Wednesday, July 16, 2014

బాణావతి - విశ్వనాథ సత్యనారాయణ - పిశాచ ప్రసంగం

బాణావతి - ఇప్పుడే చదవడం పూర్తి చేసాను.
సాహిత్య ప్రక్రియల్లో ఇదో రకం ప్రయోగం. పూర్తి సంభాషణల మధ్యనే నవలలోని కథను నడుపుతూ, మధ్యమధ్యలో హాస్యపు గుళికలు, సాహిత్య చర్చలు, రాజకీయ చర్చలు చేయిస్తూ, అలౌకిక శక్తులకు సంబంధించిన సున్నితమయిన పీటముడి అంశాలను చాలా ఓపిగ్గా విడదీస్తూ వెళ్ళిన నవల.
పిశాచాలు, ప్రేతాలు, ప్రయోగాలు లాంటివి నమ్మాలో నమ్మకూడదో అటుంచితే, ఆ అంశం నుండి కూడా వేదాంతాలు, స్త్రీ-పురుష సంబంధాల విశ్లేషణ, రాజకీయ సామాజిక పరిస్థితులని చూపించడంలో కవి సామ్రాట్ కు సాటిలేరెవ్వరు.
నలుగురం స్నేహితులం కలిసామంటే మాటల్లో మాటల్లో దెయ్యాల కథల వైపు చర్చ సాగించడం పరిపాటి, ఆ సన్నివేశమే ఇందులో మొదలవటం ఒక నోస్టాల్జియా. ఆపై క్రింది ఉద్యోగులు తమ పై అధికారులను పరోక్షనింద చేయడమూ పరిపాటే (నాకా అలవాటు లేదనుకోండి)!

సామాజిక పరిస్థితులను అధిగమించి వేద-శాస్త్రాలను నేర్చిన వనిత, అదే సామాజిక పరిస్థితులకు తలవంచి బాల్య వివాహానికి బలి కావడం, అక్కడ మొదలు పాపపు సాంగత్యం వలన అరిషడ్వర్గాల బానిసవడం, చేయరాని పాపాలలో పాలు పంచుకోవడం, దీన స్థితికి చేరి వైద్యానికి డబ్బు లేక, డబ్బు బదులు పాపం మోసి చనిపోవడం, అక్కడితో ఆగక కామాన్ని మూటకట్టుకొని కామినీ పిశాచిగా మారటం, మారి ఒక బీద యువకుడిని పట్టి పీడించ చూసి, అతనికి దాసియై, అతనికి సర్వ విద్యల సారం అందేలా చేసి, అతని ద్వారా తన మోక్షాన్ని పొందించుకున్న పిశాచం కథే ఈ బాణావతి.

సంభాషణలు చాలా చమత్కారంగా ఉంటాయి. విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యపు మిఠాయి కొట్లో ఇందాకా నేను చదివినవన్నీ తియ్యటి పదార్ధాలయితే, కారబ్బూందీ ఈ బాణావతి.

సూక్ష్మ లోకం గురించి ఇంకొంచెం లోతుగా అర్ధం చేసుకునే అవకాశం కలిగింది. నాస్తికత్వ భావం కలవారిని కూడా తగిన రీతి పిశాచాలలోకం తీరుతెన్నులపై అవగాహన కలిగేలా చేసే కథనం.
భార్య-భర్త సంబంధం మరింత వక్కాణించి చెప్పారు కవి సామ్రాట్టు.

హైదరాబాదు పరిసర ప్రాంతాలు 60ల ప్రాంతంలో ఎలా ఉండేది అన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పారు.
విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల వెతలు వారి సంభాషణల్లోనే చదవవచ్చు. ఒక సన్నివేశంలో ఆంగ్లం వీపు మీద "అట్టు" వేయడమూ జరిగింది!
సమాజంలోని బాల్య వివాహం అనే రుగ్మత ఎలాంటి సామాజిక దారుణాలకు దారి తీస్తుందో ఒక విధంగా చెప్పకనే చెప్పారు.
ఇంతకీ పుస్తకం పూర్తి చేసినా నాకు అర్ధం కానిది శర్మ వాళ్ళ చిన్నన్నయ్య మీదకు ప్రయోగం ఎవరు చేయించారూ, అన్న విషయం!
లేక ప్రయోగం బేగంపేట లోని ఇంట్లో ఉండటానికి వచ్చిన వారి మీద జరిగిందా?
మొత్తానికి మంచి మనోరంజకం అలాగే ధర్మసూక్ష్మాలనూ తెలిపే గ్రంథం!