భారతదేశం ఒక దేశం కాదు పలు దేశాల సమూహమని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసేవి మన భాషా-సంస్కృతుల వైవిధ్యాలు. ఎన్ని అసమానతలున్నా, ఎంత ఎత్తుపల్లాలున్నా, ఒక రాజ్యాంగాన్ని పాటిస్తూ కలిసి మెలిసి ఉన్నాం.
ఐతే, ఇన్నేళ్ళ తరువాత చరిత్ర తెలీకుండా. అసలేం జరిగిందో, ఏం జరుగుతుందోనన్న అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నాము మనమంతా - ఇవాళ!
ఇంతకు మునుపు మనం రోజూ మాట్లాడుకునే జనాలు మనింట్లో వాళ్ళు, పక్కింటోళ్ళు, కచేరీలో తోటి ఉద్యోగులు, స్కూల్లో తోటి విద్యార్థులు, చనువున్న వారికి ఉపాధ్యాయులు; పార్కులకు వెళ్ళి వాకింగులు చేసే వాళ్ళకి, పబ్బులకి వెళ్ళేవాళ్ళకి, యోగాలకు వెళ్ళే వాళ్ళకి అక్కడ కలిసే జనాలు. ఆ మాటల్లో కూడా మనకు అత్యంత విలువైన విషయాలే చర్చించుకునే వాళ్ళమేమో.
అంతకు మించి సంభాషణలూ ఆ రోజుల్లో జరగటం నాకు తెలుసు. యద్దనపూడి నవలలు చదివి కలం స్నేహాలు చేసి, వేరే వేరే ఊర్లలో వాళ్ళతో మా ఇంట్లో పెద్దవాళ్ళు పోస్టుకార్డులు ఇన్‌లాండ్ లెటర్లు రాసుకోవటం. పండగలకి, ముఖ్యంగా కొత్త సంవత్సరమపుడు గ్రీటింగ్ కార్డులు పంపుకోవడం. ఆవి కూడా మిత సంభాషణలే.
పలుకే బంగారమనమాట ఆ రోజుల్లో...
మెల్లిగా ఫోనులొచ్చాయి. లాండ్ లైన్ ఇంట్లో పెట్టించిన కొత్తల్లో, మా క్లాసుమేట్లకు ఫోన్ చేయడం నాకింకా గుర్తుంది. మనకు పని లేని విషయాలు, వృథా మాటలు మాట్లాడొచ్చన్న విషయం తెలిసింది! ఇక మొబైల్స్ రావటం మొదలయ్యాక పదో తరగతి పరీక్షలు - డౌట్లు వీటితో ఫోను బిల్లు రావటాలు. ఐనా మాటలు మితమే, మాటల పరిధీ మితమే.
ఇక ఇంటర్నెట్ రాక, మొబైళ్ళు విపరీతంగా పెరగటంతో సాయంత్రం చెయ్యాల్సిన వంట గురించి మొదలు పక్కింట్లో వాళ్ళు నీచు వండారన్న విషయం దాకా ఫోనుల్లో మాట్లాడ్డం మామూలైపోయింది.
దేనీకైనా ఒక పరిధి ఉంటుంది, అది దాటాక ఆ వస్తువు వాడకం తగ్గించేస్తాం, పాతొక రోత అన్న సామెత ప్రకారంగా...
కానీ ఈ ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఫోనులకు ఆ పరిధి అందనంత ఎత్తుకు చేరిపోయింది.
ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రవరతో మొదలుపెట్టి గుర్తున్నంతలో రాతి యుగం నాటి పూర్వీకులను గుర్తు చేసుకుని పెద్దల పండగ చేసుకున్నామని నలుగురికీ చెప్పేసి నాలుగు ఫోటోలు పడేసి, ఎవరు స్పందిస్తారా, ఎవరు కామెంట్ రాస్తారా, ఎవరు లైకులు కొడతారా అని ఎదురు చూడటం మొదటి స్థాయి. తరచూ స్పందించే వాళ్ళలో ఎవరు ఇవాళ పోస్టుకి లైకులు కొట్టలేదు, ఎవరు కామెంటలేదు అని చూస్కొని, వాళ్ళు స్పందించేలా పోస్టుని తిరిగిరాసి మళ్ళీ పోస్టు చేయడం, అప్పటికి పట్టినుకోకపోతే వాళ్ళని ట్యాగ్ చెయ్యటం తో ఒక కొత్త రోగం మొదలయిద్ది. ఆ రోగం ముదిరి మన పోస్టులకి లైకు కొట్టని వాళ్ళ మీద ద్వేషం పెంచుకుని, వాళ్ళ పోస్టుల్లోకి దూరి అసందర్భంగా వాళ్ళని కవ్వించటం, ఇంకా ముదిరితే వాళ్ళని టార్గెట్ చేస్తూ పేరెక్కడా చెప్పకుండా దెప్పిపొడవడం, ఇంకా ముదిరి వాళ్ళ పోస్టులకి పేరడీపోస్టులు పెట్టడం, మరింత ముదిరి వాళ్ళకు విరుద్ధంగా ఉన్న పలుగురిని వెంటేసుకుని గ్రూపులు మొదలెట్టి మరీ వాళ్ళని తిట్టుకోవడం. అంతకు మించి ముదిరితే సదరు ద్వేషిని బ్లాక్ చేసి, ఆ ద్వేషికి ఒక పేరడీ అకౌంటో, ఆ ద్వేషిని అన్ని వైపుల నుండి ఉక్కిరి బిక్కిరి చేసేందుకు ఒక ప్ఫది ఫేకు అకౌంట్ల రూపకల్పన. తారా స్థాయిలో భజన క్లబ్ లాగా ద్వేషి పేరును నిత్య పారాయణం చేసే కల్టును స్థాపించడమనమాట.
ఇదీ మనవాళ్ళకి బోర్ కొట్టేసింది.
ఇక పైన చెప్పిన ఒక్కో సోపానాన్ని ఆధారం చేసుకుని అపార్టుమెంటులు కట్టుకున్న వాళ్ళున్నారు - ఊహలూ-కబుర్లూ ఆ అపార్టుమెంటుల్లో ఇటుకలు. ఏదైనా వ్యక్తి/భావజాలాన్ని ద్వేషించడం బ్లూప్రింటు, ఒక్కోపోస్టు ఒక్కో అంతస్తు. ఆ పోస్టుకు లైకులు కొట్టి కామెంటేవాళ్ళందరూ ఆ గ్రూపు సభ్యులైపోతారు. ఒక కల్టుకుండే లక్షణాలన్ని అందరిలో ఓ మోస్తరుగా వచ్చాయనుకున్నాక, ఆ గ్రూపు తలుపులు మూసివేసి, దాన్ని రహస్యకూటమిగా మార్చేసి సభ్యులను బ్రెయిన్ వాషు చేయడం మొదలుపెడతారు పెద్ద పిచ్చోళ్ళు. కొత్త పిచ్చోళ్ళు, చిన్న పిచ్చోళ్ళు అన్ని వింత కదా, అంతా జీర్ణించేసుకుంటారు. మనకు ఇంటర్నెట్ ప్రపంచంలో అజీర్తి సమస్య లేదు కదా మరి!
నిజ జీవితంలోనే ఒక భవనానికి భౌతికంగా కొన్ని లక్షణాలున్నాయి. ఏ ఆకారం పడితే ఆ ఆకారంలో కట్టలేము. వంటగదికి ఆగ్నేయం, నీరు పోయే దిశ ఈశాన్యం, గాలి వెలుతురు వచ్చేలా వాయవ్యంలో ఖాళీ స్థలం, ఇలా అన్ని ఫిక్స్డ్ కదా!
ఐతే ఈ ఇంటర్నెట్ ఇళ్ళకి ఎలాంటి పరుధులూ లేవని ముందే అనుకున్నాం కదా, అపార్టుమెంటుల బ్లూప్రింటుల్లోనూ అంతే! వంటగదిలో బాత్రూం ఉంటుంది, పడుకునే చోటే నడవా ఉంటుంది. కొన్ని గ్రూపుల్లో చేరాలంటే మీ వివరాలన్నీ చెప్పేసి, ఆ అపార్టుమెంటులో మిగితా అందరిలాగానే నగ్నంగా తిరగాలన్నమాట!
ఇంట్లో జనాలు పెరిగితే వేరు కుంపటి సహజమే, వేరు కుంపటి వేరే గ్రూపుకి దారి తీస్తుంది.
అలా సవా లక్ష గ్రూపులు తయారయ్యాయి.ఇది ఫేస్ బుక్ మాట.
సోషల్ మీడియాలో ఏ కొత్త అనువర్తనం వచ్చినా ఇదే రూలు అక్కడా పాటించేస్తున్నాం, ముఖ్యంగా మన తెలుగువాళ్ళు ఇందులో దిట్ట!
ఇక్కడ మురళి అన్నయ్య చెప్పిన విధంగానే, నాకూ అనుభవముంది! టెలిగ్రాములో, వాట్సాపులో నా ప్రమేయం లేకుండా నేను ఎన్నో గృహప్రవేశాలు చేసేసా! ఆ గ్రూపుల్లో ఎలాంటి చర్చలు జరుగుతాయో అన్నయ్య పోస్టులో చదువుకోవచ్చు.
జనం ఎక్కడుంటే ఐదెస్టేట్లు అక్కడేగా మన దేశంలో, పైగా మనది ప్రపంచంలోనే అతి పెద్ద డెమాక్రసీ!
కోర్టుల్లో ఫేసుబుకు తరహా జోకులేసే జడ్జీలొచ్చారు. WHO, UNESCO, UNO, World Bank కలిసి మూకుమ్మడిగా తెలుగు ఒక పక్క చచ్చిపోతుందని ప్రకటనలు వారానికొకటి ఇస్తుంటే, మరో పక్క తెలుగు భాష ప్రపంచంలోనే గొప్ప భాష అనీ, తెలుగు లిపి ప్రపంచంలోనే అతి గొప్ప లిపి అని ప్రకటనలు గంటకొకటి. ఆ వార్తలని ఆధారంగా చేసుకుని కేసులు గెలుస్తున్న న్యాయవాదులు, ఆ ప్రకటనలతో జనాల మనసు దోచి ప్రజాప్రతినిధులవుతున్న నాయకులు, ఆ పోస్టుల ఆధారంగా అరెస్ట్ చేస్తున్న పోలీసులు, ఆ పోస్టులనే నిజమని నమ్ముతూ, అసలు వార్తలని కప్పెట్టేసి జనాల రుచికి తగినట్టుగా వార్తలను వండుతున్న మీడియా!
ఇక ఇళ్ళన్నీ గేటెడ్ కమ్యూనిటిగా, ఆపై శాటిలైట్ నగరాలుగా, టౌన్ షిప్లుగా, ఉపనగరాలుగా, ముఖ్య నగరాలుగా మారినట్టు; గ్రూపులు మెల్లిగా ఒక భావజాలం చుట్టూ రెండుగా విడిపోయి పరస్పర విరుద్ధ ప్రకటనలు, ఒకరినొకరు నిందించుకోవడం జోకులు పేల్చడం మొదలైపోయింది. మీములు, పేరడీ పాటలు, చిరుచిత్రాలు, లఘుచిత్రాలు, చలనచిత్రాల దాకా వెళిపోయింది స్థాయి.
మన దేశంలో మొహమ్మదీయులు, కిరిస్తానీలకు స్థానం లేదన్న భావజాలం చాలా తక్కువ స్థాయిలో ఉండేది ఒకప్పుడు. ఈనాడు అది వికృత రూపం దాల్చింది. క్రిస్టియన్ లను ప్రేతాలని, మొహమ్మదీయులను సుల్లాలని పిలిచే సభ్యత్వం సమాజానికి అలవరుచుకుపోయింది.
కాదనే వాళ్ళు దేశద్రోహులు. కలిసి నడిచే వాళ్ళు క్షణక్షణం వాళ్ళ స్వామిభక్తిని, ముస్లిం-క్రిస్టియన్ వ్యతిరేకతను చాటుకోవాలి. అందుకు వాళ్ళ సహజత్వాన్ని మానేసి పొద్దస్తమానం ఎవరు హిందుత్వానికి శత్రువులో గుర్తిస్తూ వారి చేస్తున్న చిన్న తప్పైనా, అది వారి మతంతో, వారి సామాజిక పూర్వరంగంతో ముడిపెట్టి వాళ్ళను సామాజిక మాధ్యమాల నుండి బహిష్కరించాలి.
ప్రభుత్వం - హిందూ నాయకత్వ ప్రభుత్వం, వాళ్ళేది చేసినా అది న భూతో న భవిష్యత్. నోటురద్దు మొదలుకొని జిఎస్టి దాకా, తాజ్‍మహల్ ను వారసత్వ కట్టడాల జాబితా నుండి తీసివేయడం మొదలు నిలదీసే వాణ్ణి దేశద్రోహిగా నిలబెట్టడం దాకా. అన్ని నిర్ణయాలు అభివృద్ధి హేతుకాలే, వీటిన మించి దేశానికి ప్రయోజనం చేకూర్చేవి లేవు!