Showing posts with label తెలుగు లినక్స్. Show all posts
Showing posts with label తెలుగు లినక్స్. Show all posts

Saturday, August 16, 2014

నేడే ఫైర్ఫాక్సుకు మారండి, లేదా భవిష్యత్తులో మీరు మిమ్మల్నే కోల్పోగలరు.

1990వ దశకంలో మైక్రోసాఫ్ట్, యాపిల్ ఆగడాలను చవి చూసాము. సాఫ్టువేరు రంగంలో అధిపత్య దాహంతో చిన్న కంపెనీలను ముందు కొంత లాభం చూపించి హస్తగతం చేసుకోటం, ఆపై సదరు కంపెనీ నుండి తీసుకున్న అమూల్యమైన సాఫ్టువేరు ఉత్పత్తిని నిరుపయోగం చేయడం.
ఇక 2000 మొదట్లో ఒక ప్రత్యామ్నాయంగా గూగుల్ వచ్చినప్పటికీ, అది కూడా మైక్రోసాఫ్ట్ బాటనే పట్టింది. అయితే మైక్రోసాఫ్ట్ సందర్భంలో ప్రత్యామ్నాయాలు తక్కువ, వాఅటి గురించి జనాలకు తెలిసే అవకాశాలూ తక్కువే. అందువలన మైక్రోసాఫ్ట్ పెద్ద మేధస్సును ఉపయోగించకుండానే నిలదొక్కుకోగలిగింది.
మైక్రోసాఫ్ట్ వాడి ఉత్పాదనలు, సాఫ్టువేర్లు, మనల్ని వాడి మీద ఆధారపడేలా చేస్తాయి. ఉదాహరణకి వైరస్ వచ్చే అవకాశం మైక్ర్రోసాఫ్ట్ సరుకులో చాలా ఎక్కువ. ఇన్నేళ్ళ అనుభవంలో ఏ ఇతర కంపెనీ అయినా ఆ వైరస్ ల బారిన పడకుండా తమ సరుకును మెఱుగు పరుస్తాయి. కానీ మైక్రోసాఫ్ట్ ఆ పని చెయ్యలేదు, సరి కదా, యాంటి వైరస్ కంపెనీల మార్కెట్ ను సృష్టించింది. ఫలానా వైరస్ ఉంది అని ఫిర్యాదు వస్తే ఫలానా యాంటి వైరస్ కొనుక్కో అని సమాధానం ఇచ్చేది. ఏ యాంటి వైరస్ సాఫ్టువేరూ వేసుకోకపోతే ప్రమాదం అని హెచ్చరించి, వాడికి లాభం చేకూర్చే యాంటివైరస్ కంపెనీలను సూచించేది.
ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, లోతుగా వెళితే ఇంకెన్నెన్నో.
గ్నూ/లినక్స్ విప్లవం వచ్చి స్వేచ్ఛా సాఫ్టువేర్ల వాడకం పెరిగినా ఇంకా ఎందరో మైక్రోసాఫ్ట్ ఉచ్చులో బంధీలుగానే ఉన్నారు.
ఇక యాపిల్ అయితే మరీ ఘోరం, మనకి నచ్చిన హార్డువేరు కొనుక్కునే సదుపాయం కూడా ఉండదే! ఏదయినా సాఫ్టువేరు ఉపకరణం ఆడించాలన్నా కాసులు విదల్చాల్సిందే!
గూగుల్ వాడు వీళ్ళకన్నా మేలేమో అనుకుంటే అదీ కాదాయె!
గూగుల్ వాడు చాలా తెలివయిన జిత్తునక్క వేషాలు కలవాడు.
మనకు తెలీకుండానే మన మెయిల్స్, ప్లస్ పోస్టులు, బ్లాగు పోస్టులు, చాట్ మెసేజులు, అన్నీ, ఇది పబ్లిక్, ఇది ప్రయివేట్ అనే వ్యత్యాసం లేకుండా అన్నిటినీ దాచుకుంటున్నాడు. వాటిని పలు విధాలుగా వాడుకుంటున్నాడు. మన బాహ్య-వెలుపల-గుప్త జీవితాల చిట్టా గూగుల్ వాడి చేతుల్లో ఉంది. ప్రభుత్వాలడిగితే ప్రభుత్వాలకి, డబ్బులు విసిరే బడా కంపెనీలకీ ఈ సమాచారం ఎటువంటి కరుణా లేకుండా నిర్దాక్షిణ్యంగా పంచిపెడుతున్నాడు. అది పొందిన గవర్నమెంటులు తమకు ముప్పు ఉన్న మనుషులను పట్టుకుని శిక్షిస్తున్నారు, ఇంటలిజెన్స్ రిపోర్టులు రూపొందిస్తున్నారు సరే! కానీ అదే సమయంలో ఎందరో వ్యక్తులను వ్యక్తిగత విషయాల గూర్చి హింసించి, శిక్షిస్తున్నారు - ఇది గమనార్హం. ఇక బడా కంపెనీల సంగతి సరేసరి. మనకు తెలీకుండానే మన మెయిల్స్ లో మెయిల్లోని పాఠ్యానికి సంబంధించిన వాణిజ్య ప్రకటన దర్శనమిస్తుంది. మన మెయిల్లోని సమాచారం (అది గూగుల్ వాడు చదువుతాడా లేదా అన్నది తరువాతి విషయం) చూసి, తగ్గ ఆడ్స్ వేసే ప్రోగ్రాములు గూగుల్ వాడి దగ్గర కోకొల్లలు.
ప్రస్తుతానికి చాలా మంది గూగుల్ వాడి ప్రోడక్ట్స్ అన్నీ వాడడం లేదు కాబట్టీ చాలా సమాచారం గూగుల్ వాడికి అందడం లేదు. అందుకనే పొద్దస్తమానమూ గూగుల్ క్రోం వాడు, యూట్యూబ్ వాడు, జీమెయిల్ వాడు అని వాడి సొద.
ఒకవేళ గూగ్ల్ క్రోం వాడి జీమెయిల్ ఉపయోగిస్తే, గూగుల్ వాడికి మన మెయిల్స్ లోని సమాచారం గోప్యంగా మరింత త్వరిత గతిన చేరే అవకాశాలు ఉంటాయి.
గూగుల్ నేడు ఆండ్రాయిడ్ ను పోషిస్తోంది - ముబైల్ రంగంలో అద్దే అగ్రగామి.
క్రోం - మనకు తెలీకుండానే ఎందరమో దీనినే అప్రమేయ విహారిణిగా వాడుతున్నాము.
జాలశోధన, యూట్యూబ్,మెయిల్స్, డాక్స్ (డ్రైవ్) - ఇవీ మనమంతా వాడేస్తున్నాం, ఆయా విషయాలలో అవే అగ్రగామిలూను.
అందాకా బాగుంది. ఇవి అత్యంత ప్రజాదరణ పొందాక ఏమవుతుంది?
ఏమవుతుందీ, గూగుల్ సరుకు తప్ప ఇతరత్రా మన కళ్ళకు కనిపించవు.
మైక్రోసాఫ్ట్ మార్కెట్ లో ఉన్నపుడు ఎందరో కొందరికి రెడ్ హ్యాట్, ఫెడోరా, డీబియన్, ఉబుంటూ, యాపిల్, సొలారిస్ ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలుసు. పని వద్దో కాలేజీలోనో వాడే వారు కూడా.
కానీ ఆండ్రాయిడ్ కు ప్రత్యామ్నాయం సయనోజెన్ మాడ్, ఫైర్ఫాక్స్ఓఎస్ మొ॥ ఉన్నవని ఈనాడు చాలా మందికి తెలీదు.
క్రోం స్థానే ఫైర్ఫాక్సును వాడటానికి జనాలు సుముఖత చూపలేకపోతున్నారు. క్రోం కన్నా ఫైర్ఫాక్స్ వేగవంతం, పైగా అంతర్జాల వాడుక లేనప్పుడు ఫైర్ఫాక్స్ జాలంతో సంపర్కం చెయ్యదు.  ఈ విషయం కనిపెట్టాలంటే ఒక నెల పొర్తిగా క్రోం ని, ఒక నెల పూర్తిగా ఫైర్ఫాక్సునే వాడి ఇంటర్నెట్ వాడకంలో తేడాలు గమనించండి. కేవలం జీమెయిల్, గూగుల్ సెర్చ్ మొ॥ గూగుల్ సరుకు కొంత వేగవంతంగా క్రోం లో ఆడినట్టు మనకు భ్రమ కలుగుతుంది. నిజానికి అలా జరుగదు.
ఇక జాలశోధన సమయంలో మన వ్యక్తిత్వానికి మన శోధనలను ముడిపెట్టే  గూగుల్ శోధన చాలా అసహ్యమయిన చర్యలను మన శోధనాధారంగా చేస్తోంది - అవి మనకు తెలీవు.
డక్‍డక్‍గో లాంటి శోధనయంత్రాలు మన శోధన ను పసిగట్టవు, మనకు ఇబ్బందులూ చేపట్టవు.
యూట్యూబ్ వల్ల జరిగే మేలు కన్నా నష్టమే ఎక్కువని ఈ మధ్యనే చూసాము కూడా. కొన్ని కంపెనీలు పైరసీ విరుద్ధ చట్టాలు రూపొందించి త్యాగయ్య కృతులనే కాపీరైటులో చూపిన వైనం ఈ అంధ్య పెద్ద దుమారమే రేపింది.
డాక్స్, లేదా డ్రైవ్ కి ప్రత్యామ్నాయంగా ఎన్నో సేవలు జాలంలో కలవు, జోహో అనే భారతీయ కంపెనీ కూడా గూగుల్ డాక్స్ లా వర్డ్, స్ప్రెడ్ షీట్, ప్రెజెంటేషన్ ఆన్లైనులో చేసుకునే సేవలను అందిస్తుంది.
మన నుండి ఎంత తక్కువ అయితే అంత తక్కువ సమాచారం జాలంలోకి చేరేలా జాగ్రత్త తీసుకోవాలి, లేదా మీరు ఎవరూ లేని సమయంలో వ్యక్తిగతంగా ఏవో కొన్ని వీడియోలు యూట్యూబులో చూసారు, అందరి ముందు, ఏదో కాన్ఫరెన్సులో ఏదో వీడియో యూట్యూబులో చూపించాల్సి వచ్చింది, ఆ వీడియో అయిపోయిన వెంటనే సజెస్టెడ్ వీడియోస్ అంటూ అంతకు ముందు మీరు చూసిన వీడియో కు సంబంధించిన మరిన్ని నలుగురు ముందూ యూట్యూబ్ చూపెట్టింది - ఇది అసలు ఊహించగలమా?
అలానే ఏదో  వివాదాస్పద జాలస్థలి (వెబ్సైట్) ఉంది. మీరు స్నేహితుల ముందు సెర్చ్ చేసారు, ఫలానా జాలస్థలిని మీరు ఫలానా తేదీన చూసారని వస్తుంది - ఎంత ఇబ్బంది?
ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి, వినియోగదారుడికి మరింత మెఱుగైన సేవలు అనే నెపంతో ఆయా జాలస్థల సేవలు అనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను చాలా వరకూ మన వద్ద నుండి రాబట్టి దుర్వినియోగం చేస్తున్నాయి. మన వ్యక్తిగతత్త్వాన్ని మనమే వారికి ఇవ్వాళ చేరవేసి రేపు బాధపడే సందర్భాలను కావాలనే ఏర్పరుచుకుంటున్నాము.
దీనికి స్వస్తీ పలకాలంటే అలాంటి శోషణకు స్థానంలేని సేవలను ఉపయోగించవచ్చు.
ఇవ్వాళ ఆఫ్లైనులో గూగుల్ డాక్స్ వాడాలంటే క్రోం లోనే సాధ్యం ఐ గూగుల్ వాడు ప్రకటించాడంటే దానర్ధం, ఆఫ్లైన్ ద్వారా క్రోం ని మన మొత్తం కంప్యూటర్ లోకి జొరబడే అవకాశాన్ని మన ద్వారానే ఇప్పించాలని చూడటం, ఇక దీని పర్యవసానం జనాల ఆలోచనలకే వదిలివేస్తున్నాను.
ఆండ్రాయిడ్ ద్వారా ఎన్నో కంపెనీలను నిబంధనలు మార్చి వాడుకరుల సమాచారం రాబట్టే ప్ప్రయత్నం గూగుల్ పెద్ద యెత్తునే చేబడుతోంది కూడా.
మరి దీనిని ఎలా ప్రతిఘటించడం?
ప్రత్యామ్నాయాలను వాడడం ద్వారా!
గూగుల్ క్రోం ను వాడడం మానేయడం! మీ స్నేహితుల ద్వారా మానిపించడం.
లేదా గ్గూగుల్ విజృంభణలో అందరూ బలి కావాల్సిందే!
ఫైర్ఫాక్సును వాడండి. గూగులు, మైక్రోసాఫ్ట్, యాపిల్ లా కాకుండా ఫైర్ఫాక్స్ కేవలం ఔత్సాహికుల ద్వారా ఏనాటికానాడు మెరుగు పరచబడుతుంది కూడా. అందరికీ జాలం అన్న నినాదంతో ముందుకు వెళుతున్న మొజిల్లా ఫైర్ఫాక్స్ మన భారతీయతను ఆదర్శంగా తీసుకుంది కూడా.
వేరే ఏ బడా కంపెనీలు మనల్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నా, మొజిల్లా మాత్రం అందుకు చాలా దూరం :)

Tuesday, July 29, 2014

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కవితలు, పాటలకు ఆహ్వానం

నమస్కారం

తెలుగు భాష గొప్పదనమేమిటో తెలిపే పాటలు మనకు అత్యల్పం. మన స్థానిక ప్రముఖులెందరో ఉన్నా, వారి గురించి మనకు తెలీదు. (ఉదాహరణకి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురించి కడప వారికీ, పట్టాభి సీతారామయ్య గురించి కృష్ణా జిల్లా వారికీ  తరం చాలా మందికి తెలీదు) ప్రాంతీయ ఆట-పాటలు, పండుగలు-పిండి వంటల గురించి తెలిపే తెలుగు పాటలు చాలా అరుదు. 
సురవరం ప్రతాప రెడ్డి ఎవరు అంటే చెప్పలేని దుఃస్థితి. బాపిరాజు బొమ్మలు ఎరుగని బ్రతుకులు. 
ఇదంతా ఎందు వలన? సాహిత్యం ద్వారా ప్రచారం లేకపోవటం వలన ఒక కారణం. పుస్తకాలలో విరివిగా మనకు ఈ జ్ఞానం లభించినా సినిమా పాటల ద్వారా లేదా మంచి రాగంలో ఉన్న పాటల ద్వారానే మనం ఈ విషయాలను జనాల్లోకి సమూలంగా తీసుకువెళ్ళవచ్చు, 

అందుకని నా అభ్యర్థన ఏమిటంటే, వచ్చే ఒక వారం రోజులలో తెలుగు ప్రముఖులు-ప్రదేశాలు-సంస్కృతి ప్రతిబింబించేలా నిందా స్తుతి చెయ్యని పాటలు / కవితలు వ్రాసి పంపగలరు. వీటిని తగు విధంగా ప్రచారం చేసే ప్రయత్నాలు నా వంతుగా చేస్తాను.
పంపవలసిన మెయిల్ చిరునామా : nani1only@gmail.com
ధన్యవాదాలతో
రహ్మానుద్దీన్ షేక్

Friday, September 16, 2011

లోహిత్ తెలుగు మెరుగయిన ఖతి వచ్చిందోచ్!

మనకు తెలుగులో యూనికోడ్ లో అందుబాటులో ఉన్న ఖతులు చాలా తక్కువ.
గౌతమి, పోతన, వేమన, కాకుండా, అత్యధికంగా వాడుకలో ఉన్నా ఖతి లోహిత్ తెలుగు.
రెడ్ హ్యాట్ సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ ఖతిలోని అక్షరాలు చాలా గుండ్రంగా స్పష్టంగా ఉంటాయి.

లోహిత్ తెలుగు ఖతి వచ్చాక రాతఖతుల లోటు తీరింది అనే చెప్పాలి.
ముఖ్యంగా డ గుణింతం, క గుణింతం చాలా చక్కగా ఉంటాయి. పాత కాలపు వ్రాతల్లా ఉండే క గుణింతం చూసి అప్పుడప్పుడు మా తాతల నాటి ద్రవిడ ప్రతులు, తెనుఁగు ప్రతులలో వంటి అక్షరాలు అని మురిసిపోయిన సందర్భాలూ ఉన్నాయి.

పోతన లో సంయుక్త, సంశ్లేష అక్షరాలు వ్రాస్తున్నప్పుడల్లా కొంచెం ఇబ్బందిగా ఉండేది. అక్షరాలు ఒకటి మరోదాంట్లో కలిసిపోయి, వికారంగా అనిపించేది. వేమన వ్రాతఖతిగా ఉపయోగించలేము. వేమన ఖతి శీర్షికలు రాయటానికి బావుంటుంది. అన్ని మెలికలు ఉండేసరికి పెద్ద పాఠ్యాలు చదవాలంటే కొంచెం ఎబ్బెట్టుగానే ఉండేది. గౌతమి అనగానే ఎందుకో, కొన్ని అక్షరాలు మరీ యాంత్రికంగా ఉంటాయి. పైగా ఆ ఖతి స్వేచ్ఛా ఖతి కాదు. అందుకని కొంచెం బావున్నా వాడలంటే ఇబ్బందే.
అందుకని లోహిత్ తెలుగు వచ్చాక నాకు ఎంతో మేలు జరిగిందని చెప్పొచ్చు. తెలుగ్లో రాయాలన్నా, చదవాలన్నా, మరింత అందంగా అక్షరాలు కనిపిస్తుంటే ఎవరికయినా నచ్చదు మరీ?
పైగా ఎన్నో చోటల మన ఆద్య గురువులు ఈ ఖతిని వాడుతున్నారు కూడా.

ఇక లోహిత్ తెలుగు చరిత్ర తెల్సుకుందాం. లోహిత్ తెలుగు ను ప్రాయోజితం చేస్తున్న ఫెడోరా ప్రాజెక్టు లోని వికీ ప్రకారం,
౨౦౦౪ లో రెడ్ హ్యాట్ సంస్థ అయిదు భారతీయ భాషలకు జీపీఎల్ లైసెన్స్  ద్వారా స్వేచ్ఛా ఖతులను విడుదల చేసింది. సంస్కృతంలో ఎఱుపు అని అర్ధం వచ్చే లోహిత్ అన్న పేరుతో వీటిని విడుదల చేసారు. ఈనాడు అస్సామీ, బెంగాలీ, దేవనాగరీ(హిందీ, కశ్మీరీ, కొంకణీ, మైథిలీ, నేపాలి,మరాఠీ, సింధీ), గుజరాతీ, కన్నడ, మళయాళం, ఒడియా, పంజాబీ, అరవం ఇంకా తెలుగు, మొత్తం ౧౬ భారతీయ భాషలకు లోహిత్ ఖతులు అందుబాటులో ఉన్నవి.
ప్రస్తుతం ఫెడోరా ప్రాజెక్ట్ వారు ఈ ఖతుల నిర్వహణ చూస్తున్నారు. లోహిత్ ఖతులన్నీ యూనికోడ్ ౫.౧ అనుకూలం.

అయితే మిత్రులు చాలా మంది గమనించే ఉంటారు ఫస్ట్ అన్న పదం రాసినప్పుడు తలకట్టు స మీద ఉండి పొల్లు పక్కకు పోవడం లోహిత్ తెలుగులో ఉన్న అపచారం, అలానే చూస్తున్నాం, రాస్తున్నాం అన్న పదాలు రాసినప్పుడు న్నాం అన్న ద్విత్వ-సంయుక్తాక్షరం(మిశ్రాక్షరం) న, నకారప్పొల్లు, దీర్ఘం, సున్నాలుగా విడిపోతుంది, ఇదీ ఒక పెద్ద లోటే.
కానీ మొన్న ౩౦ ఆగస్టు ౨౦౧౧ నాడు లోహిత్ తెలుగు వారి అత్యాధునిక ౨.౪.౬ వెర్జన్ విడుదలయింది.
ఇందులో ఇలాంటి తప్పిదాలను సరి చేసారు.
ఇంకెందుకు ఆలస్యం వెంటనే  లోహిత్ తెలుగు ఖతిని ఇక్కడ నుండి దింపుకోండి.

సూచన :
కానీ "-" (హైఫెన్) ఈ ఖతిలో లుప్తమయింది. అలానే ఆంగ్లం లో V అక్షరం (పెద్దబడి వీ అక్షరం), ఫుల్స్టాప్, రాసి వాటికి లోహిత్ తెలుగు ఆపాదిస్తే అవీ లుప్తమవుతున్నవి. వీటిపై ఒక బగ్ ఫైల్ చేసాను. అలానే అదే బగ్ తో పాటు బగ్ ఫిక్స్ కూడా పెట్టాను. తదుపరి విడుదలలో ఇవి పొందుపరుస్తామని నాకు విజ్ఞప్తి అందింది.

Thursday, June 30, 2011

తెలుగుకై నా సంకల్పం

అందరూ కొంచెం జాగ్రత్తగా చదవండి,
చదివాక మీ అమూల్యమైన సూచనలు, సలహాలు, వనరులు, సహాయం అందించవలసినదిగా నా వేడుకోలు.

మన మాతృభాష తెలుగుకు మన రెండు తరాల ముందు నుండి జరుగుతున్న వివక్ష చూస్తూనే ఉన్నాం. నేటి పరిస్థితి ఎలా ఉంది అంటే తెలుగు పదాలు కొన్ని పలికితేనే ఇబ్బంది గా నామోషీగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది.

కాగా, అదే సమయంలో ఎంతో ఉత్సాహం తో తెలుగు నేర్చుకోవాలి అనుకునే వారెందరికో తెలుగు నేర్చుకునేందుకు మంచి సాధనాలు లేనే లేవు.

అందుకని త్వరలో నేను ఒక జాల గూడు ప్రవేశపెడదామనుకుంటున్నా, ఈ గూడు పూర్తిగా తెలుగును అభివృద్ధి చేసేందుకు ఉపయోగించుకోవాలి.

ఇప్పటి వరకూ నా ఆలోచన ప్రకారం, తెలుగు భాష ప్రాథమికాంశాలు - అక్షరాలు, వ్యాకరణం, ఉచ్చారణ మొఁ
తెలుగు పద్యం, తెలుగు కథ, తెలుగు పాట ను అందరి వద్దకూ తీసుకుపోవాలి. అలానే ఆఫ్లైన్ కొన్ని పోటీలు పెట్టి తద్వారా అంతర్జాలం అందుబాటులో లేని వారు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేలా చెయ్యటం వంటివి కొన్ని.

ఇంకా ఏంఏం చెయ్యొచ్చు?
బ్లాగుల్లో ఇందుకు కావలసిన చాలా సామగ్రి ఉంది కాబట్టి, నేను పెట్టబోయే జాలగూడు కేవలం ఆయా బ్లాగుటపాలకు లంకె ఇస్తుంది.
అలానే ఆయా టపాలు ఏదో ఒక దృక్కోణంలో రాయబడి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక సమభావన కలుగజేసే టపాలకే స్థానం కలిపించాలన్నది నా సంకల్పం.

Thursday, February 3, 2011

జాలంలో తెలుగు తీరుతెన్నులు

భారతదేశంలో దాదాపు 8 కోట్ల జనాభా అంతర్జాలాన్ని తరచూ వాడుతున్నారు.
జూన్ ౨౦౦౯ నాటి గణాంకాల ప్రకారం దేశంలో 82 లక్షల బ్రాడ్ బ్యాండ్ అనుసంధానాలు గలవు.
అందులో రమారమీ 2 శాతం అనగా 16 లక్షలు మన రాష్ట్రం వారేఅని అంచనా( బ్రాడ్ బ్యాండ్ ఆధారంగా)
నేటికి ఇవి రెట్టింపు అయి ఉండవచ్చు.

మనం బ్లాగర్ల జనాభానే ప్రాతిపదికన తీసుకుందాం రోజూ కనీసం వంద బ్లాగులు, రెట్టింపు వ్యాఖ్యలు, దానికి రెట్టింపు బజ్జులు అందులో పదో వంతు ట్విటర్ లో తెలుగు వాడకాన్ని చూస్తున్నాం.
మరి వీరిలో చాలా వరకు ఏ ఉద్దేశ్యంతో జాలానికి చేరుతారు, నూటికి తొంభైతొమ్మిదిన్నర మంది వారి మనోల్లాసం కోసమే వస్తారు.

ఈ గణాంకాలను వేరే భాషలవారితో పోల్చుకుందాం!
నాకు హిందీ గుజరాతీ గట్రా బ్లాగుల గురించి విన్నా సమాచారం ఉంది కానీ ప్రత్యక్షంగా గమనించలేదు.
క్షుణ్ణంగా పరిశీలించింది తమిళం మరియు కన్నడం.
అదేవిటో వారి సినిమా, మరియు ఇతరత్రా జాలగూళ్ళు కూడా వారి భాషలోనే ఉంటాయి. కానీ అక్కడవారు బ్లాగటం చాలా తక్కువ, మరి జాలంలో అయితే ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. మరి వారంతా ఏమి చేస్తున్నారు?

వారు జాలంలో ఎక్కువ సమయాఅన్ని వారి భాషాభివృద్ధికి కేటాయిస్తారు, స్థానికీకరణ, వికీపీడియా వంటివి దీనికి వేదికగా వారు వాడుతున్నారు!

వికీపీడియాను నేను ప్రాతిపదికగా తీస్కొని చూసాను, ఆశ్చర్యమేసింది! గణాంకాలు చూసి!
వికీపీడియాలో ప్రతీ వ్యాసం లో ఎన్ని మార్పులు జరిగితే అది అంత మెరుగైనది! నిజం స్థూలంగా!
దీనికి కొలమానం డెప్త్.

హిందీ లో అత్యధిక వ్యాసాలు కలవు, అక్షరాలా 67,449 వ్యాసాలు అయితే హిందీ కి గల డెప్త్ కేవలం 25 అంటే అంత బాగా వ్యాసాలు రాయబడటంలేదు, తరువాత మన భాషే, తెలుగు 47,293 వ్యాసాలు. మురిసిపోకండి, మన డెప్త్ కేవలం 7 అంటే నిమ్నంగా అత్యల్ప డెప్త్! అంతేగా మరి మీరు తెలుగు వికీపీడియాకు వెళ్ళి వ్యాసాలతీరుతెన్ను చూడండి, ఎక్కడో ఒక్కటి 10 లైన్లకు మించి ఉంటుంది. మిగతావన్ని 1 లేదా 2 మరీ మహా అయితే అయిదు లైన్లు గలవే!
ఇది మన భాషకి ఎంతటి అవమానం!
అన్నన్నా!
అలానే వెతుకుతూ మన వెనుక  ఉన్నవి గమనిస్తే, తరువాతి వరుసలో ఉన్న మరాఠీ(డెప్త్-20),  తమిళం(డెప్త్-31)  సంఖ్యాపరంగా మనకు వెనుకంజలో ఉన్నా, డెప్త్ లో మనకు ముందరే ఉన్నారు.
అయితే చెప్పుకోదగ్గది మళయాళం - కేవలం 16 వేల పై చిలుకు వ్యాసాలే ఉన్నా, ప్రతీ వ్యాసం కనీసం ఒక నిర్ణీత లైన్లు ఉండేలా వారు చర్య తీస్కున్నారు. అందుచేత వారికి కొలమానం ప్రకారం డెప్త్ 320! మనం చేరుకోవాలంటే ఇప్పుడున్నా 42 వేల వ్యాసాలన్నిటినీ మనం తీర్చిదిద్దాలి.

మీ ఊరు వికీపీడియాలో ఉంది, కానీ మీ ఊరి సమాచారం, మీ ఊరి బడి, గుడి, చెరువు వికీపీడియాలో కలవా?
వాటి చిత్రాలు?
ఈ విషయాలను వికీ లో చేర్చి మన భాషకే కాదు రాబోయే తరాలకు సమాచారం అందించిన వారవుతారు!


ఇక ఆ తర్వాత నేను గమనించింది విక్షనరీ , ఇది నిఘంటువు

అయితే ఇక్కడ గమ్మత్తు మనకు చాలా వెనుకవున్న అరవం ఇక్కడ మనకు 5 రెట్లు ముందు కలదు 
భారతీయ భాషల్లో కూడా మన అరవ సోదరులే ముదలియార్లు!
అక్షరాలా లక్షా తొంభై రెండువేల పైబడి పదాలు కలవు!
ఆ తరువాత స్థానం కన్నడిగులది, ఎనభై ఆరు వేల పైచిలుకు పదాలు
ఆ పై మళయాళం అరవై వేలు +
మరి మనం కేవలం ముప్పై తొమ్మిది వేలు+



తేడా గమనించారా!
మనకు చెప్పుకోటానికే భాషాభిమానం, నిరూపణకు వస్తే సున్నా!
ఇకనైనా రోజూ మీరు బ్లాగ్గోలలకు పెట్టే సమయంలో ఒక నూరోవంతు వీటిపై దృష్టి పెట్టండి

మీకు వికీ దిద్దుబాటు రాదా, ఉచిత సహాయం అందిస్తున్నాం మమ్మల్ని సంప్రదించండి!

॥సత్కృతాయాస్తు మంగళం ॥

Saturday, December 4, 2010

లినక్స్ వాడకపోవటానికి గల కారణాలు

చాలా రోజులైంది బ్లాగు లో ఒక టపా రాసి. నా శిక్షణకాలం కావటం వలన నాకు సమయం అస్సలు కుదరటం లేదు.
ఇన్ని రోజులకి సమయం కూర్చుకుని ఈ బ్లాగు రాస్తున్నా!

తెలుగు వాడకాన్ని మన సంగణక యంత్రాల్లో పెంపొందింప చెయ్యటం అనేది ఇప్పుడు నా ముఖ్య లక్ష్యం
అందుకు లినక్స్ వాడకం ఒక మంచి దారి. మరి చాలా మంది లినక్స్ వాడాలంటే భయపడతారు.
ఇందుకు నేను మన ఈ-తెలుగు వారు నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన స్టాల్ లో ఒక చిన్న ప్రదర్శన మరియు అంకోపరిని తెచ్చుకునే వారికి లినక్స్ స్థాపన వంటివి ఒక రోజు నాకు ఖాళీ ఉన్న రోజు చెయ్యాలనుకుంటున్నా.
ఇది నేను ఇంకా ఈ-తెలుగు వారితో సంప్రదించి ఏ రొజు జరుగుతుందో తరువాత చెపుతాను.
అయితే సంగణక యంత్ర వాడుకర్లు లినక్స్ ను ఎందుకు వాడరో.
లేక లినక్స్ వాడకంలో వారికి ఏమి ఇబ్బంది గలదో వారు నా బ్లాగాభిముఖంగా తెలిపితే
ఆయా అంశాలను నా ప్రదర్శన లో చేర్చి వాటిపై అవగాహన కలిపిస్తాను
వృత్తిరీత్యా నిబద్ధులు ఏమీ చెయ్యలేరు వారు వారి కంపెనీ చెప్పిన నిర్వహణ వ్యవస్థనే వాడాలి
అలా కాకుండా మిగతా వారు మీ మీ అభిప్రాయాలను మీ వ్యాఖ్యలుగా ఇక్కడ పెట్టండి
అలానే ఎన్నో లినక్స్ మరియు ఇతర స్వేచ్ఛామృదోపకరణాల యొక్క డాక్యుమెంటేషన్ తెలుగులోకి అనువాదం కావలసి ఉంది అందువలన ఇటువంటి వాటికి ఎన్తమంది ఉత్సాహంగా ఉన్నారో తెలుపగలరు

॥ సత్కృతాయాస్తు మంగళం ॥

Saturday, October 23, 2010

ఉబుంటు పంపకంలో తెలుగు ఖతులను స్థాపించే విధానం

ఉబుంటు పంపకంలో by default, పోతన మరియు వేమన ఖతులు ముందుగానే స్థాపితమై ఉంటాయి. అవి కొందరికి నచ్చవచ్చు మరికొందరికి నచ్చకపోవచ్చు.
ఒకవేళ మీరు కొత్త ఖతులు స్థాపన చేయదలచుకుంటే, అదెంతో సుళువు.
ముందుగా ఆయా ఖతులను డౌన్లోడ్ చేసుకుని ఆ టీటీఎఫ్ దస్త్రాలను su గా 
/usr/share/fonts అనే ఫోల్డర్ లోకి కాపీ చేస్కోండి ఆ పై ఈ కమాండ్ ను రన్ చెయ్యండి 
fc-cache -fv
ఇది రన్ చేసాక మీ యంత్రంలోకి ఆయా ఖతులు స్థాపితమవుతాయి 
లేదా పై కమాండ్ ను రన్ చెయ్యకుండానే సిస్టంను రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది 
కొన్ని మంచి తెలుగు ఖతులు :

Tuesday, October 5, 2010

కొత్తవారికి లినక్స్ పంపకం

ఇదివరకే  లినక్స్ పంపకాల గురించి ఇక్కడ చర్చ జరిగింది చూడగలరు.
అయితే విండోస్ కంటే ఎన్నో రెట్లు మేలయినదని అనుకుంటున్నాం కదా లినక్స్ ను
అందుకని లినక్స్ కు మారదామా అంటే ఒక పెద్ద చిక్కుప్రశ్న ఏపంపకం వాడాలి అని
పక్కింటి శ్రీను డెబియన్ ది బెస్ట్ అంటాడు ఎదురింటి రాజు ఫెడోరా బెటర్ దాన్ ది బెస్ట్ అంటాడు ,
ఇక మన హేచోడీ లేదా ప్రొఫెసర్ ఆయన వాడిన రెడ్ హ్యాట్ మాత్రమే ఒక అసలైన పంపకమనీ
మిగతావి వేస్ట్ అని కొట్టిపారేస్తాడు.
అయితే లినక్స్ వాడే వారికి అన్నిరకాల వేసులుబాట్లూ ఉంటాయి.
ఇన్ని చాయిస్లు ఉన్నయ్యంటే అది ఎంత బెస్ట్ అన్నది మీరే చెప్పగలరు
ఆ మధ్య ఒక టపాలో ఎవరో ఫ్రీ సాఫ్ట్వేర్ అంటున్నారు జీవితం లో అన్ని ఫ్రీగా రావు కదా అని
ఆయనకు ఈ టపా ఎలాగోలా చేరాలి ఆయన దీన్ని చదవాలి
ఆంగ్లం చాలా చిన్ని భాష, వారి దేశం ఎంత చిన్నదో బ్రిటీష్ వారి భాష కూడా అంటే చిన్నది
వారికి ఎక్కువ పదాలు లేవు
మనం స్వాతంత్ర్యం అన్నా, స్వేచ్ఛ అన్నా, ఉచితం అన్నా
ఈ మూడింటికీ వారి దగ్గర ఒక ఫ్రీ అన్న పదమే ఉంది
(ఇంకా చెప్పాలంటే మాకు ఒక ౬ పేజీల పాఠం హిందీ ౮వ తరగతిలో ఉంది అందులో కూడా ఇండెపెండెన్స్ డే అంటే  అపరతంత్ర దినోత్సవం అన్న అర్థం వస్తుంది కానీ మనం స్వాతంత్ర్యదినోత్సవం అంటాం అంటూ ఆరు పేజీల సుత్తి)
చెప్పొచ్చేదేమిటంటే ఫ్రీ అంటే అర్థం ఉచితం కాదు తండ్రీ, ఫ్రీ అంటే స్వేచ్ఛ


అయితే నా స్వంత పూచీ మీద మీరు ఉబుంటు ని కళ్ళు మూస్కుని సారీ కళ్ళు తెరిసే అనుసంధానం చేసేస్కోండి
ఒక వేల మీరు పూణే వాసులైతే నేనే మీ వద్దకొచ్చి ఉచిత(ఫ్రీ)ముగా చేసి పెడతాను
ఉబుంటు డెబియన్ ఆధారిత పంపకం
మనం గమనించాల్సిన విషయాలు ఏమిటంటే
ప్రతీ పంపకానికి కొన్ని ప్యాకేజేస్ ఉంటాయి
అవి ఎప్పుడెప్పుడు అప్డేట్ అవుతున్నాయి
వాడుకరులు ఎంతమంది ఉన్నారు వీరిలో ఎంతమంది అంతర్జాలంలో సహాయం చేస్తున్నారు
మనకు కావాల్సిన సాఫ్ట్వేర్లు ఆ పంపకంలో ఉన్నాయా
ఇవన్నీ ముందు తెలుసుకోండి
ఇక పొతే నా సలహా ఏమిటంటే ఒక వేల మీ వద్ద అంతర్జాలం అనుసంధానించి ఉంటే ఉబుంటు మేలు
లేదా డెబియన్ బావుంటుంది.
ఉబుంటూ లో మీరు కావాల్సిన అన్ని ప్యాకేజ్లను డౌన్లోడ్ చేస్కొని మీ డెస్క్టాప్ తో ఎన్నో చెయ్యవచ్చు
తెలుగు స్థానికీకరణ కూడా ఉబుంటు లో బాగుంటుంది
నేను ప్రస్తుతం 9.10 వాడుతున్నాను
ప్రతి ఏడు ఏప్రిల్ మరియూ అక్టోబర్లలో కొత్త వెర్షన్ వస్తుంది
ప్రస్తుతం 10.04 చలామణి లో ఉంది
ఇవాలో రేపో 10.10 రాబోతోంది
అయితే చాలా మంది 10.04 లో కొన్ని అవగుణాలున్నాయని చెప్పారు
సో 9.10 లో నాకేమి గ్లిచెస్ కనపడలేదు
మీరూ అదే వాడండీ !!!!

Tuesday, September 21, 2010

గ్నూ/లినక్స్ పరిచయం

గ్నూ/ లినక్స్ గురించి :-(ఇందులో చాలా సాంకేతిక పదాలను తెలుగులోనే వాడాను వాటిని కింద వాటి మూల పదాలతో సహా జాబితా ఒకటి కింద ఇచ్చాను ఏమైనా మార్పులు ఉంటే దయచేసి కామెంట్ గా ఇవ్వండి)

మనం ప్రస్తుతం విస్తృతంగా వాడుతున్న సంగణక యంత్రం గురించి చాలా తక్కువ తెలుసు మనకి.
ఈ యంత్రం కనిపెట్ట బడిన తొలినాళ్ళలో దీని ఆకారం చాలా పెద్దదిగా ఉండెడిది. ఎంత పెద్దది అంటే ఒక మొత్తం గదిని నింపేంత.
ఈ సంగణక యంత్రం లో మనకు బాహ్యంగా కనిపించే కఠినాంత్రం మరియు దానిని సక్రమంగా పని చేయించే కోమలాంత్రమూ ఉంటాయి.
కోమలాంత్రము అనేది మనకు కనబడదు.
అయితే తొలి రోజుల్లో సంగణకాన్ని నడిపే కోమలాంత్రంయొక్క మూలసంజ్ఞావళి బాహ్యంగా ఉండేవి.
కోమలాంత్రాన్ని అందరూ తమకు నచ్చినట్టుగా అనుసంధానం చేస్కునే వారు(మూలసంజ్ఞావళిని మార్పిడి చెయ్యటం ద్వారా).
కానీ 6౦ వ దశకం రాగానే , సార్థవాహకాలు (స్వార్థవాహక???) కొన్ని, కోమలాంత్రం యొక్క మూలసంజ్ఞావళిని వాడుకరికి గోప్యంగా ఉంచటం మొదలెట్టాయి. దీని వల్ల సార్థవాహక సార్తవాహకాలకు బోల్లెడు ప్రయోజనాలు కానీ, ఎటొచ్చీ ఒక వాడుకరి ఆ కోమలాంత్రపు లోలోపల గల మూలసంజ్ఞావళిని పరిశీలించడం, మార్చడం కుదురేవి కావు.
అందువల్ల వాడుకరులు స్వేచ్ఛ కోల్పోయారనమాట.
అయితే ఇది ఒక ఇరవయ్యేళ్ళు అలాగే కొనసాగింది, సార్థవాహకాలు మరీ మితిమీరిపోయి అన్ని కోమలాంత్రాల్ని వాడుకరులకు, నిపుణులకు దూరం చేసాయి.
అయితే 8౦వ దశకం లో రిచార్డ్ మ్యాథ్యూ స్టాల్మాన్ అనే ఒక నిపుణుడు ఈ అరాచకత్వాన్ని ఎదిరిస్తూ
స్వేచ్ఛాపూరితకోమలాంత్ర ఉద్యమాన్ని మొదలెట్టారు.
తద్వారా అప్పట్లో పేరొందిన అత్యంత జనాదరణ పొందిన యూనిక్స్ కు వికల్పముగా కొన్ని కోమలాంత్రాలను తయారు చేసి వాటిని ఉచితంగా వాటి మూలసంజ్ఞావళి తో సహా పంచిపెట్టటం మొదలయింది - ఇది స్వేచ్ఛాపూరితకోమలాంత్రోద్యమానికి తొలి మెట్టు. అలా పుట్టిందేగ్నూ (ఆంగ్ల అక్షరాలైన G-N-U లతో తయరయింది, దాని విస్తార పదం - GNU=GNU Not Unix, ఇది ఒక ముహుర్పదము ఇందులో GNU పదే పదే పునరావృతమౌతుంది).
అలా గ్నూ కై చాలానే కోమలాంత్రాలు తయారు చేయబడ్డాయి, వాటిలో ముఖ్యమైనవి గ్నూ సి కంపైలర్(GCC), గ్నూ డిబగ్గర్(GDB), మొదలగునవి.
ఇక 9౦వ దశకం మొదల్లో లినస్ టొర్వాల్డ్స్ అనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి యూనిక్స్ యొక్క నుంగు ను అనుకరించి లినక్స్ అనే కొత్త నుంగును కనిపెట్టారు.
ఈ నుంగుపై జీ ఎన్ యూ ద్వారా ఉత్పత్తి చేసిన కోమలాంత్రాల్ని పేర్చి తయారైనదే మన గ్నూలినక్స్ నిర్వహణా వ్యవస్థ.
అందుకనే మనం ఈ నిర్వహణావ్యవస్థను గ్నూ/లినక్స్ నిర్వహణా వ్యవస్థ అనాలి. చాలా మంది లినక్స్ అని మాత్రమే సంబోధిస్తారు, ఇది చాలా తప్పు , లినక్స్ అనేది నుంగు మాత్రమే.
ఇక ఆ పై మొదలు ఇది అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండటంవలన(మూలశాసనపదాలతో సహా), ఎవరికి నచ్చినట్టూ వారు దీనిని మార్చుకోవచ్చు.
అందువలననే గ్నూ/లినక్స్ కు ఇన్ని రకాల పంపిణీలు ఉన్నాయి. రెడ్ హ్యాట్, ఫెడోరా, మాండ్రివా, ఉబుంటూ, ఓపెన్ సూసీ, డెబియన్, అచ్చంగా మన తెలుగులో తయారైన పంపిణీ-స్వేచ్ఛ. మున్నగువి ఇంకా చాలా చాలా ఉన్నయి.
ఈఎక్స్టీ-2, ఈక్ష్టీ-3 మరియు ఈ ఎక్స్టీ-4 అను విశిష్టమైన దస్త్ర వ్యవస్థ ను వాడటం వల్ల గ్నూ/లినక్స్ వాడుకర్లకు అసలు చాలా ఉపయోగాలున్నాయి.
ఇంకా ఇదే కాకుండా గ్నూ/లినక్స్ వాడుకర్లు, వారిలోనిపుణులు, కలిసి ఈ గ్నూ/లినక్స్ వ్యవస్థ కోసం చాలా కోమలాంత్రాలను రాసారు, రాస్తున్నారు, రాస్తారు కూడా.
మూలసంజ్ఞావళి (ఉచితంగా) అందుబాటులో ఉన్నందున స్థానికీకరణ కూడా చాలా సులువైంది.
తెలుగులోనే పూర్తి స్థాయి నిర్వహణా వ్యవస్థలు ఉన్నాయి.
ఉదాహరణకు: స్వేచ్ఛ, ఉబుంటు-తెలుగు, డెబియన్-తెలుగు మున్నగునవి.
మీరూ మీ వంతు సహాయాన్నీ అందిచవచ్చు. లాంచ్ప్యాడ్ వంటి ప్రదేశాలలో మీరు ఏ కార్యక్రమించడం తెలియకపోయినా స్థానికీకరణకు సహాయం చెయ్యొచ్చు, తద్వారా చాలా మేలు చేసిన వారవుతారు మన భాషకు.
అయితే ఈ టపా లో అర్జున్ గారు చెప్పినట్టు ఇంకా చాలా చెయ్యవలిసి ఉంది నిపుణులు, వాడుకర్లు ముందుకు వచ్చి మీ ప్రోత్సాహాన్ని అందిస్తే చాలా చెయ్యవచ్చు మనం.

'తెలుగుదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగువల్లభుండ, తెలుగొకండ, ఎల్లనృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స'

list of tech jargons in telugu:

  • సంగణక యంత్రం : Computer
  • కఠినాంత్రం : hardware
  • కోమలాంత్రము: Software
  • మూలసంజ్ఞావళి : source code
  • శాసనపదం : command
  • సార్థవాహకాలు (స్వార్థవాహక????): company
  • వాడుకరి : user
  • నిపుణుడు : developer
  • స్వేచ్ఛాపూరితకోమలాంత్ర ఉద్యమాన్ని : Free Software Movement
  • నుంగు : kernel
  • నిర్వహణా వ్యవస్థ : Operating System
  • పంపిణీ(used as a noun here) : Distro (Distribution)
  • దస్త్ర వ్యవస్థ : file సిస్టం
  • కార్యక్రమించడం : programming