Tuesday, December 11, 2012
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్త్వం విడుదల చేసిన సరికొత్త తెలుగు ఖతులు
Thursday, October 11, 2012
లలితమ్మకు నీరాజనం
మా తల్లి లత్తుకకు నీరాజనం
కెంపైన నీరాజనం - భక్తి పెంపైన నీరాజనం ॥
యోగీంద్ర హృదయాల మ్రోగేటి మాతల్లి।
బాగైన అందెలకు నీరాజనం
బంగారు నీరాజనం - భక్తి పొంగారు నీరాజనం ॥
నెలతాల్పు డెందాన వలపు వీణలు మీటు
మాతల్లి గాజులకు నీరాజనం
రాగాల నీరాజనం - భక్తి తాళాల నీరాజనం ॥
మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు
మాతల్లి నవ్వులకు నీరాజనం
ముత్యాల నీరాజనం - భక్తి నృత్యాల నీరాజనం ॥
చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు
మా తల్లి ముంగెరకు నీరాజనం
రతనాల నీరాజనం - భక్తి జతనాల నీరాజనం ॥
పసి బిడ్డలను చేసి - ప్రజనెల్ల పాలించు
మాతల్లి చూపులకు నీరాజనం
అనురాగ నీరాజనం - భక్తి కనరాగ నీరాజనం ॥
దహరాన కనిపించు ఇనబింబ మనిపించు
మాతల్లి కుంకుమకు భక్తి నీరాజనం
నిండిన నీరాజనం భక్తి మెండైన నీరాజనం॥
తేటి పిల్లలు వోలె గాలి కల్లలలాడు
మాతల్లి కుఱులకూ నీరాజనం
నీలాల నీరాజనం - భక్తి భావాల నీరాజనం ॥
జగదేక మోహిని సర్వేశ గేహిని
మా తల్లి రూపునకు నీరాజనం
నిలువెత్తు నీరాజనం - భక్తి నిలువెత్తు నీరాజనం ॥
Friday, September 14, 2012
నీకేమయినా అభ్యంతరమా శివశక్తీ?
చెప్పు, శివశక్తీ!!! ఎందుకని నన్ను ఈ జ్ఞానంతో పుట్టించావు?
నాకు శక్తినిస్తావా - ఈ ప్రపంచానికి ఉపయోగపడేలా జనం బ్రతకేలా నేను చెయ్యాలి!
చెప్పు, శివశక్తీ!!! వారు ఈ భూమికి భారమై బ్రతకాలా?
నేను చెప్పినట్టూ ఆడే బంతిలా, నా శరీరం నా బుద్ధి చెప్పినట్టూ ఎక్కడికయినా వెళ్ళిపోవాలి
కల్మషంలేని బుద్ధినివ్వు శివశక్తీ, జీవితానికే జీవితాన్నిచ్చే జీవితాన్ని ప్రసాదించు శివశక్తీ!!!
ఈ శరీరం కాలి బూడిదయ్యాక కూడా నీ పాటలే నేను పాడాలి, అలాంటి నన్ను నాకివ్వు శివశక్తీ
అచంచలమయిన ఆత్మవిశ్వాసాన్నే కదా నేనడిగింది, నాకివన్నీ ఇవ్వటానికి నీకేమయినా అభ్యంతరమా శివశక్తీ?
మనస్సు నిలకడగా ఉండాలి
ఓం ఓం ఓం
మూలం : సుబ్రహ్మణ్య భారతి రచన
மனத்தில் உறுதி வேண்டும்
மனதி லிறுதி வேண்டும்
வாக்கினி லேயினிமை வேண்டும்
நினைவு நல்லது வேண்டும்
நெருங்கின பொருள் கைப்பட வேண்டும்
கனவு மெய்ப்பட வேண்டும்,
கைவசமாவது விரைவில் வேண்டும்,
தனமும் இன்பமும் வேண்டும்,
தரணியிலே பெருமை வேண்டும்,
கண் திறந்திட வேண்டும்,
காரியத்தி லுறுதி வேண்டும்,
பெண் விடுதலை வேண்டும்,
பெரிய கடவுள் காக்க வேண்டும்
மண் பயனுற வேண்டும்,
வானகமிங்கு தென்பட வேண்டும்,
உண்மை நின்றிட வேண்டும்,
ஓம் ஓம் ஓம்.
Thursday, September 13, 2012
అమ్మాయీ!
నీ కనులు చంద్రుళ్ళోని కళనూ, సూర్యుని తేజాన్ని కలిగి ఉన్నాయి!
నల్లని గుండ్రనికనులు - రేయాకాశపు నల్లనితనాన్ని లాక్కున్నవా?
మెరిసే వజ్రాలు పొదిగిన సరికొత్త నల్లపట్టుచీర కట్టావు - నడిరేయి ఆకాశాన గల తారల్లా.
అప్పుడే పూచిన పూల సుమగంధపు నవ్వు నీది
నీలసంద్రపు అలలు నీ హృదయ ప్రేమ తరంగాలు
నీ గళం - తీయని కోకిల గళం
అమ్మాయీ
నేను నీ ప్రేమలో పడ్డాను
ఏవో కట్టుబాట్లూ, నియమాలూ అంటున్నావు
అమ్మాయీ
అవి ఎందు కోసం?
కోపావేశాల్లో మరిగిపోయే వారికే కదా ఆ కట్టుబాట్లూ, ఓ అమ్మాయీ!
పెద్దల అంగీకారంతో పెళ్ళీ క్రతువులు ఆనకి చేసుకొనవచ్చు
నేను వేచి ఉన్నాను, చూడూ
ఓ ముద్దుకై.
ఓ అమ్మాయి!
Saturday, September 8, 2012
విండోస్ ఎక్స్పీ లో ఇన్‍స్క్రిప్టు స్థాపించడం
సోపానం 1 :
Start Menu లోకి వెళ్లి Control Panel క్లిక్ చెయ్యండి
సోపానం 2:
ఇప్పుడు Control Panel నుండి Regional and Language Options క్లిక్ చెయ్యండి.
సోపానం 3:
ఇప్పుడు Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోనికి వెళ్లి Install files for complex script and right-to-left languages ని ఎంచుకుని Ok నొక్కండి. ఇప్పుడు మీ మిషను reboot చేసి, మరలా మొదటి రెండు సోపానములను పాటించి, Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోనికి వెళ్లండి. ఇక్కడ Text Services and input languages లోని details నొక్కండి.
సోపానం 4:క్రింది బొమ్మలో చూపిన విధంగా Text Services and input languages Dialog లోని Settings టాబ్ లో Installed Services విభాగంలోని Add బటన్ నొక్కండి.
సోపానం 5:
ఈ Add Input Language Dialog నుండి Telugu ఎంచుకొని Ok నొక్కండి.
సోపానం 6:
ఇప్పుడు Text Services and input languages Dialog లోని Settings టాబ్ లో Preferences విభాగంలోని Language Bar ని నొక్కండి.
సోపానం 7:Language Bar Settings లో Show the Language bar on the desktop ని ఎంచుకోండి.
సోపానం 8:
ఇప్పుడు మీ డెస్కుటాపు మీద ఈ క్రింద చూపినట్లుగా Language Bar కనిపిస్తుంది. దీనిలో తర్వాతి బొమ్మలో చూపిన విధంగా Teluguను ఎంచుకుని మీకు కావలసిన చోట తెలుగులో టైపు చేసుకోండి. కీబోర్డు లేయవుట్ చివరి బొమ్మలో చూపబడినది.
కీబోర్డు లేయవుట్
Friday, September 7, 2012
యేది యేది కుదురేది యేది యెదలో పాట సాహిత్యం
యేది యేది కుదురేది యేది యెదలో
యేది యేది అదుపేది యేది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక
పెదవే పేరై నీదై ఉంటే
యేది యేది కుదురేది యేది యెదలో ఓఓఓ
యేది యేది అదుపేది యేది మదిలో ఓఓఓ ఓఓఓ
నే ఓడే ఆట నీ వాటం అంటా
ఎంతో ఇష్టంగా
నే పాడే పాట నీ పేరేనంటా
చాలా కాలంగా
నాకంటూ ఉందా ఓ ఆశా
నీ ఆశే నాకూ శ్వాస
ఊహా ఊసూ నీతో నేనుంటే శా
నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే
కలలే కళ్ళై చూస్తూ ఉంటే
యేది యేది కుదురేది యేది యెదలో ఓఓ
యేది యేది అదుపేది యేది మదిలో ఓఓ
నా కాలం నీదే, నువ్వై గడిపేసెయ్ ఎన్నాళ్ళవుతున్నా
ఓహో నీ పాఠం నేనే, నన్నే చదివేసెయ్ అర్ధం కాకుండా
నాలోకం నిండా నీ నవ్వే, నాలోనూ నిండా నువ్వే
తీరం దారీ దూరం నువ్వయ్యావే
నా మొత్తం నీదయితే, నువ్వంతా నేనయితే
మనలో, నువ్వు-నేను ఉంటే
యేది యేది కుదురేది యేది యెదలో
యేది యేది అదుపేది యేది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో కనలేక
పెదవే పేరై నీదై ఉంటే
యేది యేది కుదురేది యేది యెదలో
యేది యేది అదుపేది యేది మదిలో
Thursday, August 16, 2012
మధుసూదన మధుసూదన హర మామక దురితం
కురుదీనదయాళో
కరుణారస వరుణాలయ
కరిరాజ కృపాళో
అధునాఖలు విధినా మయి
సుధియాసుర భరితం
మధుసూదన మధుసూదన హర
మామక దురితం
వరనూపుర ధరసుందర కరశోభితవలయా
సురభూసుర భయవారక
ధరణీధర కృపయా
త్వరయా హర భయమీశ్వర
సురవర్య మదీయం
మధుసూదన మధుసూదన
హర మామక దురితం
ఘృణిమండల మణికుండల
ఫణిమండల శయన
అణిమాది సుగుణ భూషణ
మణిమంటప సదన
వినతాసుత ఘనవాహన
మునిమానసభవనా
మధుసూదన మధుసూదన
హర మామక దురితం
అరిభీకర హలిసోదర
పరిపూర్ణ సుఖాబ్దే
నరకాంతక నరపాలక
పరిపాలిత జలధే
హరిసేవక శివ నారా
యణ తీర్థ పరాత్మన్
మధుసూదన మధుసూదన
హర మామక దురితం
మకరచెఱలో చిక్కుకుని విలవిలలాడుతున్న కరిరాజుని కాపాడిన ఓ అత్యంత దయామయుడవయిన దేవదేవా, కరుణామయా, నాపై నీ కరుణను కురిపించు.
మధు అను రాక్షసుడిని మర్దించిన ఓ దేవా, ఇవాళ నా పాపాలన్నీ మన్నించి హరించివేయి.
కాళ్ళకు మనోహరమయిన గజ్జెలు కట్టి చేతులకు అందమయిన కంకణాలు కట్టుకుని , సమస్త దేవత్లూ మరియు ఋషిజనాల కష్టాలు తీర్చు స్వామీ, మధు అను రాక్షసుడిని మర్దించిన ఓ దేవా, ఇవాళ నా పాపాలన్నీ మన్నించి హరించివేయి.
మణులు ఖచితమయిన చెవిపోగులు ధరించి, ఫణి రాజు పై శయనించిన ఓ స్వామీ , నీవు సమస్త సుగుణాలూ కల వాడవు, ఆ గరుత్మంతుడ్ని వాహనం గా చేసుకుని ఉన్నవాడవు. మధు అను రాక్షసుడిని మర్దించిన ఓ దేవా, ఇవాళ నా పాపాలన్నీ మన్నించి హరించివేయి.
నీ శత్రువులకు నీవు అరివీర భయంకరుడవు, సుఖ సంతోషాల సముద్రం నీవు, నరకుడిని సంహరించి, అందరినీ కాపాడావు, నారాయణ తీర్థుల సేవలు గొన్న దేవా, మధు అను రాక్షసుడిని మర్దించిన ఓ దేవా, ఇవాళ నా పాపాలన్నీ మన్నించి హరించివేయి.
Friday, July 13, 2012
తాగుడు నిర్ణయాలు
తాగడం తాగకపోవడం అనేది పూర్తిగా ఒక మనిషి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. చావుబతుకుల మధ్య తేడా ఒకటే, చావులో మీరు చేతనులై ఉండరు, బతుకులో మీరు చేతనమయి ఉండొచ్చు. నిద్రలో మీరు అచేతనులు; నీరసావస్థలో చేతనులుగా ఉండే శక్తి ఉండొచ్చు. బతుకనేది మీరు చేతన ఇంకా మెలకువలో ఉంటేనే సాధ్యం. తాగుడు మత్తునిస్తుంది, అది మిమ్మల్ని చేతనావస్థ నుండి దూరంగా లాక్కుపోతుంది. మీరు మనశ్శాంతికై ఏ ప్రయత్నమూ చేయకుండా అనిర్మలమయిన మనస్సుతో ఉండటం వలన సాయంత్రమో, ఆఫీసు పార్టీలోనో తాగే మందు పెద్ద మనశ్శాంతిని ప్రసాదించే మార్గంలా అనిపిస్తుంది.
మనస్సు ఒత్తిడిలో ఉన్నా, ఉగ్రముగా ఉన్నా, పొందనిదాని కోసం పరితపిస్తున్నా, తాగుడులోని మత్తు పెద్ద ఉపశమనంలా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని మనం మన శరీరానికి తెలిపితే, అదే బతుకు నుండి దూరంగా చేసేవన్నీ ఉపశమనానికి మార్గాలని గుర్తిస్తుంది. ఇక అక్కడితో మృత్యువాతపడటం చాలా సులభం.
--సద్గురు జగ్గీ వాసుదేవ్
Friday, May 11, 2012
కలత నిదర - నండూరి సుబ్బారావు గారి కవిత
ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా!
యెన్నెలల సొగసంత యేటిపాలేనటర?
ఆ కాశ మేమూలొ
అణగి పోయిన రేయి
యేటి శెందురుడల్లె
సాటు సూపుల కులికి ॥ఈ రేయి॥
ఆకాశ మావొరస
అడిలి పోయిన రేయి
మాట లెరుగని పాప
యేటి గిలగిల సూపి ॥ఈ రేయి॥
ఆకాశ మోతీరు
ఆవు లించిన రేయి
మిసమిసలతో యేటి
పసలతో నను సుట్టి ॥ఈ రేయి॥
యెలుతు రంతా మేసి
యేరు నెమరేసింది ---
కలవరపు నాబతుకు
కలతనిద రయ్యింది ॥ఈ రేయి॥
ఒక్క_ తెను నాకేల
ఓపజాలని సుకము?
యీరేయినన్నొల్లనేరవారాజా!
--నండూరి సుబ్బారావు
ఈ పద్ధతిని ఏమంటారు?
వేఁగి క్షేత్రము - విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత
ఏ రాజు పంచెనో యిచట శౌర్యపు పాయసమ్ములు నాగులచవితినాళ్ళ
ఏ యెఱ్ఱసంజలో నెలమి పల్లవరాజరమణులు కాళ్ళఁబారాణులిడిరొ,
చిత్రరధస్వామి శ్రీరథోత్సవములోఁ దెలుగు పిల్లలు కత్తి త్రిప్పిరెపుడొ,
ఏ రెండు జాముల యినునివేడిమి వచ్చి కలసి పోయెనొత్రిలింగ ప్రభువుల,
నాజగచ్ఛ్రేయసంబులై యలరుతొంటి
వేంగిరాజుల పాద పవిత్రచిహ్న
గర్భిత మ్మైనయీ భూమిఖండమందు
నశ్రువులు జార్త్రు జీవచ్ఛవాంధ్రజనులు.
ఇట వేఁగీశుల పాదచిహ్నములు లెవే! లేవుపో! భావనా
స్ఫుట మూర్తిత్వమునైనఁ బొందవు నెదో పూర్వాహ్ణదుష్కాలపుం
ఘటికల్ గర్భమునం దిముడ్చుకొనియెం గాబోలు నీపల్లెచో
టట లోకాద్భుతదివ్యదర్శనమటే యాభోగ మేలాటిదో.
నీయతుల ప్రభావ మహనీయత వేఁగిపురాధిరాజమా!
ఆయతధర్మమూర్తులు మహాత్ములు వారలు బ్రహ్మకోశగో
పాయిత లాంధ్రపల్లవనృపాలురహుంకృతి వ్యాఘ్రగర్జగా
నై యరిలోకభీకర మహాద్భుత శౌర్యరసాకృతిం జనెన్.
ఈ నాపదార్పితక్షోణి నేరాజు ధర్మాసనంబుండి స్మృత్యర్థం పొందెనొ
ఈనాదృగావృతంబైన భూములలోన నేశౌర్యధనులు శిక్షింపఁబడిరొ
ఈ నాశరీరమం దివతళించిన గాలి యెంత పౌరాతన్య మేచుకొనెనొ
ఈ నాతనూపూర్ణ మైన యాకాశమ్ము నే క్రతుధ్వనులు శబ్దించినదియొ
అస్మదజ్ఞాతపూర్వదివ్యత్వ మొప్పు
నీవునీతావనీఖండ మిచట నిలచి
యస్వతంత్ర దొరలు నాయాంధ్రశక్తి
నన్నుఁగంపింపఁ జేయుచున్నది భృశమ్ము.
వేఁగి రాజ్యపు పల్లెవీధుల చెడుగుళ్ళ రిపులఁ గవ్వించు నేరువులు తెలిసి
ఎగురుగోడీబిళ్ళసొగసులో రిపుశిరస్సుల బంతులాడు శిక్షలకు డాసి
చెఱ్ఱాడి యుప్పుతెచ్చిననాడె శాత్రవ వ్యూహముల్ పగిలించు నొఱపుగఱచి,
కోతికొమ్మచ్చిలో కోటగోడల కెగఁబ్రాకి లంఘించు చంక్రమణ మెఱిఁగి
తెనుఁగులంతప్డెయవి నేర్చుకొనియు యుందు
రెన్నగాఁ దెల్గుతల్లులు మున్ను శౌర్య
రస మొడిచి యుగ్గుఁ బాలతో రంగరించి
బొడ్డుకోయని కూనకే పోయుదు రట.
శిలవోలెన్ కదలంగ లేక హృదయస్నిగ్ధార్ద్రసద్భావనా
ఖిల చైతన్యుడనై పురావిదిత వేంగీపూజ్య సామ్రాజ్యగా
ధల యోజించుచు నాంధ్రపల్లవనరేంద్ర శ్రీయశస్త్సంభమున్
బలె నిల్చుంటిన యీ పవిత్ర ధరణీ భాగంబునం దీగతిన్-
ఏ దివ్యపూరుషు లీశాద్వలాంకూరశేఖరమ్ముల లిఖించిరొ! యివెల్ల
ఈ వాయువీచిలో నేయప్సరస్సమాజము నింపిరో గీతిసముదయంబు
ఏ దివ్యశిల్పు లీరోదసీకుహరాన వ్రాసిరో దివ్యశిల్పమ్ము లిన్ని
ఈ పధాంతరమునం దేవురాణమునీంద్రసంతతులో ప్రశంసలు పొనర్త్రు
ఎటఁ గనినఁ బూర్వపల్లవ నృపచరితలె
వ్రాయఁ బడి పాడఁబడి గీయఁబడి యువిన్య
సింపఁబడి శ్రోత్ర పేయమై చెన్నుదాల్చె
నీయతీంద్రియశక్తి నాకెట్టు లబ్బె!
ఈ పొలా లెంతచేవెక్కించుకొన్నవో. గుండె వ్రయ్య సముద్రగుప్తు డడలె
ఈ నేల పావిత్ర్యమెంత కుంభించెనో చిత్రరధ స్వామి సేవలుకొనె
ఇట పల్లవులరాచయెలనాగ లేవ్రతమ్ములు చేసిరో లచ్చి నిలుకడ వడె
ఈ కాశ్యపీఖండ మేశరజ్యోత్స్నలో పిలకించెనో కీర్తి తెలుపులూరె
ఇట నెచట త్రవ్వినను బంగరేనట యది
యెంతశ్రీయొ! యదెంత రాజ్యేందిరయొ ప
దానతనఖాగ్రపాతనిర్యన్నిధాన
మైన యీచోటనుపభోగ్య మయ్యె నేడు.
ఈ పొదలం జరించుచు నహీనమహామహిమానుభావమౌ
నేపురవీధులందొ చరియించుచు నంటి నటంచుఁ భారతం
త్ర్యాపతితుండ నయ్యును పురా మహదాంధ్రమునన్ స్వతంత్రుడౌ
నేపురుషుందనో మనుచు నీ భ్రమ సత్యముగాఁ దలంచుదున్
ఏ పల్లవనృపాలు డెత్తినబావుటా చాళుక్యనృపులరాజ్యంబునందు
ఏ దేశికవిత పాలించినకవిరాజు నన్నయ్య వ్యాకరణంబునందు
ఏయులిఁజెక్కునేర్పులు మహాశిల్పి గోదావరీనదీఘోషయందు
ఏతొంటి తెలుగుల యెక్కువాచారమ్ము బలవ న్నృపుల ప్రాభవమ్మునందు
సమసిపోయెనో -- యున్మత్తసామజంబు
కొలను జొరబడి తమ్మితూడులను పెరికి
వైచెటె యెఱుంగుగాని తత్పద్మగర్భ
కేసరవిమిశ్రమధురసాగ్రియత గలదె?
ఇమ్ముగఁగాకుళమ్ము మొదలీవరకుం గల యాంధ్రపూర్వరా
జ్యమ్ముల పేరు చెప్పిన హృదంతరమేలో చలించి పోవు నా
ర్ద్ర మ్మగు చిత్తవృత్తులఁ బురాభవనిర్ణయమేని నెన్నిజ
న్మములుగాగ నీతనువున్ బ్రవహించునొ యాంధ్రరక్తముల్.
ఇది వినిపింతు నదు మది నెంచెద మిత్రులకున్ గళన్ధగా
ద్గదికము లోచనాంతబహుధాస్రుతభాష్పనదమ్ము స్పందనా
స్పదహృదయమ్ము నాపనికిఁజాలక చేసెడు నన్ను నింతగా
నెద పదిలించుకొన్న దిదియెక్కడి పూర్వజన్మవాసనో!
--విశ్వనాథ సత్యనారాయణ
Monday, April 16, 2012
భాషాభిమానం మితిమీరిన వేళ కూడా తెలుగు అక్షరం అ-క్షరమే
Wednesday, February 22, 2012
భాషందం అజంతం
మరి ఈ అజంతమనగా ఏంటి?
అజంతం -- అచ్చు+అంతం.
అనగా అచ్చుతో అంతమయ్యేది.
తెలుగు నుడి ఇది -- ఏ పదమూ హల్లులతో ముగియదు!
అమ్మ - అ తో ముగుస్తుంది
ఆవు - ఉ తో ముగుస్తుంది
ఇల్లు - ఉ తో ముగుస్తుంది
ఈగ - అ తో ముగుస్తుంది
...
మానస్ - స తో ముగుస్తుంది - తెలుగు కాదు, సంస్కృతం
రమేశ్ - శ తో ముగుస్తుంది - తెలుగు కాదు, సంస్కృతం కూడా కాదు (సంస్కృతంలో నపుంసక లింగం)
...
మన భాష హల్లుతో ముగియదు, హలంతం కాదు. అజంతం, అమరం, అందం.
అదనమాట సంగతి
Monday, February 20, 2012
తెలుగదేలయన్న
అన్ని టపాల్లోనూ తెలుగు భాషపై నా ఆలోచనలు పంచుకోనున్నాను.
ఈ టపాలో : తెలుగదేలయన్న
ఎన్నో సందర్భాల్లో ఈ పై పదాన్ని జనం వాడేస్తారు(అర్ధం తెలిసి వాడతారా లేక అజ్ఞానంగా ఏదో చెప్పేదానికి వెయిట్ ఇవ్వాలని వాడతారా? అనే ప్రాథమిక అనుమానం వచ్చినా అభివాదన శీలస్య గుర్తొచ్చి కంగా ఉండాలి :P).
నేను ఒకటి రెండు సందర్భాల్లో చాలా ఫూలిష్ కాంటెక్స్ట్ లలో వాదేసాను.
అయితే వీవెన్ గారు ఒక రోజు మాటల సందర్భంలో దేసభాశాలందు తెలుగు లెస్స అన్న పద్యం గురించి కారకా తెచ్చారు, అర్ధం చెప్పమన్నారు.చెప్పకపోతే నన్ను తక్కువ అంచానా వేస్స్తారని భయం. సెప్తే మన మందబుద్ధి బయట పడిద్దనే పీడ. మొత్తానికి అంతకు ముందొకసారి వికీపీడియాలో కృష్ణదేవరాయలు వ్యాసంలో చదివింది గుర్తొచ్చి నెమరవేసుకున్నా.
“తెలుఁగదేలనన్న దేశంబు దెలుఁగేను
తెలుఁగు వల్లభుండఁ దెలుఁగొకండ
యెల్ల నృపులగొలువ నెరుఁగ వే బాసాడి
దేశభాషలందుఁ తెలుఁగు లెస్స”
ఇక సందర్భానికొద్దాం శ్రీకృష్ణదేవరాయలవారు తెలుగులోనే ఆముక్తమాల్యదను ఎందుకు రాయాలి అని శ్రీకృష్ణదేవరాయలకు సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే ఆంధ్రమహావిష్ణువుగా పలికెనని సాహితీ సమరాంగణుడే చెప్పెను.
తెలుఁగదేలయన్న - తెలుగు అది ఏలయు అనిన
అడనమాట సంగతి ....
Thursday, January 19, 2012
క్యూఆర్ కోడ్
క్యూఆర్ కోడ్ అనేది క్విక్ రెస్పాన్స్ కోడ్ కు సంక్షిప్త రూపం. ఇది ఒక 2-డైమెన్షనల్ మ్యాట్రిక్స్ బార్ కోడ్. మొట్టమొదట ఆటోముబైల్ ఇండస్ట్రీ కోసం కనుగొన్నారు. ఎక్కువ పదాలను ఒక చిన్న బొమ్మ రూపంలో పొందుపరచటం మరియు త్వరిత పఠనీయతవల్ల ఈ టెక్నిక్ బాగా ప్రాచుర్యం పొందింది. తెలుపు బ్యాగ్రౌండ్ లో నలుపు రంగు చతురస్రాలతో ఒక సందేశాన్ని గూఢంగా ఉంచడమే ఈ టెక్నిక్. అంకెలు, అక్షరాలు+అంకెలు, బైట్/బైనరీ మరియు కంజి(జపానీయుల లిపి) -- ఈ నాలుగు రకాల సందేశాలను క్యూఆర్ కోడ్ ద్వారా భద్ర పరచవచ్చు. టొయోటా అనుబంధ సంస్థ అయిన డెన్సో 1994 లో వాహనాల తయారీని అంచనా వేసేందుకు బార్ కోడ్ యొక్క 2 డైమెన్షన్ రూపాన్ని వాడారు. అతి వేగంగా ఎన్కోడ్(గూఢీకరణ) మరియు డీకోడ్(నిగూఢీకరణ) అయ్యే విధంగా ఈ కోడ్ ను రూపొందించారు. అమెరికా, కెనడా మరియు హాంగ్‍కాంగ్ లలో క్యూఆర్ కోడ్ వాడుక అధికంగా ఉంది.
నా పేరు బ్లాగు పేరు, నా ఫోన్ నంబర్, ఈ మెయిల్ ను పొందుపరిచిన క్యూఆర్ కోడ్ |
మీ పేరు లేదా ఏదయినా సమాచారాన్ని ఇప్పుడే క్యూఆర్ కోడ్ గా మార్చండి. http://qrcode.kaywa.com/ కు వెళ్ళి మీ సొంత క్యూఆర్ కోడ్ ను పొందండి.