Thursday, October 26, 2017

ఎవరి తండ్రి సొమ్మని?

కింది పెద్ద పోస్టుకి చిన్న సారాంశం :

నేనో, మీరో, మరెవరో సాధారణ పౌరుడు బ్యాంకులో వంద రూపాయలు జమ చేస్తాడు. బ్యాంకు ఆ వంద రూపాయలతో ప్రభుత్వ బాండ్లు కొంటుంది. ఇప్పుడు ప్రభుత్వం సదరు బ్యాంకులో వంద రూపాయలను పెట్టుబడిగా పెడుతుంది. ఆర్‌బిఐ ప్రభుత్వం బ్యాంకుకిచ్చిన ఋణపు వంద రూపాయలను కొత్త వంద రూపాయల నోటుగా ముద్రిస్తుంది. 

ఈ మొత్తం గందరగోళంలో ఎవరు లాభపడ్డారు? ఎవరు నష్టపోయారు?


*********************************************************


కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ బ్యాంకులకు ఊరటనిస్తూ పలు ప్రకటనలు చేసింది. వాటిలో ముఖ్యమైనది రిక్యాపిటలైజేషన్. అంటే ప్రభుత్వం బ్యాంకులలో పెట్టుబడి రూపేణా కొంత సొమ్మును జమ చేస్తుంది.
రాబోయే రెండేళ్ళలో కేంద్ర ప్రభుత్వం 2.11 లక్షల కోట్ల రూపాయలను వివిధ పథకాల ద్వారా అంచెలంచెలుగా బ్యాంకులకు అందించనుంది.
మన ప్రభుత్వ రంగ బ్యాంకులు మల్యా లాంటి బడాబాబులకు ఇప్పిచ్చిన అప్పు, చిన్న చితకా నష్టాలు, ఎందుకు పనికిరాని ఆస్తులు కలుపుకొని ఒక పది లక్షల కోట్ల నష్టంలో ఉన్నాయనేది ఒక అంచనా. అందువల్ల గత కొద్ది కాలంగా బ్యాంకులు ఋణాలు అందివ్వలేక పోతున్నాయి. అరవై ఏళ్ళలో ఇలాంటి దయనీయ స్థితి ఇదే తొలిసారి.
కొత్తగా పరిశ్రమలకు అప్పులు ఇవ్వకపోతే వ్యాపారాలు జరగవు. అప్పులిచ్చేందుకు అంతకు ముందున్న బకాయిల కుప్పలు వీలు కల్పించలేకపోతున్నాయి - అందుకని బ్యాంకులు ఋణాలు ఇవ్వడం లేదు.
గతేడాది చివర్లో రిజర్వ్ బ్యాంకు అన్ని బ్యాంకింగ్ సంస్థలకు కచ్చితమైన చట్టం ప్రవేశపెట్టింది. ఆ చట్టం ప్రకారం బ్యాంకులు బకాయిపడ్డ వారితో కఠినంగా వ్యవహిరించాలి. బ్యాంకులు షూరిటీగా ఉన్న ఆస్తులను జప్తు చేసుకొన్నా, అప్పులో పదో వంతు కూడా రావటం లేదు. దొరికిందే పదివేలు అన్న ధోరణిలో నష్టపోయిన ఋణగ్రహీతలతో వ్యవహరిస్తున్నాయి బ్యాంకులు.
అదే సమయంలో ప్రయివేట్రంగ బ్యాంకులు అధిక వడ్డీలకి ఋణాలిచ్చి ముందంజలో ఉన్నాయి.
ఇక ఈ కొత్త విధానం సంగతి చూద్దాం.
ఇది మూడు విధానాల్లో జరుగుతుంది. మొదటిది కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు బడ్జెట్ నుండి 18,000 కోట్ల రూపాయలు భర్తీ చేయనుంది. ఆపై ప్రభుత్వ సంస్థల షేర్లను (ప్రభుత్వ అధీనంలో 51% తక్కువ కాకుండా) మదింపుకు (పెం)ఉంచి 58,000 కోట్ల రూపాయలను షేర్ మార్కెట్ నుండి సమకూర్చుకోవచ్చు. రికాపిటలైజేషన్ బాండ్ల ద్వారా మరొక 1.35లక్షల కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలి.
ఇదంతా వినడానికి బాగానే ఉన్నా, షేర్లను హెచ్చించినపుడు, బాండ్లను సాధారణ ప్రజానీకం ముందు ప్రవేశపెట్టినపుడు అసలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇంతకీ ఇదంతా ప్రభుత్వం ఎందుకు చేయాలనుకుంటుంది? బ్యాంకులకు ఈ వింత విధానం ద్వారా చేకూరిన లాభం వలన, అవి ఋణం ఇచ్చే పరిస్థితిలో ఉండి, పరిశ్రమలకు పెట్టుబడులు వచ్చి, మార్కెట్ పుంజుకుంటుందన్నది ప్రభుత్వం ఆలోచన.
ఆలు లేదు ౘూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది మన జైట్లీ - ఉర్జిత్ పటేల్ ల కథనం.
అసలు ఏ బ్యాంకు వద్ద ఎంత ఋణం బాకీలున్నాయి, అందులో ఎంత తిరిగి రావచ్చో, ఎంత అచల ఆస్తుల రూపంలో ఉందో, ఎంత ఎప్పటికీ తిరిగి రాదో? ఈ లెక్కలు బ్యాంకులు బహిర్గతం చేయవు - చేయలేవు. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపలి మనుషులు చాలా బాగా డబ్బు-ఆస్తులను గందరగోళం చేసి లంచగొండితనం బాగా రుచిగొని ఉన్నారు.
దానికి తోడు ఏ ప్రభుత్వ రంగ సంస్థకు ఎంత శాతం పైన చెప్పిన డబ్బు అందచేయబడుతుంది, అందుకు ప్రాతిపదిక ఏమిటి, అన్నది పెరుమాళ్ళకే ఎఱుక.
మన గౌరవనీయ ఆర్ధిక శాఖ మంత్రి గారేమో ఏ రోజు ఏ కొత్త ప్రకటన చేస్తారో, మన ఆర్ధిక వ్యవస్థకు అది ఏం మార్పు తెస్తుందోనన్న ఆందోళన ప్రతి క్షణం ఆర్ధిక వ్యవస్థలోని ప్రతి ఒక్కరికీ ఉండనే ఉంది.
ఇక పాడుపడిపోయి, పాతబడిపోయి, కొత్త మార్పులకు, కొత్త విధానాలకు విముఖంగా ఉండే మన ప్రభుత్వ రంగ బ్యాంకు సంస్థలు ఎప్పటికి మారతాయో? ఇలాంటి తాయిలాలు ఆయా బ్యాంకుల పనితనాన్ని ఏ మాత్రం మెరుగు పరుస్తాయో? వేచి చూడటం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి.

నోట్లరద్దు తరువాత లక్షల కోట్లలో బ్యాంకుల్లో డబ్బులు జమ అయ్యాయి. జిఎస్టి వలన అన్ని పెద్ద డబ్బు లావాదేవీలు బ్యాంకు ముఖతః మాత్రమే జరుగుతున్నాయి. దీని వలన బ్యాంకు మాధ్యమంగా కాకుండా డబ్బులు చేతులు మారే అవకాశం లేకుండా పోవటంతో చాలా వరకు అమ్మకాలు, కొనుగోళ్ళు, వస్తువుల తయారీ, ఎగుమతి లాంటివి గణనీయంగా పడిపోయాయి. బ్యాంకుల్లో జమ చేస్తున్న డబ్బుపై సాధారణంగా వచ్చే వడ్డీని రాను రానూ అటు ఆర్‌బిఐ, ఇటు బ్యాంకులు తగ్గించేస్తున్నాయి. వీటికి తోడు కొత్తగా ప్రభుత్వ ఆసరా అవసరమా? మన బ్యాంకింగ్ వ్యవస్థలు మరికొంత జవాబుదారీ తో పని చేయలేవా?
నోట్లరద్దు సమయంలో ఆ నాలుగైదు నెలలు బ్యాంకింగ్ వ్యవస్థలోని ఎన్నో పనులు వదిలేసి బ్రాంచికి నలుగురైదుగురు కేవలం నోట్లను డిపాజిట్ చేసుకుని, మార్పిడి చేయటం లాంటి నిరర్ధక పనులలో నిమగ్నులయ్యారు. ఆ సమయంలో వాళ్ళు సాధారణంగా చేసుకునే వసూళ్ళు, ఋణాల సేకరణ విశ్లేషణ లాంటి పనులను ప్రజల వెసులుబాటు కోసం పక్కన పెట్టేయాల్సి వచ్చింది. సరయిన సంఖ్యలో క్యాష్ డిపాజిట్ మెషిన్లు, క్యాష్ డిస్పెన్సింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే బ్యాంకులపై పని భారం ఎక్కువ ఉండేది కాదు.
ఆ నెలలలో బ్యాంకింగ్ వ్యవస్థ సవ్యంగా పని చేయకపోవటం నేటి ఆర్ధిక వ్యవస్థ పరిస్థితికి అతి పెద్ద కారణం.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నిజంగానే మన దేశపు రిసెషన్ ను చూసేవాళ్ళం.
ప్రభుత్వపు ఈ రిక్యాపిటలైజేషన్ చొరవ ఎంతో కొంత బ్యాంకులను గాడిలో పెట్టేందుకు దోహద పడుతుంది. ఇది ఎలక్షన్లకు ముందు వస్తున్న నిరర్ధక తాయిలం కాకుండా అమలులో సరిగ్గా చేసి చూపించి మన దేశ ఆర్ధిక వ్యవస్థను అభివృద్ధి వైపుకు మన కేంద్ర ప్రభుత్వం తీసుకు వెళుతుందని ఆశిద్దాం.

No comments:

Post a Comment