Showing posts with label సాంకేతికం. Show all posts
Showing posts with label సాంకేతికం. Show all posts

Saturday, August 16, 2014

నేడే ఫైర్ఫాక్సుకు మారండి, లేదా భవిష్యత్తులో మీరు మిమ్మల్నే కోల్పోగలరు.

1990వ దశకంలో మైక్రోసాఫ్ట్, యాపిల్ ఆగడాలను చవి చూసాము. సాఫ్టువేరు రంగంలో అధిపత్య దాహంతో చిన్న కంపెనీలను ముందు కొంత లాభం చూపించి హస్తగతం చేసుకోటం, ఆపై సదరు కంపెనీ నుండి తీసుకున్న అమూల్యమైన సాఫ్టువేరు ఉత్పత్తిని నిరుపయోగం చేయడం.
ఇక 2000 మొదట్లో ఒక ప్రత్యామ్నాయంగా గూగుల్ వచ్చినప్పటికీ, అది కూడా మైక్రోసాఫ్ట్ బాటనే పట్టింది. అయితే మైక్రోసాఫ్ట్ సందర్భంలో ప్రత్యామ్నాయాలు తక్కువ, వాఅటి గురించి జనాలకు తెలిసే అవకాశాలూ తక్కువే. అందువలన మైక్రోసాఫ్ట్ పెద్ద మేధస్సును ఉపయోగించకుండానే నిలదొక్కుకోగలిగింది.
మైక్రోసాఫ్ట్ వాడి ఉత్పాదనలు, సాఫ్టువేర్లు, మనల్ని వాడి మీద ఆధారపడేలా చేస్తాయి. ఉదాహరణకి వైరస్ వచ్చే అవకాశం మైక్ర్రోసాఫ్ట్ సరుకులో చాలా ఎక్కువ. ఇన్నేళ్ళ అనుభవంలో ఏ ఇతర కంపెనీ అయినా ఆ వైరస్ ల బారిన పడకుండా తమ సరుకును మెఱుగు పరుస్తాయి. కానీ మైక్రోసాఫ్ట్ ఆ పని చెయ్యలేదు, సరి కదా, యాంటి వైరస్ కంపెనీల మార్కెట్ ను సృష్టించింది. ఫలానా వైరస్ ఉంది అని ఫిర్యాదు వస్తే ఫలానా యాంటి వైరస్ కొనుక్కో అని సమాధానం ఇచ్చేది. ఏ యాంటి వైరస్ సాఫ్టువేరూ వేసుకోకపోతే ప్రమాదం అని హెచ్చరించి, వాడికి లాభం చేకూర్చే యాంటివైరస్ కంపెనీలను సూచించేది.
ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, లోతుగా వెళితే ఇంకెన్నెన్నో.
గ్నూ/లినక్స్ విప్లవం వచ్చి స్వేచ్ఛా సాఫ్టువేర్ల వాడకం పెరిగినా ఇంకా ఎందరో మైక్రోసాఫ్ట్ ఉచ్చులో బంధీలుగానే ఉన్నారు.
ఇక యాపిల్ అయితే మరీ ఘోరం, మనకి నచ్చిన హార్డువేరు కొనుక్కునే సదుపాయం కూడా ఉండదే! ఏదయినా సాఫ్టువేరు ఉపకరణం ఆడించాలన్నా కాసులు విదల్చాల్సిందే!
గూగుల్ వాడు వీళ్ళకన్నా మేలేమో అనుకుంటే అదీ కాదాయె!
గూగుల్ వాడు చాలా తెలివయిన జిత్తునక్క వేషాలు కలవాడు.
మనకు తెలీకుండానే మన మెయిల్స్, ప్లస్ పోస్టులు, బ్లాగు పోస్టులు, చాట్ మెసేజులు, అన్నీ, ఇది పబ్లిక్, ఇది ప్రయివేట్ అనే వ్యత్యాసం లేకుండా అన్నిటినీ దాచుకుంటున్నాడు. వాటిని పలు విధాలుగా వాడుకుంటున్నాడు. మన బాహ్య-వెలుపల-గుప్త జీవితాల చిట్టా గూగుల్ వాడి చేతుల్లో ఉంది. ప్రభుత్వాలడిగితే ప్రభుత్వాలకి, డబ్బులు విసిరే బడా కంపెనీలకీ ఈ సమాచారం ఎటువంటి కరుణా లేకుండా నిర్దాక్షిణ్యంగా పంచిపెడుతున్నాడు. అది పొందిన గవర్నమెంటులు తమకు ముప్పు ఉన్న మనుషులను పట్టుకుని శిక్షిస్తున్నారు, ఇంటలిజెన్స్ రిపోర్టులు రూపొందిస్తున్నారు సరే! కానీ అదే సమయంలో ఎందరో వ్యక్తులను వ్యక్తిగత విషయాల గూర్చి హింసించి, శిక్షిస్తున్నారు - ఇది గమనార్హం. ఇక బడా కంపెనీల సంగతి సరేసరి. మనకు తెలీకుండానే మన మెయిల్స్ లో మెయిల్లోని పాఠ్యానికి సంబంధించిన వాణిజ్య ప్రకటన దర్శనమిస్తుంది. మన మెయిల్లోని సమాచారం (అది గూగుల్ వాడు చదువుతాడా లేదా అన్నది తరువాతి విషయం) చూసి, తగ్గ ఆడ్స్ వేసే ప్రోగ్రాములు గూగుల్ వాడి దగ్గర కోకొల్లలు.
ప్రస్తుతానికి చాలా మంది గూగుల్ వాడి ప్రోడక్ట్స్ అన్నీ వాడడం లేదు కాబట్టీ చాలా సమాచారం గూగుల్ వాడికి అందడం లేదు. అందుకనే పొద్దస్తమానమూ గూగుల్ క్రోం వాడు, యూట్యూబ్ వాడు, జీమెయిల్ వాడు అని వాడి సొద.
ఒకవేళ గూగ్ల్ క్రోం వాడి జీమెయిల్ ఉపయోగిస్తే, గూగుల్ వాడికి మన మెయిల్స్ లోని సమాచారం గోప్యంగా మరింత త్వరిత గతిన చేరే అవకాశాలు ఉంటాయి.
గూగుల్ నేడు ఆండ్రాయిడ్ ను పోషిస్తోంది - ముబైల్ రంగంలో అద్దే అగ్రగామి.
క్రోం - మనకు తెలీకుండానే ఎందరమో దీనినే అప్రమేయ విహారిణిగా వాడుతున్నాము.
జాలశోధన, యూట్యూబ్,మెయిల్స్, డాక్స్ (డ్రైవ్) - ఇవీ మనమంతా వాడేస్తున్నాం, ఆయా విషయాలలో అవే అగ్రగామిలూను.
అందాకా బాగుంది. ఇవి అత్యంత ప్రజాదరణ పొందాక ఏమవుతుంది?
ఏమవుతుందీ, గూగుల్ సరుకు తప్ప ఇతరత్రా మన కళ్ళకు కనిపించవు.
మైక్రోసాఫ్ట్ మార్కెట్ లో ఉన్నపుడు ఎందరో కొందరికి రెడ్ హ్యాట్, ఫెడోరా, డీబియన్, ఉబుంటూ, యాపిల్, సొలారిస్ ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలుసు. పని వద్దో కాలేజీలోనో వాడే వారు కూడా.
కానీ ఆండ్రాయిడ్ కు ప్రత్యామ్నాయం సయనోజెన్ మాడ్, ఫైర్ఫాక్స్ఓఎస్ మొ॥ ఉన్నవని ఈనాడు చాలా మందికి తెలీదు.
క్రోం స్థానే ఫైర్ఫాక్సును వాడటానికి జనాలు సుముఖత చూపలేకపోతున్నారు. క్రోం కన్నా ఫైర్ఫాక్స్ వేగవంతం, పైగా అంతర్జాల వాడుక లేనప్పుడు ఫైర్ఫాక్స్ జాలంతో సంపర్కం చెయ్యదు.  ఈ విషయం కనిపెట్టాలంటే ఒక నెల పొర్తిగా క్రోం ని, ఒక నెల పూర్తిగా ఫైర్ఫాక్సునే వాడి ఇంటర్నెట్ వాడకంలో తేడాలు గమనించండి. కేవలం జీమెయిల్, గూగుల్ సెర్చ్ మొ॥ గూగుల్ సరుకు కొంత వేగవంతంగా క్రోం లో ఆడినట్టు మనకు భ్రమ కలుగుతుంది. నిజానికి అలా జరుగదు.
ఇక జాలశోధన సమయంలో మన వ్యక్తిత్వానికి మన శోధనలను ముడిపెట్టే  గూగుల్ శోధన చాలా అసహ్యమయిన చర్యలను మన శోధనాధారంగా చేస్తోంది - అవి మనకు తెలీవు.
డక్‍డక్‍గో లాంటి శోధనయంత్రాలు మన శోధన ను పసిగట్టవు, మనకు ఇబ్బందులూ చేపట్టవు.
యూట్యూబ్ వల్ల జరిగే మేలు కన్నా నష్టమే ఎక్కువని ఈ మధ్యనే చూసాము కూడా. కొన్ని కంపెనీలు పైరసీ విరుద్ధ చట్టాలు రూపొందించి త్యాగయ్య కృతులనే కాపీరైటులో చూపిన వైనం ఈ అంధ్య పెద్ద దుమారమే రేపింది.
డాక్స్, లేదా డ్రైవ్ కి ప్రత్యామ్నాయంగా ఎన్నో సేవలు జాలంలో కలవు, జోహో అనే భారతీయ కంపెనీ కూడా గూగుల్ డాక్స్ లా వర్డ్, స్ప్రెడ్ షీట్, ప్రెజెంటేషన్ ఆన్లైనులో చేసుకునే సేవలను అందిస్తుంది.
మన నుండి ఎంత తక్కువ అయితే అంత తక్కువ సమాచారం జాలంలోకి చేరేలా జాగ్రత్త తీసుకోవాలి, లేదా మీరు ఎవరూ లేని సమయంలో వ్యక్తిగతంగా ఏవో కొన్ని వీడియోలు యూట్యూబులో చూసారు, అందరి ముందు, ఏదో కాన్ఫరెన్సులో ఏదో వీడియో యూట్యూబులో చూపించాల్సి వచ్చింది, ఆ వీడియో అయిపోయిన వెంటనే సజెస్టెడ్ వీడియోస్ అంటూ అంతకు ముందు మీరు చూసిన వీడియో కు సంబంధించిన మరిన్ని నలుగురు ముందూ యూట్యూబ్ చూపెట్టింది - ఇది అసలు ఊహించగలమా?
అలానే ఏదో  వివాదాస్పద జాలస్థలి (వెబ్సైట్) ఉంది. మీరు స్నేహితుల ముందు సెర్చ్ చేసారు, ఫలానా జాలస్థలిని మీరు ఫలానా తేదీన చూసారని వస్తుంది - ఎంత ఇబ్బంది?
ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి, వినియోగదారుడికి మరింత మెఱుగైన సేవలు అనే నెపంతో ఆయా జాలస్థల సేవలు అనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను చాలా వరకూ మన వద్ద నుండి రాబట్టి దుర్వినియోగం చేస్తున్నాయి. మన వ్యక్తిగతత్త్వాన్ని మనమే వారికి ఇవ్వాళ చేరవేసి రేపు బాధపడే సందర్భాలను కావాలనే ఏర్పరుచుకుంటున్నాము.
దీనికి స్వస్తీ పలకాలంటే అలాంటి శోషణకు స్థానంలేని సేవలను ఉపయోగించవచ్చు.
ఇవ్వాళ ఆఫ్లైనులో గూగుల్ డాక్స్ వాడాలంటే క్రోం లోనే సాధ్యం ఐ గూగుల్ వాడు ప్రకటించాడంటే దానర్ధం, ఆఫ్లైన్ ద్వారా క్రోం ని మన మొత్తం కంప్యూటర్ లోకి జొరబడే అవకాశాన్ని మన ద్వారానే ఇప్పించాలని చూడటం, ఇక దీని పర్యవసానం జనాల ఆలోచనలకే వదిలివేస్తున్నాను.
ఆండ్రాయిడ్ ద్వారా ఎన్నో కంపెనీలను నిబంధనలు మార్చి వాడుకరుల సమాచారం రాబట్టే ప్ప్రయత్నం గూగుల్ పెద్ద యెత్తునే చేబడుతోంది కూడా.
మరి దీనిని ఎలా ప్రతిఘటించడం?
ప్రత్యామ్నాయాలను వాడడం ద్వారా!
గూగుల్ క్రోం ను వాడడం మానేయడం! మీ స్నేహితుల ద్వారా మానిపించడం.
లేదా గ్గూగుల్ విజృంభణలో అందరూ బలి కావాల్సిందే!
ఫైర్ఫాక్సును వాడండి. గూగులు, మైక్రోసాఫ్ట్, యాపిల్ లా కాకుండా ఫైర్ఫాక్స్ కేవలం ఔత్సాహికుల ద్వారా ఏనాటికానాడు మెరుగు పరచబడుతుంది కూడా. అందరికీ జాలం అన్న నినాదంతో ముందుకు వెళుతున్న మొజిల్లా ఫైర్ఫాక్స్ మన భారతీయతను ఆదర్శంగా తీసుకుంది కూడా.
వేరే ఏ బడా కంపెనీలు మనల్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నా, మొజిల్లా మాత్రం అందుకు చాలా దూరం :)

Wednesday, July 17, 2013

పసిఫిక్ రిమ్ అనబడే ఓ ఆంగ్ల చిత్రరాజము

బ్లాగ్మిత్రుల ప్రోద్బలంతో వారి సహవాసంలో, మామూలుగా థియెటర్ కి వెళ్ళి సినిమాలు చూడని నేను, బెంగుళూరులోని బెల్లందూరు సెంట్రల్ లో ఈ సినిమా చూడటం జరిగింది. 3D సినిమా అనుకొని వెళితే ఆ హాలువాడు అటూ ఇటూ కత్తిరించి తెరలో మూడులో రెండితల తెరపైనే సినిమాను నడిపాడు. చిన్న తెర, పైగా అటూఇటూ కత్తిరించేసి, ఓ పెద్ద సైజు 40" స్క్రీనున్న హోం థియేటర్ లో సినిమా చూసిన ఫీల్ వ్వచ్చింది. ఇక ఆ థియేటర్ లోని ఇతర సదుపాయాలు పరమ చెత్తగా ఉన్న విషయం గుర్తుంచుకోవాలి. సినిమా తెరల ప్రాంగణంలో ఒక పెద్ద కొలాజ్ ఏర్పాటు చేసాడు. అది అందరు సినీ తారలను పెట్టాలని చేసాడో, లేక ఆ హాలులో ఆడిన సినిమాల నటీ నటూల ఫుటోలో తెలీదు కానీ, ఫుటోల ఎంపికలో చాలా లోటు ఉంది, మా అన్నయ్య తన అభిమాన నటుడి ఫుటో కోసం ఓ నాలుగు మార్లు అన్ని ఫుటోలు పరికించి లేడని నిర్ధారించుకున్నాక ఆ నటుడు వీరెవరికీ సాటి రాడు, అందుకని వీరి మధ్య అతనికి స్థానం అనవసరమని సంతృప్తి పడ్డాడు. థియేటర్ వాడి మరో పొదుపు చిట్కా మధ్యమధ్యలో ఏసీ ఆపివేయటం మాత్రం నాకూరికే ఉక్కపోసేలా చేసింది. ఇక సినిమా కథలోకి వస్తే, కైజూలనబడే గ్రహాంతరవాసులు సమీప భవిష్యత్తు(అంటే 2017 ప్రాంతంలో) పసిఫిక్ సముద్రం అడుగులోని మహాద్వీపాంతర భూతల పొరలనుండి పైకి వచ్చి తీరనగరాలను నాశనం చేస్తాయి. నాశనం అంటే అలా ఇలా కాదు; ఏకంగా శాన్‍ఫ్రాన్సిస్కో లోని వంతెనని కూల్చివేయడం లక్షల మంది జనాభాను చంపేయటం వగైరా. ఈ తెలీని వింత జంతువులను కట్టడి చేసి మట్టుబెట్టేందుకు భారీ స్థాయిలో యేగర్ అనే మహామఱమానవులని నిర్మించి, వాటిని నియంత్రించేందుకు ఇద్దరు మనుషులను పైలట్లుగా ఉంచి, వారి మెదడుల్లోని ఆలోచనలను ఒకరిది మరొకరితో మిళితం చేసి ఆ వచ్చిన మహా మస్తిష్క శక్తి ద్వారా ఈ యేగర్లను నడుపుతారు. (ఒంటరి పైలట్ తో చేసిన పరిశోధనలలో ఒక మనిషి మెదడు తట్టుకోలేక పోతే, ఆ యేగర్ యంత్రం కుడి భాగం ఒకరు, ఎడమ భాగం ఒకరు నియంత్రించేలా అదే సమయంలో ఒకరి ఆలోచనలు మరొకరు అన్వయించుకునేలా సిద్ధం చేస్తారు శాస్త్రజ్ఞులు). మొదట్లో కైజూలు ఒక మోస్తరుగా పుష్కరానికి ఒకటి చ్ప్పున, తర్వాత్తర్వాత మరింత తక్కువ వ్యవధిలో దాడులు చేయటం మొదలు పెడతాయి. ఈ యేగర్లు కూడా మొదట్లో కైజూలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నా, తర్వాత్తర్వాత కైజూలు యేగర్ల దాడులకి తగ్గట్టూ సిద్ధమయి రావటం మొదలుపెడతాయి. దాంతో ప్రపంచ నాయకుల సమాఖ్య యేగర్లను రద్దు చేసి తీరాల్లో గోడలు కట్టడం మొదలుపెట్టడానికి మొగ్గు చూపుతుంది. ఆ గోడల నిర్మాణం అయ్యే వరకూ రక్షణగా మిగిలిన నాలుగు యేగర్లను నియమిస్తారు. కానీ ఆ నాలుగిటినీ నడిపేందుకు సమర్ధమయిన వారు లెక్కకు సరిపోరు. దీంతో యేగర్ల కూతగాడు(కమాండర్) స్టాకర్ పెంటకోస్ట్ ఒక ప్లాన్ ను రూపొందించి అణుశక్తితో కైజూలను చంపాలని పథకమేస్తాడు. కొన్నేళ్ళ క్రితం కైజూను మట్టుపెడుతూ యేగర్ ను నడుపుతున్న వారిలో ఒకడయిన రాలీ బెకెట్ ను ఆశ్రయిస్తాడు పెంటెకోస్ట్. అదే పోరులో తన అన్నను పోగొట్టుకుని అతని ఆలోచనల సంఘర్షణలో యేగర్ ప్రాజెక్ట్ ను వదిలి గోడ కడుతున్న సిబ్బందిలో మామూలు కూలీగా ఉన్న రాలీ పెంటేకోస్ట్ అభ్యర్థన మేరకు తిరిగి వచ్చేందుకు, యేగర్ ను నడిపేందుకు ఒప్పుకుంటాడు. హాంగ్ కాంగ్ వద్ద ఉన్న గోడ కట్టే ప్రదేశం, పక్కనే ఉన్న యేగర్ల ప్రయోగశాలకు వెళతారు. అక్కడ మాకో మొరి అనే అమ్మాయి రాలీకి తారసపడుతుంది. ఆవిడని తన పక్కన యేగర్ కోపైలట్ గా ఎంచుకుంటాడు రాలీ. వీరిద్దరూ యేగర్ లోకి ప్రవేశించినప్పుడు ఆమె ఆలోచనలలో మిళితమయినపుడు ఆమె గతం గురించి తెలుసుకుని, ఆమె పెంటెకోస్ట్ పెంచుకున్నామె అని తెలుసుకుంటాడు. రెట్టించిన ఉత్సాహంతో యేగర్లను తుదముట్టించేందుకు సిద్ధమవుతాడు. అదే సమయంలో కైజూలపై పరిశోధన చేస్తున్న ఇద్దరు వైజ్ఞానికులు తమ పరిశోధన ఫలితాలను తెలిపి విస్తుపోతారు. న్యూటన్ గిజ్లర్ ఒక న్యూరోశాస్త్రజ్ఞుడు తన మెదడులోని ఆలోచనలను యేగర్లో జరిగే పద్ధతిలో కైజూమెదడుకి అనుసంధానం చేస్తాడు తద్వారా కైజూలను తుదముట్టించే ఉపాయం ఇస్తాడు. మొత్తానికి పెంటెకోస్ట్ ప్రాణార్పణ, రాలీ మికోల యేగర్ లోని అణు బాంబుతో శత్రు కైజూ స్థావరాన్ని పూర్తిగా నాశనం చేసి వీరిద్దరూ బయట పడటంతో సినిమా సుఖాంతమవుతుంది. అయితే ఎంతటి సాంకేతిక కల్పనయినా సాంకేతిక పరిమితులను 70లలోకి తీసుకుపోయి చూపించడం నాకు నచ్చలేదు. రాబోయే రోజుల్లో సాంకేతికంగా ఆయుధాలు సినిమాలో చూపించిన దానికంటే ఎన్నో రెట్లు మెరుగ్గా, మానవరహితంగా తయారవుతాయని ఇట్టే ఊహించొచ్చు. మొత్తం మీద బావుంది!

Thursday, January 19, 2012

క్యూఆర్ కోడ్


క్యూఆర్ కోడ్ అనేది క్విక్ రెస్పాన్స్ కోడ్ కు సంక్షిప్త రూపం. ఇది ఒక 2-డైమెన్షనల్ మ్యాట్రిక్స్ బార్ కోడ్. మొట్టమొదట ఆటోముబైల్ ఇండస్ట్రీ కోసం కనుగొన్నారు. ఎక్కువ పదాలను ఒక చిన్న బొమ్మ రూపంలో పొందుపరచటం మరియు త్వరిత పఠనీయతవల్ల ఈ టెక్నిక్ బాగా ప్రాచుర్యం పొందింది. తెలుపు బ్యాగ్రౌండ్ లో నలుపు రంగు చతురస్రాలతో ఒక సందేశాన్ని గూఢంగా ఉంచడమే ఈ టెక్నిక్. అంకెలు, అక్షరాలు+అంకెలు, బైట్/బైనరీ మరియు కంజి(జపానీయుల లిపి) -- ఈ నాలుగు రకాల సందేశాలను క్యూఆర్ కోడ్ ద్వారా భద్ర పరచవచ్చు. టొయోటా అనుబంధ సంస్థ అయిన డెన్సో 1994 లో వాహనాల తయారీని అంచనా వేసేందుకు బార్ కోడ్ యొక్క 2 డైమెన్షన్ రూపాన్ని వాడారు. అతి వేగంగా ఎన్కోడ్(గూఢీకరణ) మరియు డీకోడ్(నిగూఢీకరణ) అయ్యే విధంగా ఈ కోడ్ ను రూపొందించారు. అమెరికా, కెనడా మరియు హాంగ్‍కాంగ్ లలో క్యూఆర్ కోడ్ వాడుక అధికంగా ఉంది.

qrcode
నా పేరు బ్లాగు పేరు, నా ఫోన్ నంబర్, ఈ మెయిల్ ను పొందుపరిచిన క్యూఆర్ కోడ్

పై బొమ్మలో చూపిన విధంగా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇదివరకే ఈ తరహా కోడ్ ను మీరు పత్రికల్లో, బిజినెస్ కార్డ్లపై ఇంకా మరెన్నో చోట్ల చూసే వుంటారు. ఈ క్యూఆర్ కోడ్ లో ఉన్న సమాచారాన్ని ఫోన్ ద్వారా స్కాన్ చేసి అప్పటికప్పుడే ఏం రాసుందో తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వంటి స్మార్ట్ ఫోన్లలో ఈ కోడ్ ను ఇట్టే చదవవచ్చు.
మీ పేరు లేదా ఏదయినా సమాచారాన్ని ఇప్పుడే క్యూఆర్ కోడ్ గా మార్చండి. http://qrcode.kaywa.com/ కు వెళ్ళి మీ సొంత క్యూఆర్ కోడ్ ను పొందండి.

Tuesday, October 5, 2010

కొత్తవారికి లినక్స్ పంపకం

ఇదివరకే  లినక్స్ పంపకాల గురించి ఇక్కడ చర్చ జరిగింది చూడగలరు.
అయితే విండోస్ కంటే ఎన్నో రెట్లు మేలయినదని అనుకుంటున్నాం కదా లినక్స్ ను
అందుకని లినక్స్ కు మారదామా అంటే ఒక పెద్ద చిక్కుప్రశ్న ఏపంపకం వాడాలి అని
పక్కింటి శ్రీను డెబియన్ ది బెస్ట్ అంటాడు ఎదురింటి రాజు ఫెడోరా బెటర్ దాన్ ది బెస్ట్ అంటాడు ,
ఇక మన హేచోడీ లేదా ప్రొఫెసర్ ఆయన వాడిన రెడ్ హ్యాట్ మాత్రమే ఒక అసలైన పంపకమనీ
మిగతావి వేస్ట్ అని కొట్టిపారేస్తాడు.
అయితే లినక్స్ వాడే వారికి అన్నిరకాల వేసులుబాట్లూ ఉంటాయి.
ఇన్ని చాయిస్లు ఉన్నయ్యంటే అది ఎంత బెస్ట్ అన్నది మీరే చెప్పగలరు
ఆ మధ్య ఒక టపాలో ఎవరో ఫ్రీ సాఫ్ట్వేర్ అంటున్నారు జీవితం లో అన్ని ఫ్రీగా రావు కదా అని
ఆయనకు ఈ టపా ఎలాగోలా చేరాలి ఆయన దీన్ని చదవాలి
ఆంగ్లం చాలా చిన్ని భాష, వారి దేశం ఎంత చిన్నదో బ్రిటీష్ వారి భాష కూడా అంటే చిన్నది
వారికి ఎక్కువ పదాలు లేవు
మనం స్వాతంత్ర్యం అన్నా, స్వేచ్ఛ అన్నా, ఉచితం అన్నా
ఈ మూడింటికీ వారి దగ్గర ఒక ఫ్రీ అన్న పదమే ఉంది
(ఇంకా చెప్పాలంటే మాకు ఒక ౬ పేజీల పాఠం హిందీ ౮వ తరగతిలో ఉంది అందులో కూడా ఇండెపెండెన్స్ డే అంటే  అపరతంత్ర దినోత్సవం అన్న అర్థం వస్తుంది కానీ మనం స్వాతంత్ర్యదినోత్సవం అంటాం అంటూ ఆరు పేజీల సుత్తి)
చెప్పొచ్చేదేమిటంటే ఫ్రీ అంటే అర్థం ఉచితం కాదు తండ్రీ, ఫ్రీ అంటే స్వేచ్ఛ


అయితే నా స్వంత పూచీ మీద మీరు ఉబుంటు ని కళ్ళు మూస్కుని సారీ కళ్ళు తెరిసే అనుసంధానం చేసేస్కోండి
ఒక వేల మీరు పూణే వాసులైతే నేనే మీ వద్దకొచ్చి ఉచిత(ఫ్రీ)ముగా చేసి పెడతాను
ఉబుంటు డెబియన్ ఆధారిత పంపకం
మనం గమనించాల్సిన విషయాలు ఏమిటంటే
ప్రతీ పంపకానికి కొన్ని ప్యాకేజేస్ ఉంటాయి
అవి ఎప్పుడెప్పుడు అప్డేట్ అవుతున్నాయి
వాడుకరులు ఎంతమంది ఉన్నారు వీరిలో ఎంతమంది అంతర్జాలంలో సహాయం చేస్తున్నారు
మనకు కావాల్సిన సాఫ్ట్వేర్లు ఆ పంపకంలో ఉన్నాయా
ఇవన్నీ ముందు తెలుసుకోండి
ఇక పొతే నా సలహా ఏమిటంటే ఒక వేల మీ వద్ద అంతర్జాలం అనుసంధానించి ఉంటే ఉబుంటు మేలు
లేదా డెబియన్ బావుంటుంది.
ఉబుంటూ లో మీరు కావాల్సిన అన్ని ప్యాకేజ్లను డౌన్లోడ్ చేస్కొని మీ డెస్క్టాప్ తో ఎన్నో చెయ్యవచ్చు
తెలుగు స్థానికీకరణ కూడా ఉబుంటు లో బాగుంటుంది
నేను ప్రస్తుతం 9.10 వాడుతున్నాను
ప్రతి ఏడు ఏప్రిల్ మరియూ అక్టోబర్లలో కొత్త వెర్షన్ వస్తుంది
ప్రస్తుతం 10.04 చలామణి లో ఉంది
ఇవాలో రేపో 10.10 రాబోతోంది
అయితే చాలా మంది 10.04 లో కొన్ని అవగుణాలున్నాయని చెప్పారు
సో 9.10 లో నాకేమి గ్లిచెస్ కనపడలేదు
మీరూ అదే వాడండీ !!!!

Tuesday, September 21, 2010

గ్నూ/లినక్స్ పరిచయం

గ్నూ/ లినక్స్ గురించి :-(ఇందులో చాలా సాంకేతిక పదాలను తెలుగులోనే వాడాను వాటిని కింద వాటి మూల పదాలతో సహా జాబితా ఒకటి కింద ఇచ్చాను ఏమైనా మార్పులు ఉంటే దయచేసి కామెంట్ గా ఇవ్వండి)

మనం ప్రస్తుతం విస్తృతంగా వాడుతున్న సంగణక యంత్రం గురించి చాలా తక్కువ తెలుసు మనకి.
ఈ యంత్రం కనిపెట్ట బడిన తొలినాళ్ళలో దీని ఆకారం చాలా పెద్దదిగా ఉండెడిది. ఎంత పెద్దది అంటే ఒక మొత్తం గదిని నింపేంత.
ఈ సంగణక యంత్రం లో మనకు బాహ్యంగా కనిపించే కఠినాంత్రం మరియు దానిని సక్రమంగా పని చేయించే కోమలాంత్రమూ ఉంటాయి.
కోమలాంత్రము అనేది మనకు కనబడదు.
అయితే తొలి రోజుల్లో సంగణకాన్ని నడిపే కోమలాంత్రంయొక్క మూలసంజ్ఞావళి బాహ్యంగా ఉండేవి.
కోమలాంత్రాన్ని అందరూ తమకు నచ్చినట్టుగా అనుసంధానం చేస్కునే వారు(మూలసంజ్ఞావళిని మార్పిడి చెయ్యటం ద్వారా).
కానీ 6౦ వ దశకం రాగానే , సార్థవాహకాలు (స్వార్థవాహక???) కొన్ని, కోమలాంత్రం యొక్క మూలసంజ్ఞావళిని వాడుకరికి గోప్యంగా ఉంచటం మొదలెట్టాయి. దీని వల్ల సార్థవాహక సార్తవాహకాలకు బోల్లెడు ప్రయోజనాలు కానీ, ఎటొచ్చీ ఒక వాడుకరి ఆ కోమలాంత్రపు లోలోపల గల మూలసంజ్ఞావళిని పరిశీలించడం, మార్చడం కుదురేవి కావు.
అందువల్ల వాడుకరులు స్వేచ్ఛ కోల్పోయారనమాట.
అయితే ఇది ఒక ఇరవయ్యేళ్ళు అలాగే కొనసాగింది, సార్థవాహకాలు మరీ మితిమీరిపోయి అన్ని కోమలాంత్రాల్ని వాడుకరులకు, నిపుణులకు దూరం చేసాయి.
అయితే 8౦వ దశకం లో రిచార్డ్ మ్యాథ్యూ స్టాల్మాన్ అనే ఒక నిపుణుడు ఈ అరాచకత్వాన్ని ఎదిరిస్తూ
స్వేచ్ఛాపూరితకోమలాంత్ర ఉద్యమాన్ని మొదలెట్టారు.
తద్వారా అప్పట్లో పేరొందిన అత్యంత జనాదరణ పొందిన యూనిక్స్ కు వికల్పముగా కొన్ని కోమలాంత్రాలను తయారు చేసి వాటిని ఉచితంగా వాటి మూలసంజ్ఞావళి తో సహా పంచిపెట్టటం మొదలయింది - ఇది స్వేచ్ఛాపూరితకోమలాంత్రోద్యమానికి తొలి మెట్టు. అలా పుట్టిందేగ్నూ (ఆంగ్ల అక్షరాలైన G-N-U లతో తయరయింది, దాని విస్తార పదం - GNU=GNU Not Unix, ఇది ఒక ముహుర్పదము ఇందులో GNU పదే పదే పునరావృతమౌతుంది).
అలా గ్నూ కై చాలానే కోమలాంత్రాలు తయారు చేయబడ్డాయి, వాటిలో ముఖ్యమైనవి గ్నూ సి కంపైలర్(GCC), గ్నూ డిబగ్గర్(GDB), మొదలగునవి.
ఇక 9౦వ దశకం మొదల్లో లినస్ టొర్వాల్డ్స్ అనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి యూనిక్స్ యొక్క నుంగు ను అనుకరించి లినక్స్ అనే కొత్త నుంగును కనిపెట్టారు.
ఈ నుంగుపై జీ ఎన్ యూ ద్వారా ఉత్పత్తి చేసిన కోమలాంత్రాల్ని పేర్చి తయారైనదే మన గ్నూలినక్స్ నిర్వహణా వ్యవస్థ.
అందుకనే మనం ఈ నిర్వహణావ్యవస్థను గ్నూ/లినక్స్ నిర్వహణా వ్యవస్థ అనాలి. చాలా మంది లినక్స్ అని మాత్రమే సంబోధిస్తారు, ఇది చాలా తప్పు , లినక్స్ అనేది నుంగు మాత్రమే.
ఇక ఆ పై మొదలు ఇది అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండటంవలన(మూలశాసనపదాలతో సహా), ఎవరికి నచ్చినట్టూ వారు దీనిని మార్చుకోవచ్చు.
అందువలననే గ్నూ/లినక్స్ కు ఇన్ని రకాల పంపిణీలు ఉన్నాయి. రెడ్ హ్యాట్, ఫెడోరా, మాండ్రివా, ఉబుంటూ, ఓపెన్ సూసీ, డెబియన్, అచ్చంగా మన తెలుగులో తయారైన పంపిణీ-స్వేచ్ఛ. మున్నగువి ఇంకా చాలా చాలా ఉన్నయి.
ఈఎక్స్టీ-2, ఈక్ష్టీ-3 మరియు ఈ ఎక్స్టీ-4 అను విశిష్టమైన దస్త్ర వ్యవస్థ ను వాడటం వల్ల గ్నూ/లినక్స్ వాడుకర్లకు అసలు చాలా ఉపయోగాలున్నాయి.
ఇంకా ఇదే కాకుండా గ్నూ/లినక్స్ వాడుకర్లు, వారిలోనిపుణులు, కలిసి ఈ గ్నూ/లినక్స్ వ్యవస్థ కోసం చాలా కోమలాంత్రాలను రాసారు, రాస్తున్నారు, రాస్తారు కూడా.
మూలసంజ్ఞావళి (ఉచితంగా) అందుబాటులో ఉన్నందున స్థానికీకరణ కూడా చాలా సులువైంది.
తెలుగులోనే పూర్తి స్థాయి నిర్వహణా వ్యవస్థలు ఉన్నాయి.
ఉదాహరణకు: స్వేచ్ఛ, ఉబుంటు-తెలుగు, డెబియన్-తెలుగు మున్నగునవి.
మీరూ మీ వంతు సహాయాన్నీ అందిచవచ్చు. లాంచ్ప్యాడ్ వంటి ప్రదేశాలలో మీరు ఏ కార్యక్రమించడం తెలియకపోయినా స్థానికీకరణకు సహాయం చెయ్యొచ్చు, తద్వారా చాలా మేలు చేసిన వారవుతారు మన భాషకు.
అయితే ఈ టపా లో అర్జున్ గారు చెప్పినట్టు ఇంకా చాలా చెయ్యవలిసి ఉంది నిపుణులు, వాడుకర్లు ముందుకు వచ్చి మీ ప్రోత్సాహాన్ని అందిస్తే చాలా చెయ్యవచ్చు మనం.

'తెలుగుదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగువల్లభుండ, తెలుగొకండ, ఎల్లనృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స'

list of tech jargons in telugu:

  • సంగణక యంత్రం : Computer
  • కఠినాంత్రం : hardware
  • కోమలాంత్రము: Software
  • మూలసంజ్ఞావళి : source code
  • శాసనపదం : command
  • సార్థవాహకాలు (స్వార్థవాహక????): company
  • వాడుకరి : user
  • నిపుణుడు : developer
  • స్వేచ్ఛాపూరితకోమలాంత్ర ఉద్యమాన్ని : Free Software Movement
  • నుంగు : kernel
  • నిర్వహణా వ్యవస్థ : Operating System
  • పంపిణీ(used as a noun here) : Distro (Distribution)
  • దస్త్ర వ్యవస్థ : file సిస్టం
  • కార్యక్రమించడం : programming