Wednesday, October 11, 2017

ఈ నగరానికేమయింది? ఒక వైపు నుసి మరో వైపు పొగ...

ఢిల్లీలో మందుగుండు సామాన్లు కాల్చడం, అమ్మడంపై సుప్రీం కోర్టు విధించిన నిషేధం కొత్త ఏమీ కాదు. సరిగ్గా ఒక ఏడాది క్రితం భారీ స్థాయిలో మందుగుండు సామాన్ల అమ్మకం, పెద్ద స్థాయిలో మందుగుండు సామగ్రి నిల్వ ఉంచడంపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది. వివరాలకు ఈ పత్రికా వార్తను చూడగలరు.
ఈ వార్త ప్రకారం దీపావళి పండగ మాత్రమే కాదు, పెద్ద స్థాయిలో బాణాసంచా కాల్చే కార్యక్రమాలన్నిటి పైనా నిషేధం విధించినట్టు తెలుస్తోంది. బాణాసంచా, మందుగుండు సామగ్రి అమ్మకానికి పెట్టుకునే అంగళ్ళకూ లైసెన్సులు ఇవ్వరాదన్నది ఈ తీర్పు సారాంశం.
ఐతే, ఆ తీర్పులో భాగంగానే చిన్న స్థాయిలో, ఇళ్ళ వద్ద, పెళ్ళి ఊరేగింపుల్లో, బాణాసంచా కాల్చుకోవచ్చు గానీ, అవి ఢిల్లీ బయట కొనుక్కొని తేవాలి అని స్పష్టంగా చెప్పారు.
తీర్పు ఇవ్వడంతో పాటు కోర్టు కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారిని దీపావళి వల్ల జరిగే కాలుష్యంపై విస్తృత పరిశీలన జరిపి నివేదికను సమర్పించమని ఆదేశించింది.
ఒక వేళ కాలుష్యం ఏ మాత్రం దీపావళి టపాసుల వలన పెరుగుతుందని తెలిసినా, వాటిని పూర్తిగా బహిష్కరించేందుకు సిద్ధమని లేదా ఢిల్లీలో బతకడం కష్టమని కోర్టు గమనించింది.
ఇక తాజాగా వచ్చిన తీర్పును కూడా పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే సోషల్ మీడియాలో ఉన్న జనం, చేతన్ భగత్, హిందూ దక్షిణపక్షవాదులు విపరీతంగా ఉన్నవీ లేనివీ చెబుతున్నారు.
కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలిస్తే, ఢిల్లీ నగరం దేశ రాజకీయ కేంద్రం కావటం వలన, భారతదేశంలో చారిత్రకంగా కర్మాగారాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు రాజకీయ పైరవీల వలనే నడవటం, కేంద్రీకృత అభివృద్ధి, అభివృద్ధి అంటే నగరీకరణ అనే నడవడిక లాంటి కారణాల చేత విపరీతమైన జనాభా సాంద్రత, ఆపై వచ్చే ఇళ్ళు, వాటికోసం నరికేసిన చెట్లు, ఇళ్ళు కట్టడం వలన జనం పీల్చే గాలిలో చేరుతున్న దుమ్ము-ధూళి, జనానికి తగినన్ని వాహనాలు, అవి విడిచే పొగ, వెరసి ఢిల్లీలోని కాలుష్య స్థాయిని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిన స్థాయికి 29 రెట్లు ఎక్కువ చేసేసాయి.
వాయు కాలుష్యాన్ని కొలిచే కొలమానాలలో గాలిలోని సూక్ష్మ కణాల సంఖ్య ముఖ్యమైనది, దుమ్ము-పుప్పొడి-మసి-పొగ-ద్రవరూపంలో ఉండే అమ్లాలు ఇవన్నీ గాలిలో చిన్ని చిన్ని కణాల రూపంలో తేలుతూ ఉంటాయి, వీటన్నిటిని కలిపి గాలిలోని సూక్ష్మ కణాల సంఖ్యగా వ్యవహరిస్తాము.
కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రోజన్ మోనాక్సైడ్ లాంటి వాయువులు కాలుష్యంలో భాగమే, ఐతే వాటి నుండి నేరుగా తక్కువ సమస్యలున్నాయి, వాన పడినపుడు వాన నీటిలో కలిసి ఆమ్ల వర్షం అయ్యేలా చేస్తాయి.
ఢిల్లీలోని గాలిలో సూక్ష్మ కణాల శాతం విపరీత స్థాయిల్లో ఉంది. ఆ విషపు గాలిని పీల్చితే శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. దీపావళి పండుగ సమాయనికి ఇవి మూడింతలు పెరుగుతున్నాయన్నది ఢిల్లీ హైకోర్టులో నిరూపణ అయింది.
అందువలన ఢిల్లీలో టపాసుల అమ్మకం, కాల్చడం లాంటి చర్యలపై నిషేధం స్వాగతించదగిన విషయమే.
సమాజానికి చేటువవుతుందన్న కారణం చేత తరతరాలుగా మనం ఎన్నెన్నో సంప్రదాయాలను పక్కన పెట్టి సమాజశ్రేయస్సుకు దోహదపడే అసంప్రదాయక పోకడలను మన సంప్రదాయంగా ఇముడ్చుకున్నాం. అలాంటి పక్షంలో టపాకాయలు పెద్ద విషయం కాకూడదు కదా.
సంవత్సరమంతా ఢిల్లీ రోడ్లపై నడుస్తున్నవాహనాల పొగ, పరిశ్రమలు వెదజల్లుతున్నకాలుష్యం, 99% ఐతే, దీపావళి కాలుష్యం 1% ఉంతుంది అని సమర్ధించుకోవాలని చూస్తున్న దక్షిణపక్ష వాదనను ఏ విధంగా పరిగణించాలో? వారి విజ్ఞతను మెఱుగు పరచమని దేవుణ్ణి వేడుకోటం కంటే ఏం చేయగలం?

ఈ సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకునేది ఎవరు?
ఇంతకు ముందు పంజాబ్ లోని పొలాలలో కోత తరవాత మిగిలిన గడ్డిని కాల్చడం పై కోర్టులు నిషేధాలు జారీ చేసాయి. సంవత్సరం-ఆరు నెలలు నిషేధాలను అమలయ్యేలా పోలీసులు, ప్రజా ప్రతినిధులు జాగ్రత్త పడ్డారు. కానీ ఆ తరువాత షరా మామూలే. రైతులు మళ్ళీ గడ్డి మోపుల్ని కాల్చెయ్యడం మొదలుపెట్టారు. వారికి అదే సులువుగా అనిపించింది. కానీ ఈ గడ్డి మోపులను కాల్చిన ప్రతి సారీ ఆ పొగ, ధూళి పక్కనున్న రాష్ట్రాలనే కాక స్థానికంగా ఎందరికో పలు శ్వాసకోశ రోగాలు కలిగిస్తున్నాయన్న సంగతి ఆ రైతులకు పట్టదు.
ప్రభుత్వం కూడా చట్టాలు చేసి వదిలేస్తుందే కానీ, ఆయా చట్టాల అమలుపై అందుకు కావాల్సిన వనరుల సృష్టిపై దృష్టి సారించదు.
పంజాబ్ లో గడ్డిమోపు కాల్చడంపై ఉన్న నిషేధం ఎలా ఎవరూ పట్టించుకోలేదో ఢిల్లీ టపాసుల పై సుప్రీం కోర్టు తీర్పును కూడా అమలులో ఎవరూ పట్టించుకోరన్నది అందరికీ తెలిసిన వాస్తవం!

No comments:

Post a Comment