Tuesday, September 10, 2013

సద్గురు ఒడిలో

ఈశా యోగాలోకి ప్రవేశించాక జీవితంలో ఎన్నో కొన్ని అద్భుతాలు చూడగలిగాను.
ఆధ్యాత్మికంగా, ఆలోచనాపరంగా, విశ్వాసాలపరంగా మరింత పరిణితి చెందగలిగానని అనుకుంటున్నాను.
పరిచయమయిన రోజు నుండే నాకూ, అన్నయ్యకీ రాముడు-కబీర్ కీ మధ్య జరిగినంత తీవ్రంగా చర్చలు జరిగేవి, మధ్య మధ్యలో సద్గురు గురించి ప్రస్తావిస్తూ, ఈశాలోకి రమ్మని ఎన్నో మార్లు ఆహ్వానాలంపాడు కూడా.
నేను చూసీ చూడనట్టూ వదిలేసేవాడిని.
ఒక సందర్భంలో సీరియస్ గా చెప్పి ఈ ప్రోగ్రాం కి వెళ్ళు లేదంటే... అనే స్థాయికి వచ్చాడు, నొప్పించడం ఇష్టం లేక ఒప్పుకున్నాను. ఆ ఒక్క అంగీకారమే ఎన్నో అద్భుతాలను ఆవిష్కృతం చేసింది. ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం అనమాట! ఆగస్టు 2011 లో. ఒక పాశ్చాత్య అమ్మాయి మాకు అధ్యాపకురాలు, అయిదు రోజుల కార్యక్రమం; ప్రతి రోజూ మూడు గంటలు, ఓ గంట యోగాసనాలకు సంబంధించిన విషయంపై కార్యశాల, మరో రెండు గంటలు ఆధ్యాత్మిక, ప్రాపంచిక విషయాలపై చర్చ/ఆట/ప్రవచనం ఉండేవి. అసలే ఈ పడమరమ్మాయి ఏం మనకేమి చెప్పిద్ది అన్న విసుగుతో మొదటి రెండు రోజులూ కొంచెం గర్వంగా నిర్లక్ష్యంగా ఉండే వాడిని - అంటే ఆలస్యంగా వెళ్ళటం, చెప్పినది అనాసక్తిగా పాటించడం, కానీ మూడో రోజు నన్ను గమనించి నా వద్దకు చేరి ప్రత్యేకంగా మాట్లాడిందా టీచరమ్మ! ఆ మాటల్లో తెలీకుండానే ఆమె అంటే ఓ గౌరవం వచ్చింది. సద్గురు చెప్పే ప్రవచనాలు కూడా రుచించాయి, ఆదివారం మొత్తం రోజూ రావాలన్నారు. ఆ రోజు మరొక ముఖ్యమయిన పని, అది మానుకుని ఇటు వస్తన్నానే అని మరొక అనాసక్తి. పొద్దున్నే ఆరింటికి రమ్మన్నారు, సైబర్ టవర్స్ ముందున్న ఎన్ఐఎఫ్టీకి రమ్మన్నారు. సరే కదా, ఏదో పూజో సూర్య నమస్కారమో చేయిస్తారని వెళ్ళాను. వెళ్ళాక నాకు షాక్, అందరూ గెంతులేస్తున్నారు, ఆడతన్నారు, ఫ్రిస్బీ, ఫుట్బాల్, త్రో బాల్, ఇలా చాలా ఆటలు ఆడించారు. సంవత్సరాల తరువాత(మన విద్యా విధానాలు నిందనీయం) ఆడే అవకాశం వచ్చాక ఆగుతామా? ఏదో ఒక ఆటలో విజేతను కూడా నేనే(అంకెలు లెక్క పెడుతూ ఒక్కొక్కళు బయటకు వెళ్ళే ఆటనుకుంటా)!
ఆ తరువాత ఎనిమిదిన్నర కల్లా మళ్ళీ ఆధ్యాత్మికంలోకి - శాంభవీ మహాముద్ర ఉపదేశం జరిగింది. ఆపై మునుపెన్నడూ లేనంత దీర్ఘమయిన(సమయానుసారం కాదు) లోతయిన ధ్యానం లోకి వెళ్ళాను.
మధ్యాహ్న విరామ సమయానికి గానీ నేను ధ్యానం నుండి బయటకి రాలేదు.  
మధ్యాహ్నం భోజనానికి ఆశ్రమాహారం, కానీ ఎంతో రుచిగా ఉంది.
ఆపైన మరికొన్ని సందేశ ప్రవచనాలతో రోజు ముగిసింది, ఆ ధ్యానంలో ఉన్న లోతుకి మిగితా ప్రపంచం వ్యర్థమనిపించింది నాకు! కాని పని పెద్ద భారమనిపించలేదు.
తరువాతి రెండు రోజులూ మామూలుగా ఇంతవరకూ నేర్చుకున్న విషయాలు నెమరు వేసుకోవడంతో ముగిసింది.
మొత్తానికి అయిదు రోజులు మంచి ఫలితాన్నిచ్చింది.
ఆరంభశూరత్వంలో రోజుకు రెండు-మూడు మార్లు సాధన చేసాను.
నేటికి రోజుకొకసారికి దిగజారాను :(
ఆ తరువాత ఈశా యోగా జీవితంలో ఒక భాగమయినా పెద్దగా ఆశ్రమం గురించి నేను పట్టించుకోలేదు; తరువాతి స్థాయి ప్రోగ్రాములు చేసేందుకు పెద్ద ఆసక్తి కూడా చూపలేదు!
సరిగ్గా ఇది అయిన సంవత్సరమున్నరకు అన్నయ్య దేశానికి విజయం చేసాడు. ఇక అన్నయ్య సమక్షంలో తప్పదుగా ఆశ్రమానికి వెళ్ళాను.
మొదటి సారి వెళ్ళడం అదే.
కోవైకి ఓ 30 కిమీల దూరంలో ఆశ్రమం. ఇదీ మిగితా ఆశ్రమాల్లానే అనుకున్నా వెళ్ళే వరకూ.
వెళ్ళాక నా ఆలోచనలన్నీ పటాపంచలు.
ధ్యానలింగం-లింగభైరవి ఆలయాలు, తీర్థకుండం, ఆశ్రమం చుట్టూ వెళ్ళింగిరి కొండలు, ఆహ్లాదకరమయిన వాతావరణం, ఒక రెండు రోజులకి వెళ్ళాను, కానీ తిరిగి రావాలనిపించలేదు.
రోజంతా ధ్యానలింగాలయంలో ధ్యానంలో ఉండిపోవాలనిపించేది.
తిరిగి వచ్చేసి మళ్ళీ రొటీన్ లైఫ్ లో పడ్డాను.
తిరిగి ఎప్పుడు ఆశ్రమానికి వెళ్ళాలా అని ఆశ్రమం జ్ఞాపకాల్లో ఉండేవాణ్ణి.
నిరడు నుండీ ఇవాళ్టికి దాదాపు ఓ అయిదు మార్లు వెళ్ళాను ఆశ్రమానికి.
అన్నయ్య, బ్లాగుల్లో మరో ఫ్రెండ్ వస్తున్నారని తెలిసి యజమాని ఒడిలో అన్న కార్యక్రమానికి వెళ్ళాను. రెండు రోజులపాటూ ఆశ్రమంలో సద్గురు సమక్షంలో ఉంటుంది ఈ కార్యక్రమం.

రెండేళ్ళలో ఆశ్రమంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొత్త భిక్ష హాల్, ఆదియోగి ఆలయం, సూర్యకుండం కొత్తగా వచ్చినవి.

ఆలయాలను దర్శించి, సద్గురు ఒడిలోకి చేరాను.
రెండు రోజుల పాటూ ఎన్నో కబుర్లు, జోక్స్, సందేశాలు, ఉపదేశాలు, జాగ్రత్తలు, కథలతో ఇట్టే అయిపోయింది సమయం.
యోగనమస్కారమనే ఒక విశిష్ట సడలిజ యోగక్రియ ఇక్కడందిన బహుమతి.
రోజూ చేసే సాధనకన్నా ఆశ్రమంలో ఆదియోగి ఆలయంలో చేసిన సాధన మరింత ఉత్తేజపరిచేదిగా అనిపించింది.
తెలీకుండానే రెండు రోజులు గడిచిపోయాయి.
మళ్ళీ సద్గురు ఒడిలోకి చేరే రోజు కోసం వేచి ఉండాలి!