బిజినెస్ లైన్, హిందూ పత్రిక కథనం ఆధారంగా, రైళ్ళలో ఉచిత వైఫై సదుపాయం నేటితో ప్రారంభమయింది. మొట్టమొదటగా ఢిల్లీ-హౌరా రాజధాని ఎక్స్ప్రెస్‍లో ఈ సేవలను ప్రారంభించిన భారత రైల్వే వారు సంవత్సరాంతానికల్లా మరో 50 బళ్ళలో ఈ సదుపాయాన్ని అందిస్తామని పేర్కొన్నారట. ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తరువాత రైలు ప్రయాణికులు అంతర్జాలంలోని వివిధ జాలగూళ్ళనూ చూడటం, వేగులు పంపించుకోవటం, చాట్, యూట్యూబు వంటి దృశ్యక సేవలు ఇంకా జాలపు ఆటలు కూడా ఆడుకోవచ్చు. ప్రస్తుతానికి 4ఎంబీపీఎస్ దింపుకోలు వేగం, 512కేబీపీఎస్ ఎక్కింపు వేగం సామర్థ్యంతో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయట. భారతదేశపు కంపెనీ అయిన టెక్నోసాట్‍కమ్ ఈ సదుపాయాన్ని అందిస్తోన్న ప్రైవేటు కంపెనీ. ఈ-మెయిల్స్(వేగులు) ఇంకా ఆన్‍లైన్ ట్రాన్సాక్షన్స్(జాలపు అమ్మకాలు,కొనుగోళ్ళు) మొదటి ప్రాధాన్యత ఇవ్వబడే సేవలు. అంటే ఒకే సమయంలో ఆ 4Mbps ను రైలులో ఉన్న వాడుకరులకి సమానంగా పంచి ఇచ్చినా(సగటున 100 ప్రయాణీకులు వాడితే, ఒక్కొక్కరికి 400 Kbps వేగంతో నెట్ వస్తుంది), మిగితా సేవలు వాడే వారికి తక్కువ వేగం, పై రెండు సేవల వారికీ ఎక్కువ వేగం కల్పిస్తారుట. అలానే అశ్లీల జాలగూళ్ళు(porn sites)ను పూర్తి స్థాయిలో నిలిపివేస్తారుట. టోరెంట్ వంటి సేవలు కూడా నిలిపివేస్తారట.
సాంకేతిక వివరాలు :
సాటిలైట్ ఆధారంగా 2G-3G హైబ్రిడ్ ఇంకా వైఫై ఆధారంగా ఈ సేవలు అందుతాయి. సాటిలైట్ అందుబాటులో ఉన్నంత వరకూ 2G-3G, సాటిలైట్ అందుబాటులో లేని అత్యవసర సమయాల్లో వైఫై రౌటర్ల ద్వారా జాలం అందుబాటులో ఉంటుంది కాబట్టీ 99శాతం జాల సంపర్కం ఉంటుంది. సాటిలైట్ ఆంటెనాను పవర్ రేక్ పై అమర్చుతారు. ఇది ప్రతి కోచ్ కు వైఫై రేడియోల ద్వారా అనుసంధానం చేయబడి ఉంటుంది. కోచ్ వెలుపల ఉండే యాక్సెస్ పాయింట్ల ద్వారా ఇది ప్రయాణీకునికి చేరుతుంది.
రక్షణ:
ప్రభుత్వ శాఖయిన టెలికాం వారి సూచనల మేరకు ప్రతి ఒక్క వెబ్ కదలిక పంజీ చేయబడుతుంది. ప్రయాణీకులు తమ ఫోన్ నంబర్ తో పాటూ పీఎన్నార్ సంఖ్య, ప్రభుత్వం జారీ చేసిన ఏదయినా గుర్తింపు పత్రం(ఎన్నికల గుర్తింపు పత్రం లేదా ఆధార్ మొ॥) అందజేస్తే ఈ సేవలకు కావల్సిన సంకేత పదం ఇస్తారు. సంకేతపదం లేనిదే ఈ సేవను అనుభవించలేము. ఆ సంకేతపదం ఎసెమెస్ గా ఫోన్ కు వస్తుంది. త్వరలో ఇంటర్నెట్ టీవీ కూడా అందుబాటులోకి రానుందట.
ఈ తతంగమంతా వటానికి ఖర్చు దాదాపు రూ॥ 6.3 కోట్లట. ఈ సేవలు రాజధాని, శతాబ్ది ఇంకా దురొంతో రైళ్ళకు పొడిగిస్తారట.
ఇక సాధ్యాసాధ్యాల విషయానికి వస్తే,
భారతీయులు మిక్కిలి(చాలా) వెధవతెలివి గలవారు. ఏదయినా సేవను సొంత ప్రయోజనలాకు వాడుకోక మానరు. రైళ్ళలో బాత్రూం అద్దం నుండీ కిటికీ కడ్డీల వరకూ తస్కరించే బాపతు మనం! ఈ విధమయిన దొంగతనాల నుండి ఎలా ఆయా రౌటర్, అంటెనాలను కాపాడుకుంటారో రైల్వే వాళ్ళు తేల్చుకోవాలి.
ఇక సేవల దుర్వినియోగంలోనూ మనమే అగ్రులం, మహాభారతం రామాయణం పేర్లతో porn చూడటం వీసీఆర్ల కాలంలోనే ఉంది. ఇక porn బ్లాక్ చేయటం అనేది ఈ విధంగా దాదాపు అసాధ్యం.
టారెంట్లు నిలుపు చేయటం ఒక విధంగా వ్యర్థమే, టారెంట్లు లేకపోతే నేరుగా వీడియోలు డౌనులోడ్ చేస్తారు, అందువల్ల ఇంకా బ్యాండ్ విడ్త్ పై ఎక్కువ భారం పడుతుంది.
ప్రస్తుత కథనాల ప్రకారం ఎలాంటి రక్షణలు కల్పిస్తున్నారో తెలీదు, అందువలన ప్రయాణీకుల క్రెడిట్ కార్డు, బ్యాంకు వివరాలు మొదలు ఈ-మెయిలు సంకేత పదాలు వరకూ బలహీన మరియు సున్నిత సమాచారం ఎప్పుడూ తోటి క్రేకర్ ప్రయాణికుల చేతుల్లో పెట్టి నెట్ వాడతన్నామని గమనించాలి.
ఎంత గట్టి రక్షణకయినా విరుగుడు క్షణాల్లో కనిపెట్టే సామర్థ్యం ఇండియన్ బ్లాక్ హాట్ క్రేకర్లకు గలదన్న విషయం రైల్వే వారూ ఇంకా ముఖ్యంగా ప్రయాణికులు గుర్తించాలి.
ఎంత అత్యవసరమయినా బ్యాంకింగ్ వంటి సేవలు వాడకపోవటమే సబబు.
ఇంకా దాదాపు 1000 మంది ప్రయాణికులు ప్రతి ట్రెయినులో ప్రయాణిస్తున్నపుడూ, కనీసం 500 మంది అయినా నెట్ వాడతారు, అలా 4 Mbps, ఎందుకూ సరిపోదు.
నేటి రైలు ప్రయాణాల్లో క్షుణ్ణంగా గమనిస్తే, ప్రతి 5గురిలో ఒకరు లేప్‍టాపు. ప్రతి 3గురిలో ఇద్దరు స్మార్ట్ ఫోన్ తో ఉన్నారు. అందుచేత నెట్ సౌకర్య్వంతం కాకుండా, ఇంకా ఎక్కువ తలనొప్పిగా మారటం మాత్రం ఖాయం.
ప్రత్యేకంగా చెప్పుకోదగినది పీఎన్నార్ సంఖ్య. పీఎన్నార్ సంఖ్య ఒక్కటికి ఒకే పాస్ వర్డ్ ఇస్తే, 6గురు ఒక్క సంకేతపదంతో లాగిన్ అవడం-దీనిని ఎలా సాధ్యపరుస్తారో చూడాలి.
ఈ విధంగా భారతీయ ప్రయాణికునికి ఈ సౌకర్యం సేవకన్నా పేద్ద తలనొప్పే!