ఫ్రిస్బీ, ఫుట్బాల్, త్రో బాల్, ఇలా చాలా ఆటలు ఆడించారు. సంవత్సరాల తరువాత(మన విద్యా విధానాలు నిందనీయం) ఆడే అవకాశం వచ్చాక ఆగుతామా? ఏదో ఒక ఆటలో విజేతను కూడా నేనే(అంకెలు లెక్క పెడుతూ ఒక్కొక్కళు బయటకు వెళ్ళే ఆటనుకుంటా)!
ఆ తరువాత ఎనిమిదిన్నర కల్లా మళ్ళీ ఆధ్యాత్మికంలోకి - శాంభవీ మహాముద్ర ఉపదేశం జరిగింది. ఆపై మునుపెన్నడూ లేనంత దీర్ఘమయిన(సమయానుసారం కాదు) లోతయిన ధ్యానం లోకి వెళ్ళాను.
మధ్యాహ్న విరామ సమయానికి గానీ నేను ధ్యానం నుండి బయటకి రాలేదు.  
మధ్యాహ్నం భోజనానికి ఆశ్రమాహారం, కానీ ఎంతో రుచిగా ఉంది.
ఆపైన మరికొన్ని సందేశ ప్రవచనాలతో రోజు ముగిసింది, ఆ ధ్యానంలో ఉన్న లోతుకి మిగితా ప్రపంచం వ్యర్థమనిపించింది నాకు! కాని పని పెద్ద భారమనిపించలేదు.
తరువాతి రెండు రోజులూ మామూలుగా ఇంతవరకూ నేర్చుకున్న విషయాలు నెమరు వేసుకోవడంతో ముగిసింది.
మొత్తానికి అయిదు రోజులు మంచి ఫలితాన్నిచ్చింది.
ఆరంభశూరత్వంలో రోజుకు రెండు-మూడు మార్లు సాధన చేసాను.
నేటికి రోజుకొకసారికి దిగజారాను :(
ఆ తరువాత ఈశా యోగా జీవితంలో ఒక భాగమయినా పెద్దగా ఆశ్రమం గురించి నేను పట్టించుకోలేదు; తరువాతి స్థాయి ప్రోగ్రాములు చేసేందుకు పెద్ద ఆసక్తి కూడా చూపలేదు!
సరిగ్గా ఇది అయిన సంవత్సరమున్నరకు అన్నయ్య దేశానికి విజయం చేసాడు. ఇక అన్నయ్య సమక్షంలో తప్పదుగా ఆశ్రమానికి వెళ్ళాను.
మొదటి సారి వెళ్ళడం అదే.
కోవైకి ఓ 30 కిమీల దూరంలో ఆశ్రమం. ఇదీ మిగితా ఆశ్రమాల్లానే అనుకున్నా వెళ్ళే వరకూ.
వెళ్ళాక నా ఆలోచనలన్నీ పటాపంచలు.
ధ్యానలింగం-లింగభైరవి ఆలయాలు, తీర్థకుండం, ఆశ్రమం చుట్టూ వెళ్ళింగిరి కొండలు, ఆహ్లాదకరమయిన వాతావరణం, ఒక రెండు రోజులకి వెళ్ళాను, కానీ తిరిగి రావాలనిపించలేదు.
రోజంతా ధ్యానలింగాలయంలో ధ్యానంలో ఉండిపోవాలనిపించేది.
తిరిగి వచ్చేసి మళ్ళీ రొటీన్ లైఫ్ లో పడ్డాను.
తిరిగి ఎప్పుడు ఆశ్రమానికి వెళ్ళాలా అని ఆశ్రమం జ్ఞాపకాల్లో ఉండేవాణ్ణి.
నిరడు నుండీ ఇవాళ్టికి దాదాపు ఓ అయిదు మార్లు వెళ్ళాను ఆశ్రమానికి.
అన్నయ్య, బ్లాగుల్లో మరో ఫ్రెండ్ వస్తున్నారని తెలిసి యజమాని ఒడిలో అన్న కార్యక్రమానికి వెళ్ళాను. రెండు రోజులపాటూ ఆశ్రమంలో సద్గురు సమక్షంలో ఉంటుంది ఈ కార్యక్రమం.

రెండేళ్ళలో ఆశ్రమంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొత్త భిక్ష హాల్, ఆదియోగి ఆలయం, సూర్యకుండం కొత్తగా వచ్చినవి.

ఆలయాలను దర్శించి, సద్గురు ఒడిలోకి చేరాను.
రెండు రోజుల పాటూ ఎన్నో కబుర్లు, జోక్స్, సందేశాలు, ఉపదేశాలు, జాగ్రత్తలు, కథలతో ఇట్టే అయిపోయింది సమయం.
యోగనమస్కారమనే ఒక విశిష్ట సడలిజ యోగక్రియ ఇక్కడందిన బహుమతి.
రోజూ చేసే సాధనకన్నా ఆశ్రమంలో ఆదియోగి ఆలయంలో చేసిన సాధన మరింత ఉత్తేజపరిచేదిగా అనిపించింది.
తెలీకుండానే రెండు రోజులు గడిచిపోయాయి.
మళ్ళీ సద్గురు ఒడిలోకి చేరే రోజు కోసం వేచి ఉండాలి!