Showing posts with label ఆంధ్ర ప్రశస్తి. Show all posts
Showing posts with label ఆంధ్ర ప్రశస్తి. Show all posts

Friday, May 11, 2012

వేఁగి క్షేత్రము - విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత


ఏ రాజు పంచెనో యిచట శౌర్యపు పాయసమ్ములు నాగులచవితినాళ్ళ
ఏ యెఱ్ఱసంజలో నెలమి పల్లవరాజరమణులు కాళ్ళఁబారాణులిడిరొ,
చిత్రరధస్వామి శ్రీరథోత్సవములోఁ దెలుగు పిల్లలు కత్తి త్రిప్పిరెపుడొ,
ఏ రెండు జాముల యినునివేడిమి వచ్చి కలసి పోయెనొత్రిలింగ ప్రభువుల,
నాజగచ్ఛ్రేయసంబులై యలరుతొంటి
వేంగిరాజుల పాద పవిత్రచిహ్న
గర్భిత మ్మైనయీ భూమిఖండమందు
నశ్రువులు జార్త్రు జీవచ్ఛవాంధ్రజనులు.
ఇట వేఁగీశుల పాదచిహ్నములు లెవే! లేవుపో! భావనా
స్ఫుట మూర్తిత్వమునైనఁ బొందవు నెదో పూర్వాహ్ణదుష్కాలపుం
ఘటికల్ గర్భమునం దిముడ్చుకొనియెం గాబోలు నీపల్లెచో
టట లోకాద్భుతదివ్యదర్శనమటే యాభోగ మేలాటిదో.
నీయతుల ప్రభావ మహనీయత వేఁగిపురాధిరాజమా!
ఆయతధర్మమూర్తులు మహాత్ములు వారలు బ్రహ్మకోశగో
పాయిత లాంధ్రపల్లవనృపాలురహుంకృతి వ్యాఘ్రగర్జగా
నై యరిలోకభీకర మహాద్భుత శౌర్యరసాకృతిం జనెన్.
ఈ నాపదార్పితక్షోణి నేరాజు ధర్మాసనంబుండి స్మృత్యర్థం పొందెనొ
ఈనాదృగావృతంబైన భూములలోన నేశౌర్యధనులు శిక్షింపఁబడిరొ
ఈ నాశరీరమం దివతళించిన గాలి యెంత పౌరాతన్య మేచుకొనెనొ
ఈ నాతనూపూర్ణ మైన యాకాశమ్ము నే క్రతుధ్వనులు శబ్దించినదియొ
అస్మదజ్ఞాతపూర్వదివ్యత్వ మొప్పు
నీవునీతావనీఖండ మిచట నిలచి
యస్వతంత్ర దొరలు నాయాంధ్రశక్తి
నన్నుఁగంపింపఁ జేయుచున్నది భృశమ్ము.
వేఁగి రాజ్యపు పల్లెవీధుల చెడుగుళ్ళ రిపులఁ గవ్వించు నేరువులు తెలిసి
ఎగురుగోడీబిళ్ళసొగసులో రిపుశిరస్సుల బంతులాడు శిక్షలకు డాసి
చెఱ్ఱాడి యుప్పుతెచ్చిననాడె శాత్రవ వ్యూహముల్ పగిలించు నొఱపుగఱచి,
కోతికొమ్మచ్చిలో కోటగోడల కెగఁబ్రాకి లంఘించు చంక్రమణ మెఱిఁగి
తెనుఁగులంతప్డెయవి నేర్చుకొనియు యుందు
రెన్నగాఁ దెల్గుతల్లులు మున్ను శౌర్య
రస మొడిచి యుగ్గుఁ బాలతో రంగరించి
బొడ్డుకోయని కూనకే పోయుదు రట.
శిలవోలెన్ కదలంగ లేక హృదయస్నిగ్ధార్ద్రసద్భావనా
ఖిల చైతన్యుడనై పురావిదిత వేంగీపూజ్య సామ్రాజ్యగా
ధల యోజించుచు నాంధ్రపల్లవనరేంద్ర శ్రీయశస్త్సంభమున్
బలె నిల్చుంటిన యీ పవిత్ర ధరణీ భాగంబునం దీగతిన్-
ఏ దివ్యపూరుషు లీశాద్వలాంకూరశేఖరమ్ముల లిఖించిరొ! యివెల్ల
ఈ వాయువీచిలో నేయప్సరస్సమాజము నింపిరో గీతిసముదయంబు
ఏ దివ్యశిల్పు లీరోదసీకుహరాన వ్రాసిరో దివ్యశిల్పమ్ము లిన్ని
ఈ పధాంతరమునం దేవురాణమునీంద్రసంతతులో ప్రశంసలు పొనర్త్రు
ఎటఁ గనినఁ బూర్వపల్లవ నృపచరితలె
వ్రాయఁ బడి పాడఁబడి గీయఁబడి యువిన్య
సింపఁబడి శ్రోత్ర పేయమై చెన్నుదాల్చె
నీయతీంద్రియశక్తి నాకెట్టు లబ్బె!
ఈ పొలా లెంతచేవెక్కించుకొన్నవో. గుండె వ్రయ్య సముద్రగుప్తు డడలె
ఈ నేల పావిత్ర్యమెంత కుంభించెనో చిత్రరధ స్వామి సేవలుకొనె
ఇట పల్లవులరాచయెలనాగ లేవ్రతమ్ములు చేసిరో లచ్చి నిలుకడ వడె
ఈ కాశ్యపీఖండ మేశరజ్యోత్స్నలో పిలకించెనో కీర్తి తెలుపులూరె
ఇట నెచట త్రవ్వినను బంగరేనట యది
యెంతశ్రీయొ! యదెంత రాజ్యేందిరయొ ప
దానతనఖాగ్రపాతనిర్యన్నిధాన
మైన యీచోటనుపభోగ్య మయ్యె నేడు.
ఈ పొదలం జరించుచు నహీనమహామహిమానుభావమౌ
నేపురవీధులందొ చరియించుచు నంటి నటంచుఁ భారతం
త్ర్యాపతితుండ నయ్యును పురా మహదాంధ్రమునన్ స్వతంత్రుడౌ
నేపురుషుందనో మనుచు నీ భ్రమ సత్యముగాఁ దలంచుదున్
ఏ పల్లవనృపాలు డెత్తినబావుటా చాళుక్యనృపులరాజ్యంబునందు
ఏ దేశికవిత పాలించినకవిరాజు నన్నయ్య వ్యాకరణంబునందు
ఏయులిఁజెక్కునేర్పులు మహాశిల్పి గోదావరీనదీఘోషయందు
ఏతొంటి తెలుగుల యెక్కువాచారమ్ము బలవ న్నృపుల ప్రాభవమ్మునందు
సమసిపోయెనో -- యున్మత్తసామజంబు
కొలను జొరబడి తమ్మితూడులను పెరికి
వైచెటె యెఱుంగుగాని తత్పద్మగర్భ
కేసరవిమిశ్రమధురసాగ్రియత గలదె?
ఇమ్ముగఁగాకుళమ్ము మొదలీవరకుం గల యాంధ్రపూర్వరా
జ్యమ్ముల పేరు చెప్పిన హృదంతరమేలో చలించి పోవు నా
ర్ద్ర మ్మగు చిత్తవృత్తులఁ బురాభవనిర్ణయమేని నెన్నిజ
న్మములుగాగ నీతనువున్ బ్రవహించునొ యాంధ్రరక్తముల్.
ఇది వినిపింతు నదు మది నెంచెద మిత్రులకున్ గళన్ధగా
ద్గదికము లోచనాంతబహుధాస్రుతభాష్పనదమ్ము స్పందనా
స్పదహృదయమ్ము నాపనికిఁజాలక చేసెడు నన్ను నింతగా
నెద పదిలించుకొన్న దిదియెక్కడి పూర్వజన్మవాసనో!
                                                                                           --విశ్వనాథ సత్యనారాయణ