Thursday, October 11, 2012

లలితమ్మకు నీరాజనం


శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు।
మా తల్లి లత్తుకకు నీరాజనం
కెంపైన నీరాజనం - భక్తి పెంపైన నీరాజనం ॥

యోగీంద్ర హృదయాల మ్రోగేటి మాతల్లి।
బాగైన అందెలకు నీరాజనం
బంగారు నీరాజనం - భక్తి పొంగారు నీరాజనం ॥

నెలతాల్పు డెందాన  వలపు వీణలు మీటు
మాతల్లి    గాజులకు నీరాజనం 
రాగాల   నీరాజనం - భక్తి తాళాల   నీరాజనం ॥

మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు
మాతల్లి నవ్వులకు  నీరాజనం 
ముత్యాల  నీరాజనం - భక్తి  నృత్యాల నీరాజనం ॥

చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి  అలరారు
మా తల్లి ముంగెరకు నీరాజనం 
రతనాల నీరాజనం - భక్తి జతనాల నీరాజనం ॥

పసి బిడ్డలను చేసి  -  ప్రజనెల్ల పాలించు
మాతల్లి చూపులకు నీరాజనం 
అనురాగ నీరాజనం - భక్తి కనరాగ నీరాజనం  ॥ 

దహరాన కనిపించు ఇనబింబ మనిపించు
మాతల్లి కుంకుమకు భక్తి నీరాజనం 
నిండిన నీరాజనం  భక్తి మెండైన నీరాజనం॥

తేటి పిల్లలు వోలె గాలి కల్లలలాడు
మాతల్లి కుఱులకూ నీరాజనం 
నీలాల నీరాజనం - భక్తి భావాల నీరాజనం ॥

జగదేక మోహిని  సర్వేశ గేహిని
మా తల్లి రూపునకు నీరాజనం
నిలువెత్తు   నీరాజనం - భక్తి నిలువెత్తు   నీరాజనం  ॥