.
.
.
ఎవరూ పోలేదు, సమయం కొంచెం గడిస్తే,
క్రితం టపాల్లో ఏదో మొదటివి కదా అనేసి ఏదో ఆవేశ పడిపోయి ఏమేంటో రాసేశాను.
ఈ టపా నేను ప్రస్తుతం నివసిస్తున్న పుణ్య మహా నగరం, పుణె గురించి రాద్దామని నిర్ణయించుకున్నాను
నేను పుట్టి, పెరిగింది తెలుగునాడు, ఏదో సందర్భంలో ఇంజనీరింగ్ చదివే రోజుల్లో, చెన్నపట్నం, పాండ్యనాడు(మదురై), బెంగుళూరు తదితర ప్రదేశాలకు పోవటం జరిగింది. చెప్పొచ్చేదేంటంటే ఊహ తెలిశాక దక్షిణాపథం దాటి నేను పోలేదనమాట.
అయితే మెత్తవేరు (సాఁఫ్టువేరు) మళ్ళీ గట్టి పడటం వల్ల నేను తంత్రమహీంద్రుని కొలువులో నర్తకుడ్నయ్యాను. నాట్యం లో కొన్ని నేర్పులు చేర్పులు ఉంటాయిరా కన్నా అని కొలువు వారు నన్ను పుణ్యనగరికి వచ్చి ఆ నేర్పులు నేర్చమన్నారు.
ఇంకేముండి 4 యేళ్ళు తంత్ర విద్య గురుకులానే ఉండి చదివి, ఇలా ఇంటికి చేరానో లేదో మళ్ళీ ఇల్లు వదిలి వీధిన పడ్డానన్నమాట.
ఇక పోతే
మళ్ళీ ఎవరూ పోలేదు నేనే నా స్పృహలోకి వచ్చాను
మొత్తానికి 2 నెల్ల క్రితం ఖాళీ చేసిన బ్యాగ్ని మళ్ళీ నింపుకొని, ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కి పుణె చేరాను.
చేరీ చేరక ముందే ఇంకా ట్రెయిన్ దిగక ముందే నా ఆజన్మ శటృవులైన వడాపావ్ మరియూ రొట్టె దర్శనమిచ్చాయి
ఏ తిండినయితే నేను ఈ జన్మలో చూడననుకున్నానో అది నా ఉద్యోగపర్వం లో మొదటి రోజు టిఫిన్ అయింది.
మొత్తానికి పుణె చేరుకున్నాం.
మాకు పుణె లో ఎవరూ బంధువులు లేరు. సో మా బడిలో చదువుకున్న ఒక సీనియర్ పుణెలోనే ఉన్నాడని తెలిసి అతన్ని ఆశ్రయించాను, ఆయన కూడా ఇక్కడే టాటా మోటర్స్ లో పని చేస్తున్నాడు. ఆయన ఉండేది పింప్రి అనే ఒక శివారులో ఉన్న ఆర్థిక మండలి. అక్కడికి పుణె-లోణావలా లోకల్ ట్రెయిన్ లో వెళ్ళాలి.
మన హైదరాబాద్ ఎంఎంటీఎస్ మాదిరిగానే ఉన్నా ఈ బండి దుమ్ము ధూళి తో కప్పబడి ఉంది, అప్పుడు అర్థమయింది హైదరాబాద్ బెటర్ అని
జనం కూడా బాగానే ఉన్నారు, 2వ స్టేషన్ శివాజి నగర్ రాంగానే నుంచోటానికి కూడా స్థలం మిగలకుండా ట్రెయిన్ జనం తో నిండిపోయిండి. రద్దీ ఎంత అంటే, తదుపరి స్టేషన్ లో దిగాలంటే ఈ స్టేషన్ నుంచే తలుపు వద్ద పడిగాపులు కాయాలి, ఈ విషయం తెలియక నా పరిస్థితి 'అమెరికన్ టూరిస్టర్' వాణిజ్య ప్రకటన సదృషమయింది.
పింప్రి లో దిగాక ఆటో ఎక్కే ధైర్యం చేశా, ఆ ఆటో వాడేమో 2 కి.మీ. దూరానికి 40 బిల్ వేశాడు. అలా 9 కి పుణె లో బయలుదేరిన నేను 11:30 కి పింప్రి లోని కాలేవాడి అనే ప్రదేశంలో మా సీనియర్ ఫ్లాట్ కి చేరాను. ఆ రోజుకి ఇక రెస్ట్.
మరుసటి రోజు ఉదయాన్నే, "టెక్ మహీంద్ర" ఆఫీసుని అన్వేషిస్తూ అలానే పుణె కూడా తిరిగినట్టు ఉంటుంది కదా అని బయలుదేరాను. అన్నట్టు మరిచాను, అప్పటికి నేను అన్నం(వరి-ధాన్యం) తినక సరిగ్గా 24 గంటలు.
మా సీనియర్ ది ఎంపీ, సో ఆయన అన్నం తినరు.
అప్పటికే నా జీర్ణ నాడులు ఆకలి అనటం మానేసి అన్నం అనటం మొడలెట్టాయి.
వాటికి సర్దిచెప్పి, నేను వీధి చివర ఉన్న బస్ స్ఠాప్ వద్ద నుంచుని బస్ కోసం నిరీక్షిస్తూ పక్కన ఉన్న మనిషిని పలకరించి , నా సంగతి చెప్పి, ఏ బస్ వెళుతుందో అడిగాను, అతను కాసేపు ఆలోచించి ఏదో రూట్ చెప్పాడు, అతను చెప్పిన స్థలాల పేర్లు అదో రకం ఇటాలియన్ వంటకాల పేర్లను గుర్తు చేశాయి, ఇటువంటి పేర్లు కూడా ఉంటయా అని అనుకున్నా, అంతలో బస్ వచ్చింది, బస్ ఎక్కాక కండక్టర్ ని అడిగితే, అతను చెప్పాడు, పుణె లో మొత్తం 4 చోట్ల కంపెనీ ఆఫీసులున్నాయని. నా ఆఫర్ లెటర్ తీసి అతనికి చూపించి ఫలానా అన్నాను, ఏ నంబర్ బస్ వెళుతుంది అని అడిగాను, అతను గట్టిగా నవ్వి(అక్కడికేదో నేను జోక్ చెప్పినట్టు) మరాఠీ లో గొణుక్కొని, మళ్ళీ హిందీ లో నాతో, ఇక్కడ బస్సుల్ని నంబర్ తో కాదు గమ్య స్థానం తో కనుక్కోవాలని చెప్పాడు. అప్పుడు మన ఏ పీ యస్ ఆర్ టీ సీ మీద మరీ గౌరవం పెరిగి పోయింది.
మొత్తానికి బస్సులు మారుతూ ఆఫీస్ చేరుకుని, పరిసరాలు గమనించి తిరుగు ప్రయాణం పట్టాను, మరుసటి రోజు ఉదయమే జాయినింగ్.
ఇక బస్సులో తిరిగి వస్తూ, గమనించాను, ఇక్కడ లేడీస్ సీట్ అని రాసి ఉన్నా ఆ రూల్ రాతల వరకే అని.
బయట ఏ వీధి చూసినా మన మొత్తం జాతి గర్వించ దగ్గ మరాఠా పులి, శివాజి విగ్రహాలే.
డెక్కన్ అనే ఒక ఏరియా లో వీర్ సావర్కర్ జ్ఞాపిక ఉంది.
ఇక అక్కడ్నించీ చాలా దూరం మేరకు ఆర్మీ క్యాంప్.
ఆ తర్వాత కాసర్వాడి అనే ప్రాంతం నుండి పుణె యొక్క మునిసిపాలిటీ కాకుండా పింప్రీ చించ్వడ్ మునిసిపాలిటీ మొదలవుతుంది.
ఇక్కడంతా ఐటీ కంపెనీల ఉద్యోగుల మకాం అనమాట.
టాటా, ఇంఫోసిస్, విప్రో, సీ టీ యస్, ఐ బీ యం అన్నీ ఈ ఏరియాలో ఉన్నవి, ఆయా కంపెనీల ఉద్యోగులు కూడా ఇదే ప్రాంతం లో ఉండటంవల్ల ఇది పుణె కన్నా కొంచెం విభిన్నం గా ఉంటుంది.
పుణెలో వర్షం మొదలయిందంటే ఒక పట్టాన ఆగదు.
చినుకులూ పడుతూ ముసురు కమ్ముకొని వారాల తరబడి అలా ఉండిపోతుంది.
మరుసటి రోజు జాఁయినింగ్ ఫార్మాలిటీస్ తర్వాత తెలిసింది, హింజవడీ సెంటర్లో ఉన్న ఆఫీస్ లో నా ట్రైనింగ్ అని.
ఇక ఏముంది హింజవడీ లో రూమ్ తీస్కుని మకాం అక్కడికి మార్చాను.
(సశేషం)