Saturday, August 16, 2014

నేడే ఫైర్ఫాక్సుకు మారండి, లేదా భవిష్యత్తులో మీరు మిమ్మల్నే కోల్పోగలరు.

1990వ దశకంలో మైక్రోసాఫ్ట్, యాపిల్ ఆగడాలను చవి చూసాము. సాఫ్టువేరు రంగంలో అధిపత్య దాహంతో చిన్న కంపెనీలను ముందు కొంత లాభం చూపించి హస్తగతం చేసుకోటం, ఆపై సదరు కంపెనీ నుండి తీసుకున్న అమూల్యమైన సాఫ్టువేరు ఉత్పత్తిని నిరుపయోగం చేయడం.
ఇక 2000 మొదట్లో ఒక ప్రత్యామ్నాయంగా గూగుల్ వచ్చినప్పటికీ, అది కూడా మైక్రోసాఫ్ట్ బాటనే పట్టింది. అయితే మైక్రోసాఫ్ట్ సందర్భంలో ప్రత్యామ్నాయాలు తక్కువ, వాఅటి గురించి జనాలకు తెలిసే అవకాశాలూ తక్కువే. అందువలన మైక్రోసాఫ్ట్ పెద్ద మేధస్సును ఉపయోగించకుండానే నిలదొక్కుకోగలిగింది.
మైక్రోసాఫ్ట్ వాడి ఉత్పాదనలు, సాఫ్టువేర్లు, మనల్ని వాడి మీద ఆధారపడేలా చేస్తాయి. ఉదాహరణకి వైరస్ వచ్చే అవకాశం మైక్ర్రోసాఫ్ట్ సరుకులో చాలా ఎక్కువ. ఇన్నేళ్ళ అనుభవంలో ఏ ఇతర కంపెనీ అయినా ఆ వైరస్ ల బారిన పడకుండా తమ సరుకును మెఱుగు పరుస్తాయి. కానీ మైక్రోసాఫ్ట్ ఆ పని చెయ్యలేదు, సరి కదా, యాంటి వైరస్ కంపెనీల మార్కెట్ ను సృష్టించింది. ఫలానా వైరస్ ఉంది అని ఫిర్యాదు వస్తే ఫలానా యాంటి వైరస్ కొనుక్కో అని సమాధానం ఇచ్చేది. ఏ యాంటి వైరస్ సాఫ్టువేరూ వేసుకోకపోతే ప్రమాదం అని హెచ్చరించి, వాడికి లాభం చేకూర్చే యాంటివైరస్ కంపెనీలను సూచించేది.
ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, లోతుగా వెళితే ఇంకెన్నెన్నో.
గ్నూ/లినక్స్ విప్లవం వచ్చి స్వేచ్ఛా సాఫ్టువేర్ల వాడకం పెరిగినా ఇంకా ఎందరో మైక్రోసాఫ్ట్ ఉచ్చులో బంధీలుగానే ఉన్నారు.
ఇక యాపిల్ అయితే మరీ ఘోరం, మనకి నచ్చిన హార్డువేరు కొనుక్కునే సదుపాయం కూడా ఉండదే! ఏదయినా సాఫ్టువేరు ఉపకరణం ఆడించాలన్నా కాసులు విదల్చాల్సిందే!
గూగుల్ వాడు వీళ్ళకన్నా మేలేమో అనుకుంటే అదీ కాదాయె!
గూగుల్ వాడు చాలా తెలివయిన జిత్తునక్క వేషాలు కలవాడు.
మనకు తెలీకుండానే మన మెయిల్స్, ప్లస్ పోస్టులు, బ్లాగు పోస్టులు, చాట్ మెసేజులు, అన్నీ, ఇది పబ్లిక్, ఇది ప్రయివేట్ అనే వ్యత్యాసం లేకుండా అన్నిటినీ దాచుకుంటున్నాడు. వాటిని పలు విధాలుగా వాడుకుంటున్నాడు. మన బాహ్య-వెలుపల-గుప్త జీవితాల చిట్టా గూగుల్ వాడి చేతుల్లో ఉంది. ప్రభుత్వాలడిగితే ప్రభుత్వాలకి, డబ్బులు విసిరే బడా కంపెనీలకీ ఈ సమాచారం ఎటువంటి కరుణా లేకుండా నిర్దాక్షిణ్యంగా పంచిపెడుతున్నాడు. అది పొందిన గవర్నమెంటులు తమకు ముప్పు ఉన్న మనుషులను పట్టుకుని శిక్షిస్తున్నారు, ఇంటలిజెన్స్ రిపోర్టులు రూపొందిస్తున్నారు సరే! కానీ అదే సమయంలో ఎందరో వ్యక్తులను వ్యక్తిగత విషయాల గూర్చి హింసించి, శిక్షిస్తున్నారు - ఇది గమనార్హం. ఇక బడా కంపెనీల సంగతి సరేసరి. మనకు తెలీకుండానే మన మెయిల్స్ లో మెయిల్లోని పాఠ్యానికి సంబంధించిన వాణిజ్య ప్రకటన దర్శనమిస్తుంది. మన మెయిల్లోని సమాచారం (అది గూగుల్ వాడు చదువుతాడా లేదా అన్నది తరువాతి విషయం) చూసి, తగ్గ ఆడ్స్ వేసే ప్రోగ్రాములు గూగుల్ వాడి దగ్గర కోకొల్లలు.
ప్రస్తుతానికి చాలా మంది గూగుల్ వాడి ప్రోడక్ట్స్ అన్నీ వాడడం లేదు కాబట్టీ చాలా సమాచారం గూగుల్ వాడికి అందడం లేదు. అందుకనే పొద్దస్తమానమూ గూగుల్ క్రోం వాడు, యూట్యూబ్ వాడు, జీమెయిల్ వాడు అని వాడి సొద.
ఒకవేళ గూగ్ల్ క్రోం వాడి జీమెయిల్ ఉపయోగిస్తే, గూగుల్ వాడికి మన మెయిల్స్ లోని సమాచారం గోప్యంగా మరింత త్వరిత గతిన చేరే అవకాశాలు ఉంటాయి.
గూగుల్ నేడు ఆండ్రాయిడ్ ను పోషిస్తోంది - ముబైల్ రంగంలో అద్దే అగ్రగామి.
క్రోం - మనకు తెలీకుండానే ఎందరమో దీనినే అప్రమేయ విహారిణిగా వాడుతున్నాము.
జాలశోధన, యూట్యూబ్,మెయిల్స్, డాక్స్ (డ్రైవ్) - ఇవీ మనమంతా వాడేస్తున్నాం, ఆయా విషయాలలో అవే అగ్రగామిలూను.
అందాకా బాగుంది. ఇవి అత్యంత ప్రజాదరణ పొందాక ఏమవుతుంది?
ఏమవుతుందీ, గూగుల్ సరుకు తప్ప ఇతరత్రా మన కళ్ళకు కనిపించవు.
మైక్రోసాఫ్ట్ మార్కెట్ లో ఉన్నపుడు ఎందరో కొందరికి రెడ్ హ్యాట్, ఫెడోరా, డీబియన్, ఉబుంటూ, యాపిల్, సొలారిస్ ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలుసు. పని వద్దో కాలేజీలోనో వాడే వారు కూడా.
కానీ ఆండ్రాయిడ్ కు ప్రత్యామ్నాయం సయనోజెన్ మాడ్, ఫైర్ఫాక్స్ఓఎస్ మొ॥ ఉన్నవని ఈనాడు చాలా మందికి తెలీదు.
క్రోం స్థానే ఫైర్ఫాక్సును వాడటానికి జనాలు సుముఖత చూపలేకపోతున్నారు. క్రోం కన్నా ఫైర్ఫాక్స్ వేగవంతం, పైగా అంతర్జాల వాడుక లేనప్పుడు ఫైర్ఫాక్స్ జాలంతో సంపర్కం చెయ్యదు.  ఈ విషయం కనిపెట్టాలంటే ఒక నెల పొర్తిగా క్రోం ని, ఒక నెల పూర్తిగా ఫైర్ఫాక్సునే వాడి ఇంటర్నెట్ వాడకంలో తేడాలు గమనించండి. కేవలం జీమెయిల్, గూగుల్ సెర్చ్ మొ॥ గూగుల్ సరుకు కొంత వేగవంతంగా క్రోం లో ఆడినట్టు మనకు భ్రమ కలుగుతుంది. నిజానికి అలా జరుగదు.
ఇక జాలశోధన సమయంలో మన వ్యక్తిత్వానికి మన శోధనలను ముడిపెట్టే  గూగుల్ శోధన చాలా అసహ్యమయిన చర్యలను మన శోధనాధారంగా చేస్తోంది - అవి మనకు తెలీవు.
డక్‍డక్‍గో లాంటి శోధనయంత్రాలు మన శోధన ను పసిగట్టవు, మనకు ఇబ్బందులూ చేపట్టవు.
యూట్యూబ్ వల్ల జరిగే మేలు కన్నా నష్టమే ఎక్కువని ఈ మధ్యనే చూసాము కూడా. కొన్ని కంపెనీలు పైరసీ విరుద్ధ చట్టాలు రూపొందించి త్యాగయ్య కృతులనే కాపీరైటులో చూపిన వైనం ఈ అంధ్య పెద్ద దుమారమే రేపింది.
డాక్స్, లేదా డ్రైవ్ కి ప్రత్యామ్నాయంగా ఎన్నో సేవలు జాలంలో కలవు, జోహో అనే భారతీయ కంపెనీ కూడా గూగుల్ డాక్స్ లా వర్డ్, స్ప్రెడ్ షీట్, ప్రెజెంటేషన్ ఆన్లైనులో చేసుకునే సేవలను అందిస్తుంది.
మన నుండి ఎంత తక్కువ అయితే అంత తక్కువ సమాచారం జాలంలోకి చేరేలా జాగ్రత్త తీసుకోవాలి, లేదా మీరు ఎవరూ లేని సమయంలో వ్యక్తిగతంగా ఏవో కొన్ని వీడియోలు యూట్యూబులో చూసారు, అందరి ముందు, ఏదో కాన్ఫరెన్సులో ఏదో వీడియో యూట్యూబులో చూపించాల్సి వచ్చింది, ఆ వీడియో అయిపోయిన వెంటనే సజెస్టెడ్ వీడియోస్ అంటూ అంతకు ముందు మీరు చూసిన వీడియో కు సంబంధించిన మరిన్ని నలుగురు ముందూ యూట్యూబ్ చూపెట్టింది - ఇది అసలు ఊహించగలమా?
అలానే ఏదో  వివాదాస్పద జాలస్థలి (వెబ్సైట్) ఉంది. మీరు స్నేహితుల ముందు సెర్చ్ చేసారు, ఫలానా జాలస్థలిని మీరు ఫలానా తేదీన చూసారని వస్తుంది - ఎంత ఇబ్బంది?
ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి, వినియోగదారుడికి మరింత మెఱుగైన సేవలు అనే నెపంతో ఆయా జాలస్థల సేవలు అనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను చాలా వరకూ మన వద్ద నుండి రాబట్టి దుర్వినియోగం చేస్తున్నాయి. మన వ్యక్తిగతత్త్వాన్ని మనమే వారికి ఇవ్వాళ చేరవేసి రేపు బాధపడే సందర్భాలను కావాలనే ఏర్పరుచుకుంటున్నాము.
దీనికి స్వస్తీ పలకాలంటే అలాంటి శోషణకు స్థానంలేని సేవలను ఉపయోగించవచ్చు.
ఇవ్వాళ ఆఫ్లైనులో గూగుల్ డాక్స్ వాడాలంటే క్రోం లోనే సాధ్యం ఐ గూగుల్ వాడు ప్రకటించాడంటే దానర్ధం, ఆఫ్లైన్ ద్వారా క్రోం ని మన మొత్తం కంప్యూటర్ లోకి జొరబడే అవకాశాన్ని మన ద్వారానే ఇప్పించాలని చూడటం, ఇక దీని పర్యవసానం జనాల ఆలోచనలకే వదిలివేస్తున్నాను.
ఆండ్రాయిడ్ ద్వారా ఎన్నో కంపెనీలను నిబంధనలు మార్చి వాడుకరుల సమాచారం రాబట్టే ప్ప్రయత్నం గూగుల్ పెద్ద యెత్తునే చేబడుతోంది కూడా.
మరి దీనిని ఎలా ప్రతిఘటించడం?
ప్రత్యామ్నాయాలను వాడడం ద్వారా!
గూగుల్ క్రోం ను వాడడం మానేయడం! మీ స్నేహితుల ద్వారా మానిపించడం.
లేదా గ్గూగుల్ విజృంభణలో అందరూ బలి కావాల్సిందే!
ఫైర్ఫాక్సును వాడండి. గూగులు, మైక్రోసాఫ్ట్, యాపిల్ లా కాకుండా ఫైర్ఫాక్స్ కేవలం ఔత్సాహికుల ద్వారా ఏనాటికానాడు మెరుగు పరచబడుతుంది కూడా. అందరికీ జాలం అన్న నినాదంతో ముందుకు వెళుతున్న మొజిల్లా ఫైర్ఫాక్స్ మన భారతీయతను ఆదర్శంగా తీసుకుంది కూడా.
వేరే ఏ బడా కంపెనీలు మనల్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నా, మొజిల్లా మాత్రం అందుకు చాలా దూరం :)

1 comment:

  1. మీరు ఇంతగా, విడమర్చి చెప్పినా, సామాన్య సాంకేతిక వినియోగదారుడికి అర్థం అయ్యేలా మాత్రం చెప్పలేదు. ఇ-తెలుగు, తెలుగువికీపీడియా లాంటి సంస్థలు పెద్ద ఎత్తున - సదస్సు, అవగాహ నా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగాలి. మనకి విష్ణువర్థన్ గారి సంస్థ - అంతర్జాల సంస్థ ద్వారా ఉచిత సభలు నిర్వహించాలి. చేసి చూపించాలి. అప్పుడు కొంచెం అవగాహన రావచ్చు. కొంపెల్ల శర్మ - తెలుగురథం.

    ReplyDelete