Sunday, October 15, 2017

సంశయలాభము : ఆరుషి హత్య కేసులో వాంఛనీయమైనా ఆలస్యంగా వచ్చిన తీర్పు

ఆరుషి హత్య, ఆ వెంటనే వాళ్ళింటి పనిమనిషి హత్య ఉదంతం 2008లో దేశంలో పెద్ద చర్చనీయాంశమయింది. 14 ఏళ్ళ బాలిక నిర్దాక్షిణ్యంగా చంపబడి, రక్తపు మడుగులో దొరకడం, ఆ సమయానికి ఇంట్లో అంతా గాఢ నిద్రలో పడి ఉండటం. పనిమనిషి హేంరాజ్ పై అనుమానం రావడం, రెండు రోజుల్లో హేంరాజ్ మృతదేహం ఇంటిపైన టెరేస్‌లో వాటర్ ట్యాంకులో లభ్యమవడం - ఏదో క్రైం సినిమా కథలా ఉన్న యథార్థంగా జరిగిన ఉదంతమిది. ఇంకెవరి ప్రమేయం ఈ హత్యల్లో కనిపించకపోవడం తో పోలీసులు ఆరుషి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. సాక్ష్యాధారాలు సరిగా లేకపోయినా సీబీఇ కోర్టు వీరిరువురికీ జీవిత ఖైదును 2013లో ప్రకటించింది. పై కోర్టు అలాహాబాద్ హైకోర్టులో ఇన్నేళ్ళు నలిగిన కేసు ఆఖరికి బెనెఫిట్ ఆఫ్ డౌట్ (సంశయలాభము) కింద ఇద్దరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ తీర్పు వెలుతురులో సీబీఐ తీర్పు, సీబీఐ, అంతకు ముందు స్థానిక పోలీసులు జరిపిన విచారణలపై ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. కొందరు సాక్షులను పోలీసులు సమకూర్చారని, హత్య జరిగిన రాత్రి తల్వార్ కుటుంబం వాళ్ళింట్లో వేరే వారున్నట్టు ఋజువులున్నాయని, అసలు దోషులు తప్పించుకున్నారని హైకోర్టు బెంచ్ అభిప్రాయ పడింది.
అంతకు ముందు సీబీఐ విచారణలో తల్వార్ దంపతులు హత్య చేసి, హేంరాజ్ శవాన్ని ఇంటిపైకి తరలించి, హత్యకు వాడిన ఆయుధాలను దాచిపెట్టారని తేల్చింది. ఇందుకు తగిన ఆధారాలు కానీ, ఋజువులు కానీ దొరకలేదన్నది గమనార్హం.
ఈ తీర్పు మరో కోణం నుండి చూస్తే మన మామూలు ప్రజల ఊహలకు, వాటిని ప్రేరేపించే మీడియా కథనాలకు - వాస్తవాలు - సాక్ష్యాలు ఆధారం చేసుకుని చట్టపరమైన ఆలోచనలలో రంగరించి నిజానిజాల విచారణ చేసే కోర్టులకు ఉన్న వ్యత్యాసాన్ని ఇట్టే బహిర్గతం చేసింది. పక్క గదిలో పడుకొని ఉన్నా వాళ్ళమ్మాయి హత్య గురించి కానీ, హేంరాజ్ శవాన్ని ఇంటిపైకి తీసుకెళ్ళిన విషయాలు కానీ నిద్రలో ఉండటం వలన తెలీలేదన్న తల్వార్ దంపతిపై సానిభూతి చూపేవారి కన్నా అనుమానం పెంచుకున్నవారే ఎక్కువ.
దాదాపు పదేళ్ళ జైలు నరకయాతన తరువాత తల్వార్ దంపతికి సంశయలాభము వలన జైలు శిక్ష నుండి ముక్తి దొరికింది.
సాధారణంగా కోర్టులు కేవలం సాక్ష్యాధారాలను విని, పరిశీలించి మాత్రమే తీర్పు చెబుతాయి, అనుమానం ఆధారంగా తీర్పులు చెప్పవు.
మొత్తం కేసు దర్యాప్తు గందరగోళంగా ఉందంటే కొందరు ఒప్పుకోకపోవచ్చు. ఒక రోజంతా ఎక్కడా హేంరాజ్ జాడ కనిపించలేదు. హేంరాజ్ సహచరుల్లో ముగ్గురు ఈ కేసులో అనుమానితులు. కానీ ఆధారాలు లేని కారణంగా వారిపై నేరారోపణ కోణంలో విచారణ జరుగలేదు. ముగ్గురిలో ఒకడు - కృష్ణ, డిఎన్ఏ కూడా సరిపోలింది, కానీ దాన్ని కోర్టు చెల్లదని కొట్టిపారేసింది. నిజం చెప్పాలంటే సి.బి.ఐ విచారణను త్వరగా ముగించెయ్యాలనే ఆలోచన వలన సాక్ష్యాధారాలను సేకరించడంలో జాప్యం చేసింది. ఆ జాప్యంలో పుణ్య కాలం కాస్తా గడిచిపోయింది. ఇంత జరిగాక అసలు కేసును నడిపిన కోణంలోనే పరిశీలించాల్సిందా? లేక వేరే మార్గాల్లో కేసు దర్యాప్తు జరిగి ఉండవచ్చా? స్థానిక పోలీసులు - సీబీఐ, ఇరువురు రెండు స్థాయిల్లో విచారణ జరిపినా కేసు కొలిక్కి రాకపోవటం సో(శో)చనీయాంశం. హత్య కేసుల్లో నిందితులను వదిలేయడం ఒక విధంగా అన్యాయమే! ఇన్ని రోజులకి నిందితులను వదిలివేయడమంటే ప్రభుత్వ యంత్రాంగం నేరస్థుల చేత నేరం ఒప్పించడంలో విఫలమయింది లేదా నిందితులుగా గుర్తించబడిన వారు సరయిన వారు కారు. ఒకవేళ ఈ మొత్తం సన్నివేశంలో నిందితులు నేరస్థులైతే; వారు తప్పించుకుంటే అది మన న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ, సీబీఐ వైఫల్యమే. లేదూ నిందితులు నేరస్థులు కాదంటే అసలు నేరస్థులు ఎవరు? వారిని పట్టుకోలేని గుర్తించలేని మన న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, సీబీఐ వైఫల్యమే.
ఏది ఏమైనా, ఇంకా ఆరుషి హంతకులకు తగిన శిక్ష పడలేదన్నది మనం మర్చిపోలేని, మర్చిపోకూడని చేదు నిజం.

ఈ సందర్భంలోనే మలయాళ ప్రేతం సినిమా రిమేక్ "రాజుగారి గది 2" విడుదల కావటం అందులోనూ ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోవడం చూసాము. కానీ నిజానికి ఆమె హత్య చేయబడిందని మనందరికీ తెలుసు. ఐనా మనం ఇలాంటి విషయాలను పట్టించుకోం. ఎంతటి పరిస్థితి వచ్చిన తట్టుకొని నిలబడగలిగే ధైర్యం మనలో మనం నింపుకోలేకపోతున్నాం, మన పిల్లల్లో నింపలేకపోతున్నాం!

No comments:

Post a Comment