Wednesday, October 30, 2013

తెలుగు పుస్తకాల యూనీకోడీకరణపై సింపోజియం

నిన్న హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్-జూబిలీ హాల్‍లో "తెలుగు పుస్తకాల యూనికో(క్రో)డీకరణ" పై సింపోజియం జరిగింది.
 ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార సాంకేతిక శాఖ, అధికార భాషా సంఘం మరియు సిలికానాంధ్ర - ఈ మూడు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. పీవీఆర్కే ప్రసాద్ గారు లాంటి ఎందరో ప్రముఖులను మొదటి సారి చూసే అవకాశం కలిగింది.

సదస్సులో మొదటి ప్రశ్న ఏ ఏ పుస్తకాలను యూనీకోడ్ లో అందుబాటులోకి తేవాలి అని. దానికి వచ్చిన సమాధానాలు నాకు గమ్మత్తుగా అనిపించాయి: సూచనలు - ఆంధ్ర మహాభారతం, భాగవతం, క్షేత్రయ్య పదాలు మొ॥
- ఇవన్నీ ఇప్పటికే తెలుగు వికీసోర్స్( te.wikisource.org ) లో అందుబాటులో ఉన్నాయి. మనకు కావాల్సిన విధంగా HTML, pdf, doc, txt, epub, mobi మొదలగు రూపాలలో పుస్తకాన్ని దింపుకునే మార్గం కూడా ఇప్పటికే అందుబాటులో ఉన్న వికీసోర్స్ లో మహాభారతం(వ్యాస, కవిత్రయ), రామాయణం(మొల్ల, వాల్మీకం), కవిత్వం(నీతిచంద్రిక, ఊర్వశి, గురజాడ గారి కవిత్వం, చలం కవిత్వం), నాటకములు(పూర్ణమ్మ, కన్యాశుల్కం, మిణుగురులు మొ॥), పురాణాలు(భాగవతం, పద్మపురాణం), వేదాలు(ఋగ్వేదం అన్ని మండలాలు, అధర్వణ వేదం అన్ని కాండాలు, సామవేదం అర్చికలు, శుక్ల యజుర్వేద అధ్యాయాలు, కృష్ణ యజుర్వేదం కొంత భాగం)-తెలుగులిపిలో, క్షేత్రయ్య పదాలు, సంకీర్తనలు, స్తోత్రములు, శతకములు, తెలుగులో కురాన్, ఇంకా ఆంధ్రుల చరిత్రము మొదలు తెలుగువారితో సంబంధమున్న స్వేచ్ఛా లైసెన్స్ లేదా పబ్లిక్ డొమెయిన్ లో ఉన్న ఎన్నో పుస్తకాలున్నాయి.
వికీసోర్స్ మొదటి పేజీ
ఇంకా ఎన్నో పుస్తకాలు తెచ్చేందుకు కృషి జరుగుతుంది. మీరూ ఇందులో పాలుపంచుకోవచ్చు. వికీసోర్స్ మనందరిలాంటి ఔత్సాహికులు రాసే స్వేచ్ఛా గ్రంథాలయం. వికీసోర్స్ లో ప్రూఫ్ రీడ్ పొడిగింత వాడి చాలా సులువుగా పాఠ్యాన్ని టైపు చేసుకోవచ్చు.
వికీసోర్స్ లో ఇప్పటికే ఉన్న పుస్తకాల వర్గాలు

ప్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్ వాడుకలో

ప్రూఫ్ రీడ్ పొడిగింత టైపుచేస్తున్నపుడు

ప్రూఫ్ రీడ్ పొడిగింత, గులాబీ పెట్టెలోనిది మనం టైపు చేసే పాఠ్యం, పచ్చ పెట్టెలోది స్కాన్ పుస్తకపు పేజీ, ఎరుపు వృత్తంలోనిది టైపు పద్ధతిని ఎంచుకునే ఉపకరణం

epub గా ఎగుమతి చేసేందుకు


ప్రతి పుస్తకాన్నీ పీడీఎఫ్గా, ముద్రణకు అనువుగా దింపుకోవచ్చు, అలానే ఎక్కువ పుస్తకాలను ఒకే పుస్తకంగా రూపొందించవచ్చు 

వికీసోర్స్ మాత్రమే కాక ఎన్నో ఇతర జాలగూళ్ళలో ఉన్న ఎన్నో పుస్తకాలు కూడా సభికులు యూనికోడ్ లోకి రావాలి అని అడగటం గమనార్హం.
 ఏదయినా చర్చకు/సభకు వెళ్ళే ముందు అవి ఇప్పటికే అందుబాటులో ఉన్నవో లేదో నిర్ధారించుకుని అడగాలి కదా! అది వేరే విషయం అనుకోండి.

మరికొందరు అడిగినవి - గణితసార సంగ్రహం, విజ్ఞానేశ్వరం, వ్యాకరణాలు, ఛందస్సు, నందకరాజ్యం, మొ॥, జానపదుల మాటలను భద్రపరిచి అందులోనుండి వారి వాడుక పదాలను సేకరించాలని శ్రీరమణ గారో, ఇంకెవరో అడిగారు. ఇవి బాగున్నాయి.
అయితే ఏ ఒక్కరూ కూడా సమకాలీనుల పుస్తకాలను గుర్తించలేదు!
స్వేచ్ఛా లైసెన్స్‍ల అవగాహన రచయితలలో పెరగాలి. వారి కాపీరైట్లు వారితోనే ఉంచుకుని హక్కులు ప్రచురణకర్తలకు ఇవ్వటానికి బదులు సమాజానికి ఉపయోగపడే విధంగా క్రియేటివ్ కామన్స్ లాంటి లైసెన్స్ ను ఆపాదించుకోవడం మన రచయితలూ నేర్చుకోవాలి.

ఒకటి రెండు అంశాలు, తెలుగులో టైపు చేయటం ఎలా, యూనికోడ్ మా డీటీపీ వాడికి తెలీదు అనే కొన్ని ఎప్పుడూ ఉండే సాగతీత అంశాలు తప్ప మిగితా చర్చ అంతా బాగానే సాగింది.

నేను ఒక ప్రదర్శన(presentation) తయారుచేసి తీసుకెళ్ళాను. జరుగుతున్న చర్చలకి నా ప్రదర్శన జరక్కపోవచ్చు అనుకుని, నా ప్రదర్శన ఇంకా వీవెన్ ప్రదర్శనలోని స్లైడ్స్ డిస్ప్లే చేయటం మొదలుపెట్టాను. ఆఖరున ఒక 20 నిమిషాలు నాకూ వీవెన్ గారికి అవకాశం వచ్చింది, కానీ అప్పటికే డిజిటైజేషన్ కి సంబంధించిన అన్ని అంశాలు అందరూ చర్చించేసారు, అవి మినహా ఉన్న సమయంలో చెప్పదగినవి చెప్పేసాను. నా ప్రదర్శన కింద ఇవ్వబడింది.

ఈ సింపోజియంలో సిలికానాంధ్ర వారి telugupustakam.org అనే వెబ్సైట్ లాంచ్ చేసారు. ఇందులో కొన్నిపుస్తకాలు ఇప్పటికే అందుబాటులో ఉంచారు. నేను ఆసక్తిగా ఎదురుచూసేది - ఈ సైటులోకి త్వరలో వచ్చి కొలువుండబోయే టీటీడీ వారి పుస్తకాలు, కొన్ని వర్సిటీలు సంస్థల పుస్తకాలు. ఇంకా తెలుగు కోర్పస్ ప్రాజెక్టు సన్నాహాలు కూడా చేసారు.