Thursday, October 26, 2017

భలే మంచి చిట్టి కథల పుస్తకం - ప్రకృతికి మిమ్మల్ని మరింత దగ్గిర చేస్తాయీ కథలు

ఈ లింకులో పుతకాన్ని చదువుకోండి.
ఈ లింకులో పుస్తకం పిడిఎఫ్ గా దింపుకోండి.
ఈ చిట్టి కథల పుస్తకాన్ని విజయేంద్ర గారిని నేరుగా మంచిపుస్తకం ఆఫీసులో కలిసినపుడు తీసుకున్నాను. తీసుకుని ఒక ఆర్నెల్లయింది. ఇప్పుడు చదవడానికి వీలయింది. పుస్తకమంతా ౪౬ పేజీలో ఒక్క పట్టులో చదవడం అయిపోయింది.
మొదటి కథ వానర జాతకం. జాతక కథల్లో కోతి(వానర) రూపంలో బోధిసత్త్వుడు ఉన్న కథ ఇది. కాల్పనికం. మనిషి ఏ విధంగా ప్రకృతిని నాశనం చేస్తున్నాడో చెప్పడానికి వాడుకున్న కథ. బలే ఉంది!
రెండో కథ తమాషా కథ. సాధారణ వాక్యాల్లో అసాధారణ విషయాలని రచయిత చెప్పేసారు. మనలో కొందరు పక్షులని చూడటమే హాబీగా కలిగి ఉంటారు, వాళ్ళని బర్డ్‌వాచర్స్ అంటాము. ఆ బర్డ్‌వాచర్స్ ని పక్షులు ఏ విధంగా తిరిగి అదే పనిగా చూస్తాయో, వాళ్ళని ఎలా చిక్కుల్లో పడేస్తాయో ఈ కథలో తెలుసుకోవచ్చు. పక్షుల బడులు ఎలా ఉంటాయి, అక్కడ ఏమేం పాఠాలు చెబుతారో చూచాయగా తెలుస్తుంది.
మూడో కథతో మన కథల కథానాయిక నోరా పరిచయముంటుంది.
ఈమె ఎలా పుట్టింది, ఎలా పెరిగింది? ఎందుకని ఈమె ఆడ మోగ్లీ అన్న విషయాలు తెలుస్తాయి.
నాలుగో కథలో నోరా వాళ్ళింటికి జెస్సికా అనే బంధువు వస్తుంది. ఆమెను గాబరా పెట్టేసి మళ్ళీ తిరిగి రాకుండా చేస్తుంది మన కథానాయిక. పీతలభక్షణాటకం మీరూ చదవండి.
ఐదో కథలో నోరాకు ఆమె పెంపుడు కుక్కలకు ఉన్న సంబంధం మనం చూస్తాము. కుక్కలు మనుషులకన్నా ఎంతో ఎక్కువ ఓపికతో, అనుశాసనంతో ఉంటాయని తెలిపే కథ.
ఆరో కథలో మన ఆడ మోగ్లీ మరో మోగ్లీని చేరదీస్తుంది. తోడేళ్ళకున్న సహజ లక్షణాల చర్చ ఈ కథలో దొరుకుతుంది.
ఏడో కథ షిట్ కథ. సిటీ జనాలు గ్రామానికి వెళ్ళటం, అక్కడ వ్యక్తి లక్షల జనాభా ఉన్న పట్టణ ప్రజలు గ్రామాలకి ఇవ్వాల్సిన నిజమైన కానుక అడుగుతాడు - అది వాళ్ళ షిట్. ఎందుకని అలా అడిగాడో, కథ చదివి తెలుసుకోండి. ఇదే కథ ఉత్తర భాగంలో హైదరాబాద్ మహిళలు వాళ్ళ పెంపుడు నేస్తాలతో ఎంత మమేకమైపోయారో, ఆ చనువు వలన ఏ కుక్క/పిల్లి కనిపించినా వీరితో ఎలా స్నేహపూర్వకంగా మసలుతాయోనన్న విషయం చదువుతాం.
ఏడో కథ - మానవాపఃప్రీతి ఉపాఖ్యానం. ఈ కథలో ఒక పెద్దపులి, ఒక కొండచిలువ మనిషికున్న బాధల గురించి తెలుసుకునేందుకు ప్రపంచాన్ని చుట్టొస్తాయి. మనిషి ఎవరికి బానిస? ఎందుకు అలా ప్రవర్తిస్తాడోనన్న విషయం హాస్యం జోడించి చెబుతూనే విజయేంద్ర గారు పని చేస్తున్న సంస్థ సాంగత్య గురించి వివరిస్తారు. ప్రకృతి ఒడిలో, ప్రకృతితో మమేకమై ఎలా బ్రతకవచ్చోనన్న విషయం ఒక సందేశాత్మక విధానంలో చెబుతాడు రచయిత.
ఆఖరున రచయిత గురించిన కథను రచయిత రాతలోనే చదువుకుంటాం.

తప్పకుండా మీరూ ఈ పుస్తకం చదివి మీ స్పందన తెలుపగలరు.


ఎవరి తండ్రి సొమ్మని?

కింది పెద్ద పోస్టుకి చిన్న సారాంశం :

నేనో, మీరో, మరెవరో సాధారణ పౌరుడు బ్యాంకులో వంద రూపాయలు జమ చేస్తాడు. బ్యాంకు ఆ వంద రూపాయలతో ప్రభుత్వ బాండ్లు కొంటుంది. ఇప్పుడు ప్రభుత్వం సదరు బ్యాంకులో వంద రూపాయలను పెట్టుబడిగా పెడుతుంది. ఆర్‌బిఐ ప్రభుత్వం బ్యాంకుకిచ్చిన ఋణపు వంద రూపాయలను కొత్త వంద రూపాయల నోటుగా ముద్రిస్తుంది. 

ఈ మొత్తం గందరగోళంలో ఎవరు లాభపడ్డారు? ఎవరు నష్టపోయారు?


*********************************************************


కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ బ్యాంకులకు ఊరటనిస్తూ పలు ప్రకటనలు చేసింది. వాటిలో ముఖ్యమైనది రిక్యాపిటలైజేషన్. అంటే ప్రభుత్వం బ్యాంకులలో పెట్టుబడి రూపేణా కొంత సొమ్మును జమ చేస్తుంది.
రాబోయే రెండేళ్ళలో కేంద్ర ప్రభుత్వం 2.11 లక్షల కోట్ల రూపాయలను వివిధ పథకాల ద్వారా అంచెలంచెలుగా బ్యాంకులకు అందించనుంది.
మన ప్రభుత్వ రంగ బ్యాంకులు మల్యా లాంటి బడాబాబులకు ఇప్పిచ్చిన అప్పు, చిన్న చితకా నష్టాలు, ఎందుకు పనికిరాని ఆస్తులు కలుపుకొని ఒక పది లక్షల కోట్ల నష్టంలో ఉన్నాయనేది ఒక అంచనా. అందువల్ల గత కొద్ది కాలంగా బ్యాంకులు ఋణాలు అందివ్వలేక పోతున్నాయి. అరవై ఏళ్ళలో ఇలాంటి దయనీయ స్థితి ఇదే తొలిసారి.
కొత్తగా పరిశ్రమలకు అప్పులు ఇవ్వకపోతే వ్యాపారాలు జరగవు. అప్పులిచ్చేందుకు అంతకు ముందున్న బకాయిల కుప్పలు వీలు కల్పించలేకపోతున్నాయి - అందుకని బ్యాంకులు ఋణాలు ఇవ్వడం లేదు.
గతేడాది చివర్లో రిజర్వ్ బ్యాంకు అన్ని బ్యాంకింగ్ సంస్థలకు కచ్చితమైన చట్టం ప్రవేశపెట్టింది. ఆ చట్టం ప్రకారం బ్యాంకులు బకాయిపడ్డ వారితో కఠినంగా వ్యవహిరించాలి. బ్యాంకులు షూరిటీగా ఉన్న ఆస్తులను జప్తు చేసుకొన్నా, అప్పులో పదో వంతు కూడా రావటం లేదు. దొరికిందే పదివేలు అన్న ధోరణిలో నష్టపోయిన ఋణగ్రహీతలతో వ్యవహరిస్తున్నాయి బ్యాంకులు.
అదే సమయంలో ప్రయివేట్రంగ బ్యాంకులు అధిక వడ్డీలకి ఋణాలిచ్చి ముందంజలో ఉన్నాయి.
ఇక ఈ కొత్త విధానం సంగతి చూద్దాం.
ఇది మూడు విధానాల్లో జరుగుతుంది. మొదటిది కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు బడ్జెట్ నుండి 18,000 కోట్ల రూపాయలు భర్తీ చేయనుంది. ఆపై ప్రభుత్వ సంస్థల షేర్లను (ప్రభుత్వ అధీనంలో 51% తక్కువ కాకుండా) మదింపుకు (పెం)ఉంచి 58,000 కోట్ల రూపాయలను షేర్ మార్కెట్ నుండి సమకూర్చుకోవచ్చు. రికాపిటలైజేషన్ బాండ్ల ద్వారా మరొక 1.35లక్షల కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలి.
ఇదంతా వినడానికి బాగానే ఉన్నా, షేర్లను హెచ్చించినపుడు, బాండ్లను సాధారణ ప్రజానీకం ముందు ప్రవేశపెట్టినపుడు అసలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇంతకీ ఇదంతా ప్రభుత్వం ఎందుకు చేయాలనుకుంటుంది? బ్యాంకులకు ఈ వింత విధానం ద్వారా చేకూరిన లాభం వలన, అవి ఋణం ఇచ్చే పరిస్థితిలో ఉండి, పరిశ్రమలకు పెట్టుబడులు వచ్చి, మార్కెట్ పుంజుకుంటుందన్నది ప్రభుత్వం ఆలోచన.
ఆలు లేదు ౘూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది మన జైట్లీ - ఉర్జిత్ పటేల్ ల కథనం.
అసలు ఏ బ్యాంకు వద్ద ఎంత ఋణం బాకీలున్నాయి, అందులో ఎంత తిరిగి రావచ్చో, ఎంత అచల ఆస్తుల రూపంలో ఉందో, ఎంత ఎప్పటికీ తిరిగి రాదో? ఈ లెక్కలు బ్యాంకులు బహిర్గతం చేయవు - చేయలేవు. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపలి మనుషులు చాలా బాగా డబ్బు-ఆస్తులను గందరగోళం చేసి లంచగొండితనం బాగా రుచిగొని ఉన్నారు.
దానికి తోడు ఏ ప్రభుత్వ రంగ సంస్థకు ఎంత శాతం పైన చెప్పిన డబ్బు అందచేయబడుతుంది, అందుకు ప్రాతిపదిక ఏమిటి, అన్నది పెరుమాళ్ళకే ఎఱుక.
మన గౌరవనీయ ఆర్ధిక శాఖ మంత్రి గారేమో ఏ రోజు ఏ కొత్త ప్రకటన చేస్తారో, మన ఆర్ధిక వ్యవస్థకు అది ఏం మార్పు తెస్తుందోనన్న ఆందోళన ప్రతి క్షణం ఆర్ధిక వ్యవస్థలోని ప్రతి ఒక్కరికీ ఉండనే ఉంది.
ఇక పాడుపడిపోయి, పాతబడిపోయి, కొత్త మార్పులకు, కొత్త విధానాలకు విముఖంగా ఉండే మన ప్రభుత్వ రంగ బ్యాంకు సంస్థలు ఎప్పటికి మారతాయో? ఇలాంటి తాయిలాలు ఆయా బ్యాంకుల పనితనాన్ని ఏ మాత్రం మెరుగు పరుస్తాయో? వేచి చూడటం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి.

నోట్లరద్దు తరువాత లక్షల కోట్లలో బ్యాంకుల్లో డబ్బులు జమ అయ్యాయి. జిఎస్టి వలన అన్ని పెద్ద డబ్బు లావాదేవీలు బ్యాంకు ముఖతః మాత్రమే జరుగుతున్నాయి. దీని వలన బ్యాంకు మాధ్యమంగా కాకుండా డబ్బులు చేతులు మారే అవకాశం లేకుండా పోవటంతో చాలా వరకు అమ్మకాలు, కొనుగోళ్ళు, వస్తువుల తయారీ, ఎగుమతి లాంటివి గణనీయంగా పడిపోయాయి. బ్యాంకుల్లో జమ చేస్తున్న డబ్బుపై సాధారణంగా వచ్చే వడ్డీని రాను రానూ అటు ఆర్‌బిఐ, ఇటు బ్యాంకులు తగ్గించేస్తున్నాయి. వీటికి తోడు కొత్తగా ప్రభుత్వ ఆసరా అవసరమా? మన బ్యాంకింగ్ వ్యవస్థలు మరికొంత జవాబుదారీ తో పని చేయలేవా?
నోట్లరద్దు సమయంలో ఆ నాలుగైదు నెలలు బ్యాంకింగ్ వ్యవస్థలోని ఎన్నో పనులు వదిలేసి బ్రాంచికి నలుగురైదుగురు కేవలం నోట్లను డిపాజిట్ చేసుకుని, మార్పిడి చేయటం లాంటి నిరర్ధక పనులలో నిమగ్నులయ్యారు. ఆ సమయంలో వాళ్ళు సాధారణంగా చేసుకునే వసూళ్ళు, ఋణాల సేకరణ విశ్లేషణ లాంటి పనులను ప్రజల వెసులుబాటు కోసం పక్కన పెట్టేయాల్సి వచ్చింది. సరయిన సంఖ్యలో క్యాష్ డిపాజిట్ మెషిన్లు, క్యాష్ డిస్పెన్సింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే బ్యాంకులపై పని భారం ఎక్కువ ఉండేది కాదు.
ఆ నెలలలో బ్యాంకింగ్ వ్యవస్థ సవ్యంగా పని చేయకపోవటం నేటి ఆర్ధిక వ్యవస్థ పరిస్థితికి అతి పెద్ద కారణం.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నిజంగానే మన దేశపు రిసెషన్ ను చూసేవాళ్ళం.
ప్రభుత్వపు ఈ రిక్యాపిటలైజేషన్ చొరవ ఎంతో కొంత బ్యాంకులను గాడిలో పెట్టేందుకు దోహద పడుతుంది. ఇది ఎలక్షన్లకు ముందు వస్తున్న నిరర్ధక తాయిలం కాకుండా అమలులో సరిగ్గా చేసి చూపించి మన దేశ ఆర్ధిక వ్యవస్థను అభివృద్ధి వైపుకు మన కేంద్ర ప్రభుత్వం తీసుకు వెళుతుందని ఆశిద్దాం.

Sunday, October 22, 2017

మూఢ చేతస్సుతో నిండిపోయాం

భారతదేశం ఒక దేశం కాదు పలు దేశాల సమూహమని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసేవి మన భాషా-సంస్కృతుల వైవిధ్యాలు. ఎన్ని అసమానతలున్నా, ఎంత ఎత్తుపల్లాలున్నా, ఒక రాజ్యాంగాన్ని పాటిస్తూ కలిసి మెలిసి ఉన్నాం.
ఐతే, ఇన్నేళ్ళ తరువాత చరిత్ర తెలీకుండా. అసలేం జరిగిందో, ఏం జరుగుతుందోనన్న అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నాము మనమంతా - ఇవాళ!
ఇంతకు మునుపు మనం రోజూ మాట్లాడుకునే జనాలు మనింట్లో వాళ్ళు, పక్కింటోళ్ళు, కచేరీలో తోటి ఉద్యోగులు, స్కూల్లో తోటి విద్యార్థులు, చనువున్న వారికి ఉపాధ్యాయులు; పార్కులకు వెళ్ళి వాకింగులు చేసే వాళ్ళకి, పబ్బులకి వెళ్ళేవాళ్ళకి, యోగాలకు వెళ్ళే వాళ్ళకి అక్కడ కలిసే జనాలు. ఆ మాటల్లో కూడా మనకు అత్యంత విలువైన విషయాలే చర్చించుకునే వాళ్ళమేమో.
అంతకు మించి సంభాషణలూ ఆ రోజుల్లో జరగటం నాకు తెలుసు. యద్దనపూడి నవలలు చదివి కలం స్నేహాలు చేసి, వేరే వేరే ఊర్లలో వాళ్ళతో మా ఇంట్లో పెద్దవాళ్ళు పోస్టుకార్డులు ఇన్‌లాండ్ లెటర్లు రాసుకోవటం. పండగలకి, ముఖ్యంగా కొత్త సంవత్సరమపుడు గ్రీటింగ్ కార్డులు పంపుకోవడం. ఆవి కూడా మిత సంభాషణలే.
పలుకే బంగారమనమాట ఆ రోజుల్లో...

మెల్లిగా ఫోనులొచ్చాయి. లాండ్ లైన్ ఇంట్లో పెట్టించిన కొత్తల్లో, మా క్లాసుమేట్లకు ఫోన్ చేయడం నాకింకా గుర్తుంది. మనకు పని లేని విషయాలు, వృథా మాటలు మాట్లాడొచ్చన్న విషయం తెలిసింది! ఇక మొబైల్స్ రావటం మొదలయ్యాక పదో తరగతి పరీక్షలు - డౌట్లు వీటితో ఫోను బిల్లు రావటాలు. ఐనా మాటలు మితమే, మాటల పరిధీ మితమే.

ఇక ఇంటర్నెట్ రాక, మొబైళ్ళు విపరీతంగా పెరగటంతో సాయంత్రం చెయ్యాల్సిన వంట గురించి మొదలు పక్కింట్లో వాళ్ళు నీచు వండారన్న విషయం దాకా ఫోనుల్లో మాట్లాడ్డం మామూలైపోయింది.

దేనీకైనా ఒక పరిధి ఉంటుంది, అది దాటాక ఆ వస్తువు వాడకం తగ్గించేస్తాం, పాతొక రోత అన్న సామెత ప్రకారంగా...

కానీ ఈ ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఫోనులకు ఆ పరిధి అందనంత ఎత్తుకు చేరిపోయింది.
ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రవరతో మొదలుపెట్టి గుర్తున్నంతలో రాతి యుగం నాటి పూర్వీకులను గుర్తు చేసుకుని పెద్దల పండగ చేసుకున్నామని నలుగురికీ చెప్పేసి నాలుగు ఫోటోలు పడేసి, ఎవరు స్పందిస్తారా, ఎవరు కామెంట్ రాస్తారా, ఎవరు లైకులు కొడతారా అని ఎదురు చూడటం మొదటి స్థాయి. తరచూ స్పందించే వాళ్ళలో ఎవరు ఇవాళ పోస్టుకి లైకులు కొట్టలేదు, ఎవరు కామెంటలేదు అని చూస్కొని, వాళ్ళు స్పందించేలా పోస్టుని తిరిగిరాసి మళ్ళీ పోస్టు చేయడం, అప్పటికి పట్టినుకోకపోతే వాళ్ళని ట్యాగ్ చెయ్యటం తో ఒక కొత్త రోగం మొదలయిద్ది. ఆ రోగం ముదిరి మన పోస్టులకి లైకు కొట్టని వాళ్ళ మీద ద్వేషం పెంచుకుని, వాళ్ళ పోస్టుల్లోకి దూరి అసందర్భంగా వాళ్ళని కవ్వించటం, ఇంకా ముదిరితే వాళ్ళని టార్గెట్ చేస్తూ పేరెక్కడా చెప్పకుండా దెప్పిపొడవడం, ఇంకా ముదిరి వాళ్ళ పోస్టులకి పేరడీపోస్టులు పెట్టడం, మరింత ముదిరి వాళ్ళకు విరుద్ధంగా ఉన్న పలుగురిని వెంటేసుకుని గ్రూపులు మొదలెట్టి మరీ వాళ్ళని తిట్టుకోవడం. అంతకు మించి ముదిరితే సదరు ద్వేషిని బ్లాక్ చేసి, ఆ ద్వేషికి ఒక పేరడీ అకౌంటో, ఆ ద్వేషిని అన్ని వైపుల నుండి ఉక్కిరి బిక్కిరి చేసేందుకు ఒక ప్ఫది ఫేకు అకౌంట్ల రూపకల్పన. తారా స్థాయిలో భజన క్లబ్ లాగా ద్వేషి పేరును నిత్య పారాయణం చేసే కల్టును స్థాపించడమనమాట.
ఇదీ మనవాళ్ళకి బోర్ కొట్టేసింది.
ఇక పైన చెప్పిన ఒక్కో సోపానాన్ని ఆధారం చేసుకుని అపార్టుమెంటులు కట్టుకున్న వాళ్ళున్నారు - ఊహలూ-కబుర్లూ ఆ అపార్టుమెంటుల్లో ఇటుకలు. ఏదైనా వ్యక్తి/భావజాలాన్ని ద్వేషించడం బ్లూప్రింటు, ఒక్కోపోస్టు ఒక్కో అంతస్తు. ఆ పోస్టుకు లైకులు కొట్టి కామెంటేవాళ్ళందరూ ఆ గ్రూపు సభ్యులైపోతారు. ఒక కల్టుకుండే లక్షణాలన్ని అందరిలో ఓ మోస్తరుగా వచ్చాయనుకున్నాక, ఆ గ్రూపు తలుపులు మూసివేసి, దాన్ని రహస్యకూటమిగా మార్చేసి సభ్యులను బ్రెయిన్ వాషు చేయడం మొదలుపెడతారు పెద్ద పిచ్చోళ్ళు. కొత్త పిచ్చోళ్ళు, చిన్న పిచ్చోళ్ళు అన్ని వింత కదా, అంతా జీర్ణించేసుకుంటారు. మనకు ఇంటర్నెట్ ప్రపంచంలో అజీర్తి సమస్య లేదు కదా మరి!
నిజ జీవితంలోనే ఒక భవనానికి భౌతికంగా కొన్ని లక్షణాలున్నాయి. ఏ ఆకారం పడితే ఆ ఆకారంలో కట్టలేము. వంటగదికి ఆగ్నేయం, నీరు పోయే దిశ ఈశాన్యం, గాలి వెలుతురు వచ్చేలా వాయవ్యంలో ఖాళీ స్థలం, ఇలా అన్ని ఫిక్స్డ్ కదా!
ఐతే ఈ ఇంటర్నెట్ ఇళ్ళకి ఎలాంటి పరుధులూ లేవని ముందే అనుకున్నాం కదా, అపార్టుమెంటుల బ్లూప్రింటుల్లోనూ అంతే! వంటగదిలో బాత్రూం ఉంటుంది, పడుకునే చోటే నడవా ఉంటుంది. కొన్ని గ్రూపుల్లో చేరాలంటే మీ వివరాలన్నీ చెప్పేసి, ఆ అపార్టుమెంటులో మిగితా అందరిలాగానే నగ్నంగా తిరగాలన్నమాట!
ఇంట్లో జనాలు పెరిగితే వేరు కుంపటి సహజమే, వేరు కుంపటి వేరే గ్రూపుకి దారి తీస్తుంది.
అలా సవా లక్ష గ్రూపులు తయారయ్యాయి.ఇది ఫేస్ బుక్ మాట.
సోషల్ మీడియాలో ఏ కొత్త అనువర్తనం వచ్చినా ఇదే రూలు అక్కడా పాటించేస్తున్నాం, ముఖ్యంగా మన తెలుగువాళ్ళు ఇందులో దిట్ట!

ఇక్కడ మురళి అన్నయ్య చెప్పిన విధంగానే, నాకూ అనుభవముంది! టెలిగ్రాములో, వాట్సాపులో నా ప్రమేయం లేకుండా నేను ఎన్నో గృహప్రవేశాలు చేసేసా! ఆ గ్రూపుల్లో ఎలాంటి చర్చలు జరుగుతాయో అన్నయ్య పోస్టులో చదువుకోవచ్చు.

జనం ఎక్కడుంటే ఐదెస్టేట్లు అక్కడేగా మన దేశంలో, పైగా మనది ప్రపంచంలోనే అతి పెద్ద డెమాక్రసీ!
 కోర్టుల్లో ఫేసుబుకు తరహా జోకులేసే జడ్జీలొచ్చారు. WHO, UNESCO, UNO, World Bank కలిసి మూకుమ్మడిగా తెలుగు ఒక పక్క చచ్చిపోతుందని ప్రకటనలు వారానికొకటి ఇస్తుంటే, మరో పక్క తెలుగు భాష ప్రపంచంలోనే గొప్ప భాష అనీ, తెలుగు లిపి ప్రపంచంలోనే అతి గొప్ప లిపి అని ప్రకటనలు గంటకొకటి. ఆ వార్తలని ఆధారంగా చేసుకుని కేసులు గెలుస్తున్న న్యాయవాదులు, ఆ ప్రకటనలతో జనాల మనసు దోచి ప్రజాప్రతినిధులవుతున్న నాయకులు, ఆ పోస్టుల ఆధారంగా అరెస్ట్ చేస్తున్న పోలీసులు, ఆ పోస్టులనే నిజమని నమ్ముతూ, అసలు వార్తలని కప్పెట్టేసి జనాల రుచికి తగినట్టుగా వార్తలను వండుతున్న మీడియా!

ఇక ఇళ్ళన్నీ గేటెడ్ కమ్యూనిటిగా, ఆపై శాటిలైట్ నగరాలుగా, టౌన్ షిప్లుగా, ఉపనగరాలుగా, ముఖ్య నగరాలుగా మారినట్టు; గ్రూపులు మెల్లిగా ఒక భావజాలం చుట్టూ రెండుగా విడిపోయి పరస్పర విరుద్ధ ప్రకటనలు, ఒకరినొకరు నిందించుకోవడం జోకులు పేల్చడం మొదలైపోయింది. మీములు, పేరడీ పాటలు, చిరుచిత్రాలు, లఘుచిత్రాలు, చలనచిత్రాల దాకా వెళిపోయింది స్థాయి.

మన దేశంలో మొహమ్మదీయులు, కిరిస్తానీలకు స్థానం లేదన్న భావజాలం చాలా తక్కువ స్థాయిలో ఉండేది ఒకప్పుడు. ఈనాడు అది వికృత రూపం దాల్చింది. క్రిస్టియన్ లను ప్రేతాలని, మొహమ్మదీయులను సుల్లాలని పిలిచే సభ్యత్వం సమాజానికి అలవరుచుకుపోయింది.
కాదనే వాళ్ళు దేశద్రోహులు. కలిసి నడిచే వాళ్ళు క్షణక్షణం వాళ్ళ స్వామిభక్తిని, ముస్లిం-క్రిస్టియన్ వ్యతిరేకతను చాటుకోవాలి. అందుకు వాళ్ళ సహజత్వాన్ని మానేసి పొద్దస్తమానం ఎవరు హిందుత్వానికి శత్రువులో గుర్తిస్తూ వారి చేస్తున్న చిన్న తప్పైనా, అది వారి మతంతో, వారి సామాజిక పూర్వరంగంతో ముడిపెట్టి వాళ్ళను సామాజిక మాధ్యమాల నుండి బహిష్కరించాలి.
ప్రభుత్వం - హిందూ నాయకత్వ ప్రభుత్వం, వాళ్ళేది చేసినా అది న భూతో న భవిష్యత్. నోటురద్దు మొదలుకొని జిఎస్టి దాకా, తాజ్‍మహల్ ను వారసత్వ కట్టడాల జాబితా నుండి తీసివేయడం మొదలు నిలదీసే వాణ్ణి దేశద్రోహిగా నిలబెట్టడం దాకా. అన్ని నిర్ణయాలు అభివృద్ధి హేతుకాలే, వీటిన మించి దేశానికి ప్రయోజనం చేకూర్చేవి లేవు!

 

Sunday, October 15, 2017

సంశయలాభము : ఆరుషి హత్య కేసులో వాంఛనీయమైనా ఆలస్యంగా వచ్చిన తీర్పు

ఆరుషి హత్య, ఆ వెంటనే వాళ్ళింటి పనిమనిషి హత్య ఉదంతం 2008లో దేశంలో పెద్ద చర్చనీయాంశమయింది. 14 ఏళ్ళ బాలిక నిర్దాక్షిణ్యంగా చంపబడి, రక్తపు మడుగులో దొరకడం, ఆ సమయానికి ఇంట్లో అంతా గాఢ నిద్రలో పడి ఉండటం. పనిమనిషి హేంరాజ్ పై అనుమానం రావడం, రెండు రోజుల్లో హేంరాజ్ మృతదేహం ఇంటిపైన టెరేస్‌లో వాటర్ ట్యాంకులో లభ్యమవడం - ఏదో క్రైం సినిమా కథలా ఉన్న యథార్థంగా జరిగిన ఉదంతమిది. ఇంకెవరి ప్రమేయం ఈ హత్యల్లో కనిపించకపోవడం తో పోలీసులు ఆరుషి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. సాక్ష్యాధారాలు సరిగా లేకపోయినా సీబీఇ కోర్టు వీరిరువురికీ జీవిత ఖైదును 2013లో ప్రకటించింది. పై కోర్టు అలాహాబాద్ హైకోర్టులో ఇన్నేళ్ళు నలిగిన కేసు ఆఖరికి బెనెఫిట్ ఆఫ్ డౌట్ (సంశయలాభము) కింద ఇద్దరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ తీర్పు వెలుతురులో సీబీఐ తీర్పు, సీబీఐ, అంతకు ముందు స్థానిక పోలీసులు జరిపిన విచారణలపై ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. కొందరు సాక్షులను పోలీసులు సమకూర్చారని, హత్య జరిగిన రాత్రి తల్వార్ కుటుంబం వాళ్ళింట్లో వేరే వారున్నట్టు ఋజువులున్నాయని, అసలు దోషులు తప్పించుకున్నారని హైకోర్టు బెంచ్ అభిప్రాయ పడింది.
అంతకు ముందు సీబీఐ విచారణలో తల్వార్ దంపతులు హత్య చేసి, హేంరాజ్ శవాన్ని ఇంటిపైకి తరలించి, హత్యకు వాడిన ఆయుధాలను దాచిపెట్టారని తేల్చింది. ఇందుకు తగిన ఆధారాలు కానీ, ఋజువులు కానీ దొరకలేదన్నది గమనార్హం.
ఈ తీర్పు మరో కోణం నుండి చూస్తే మన మామూలు ప్రజల ఊహలకు, వాటిని ప్రేరేపించే మీడియా కథనాలకు - వాస్తవాలు - సాక్ష్యాలు ఆధారం చేసుకుని చట్టపరమైన ఆలోచనలలో రంగరించి నిజానిజాల విచారణ చేసే కోర్టులకు ఉన్న వ్యత్యాసాన్ని ఇట్టే బహిర్గతం చేసింది. పక్క గదిలో పడుకొని ఉన్నా వాళ్ళమ్మాయి హత్య గురించి కానీ, హేంరాజ్ శవాన్ని ఇంటిపైకి తీసుకెళ్ళిన విషయాలు కానీ నిద్రలో ఉండటం వలన తెలీలేదన్న తల్వార్ దంపతిపై సానిభూతి చూపేవారి కన్నా అనుమానం పెంచుకున్నవారే ఎక్కువ.
దాదాపు పదేళ్ళ జైలు నరకయాతన తరువాత తల్వార్ దంపతికి సంశయలాభము వలన జైలు శిక్ష నుండి ముక్తి దొరికింది.
సాధారణంగా కోర్టులు కేవలం సాక్ష్యాధారాలను విని, పరిశీలించి మాత్రమే తీర్పు చెబుతాయి, అనుమానం ఆధారంగా తీర్పులు చెప్పవు.
మొత్తం కేసు దర్యాప్తు గందరగోళంగా ఉందంటే కొందరు ఒప్పుకోకపోవచ్చు. ఒక రోజంతా ఎక్కడా హేంరాజ్ జాడ కనిపించలేదు. హేంరాజ్ సహచరుల్లో ముగ్గురు ఈ కేసులో అనుమానితులు. కానీ ఆధారాలు లేని కారణంగా వారిపై నేరారోపణ కోణంలో విచారణ జరుగలేదు. ముగ్గురిలో ఒకడు - కృష్ణ, డిఎన్ఏ కూడా సరిపోలింది, కానీ దాన్ని కోర్టు చెల్లదని కొట్టిపారేసింది. నిజం చెప్పాలంటే సి.బి.ఐ విచారణను త్వరగా ముగించెయ్యాలనే ఆలోచన వలన సాక్ష్యాధారాలను సేకరించడంలో జాప్యం చేసింది. ఆ జాప్యంలో పుణ్య కాలం కాస్తా గడిచిపోయింది. ఇంత జరిగాక అసలు కేసును నడిపిన కోణంలోనే పరిశీలించాల్సిందా? లేక వేరే మార్గాల్లో కేసు దర్యాప్తు జరిగి ఉండవచ్చా? స్థానిక పోలీసులు - సీబీఐ, ఇరువురు రెండు స్థాయిల్లో విచారణ జరిపినా కేసు కొలిక్కి రాకపోవటం సో(శో)చనీయాంశం. హత్య కేసుల్లో నిందితులను వదిలేయడం ఒక విధంగా అన్యాయమే! ఇన్ని రోజులకి నిందితులను వదిలివేయడమంటే ప్రభుత్వ యంత్రాంగం నేరస్థుల చేత నేరం ఒప్పించడంలో విఫలమయింది లేదా నిందితులుగా గుర్తించబడిన వారు సరయిన వారు కారు. ఒకవేళ ఈ మొత్తం సన్నివేశంలో నిందితులు నేరస్థులైతే; వారు తప్పించుకుంటే అది మన న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ, సీబీఐ వైఫల్యమే. లేదూ నిందితులు నేరస్థులు కాదంటే అసలు నేరస్థులు ఎవరు? వారిని పట్టుకోలేని గుర్తించలేని మన న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, సీబీఐ వైఫల్యమే.
ఏది ఏమైనా, ఇంకా ఆరుషి హంతకులకు తగిన శిక్ష పడలేదన్నది మనం మర్చిపోలేని, మర్చిపోకూడని చేదు నిజం.

ఈ సందర్భంలోనే మలయాళ ప్రేతం సినిమా రిమేక్ "రాజుగారి గది 2" విడుదల కావటం అందులోనూ ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోవడం చూసాము. కానీ నిజానికి ఆమె హత్య చేయబడిందని మనందరికీ తెలుసు. ఐనా మనం ఇలాంటి విషయాలను పట్టించుకోం. ఎంతటి పరిస్థితి వచ్చిన తట్టుకొని నిలబడగలిగే ధైర్యం మనలో మనం నింపుకోలేకపోతున్నాం, మన పిల్లల్లో నింపలేకపోతున్నాం!

Thursday, October 12, 2017

చావుకీ రాయాలో వీలునామా

యుథెనేషియా, ఈ పదం వినగానే కొందరి గుండెల్లో ఝల్లుమనిపిస్తుంది. న్యాయపరంగా భారతదేశంలో, ప్రపంచంలో కూడా పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరుగుతున్న అంశం. మానవతా దృక్కోణంలో యుథెనేషియాను సమర్ధించేవారెంతమంది ఉంటే, వ్యతిరేకించే వారు అంతకు మించి ఉండి ఉండవచ్చు.
ఏమిటీ యుథెనేషియా? ఆక్స్‌ఫర్డ్ అడ్వాన్స్డ్ లర్నర్స్ నిఘంటువు ప్రకారం "the practice (illegal in most countries) of killing without pain a person who is suffering from a disease that cannot be cured" అంటే నయంకాని ప్రాణాంతక ముదురు రోగంతో బాధపడుతున్న వ్యక్తిని నొప్పి లేకుండా వైద్యకీయ విధానంలో చంపివేయడం. ఇది ఎన్నో దేశాల్లో చట్టవిరుద్ధం.
ఒక రకంగా యుథెనేషియాని గౌరవ మరణం, సుఖ మరణం, ముక్తి మరణం, ఇలా పలు విధాలుగా అభివర్ణించవచ్చు. 
మెర్సీ కిలింగ్ లేదా కరుణతో హత్య చేయడం ఈ యుథెనేషియాకున్న ప్రసిద్ధ పరిభాష.
ఈ యుథెనేషియా రెండు రకాలు - ఆక్టివ్ యుథెనేషియా, పాసివ్ యుథెనేషియా. ఆక్టివ్ యుథెనేషియాలో ప్రాణాంతక ఇంజెక్షన్ లేదా మందులు ఇచ్చి ప్రాణం తీసివేయడం జరుగుతుంది. పాసివ్ యుథెనేషియాలో చికిత్సను ఆపివేసి, ప్రాణాలను నిలిపి ఉంచే  మందులను ఇవ్వడం ఆపివేస్తారు.
ఇంకా రోగి ఇష్టపూర్వకంగా యుథెనేషియాకు అంగీకరిస్తే దానిని వాలంటారీ అని, రోగి అంగీకరించే పరిస్థితి లేనపుడు నాన్‌వాలంటరీ అని, రోగి అంగీకరణతో సంబంధం లేకుండా యుథెనేషియా చేస్తే దానిని ఇన్‌వాలంటరీ అని వ్యవహరిస్తున్నారు.
నెదెర్లాండ్స్, బెల్జియం, కొలంబియా, లగ్జెంబర్గ్ దేశాల్లో ఆక్టివ్ యుథెనేషియా చట్టబద్ధతను కలిగి ఉంది. స్విజర్లాండ్, జర్మనీ, జపాన్, కెనడా, అమెరికాలోని కొన్ని రాజ్యాల్లో ఆత్మహత్యకు వైద్య పరంగా సహకరించడం చట్టబద్ధమే.
భారతదేశంలో ఆక్టివ్ యుథెనేషియా చట్టవిరుద్ధం; పాసివ్ యుథెనేషియాను చట్టబద్ధం చేస్తూ ౨౦౧౧, ౭ మార్చి తేదీన సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
వాదనల రూపం నుండి పరిణితి చెంది ఈ యుథెనేషియా ఒక ప్రధాన ప్రశ్న రూపంలో సుప్రీం కోర్టు ముందుకొచ్చింది. ఆ ప్రశ్నే, "చట్టం జనాలు వ్రాసుకునే మరణ వీలునామాలను అంగీకరించాలా?" అన్నది.
ఈ వీలునామాను ఎవరైనా వ్యక్తి పూర్తి స్వస్థతలో ఉండగా రేపటి రోజు ఒక వేళ అతను/ఆమె చికిత్సకు ప్రతిక్రియ ఇవ్వలేని స్థితికి చేరుకుంటే, అలాంటి పరిస్థితిలో అతని/ఆమె ప్రాణాలను తీసివేయవచ్చు అని ముందుగా రాసివ్వటం.
ఈ ప్రశ్నకు చట్టపరమైన, మానవత, సైద్ధాంతిక, దార్శనిక పార్శ్వాలున్నాయి. ఈ ప్రశ్నకు జవాబిచ్చే ప్రక్రియలో సుప్రీం కోర్టు అత్యున్నత న్యాయస్థాన న్యాయవాదులు, న్యాయాధీశులు మనకు రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు(ధారణ 21) ప్రకారం జీవించే హక్కులోనే మరణించే హక్కు ఇమిడి ఉందా? అన్న ప్రశ్నను చట్టపరమైన కోణం నుంచి సమాధానమిస్తారు. ఇంతకు ముందు ఇచ్చిన తీర్పుల్లో మరణించే హక్కు జీవించే హక్కులో భాగం కాదని తెలిపిన సుప్రీం కోర్టు మరలా ఆ తీర్పు సారాంశాన్ని మార్చి చెప్పాల్సిన తరుణం వచ్చిందేమో?
"నేను ఎలా చావాలి, ఎప్పుడు చావాలి అన్నది నా చేతుల్లో లేదా?"
ఐతే ఈ మరణపు వీలునామా చికిత్సకు డబ్బు కట్టలేని పేద బంధువులకు ఉపశమనమే.
చనిపోతానని ఒక వ్యక్తి నిర్ణయించుకుంటే దాన్ని ప్రభుత్వం చట్టం ఇకపై ఆపలేవా?
ప్రాణాలని కాపాడటమే లక్ష్యంగా పని చేసే డాక్టర్లకు వారి ప్రతిజ్ఞకు విరుద్ధంగా పని చేయమని ఈ వీలునామాలు బలవంతపెడతాయి కదా!
అమెరికా చట్టాల ప్రకారం రోగి స్వాతంత్ర్యం పరమావధి. రోగి నిర్ణయం తీసుకోలేనపుడు, రోగి స్థానంలో రోగి కోసం నిర్ణయాలు తీసుకునే వారసులను చికిత్సకు ముందే తెలియపరచాలి. భారతదేశం కూడా ఇదే పంథా పాటించాలా?
తీర్పును రిజర్వ్ లో ఉంచి సుప్రీం కోర్టు ఎలాంటి సందేశం ఇస్తోంది? త్వరలో ఈ మరణ వీలునామాలపై సమగ్ర మార్గదర్శక సూత్రాలను వెలువరించనుందా? కాలమే చెప్పాలి.
ప్రభుత్వం మాత్రం ఈ మరణ వీలునామాలను ఏ మాత్రమూ సమర్ధించబోదని తెలుస్తోంది. ఇది ఒక విధంగా జనాల బతుకులను బలవంతంగా నాశనం చేయడమనేనన్నదని, రాజ్యాంగం ఉటంకించిన జీవన హక్కుకు ఇది విరుద్ధమని ప్రభుత్వ వాదన.
ముసలితనం వచ్చిన వెంటనే వృద్ధాశ్రమాలకు పంపించే మన జనాభా, వారికి రోగాలొస్తే బలవంతంగా మరణ వీలునామా వ్రాయించి చంపెయ్యరని ఏ విధంగా చెప్పగలం?
ఐతే ఒకవేళ మెడికల్ బోర్డ్, పై అధికారులు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి న్యాయాధికారుల నుండి అనుమతి పొందడాన్ని కచ్చితం చేస్తే యుథెనేషియాను దురుపయోగం కాకుండా ఆపవచ్చేమో.
సుప్రీం కోర్టు తీర్పు, మార్గదర్శకాల కోసం వేచి చూద్దాం.


Wednesday, October 11, 2017

ఈ నగరానికేమయింది? ఒక వైపు నుసి మరో వైపు పొగ...

ఢిల్లీలో మందుగుండు సామాన్లు కాల్చడం, అమ్మడంపై సుప్రీం కోర్టు విధించిన నిషేధం కొత్త ఏమీ కాదు. సరిగ్గా ఒక ఏడాది క్రితం భారీ స్థాయిలో మందుగుండు సామాన్ల అమ్మకం, పెద్ద స్థాయిలో మందుగుండు సామగ్రి నిల్వ ఉంచడంపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది. వివరాలకు ఈ పత్రికా వార్తను చూడగలరు.
ఈ వార్త ప్రకారం దీపావళి పండగ మాత్రమే కాదు, పెద్ద స్థాయిలో బాణాసంచా కాల్చే కార్యక్రమాలన్నిటి పైనా నిషేధం విధించినట్టు తెలుస్తోంది. బాణాసంచా, మందుగుండు సామగ్రి అమ్మకానికి పెట్టుకునే అంగళ్ళకూ లైసెన్సులు ఇవ్వరాదన్నది ఈ తీర్పు సారాంశం.
ఐతే, ఆ తీర్పులో భాగంగానే చిన్న స్థాయిలో, ఇళ్ళ వద్ద, పెళ్ళి ఊరేగింపుల్లో, బాణాసంచా కాల్చుకోవచ్చు గానీ, అవి ఢిల్లీ బయట కొనుక్కొని తేవాలి అని స్పష్టంగా చెప్పారు.
తీర్పు ఇవ్వడంతో పాటు కోర్టు కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారిని దీపావళి వల్ల జరిగే కాలుష్యంపై విస్తృత పరిశీలన జరిపి నివేదికను సమర్పించమని ఆదేశించింది.
ఒక వేళ కాలుష్యం ఏ మాత్రం దీపావళి టపాసుల వలన పెరుగుతుందని తెలిసినా, వాటిని పూర్తిగా బహిష్కరించేందుకు సిద్ధమని లేదా ఢిల్లీలో బతకడం కష్టమని కోర్టు గమనించింది.
ఇక తాజాగా వచ్చిన తీర్పును కూడా పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే సోషల్ మీడియాలో ఉన్న జనం, చేతన్ భగత్, హిందూ దక్షిణపక్షవాదులు విపరీతంగా ఉన్నవీ లేనివీ చెబుతున్నారు.
కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలిస్తే, ఢిల్లీ నగరం దేశ రాజకీయ కేంద్రం కావటం వలన, భారతదేశంలో చారిత్రకంగా కర్మాగారాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు రాజకీయ పైరవీల వలనే నడవటం, కేంద్రీకృత అభివృద్ధి, అభివృద్ధి అంటే నగరీకరణ అనే నడవడిక లాంటి కారణాల చేత విపరీతమైన జనాభా సాంద్రత, ఆపై వచ్చే ఇళ్ళు, వాటికోసం నరికేసిన చెట్లు, ఇళ్ళు కట్టడం వలన జనం పీల్చే గాలిలో చేరుతున్న దుమ్ము-ధూళి, జనానికి తగినన్ని వాహనాలు, అవి విడిచే పొగ, వెరసి ఢిల్లీలోని కాలుష్య స్థాయిని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిన స్థాయికి 29 రెట్లు ఎక్కువ చేసేసాయి.
వాయు కాలుష్యాన్ని కొలిచే కొలమానాలలో గాలిలోని సూక్ష్మ కణాల సంఖ్య ముఖ్యమైనది, దుమ్ము-పుప్పొడి-మసి-పొగ-ద్రవరూపంలో ఉండే అమ్లాలు ఇవన్నీ గాలిలో చిన్ని చిన్ని కణాల రూపంలో తేలుతూ ఉంటాయి, వీటన్నిటిని కలిపి గాలిలోని సూక్ష్మ కణాల సంఖ్యగా వ్యవహరిస్తాము.
కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రోజన్ మోనాక్సైడ్ లాంటి వాయువులు కాలుష్యంలో భాగమే, ఐతే వాటి నుండి నేరుగా తక్కువ సమస్యలున్నాయి, వాన పడినపుడు వాన నీటిలో కలిసి ఆమ్ల వర్షం అయ్యేలా చేస్తాయి.
ఢిల్లీలోని గాలిలో సూక్ష్మ కణాల శాతం విపరీత స్థాయిల్లో ఉంది. ఆ విషపు గాలిని పీల్చితే శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. దీపావళి పండుగ సమాయనికి ఇవి మూడింతలు పెరుగుతున్నాయన్నది ఢిల్లీ హైకోర్టులో నిరూపణ అయింది.
అందువలన ఢిల్లీలో టపాసుల అమ్మకం, కాల్చడం లాంటి చర్యలపై నిషేధం స్వాగతించదగిన విషయమే.
సమాజానికి చేటువవుతుందన్న కారణం చేత తరతరాలుగా మనం ఎన్నెన్నో సంప్రదాయాలను పక్కన పెట్టి సమాజశ్రేయస్సుకు దోహదపడే అసంప్రదాయక పోకడలను మన సంప్రదాయంగా ఇముడ్చుకున్నాం. అలాంటి పక్షంలో టపాకాయలు పెద్ద విషయం కాకూడదు కదా.
సంవత్సరమంతా ఢిల్లీ రోడ్లపై నడుస్తున్నవాహనాల పొగ, పరిశ్రమలు వెదజల్లుతున్నకాలుష్యం, 99% ఐతే, దీపావళి కాలుష్యం 1% ఉంతుంది అని సమర్ధించుకోవాలని చూస్తున్న దక్షిణపక్ష వాదనను ఏ విధంగా పరిగణించాలో? వారి విజ్ఞతను మెఱుగు పరచమని దేవుణ్ణి వేడుకోటం కంటే ఏం చేయగలం?

ఈ సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకునేది ఎవరు?
ఇంతకు ముందు పంజాబ్ లోని పొలాలలో కోత తరవాత మిగిలిన గడ్డిని కాల్చడం పై కోర్టులు నిషేధాలు జారీ చేసాయి. సంవత్సరం-ఆరు నెలలు నిషేధాలను అమలయ్యేలా పోలీసులు, ప్రజా ప్రతినిధులు జాగ్రత్త పడ్డారు. కానీ ఆ తరువాత షరా మామూలే. రైతులు మళ్ళీ గడ్డి మోపుల్ని కాల్చెయ్యడం మొదలుపెట్టారు. వారికి అదే సులువుగా అనిపించింది. కానీ ఈ గడ్డి మోపులను కాల్చిన ప్రతి సారీ ఆ పొగ, ధూళి పక్కనున్న రాష్ట్రాలనే కాక స్థానికంగా ఎందరికో పలు శ్వాసకోశ రోగాలు కలిగిస్తున్నాయన్న సంగతి ఆ రైతులకు పట్టదు.
ప్రభుత్వం కూడా చట్టాలు చేసి వదిలేస్తుందే కానీ, ఆయా చట్టాల అమలుపై అందుకు కావాల్సిన వనరుల సృష్టిపై దృష్టి సారించదు.
పంజాబ్ లో గడ్డిమోపు కాల్చడంపై ఉన్న నిషేధం ఎలా ఎవరూ పట్టించుకోలేదో ఢిల్లీ టపాసుల పై సుప్రీం కోర్టు తీర్పును కూడా అమలులో ఎవరూ పట్టించుకోరన్నది అందరికీ తెలిసిన వాస్తవం!

Wednesday, October 4, 2017

వెగాస్ లో జరిగిన దుర్ఘటన ఒక కనువిప్పు కావాలి

లాస్ వేగాస్ లో జరిగిన కాల్పుల ఘటన అమానుషం. 58 ని పొట్టన పెట్టుకున్న హంతకుడు ఆ గన్నుల వాళ్ళ కలిగిన గాయానికి చనిపోవడం ఒకెత్తు, ఎందుకు చంపాడో కారణం తెలియకపోవడం మరో ఎత్తు.
 22,000 మంది హాజరైన ఆ సంగీత సంబరాలలో ఆఖరి రోజున ఆఖరి కచేరీలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 600 మంది గాయాలపాలయ్యారు.
సంగీతం లో మునిగి తేలుతున్న వారిపై ఆ ముసలాడికి  ఎందుకంత కోపం? ఒకటి కాదు రెండు కాదు 23 గన్నులు, వందల బుల్లెట్లు స్టాక్ పెట్టుకుని ఆ అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ వ్యక్తి. ఇది అమెరికా వాసులు మాట్లాడే స్వేచ్ఛకు, అమెరికా వాసుల్లో తగ్గిపోతున్న మానవత్వ విలువలు, పెరుగుతున్న నేరప్రవృత్తి కి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
మేమే చేసాములే అని ముందుగా ఉగ్రవాద సంస్థలు తాము చెయ్యని చర్యలకు జవాబుదారీ తీసుకొని నవ్వులపాలయ్యారు.
ఇది ఇప్పటి వరకు అమెరికా చరిత్రలోనే అతి పెద్ద మారణకాండ కదూ ఎవరైనా పేరు కొట్టెయ్యాలనుకోవటం సమంజసమే.
స్వేచ్ఛ పేరుతో యధేచ్చగా గన్నులు సొంతం చేసేసుకొనే చట్టాలున్నంత వరకు అమాయకులే  బలి.
ఈ ఘటన వలన ఒబామాను గుర్తు చేసుకోవాలి. అమెరికా చట్ట సభ ముందు ఎన్నో సార్లు ఆయన గన్నులపై నిషేధం నియంత్రణ లాంటి విషయాలతో కూడిన చట్టాలను ప్రవేశపెట్టే ప్రతిపాదనలు తెచ్చాడు కానీ ప్రత్యర్ధుల పన్నాగాలు పన్ని అవి అమలు కానివ్వలేదు.
ప్రపంచ సారధులని చెప్పుకునే అమెరికన్లు స్వేచ్ఛ పేరుతో చేస్తున్న తప్పిదాలు ఇలా అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇకనైనా మారణాయుధాల అమ్మకం, వాడకం పై కఠిన చట్టాలు తెస్తే గానీ ఇలాంటి ఘటనలను ఆపలేం.