Friday, September 16, 2011

లోహిత్ తెలుగు మెరుగయిన ఖతి వచ్చిందోచ్!

మనకు తెలుగులో యూనికోడ్ లో అందుబాటులో ఉన్న ఖతులు చాలా తక్కువ.
గౌతమి, పోతన, వేమన, కాకుండా, అత్యధికంగా వాడుకలో ఉన్నా ఖతి లోహిత్ తెలుగు.
రెడ్ హ్యాట్ సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ ఖతిలోని అక్షరాలు చాలా గుండ్రంగా స్పష్టంగా ఉంటాయి.

లోహిత్ తెలుగు ఖతి వచ్చాక రాతఖతుల లోటు తీరింది అనే చెప్పాలి.
ముఖ్యంగా డ గుణింతం, క గుణింతం చాలా చక్కగా ఉంటాయి. పాత కాలపు వ్రాతల్లా ఉండే క గుణింతం చూసి అప్పుడప్పుడు మా తాతల నాటి ద్రవిడ ప్రతులు, తెనుఁగు ప్రతులలో వంటి అక్షరాలు అని మురిసిపోయిన సందర్భాలూ ఉన్నాయి.

పోతన లో సంయుక్త, సంశ్లేష అక్షరాలు వ్రాస్తున్నప్పుడల్లా కొంచెం ఇబ్బందిగా ఉండేది. అక్షరాలు ఒకటి మరోదాంట్లో కలిసిపోయి, వికారంగా అనిపించేది. వేమన వ్రాతఖతిగా ఉపయోగించలేము. వేమన ఖతి శీర్షికలు రాయటానికి బావుంటుంది. అన్ని మెలికలు ఉండేసరికి పెద్ద పాఠ్యాలు చదవాలంటే కొంచెం ఎబ్బెట్టుగానే ఉండేది. గౌతమి అనగానే ఎందుకో, కొన్ని అక్షరాలు మరీ యాంత్రికంగా ఉంటాయి. పైగా ఆ ఖతి స్వేచ్ఛా ఖతి కాదు. అందుకని కొంచెం బావున్నా వాడలంటే ఇబ్బందే.
అందుకని లోహిత్ తెలుగు వచ్చాక నాకు ఎంతో మేలు జరిగిందని చెప్పొచ్చు. తెలుగ్లో రాయాలన్నా, చదవాలన్నా, మరింత అందంగా అక్షరాలు కనిపిస్తుంటే ఎవరికయినా నచ్చదు మరీ?
పైగా ఎన్నో చోటల మన ఆద్య గురువులు ఈ ఖతిని వాడుతున్నారు కూడా.

ఇక లోహిత్ తెలుగు చరిత్ర తెల్సుకుందాం. లోహిత్ తెలుగు ను ప్రాయోజితం చేస్తున్న ఫెడోరా ప్రాజెక్టు లోని వికీ ప్రకారం,
౨౦౦౪ లో రెడ్ హ్యాట్ సంస్థ అయిదు భారతీయ భాషలకు జీపీఎల్ లైసెన్స్  ద్వారా స్వేచ్ఛా ఖతులను విడుదల చేసింది. సంస్కృతంలో ఎఱుపు అని అర్ధం వచ్చే లోహిత్ అన్న పేరుతో వీటిని విడుదల చేసారు. ఈనాడు అస్సామీ, బెంగాలీ, దేవనాగరీ(హిందీ, కశ్మీరీ, కొంకణీ, మైథిలీ, నేపాలి,మరాఠీ, సింధీ), గుజరాతీ, కన్నడ, మళయాళం, ఒడియా, పంజాబీ, అరవం ఇంకా తెలుగు, మొత్తం ౧౬ భారతీయ భాషలకు లోహిత్ ఖతులు అందుబాటులో ఉన్నవి.
ప్రస్తుతం ఫెడోరా ప్రాజెక్ట్ వారు ఈ ఖతుల నిర్వహణ చూస్తున్నారు. లోహిత్ ఖతులన్నీ యూనికోడ్ ౫.౧ అనుకూలం.

అయితే మిత్రులు చాలా మంది గమనించే ఉంటారు ఫస్ట్ అన్న పదం రాసినప్పుడు తలకట్టు స మీద ఉండి పొల్లు పక్కకు పోవడం లోహిత్ తెలుగులో ఉన్న అపచారం, అలానే చూస్తున్నాం, రాస్తున్నాం అన్న పదాలు రాసినప్పుడు న్నాం అన్న ద్విత్వ-సంయుక్తాక్షరం(మిశ్రాక్షరం) న, నకారప్పొల్లు, దీర్ఘం, సున్నాలుగా విడిపోతుంది, ఇదీ ఒక పెద్ద లోటే.
కానీ మొన్న ౩౦ ఆగస్టు ౨౦౧౧ నాడు లోహిత్ తెలుగు వారి అత్యాధునిక ౨.౪.౬ వెర్జన్ విడుదలయింది.
ఇందులో ఇలాంటి తప్పిదాలను సరి చేసారు.
ఇంకెందుకు ఆలస్యం వెంటనే  లోహిత్ తెలుగు ఖతిని ఇక్కడ నుండి దింపుకోండి.

సూచన :
కానీ "-" (హైఫెన్) ఈ ఖతిలో లుప్తమయింది. అలానే ఆంగ్లం లో V అక్షరం (పెద్దబడి వీ అక్షరం), ఫుల్స్టాప్, రాసి వాటికి లోహిత్ తెలుగు ఆపాదిస్తే అవీ లుప్తమవుతున్నవి. వీటిపై ఒక బగ్ ఫైల్ చేసాను. అలానే అదే బగ్ తో పాటు బగ్ ఫిక్స్ కూడా పెట్టాను. తదుపరి విడుదలలో ఇవి పొందుపరుస్తామని నాకు విజ్ఞప్తి అందింది.

1 comment:

  1. please down load ramaneeya fonts
    http://adityafonts.com/downloads/Ramaneeya_Font.zip

    ReplyDelete