Tuesday, October 13, 2015

బలహీన క్షణం

నా పేరు బలహీన క్షణం. నేను సమయ కొలమానాల్లో కనిపెట్టబడిన వేల కొలతల్లో ఒకడ్ని. నా నిడివి పేరులో ఉన్నట్టే ఒక క్షణ కాలం. నేను సర్వవ్యాపిని. యముడొక్కడే సమవర్తి అనుకొంటారు మీలో చాలా మంది. కానీ పెక్కు వ్యాసులు ఉన్నది ఎంత నిజమో పెక్కు సమవర్తులు ఉన్నదీ అంతే నిజము. 
ఉదాహరణకి నిద్ర సమవర్తి, పేదా-పెద్ద అన్న తేడా లెకుండా అందరూ నిద్రపోవాల్సిందే, అలానే చావు, అలానే సంతోషము కూడా. 
నా నిడివి ఒక్క క్షణమైనా, మనుషులు వాళ్ళ అవకాశాన్ని బట్టి నా నిడివిని నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు. సంవత్సరాలు దాటేయిస్తారు. 
వారి జీవితాల్లో ఏం తప్పు జరిగినా నా మీదకు నెట్టేస్తారు జనాలు. 
తన భర్తను అనాల్సిన మాటలు అనేస్తుంది భార్య, ఏమయిందని మళ్ళీ ఆలోచించుకొని అదొక బలహీన క్షణం అని తను చేసిన తప్పుకు నన్ను నిందితుడ్ని చేసేస్తుంది. 
పెద్ద పెద్ద దేశాధినేతలు కూడా ఎన్నో తప్పులు చేసేస్తారు, వేల జనాల ప్రాణాలు బలి తీసుకుని ఆ నింద కూడా నా మీదకు నెట్టేస్తారు. 
నేనే ఆ దుశ్చర్యకు కారణమని కాబోలు.