Monday, September 19, 2011

నా ఆలంపూర్ యాత్ర

ఈ ఆదివారం జీవని విద్యార్థులను, మన బ్లాగ్మితృలను కలవటానికి అనంతపురం వెళ్ళాలి కాబట్టీ శనివారం వేరే ఏ పనీ లేదు కాబట్టీ, అలానే తుంగభద్రలో నీరు చేరాయి కాబట్టీ, ఆలంపూర్ దారిలోనే ఉంది కాబట్టీ. అమ్మో ఇన్ని కాబట్టీ లు కాబట్టీ నేను మొన్న శనివారం ఆలంపూర్ వెళ్ళాను.
ఉదయాన్నే సికంద్రాబాద్-కర్నూల్ టౌన్ తుంగభద్రా ఎక్స్ప్రెస్ లో ప్రయాణం. రైలు బండి ఉదయం 7:30 కు సికంద్రాబాద్ లో బయల్దేరి 8 కల్లా ఫలక్నుమా కు చేరుకుంది. అక్కడి నుండీ రైలు లో దాదాపు అయిదేళ్ళనుండి సుపరిచితమయిన రూటే కాబట్టీ అలా చూస్తూ కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను.








సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైలు శ్రీ బాలబ్రహ్మేశ్వర  జోగుళాంబా హాల్ట్ స్టేషన్ కు చేరింది. ఇక్కడ నుండి ఆలంపూరు ఒక 15 కి.మీ. లు ఉంటుంది. రైల్వే స్టేషన్ నిర్మాణం ఇంకా జరుగలేదు, ప్లాట్ఫాం కూడా లేదీ స్టేషనుకి. కానీ దగ్గర్లో ఉండే దాదాపు ౨౦ గ్రామాలకు ఇదే రైల్వే స్టేషన్ లేదా మరో పదిహేను కిలోమీటర్లు ప్రయాణించి కర్నూల్ వెళ్ళి రైలు ఎక్కాలి. తుంగభద్రా పుష్కరాల సమయం నుండి, ఇక్కడ పలు రైళ్ళను ఆపుతున్నారట. రైలు ఒక రెండు నిమిషాలు స్టేషన్లో ఆపారు. అక్కడక్కడ కూర్చోడానికి ఇనప కుర్చీలు, ఒక కంట్రోల్ రూం మినహా ఇంకేమీ లేవిక్కడ. కర్నూల్ వైపుకు స్టేషన్ ను ఆనుకొని ఆలంపూర్-కర్నూల్ రహదారి కలదు, ఇది ముందుకు వెళ్ళి ఎన్.హెచ్-౭ లో కలుస్తుంది.

రోడ్-రైలు లైనులు కలుస్తాయి కాబట్టి, ఇక్కడ ఒక రైల్వే గేట్ ఒకటి ఉంది. ఈ గేటు వద్దే ఆలంపూర్ కు వెళ్ళేందుకు షేర్ ఆటోలు, ప్రైవేటు ట్యాక్సీలు, వ్యానులు ఇంకా ఆర్టీసీ బస్సులు కలవు. నేను దిగిన సమయం మధ్యాహ్న విరామ సమయం కాబోలు గంట వరకూ ఒక్క బస్సు కూడా రాలేదు. 
ఇంకా కాసేపు ఆగి ఉంటే ఆకలికి నా పని అయిపోయేది, అందుకని బలవంతంగా ఒక షేర్ ఆటోలో ఆలంపూర్ చేరాను. చేరాక తెలిసింది, ఇక్కడ వసతికి కాదు కదా తినడానికి కూడా మంచి హోటెల్స్ ఏమీ లేవట. ఒకటి రెండు చిన్నపాటి భోజన హోటల్స్ ఉన్నాయి. అందులో ఒకటి మొహమ్మదీయులది బస్శ్టాండ్ నుండి అమ్మవారి గుడి వైపు వెళుతుండగా మొదట వచ్చే గాంఢీ బొమ్మ సర్కిల్ వద్ద ఉంది. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళాక కుడి వైపుగా వెళితే మరలా ఎడమ మలుపు, అక్కడ మరో సర్కిల్, అక్కడ ఆలంపూర్ పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడే ఒక హిందూ హోటల్ కూడా కలదు. అక్కడ భోజనం చేసి, గుడి వైపుకి బయల్దేరాను. బస్ స్టాండు నుండి మహా అయితే ఒక అర కిలోమీటరు ఉంటుంది ఏమో.
మొదటగా శిధిలాల్లో ఉన్నా నవబ్రహ్మేశ్వర దేవాలయాలు కనిపించాయి. ఇంకాస్త ముందుకు వెళితే ఒక పదడుగులు వేసాక, ఎడమ పక్కన మూడు శిథిలాల్లో ఉన్నా దేవాలయాలు, కుడి పక్క ఆర్కేలాజికల్ సర్వే వారి సంగ్రహాలయం, దానికి ముందు, బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం, బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం పక్కన మరో నాలుగు విమాన గోపురాలతో సహా ఉన్న నవబ్రహ్మేశ్వరాలయాలు. ఇంకొన్ని విమానగోపురాల్లేని ఆలయాలు, పక్కనే ఆధునిక రంగులతో రెండు గోపురాల మధ్య గల జోగుళాంబా ఆలయం.
ముందుగా జోగుళాంబా ఆలయానికి వెళ్ళాను.
ఈ ఆలయం ఉదయాన్నే తెరుస్తారట, మధ్యాహనం ఒక గంట విరామం(౧ నుండి ౨ వరకు) తరువాత సాయంత్రం ౯ వరకు తెరిచే ఉంటుందిట. నిత్యం కుంకుమార్చనలు జరుగుతూనే ఉంటాయి. నేను వెళ్ళిన సమయంలోనే కొందరు యువతులు తెచ్చుకున్నా తినుబండారాలు, చాక్లేట్లు, పర్సు మొబైల్ ఫోన్ తోసహా అన్ని తస్కరించి కోతులు నానా అల్లరి చేస్తున్నాయి. వాటిని బుజ్జగించటంలో ఆలయ పూజారి మొదలు అందరూ నిమగ్నులయిపోయారు. దాదాపు అరగంట తరువాత పూజారి వచ్చి కుంకుమార్చన చేసి, అక్షత ప్రసాదాలు ఇచ్చారు.
అమ్మవారు రౌద్ర రూపం, ఉగ్రంగా ఉంటారు. ప్రస్తుతం ఉన్నది శాంత మూర్తి అని పూజారి అంటున్నా నాకమ్మ వారు చాలా భీతికరంగా అనిపించారు. తలపై పాపిడిలో రెండు బల్లులు, తేలు, పుర్రె, గబ్బిళం, మెడలో పుర్రెల మాల, కూర్చున్నది ఒక శవం పైన, అందునా ప్రేతాసనంలో. కోరలు, నాలుక బయటకి పెట్టి, పెద్ద కళ్ళతో. కొంచెం సేపు భయం వేసింది. దృష్టి మరల్చి గడపకై చూసాను, కింద మనిషి తల, పైన ఒక పుర్రె దాని కుడి వైపు రెండు బల్లులు, ఎడమ వైపు గబ్బిళం తేలు, కిందనే కోతీ పాములు పరస్పరం సంఘర్షణ చేస్తున్న దృశ్యం. ఇక చుట్టూ చూసాను, ఆధునికంగా కట్టిన గుడి, స్థంబాలపై, అష్టాదశ శక్తి పీఠాల్లో వెలసిన అమ్మ వారి రూపలు తీర్చిదిద్దారు. అలానే ఎదురుంగా సప్తమాతృకలను, వినాయకుణ్ణి చెక్కి ఉంచారు.
సతీ దేవి తనువు చాలించాక ఆవిడ కళేబరాన్ని ఎత్తుకుని ప్రళయ నాట్యమాడుతున్న శివుడ్ని వారించటానికి శ్రీమహావిష్ణువు సుదర్శన ప్రయోగం చెయ్యగా అమ్మవారి శరీరభాగాలు భూమిపై వివిధ క్షేత్రాల్లో పడి శక్తి పీఠాలుగా మారాయని ప్రతీతి. ఇవి 51 అని కొందరు, కాదు 18  అని కొందరి వాదన. రెండు నమ్మికల ప్రకారమూ, అమ్మవారి పై దంత పంక్తి ఇక్కడ జోగుళాంబా క్షేత్రంలో తుంగ-భద్రా-కృష్ణా త్రివేణీ సంగమ క్షేత్రంలో పడిందని ప్రతీతి.
అక్షత ప్రసాదలను తీస్కొని, నేను అయ్యవారి గుడివైపు వెళ్ళాను. ఇక్కడ స్పర్శ దర్శనం ఉంది.
బాలబ్రహ్మేశ్వర ఆలయం ఆధునిక గుడిలా లేదు. దీని ప్రాచీనత్వాన్ని కాపాడి అలా ఉంచేసారు. ఈ ఆలయం ఉదయం మొదలు సాయంత్రం వరకూ తెరిచే ఉంటుందట. నేను వెళ్ళిన సమయానికి నా వద్ద నా బ్యాగ్ గట్రా ఉండటం చేత, గర్భగృహంలోకి వెళ్ళలేదు. బయట బ్యాగు పెట్టి స్పర్శ దర్శనం చేస్కుందాం అనుకునే లోపే రెండు సార్లు కోతులు నా బ్యాగుని నా చేతిలో ఉండగానే లాక్కెళ్ళటానికి ప్రయత్నించాయి. అందుకని నేను బయటి నుండే దర్శనం చేస్కుని, ప్రదక్షినం చేసాను. ఆలయ వెలుపల గోడల పై ప్రాచీన శిల్పుల అద్భుతాలు కొలువుతీరాయి. అతి ప్రాచీన వినాయకుడా అనిపించాడు విఘ్నేశ్వరుడు.
రెండు ప్రదక్షిణ మార్గాలతో ఈ ఆలయం ప్రాచీన చండా ప్రదక్షిణ కు అనుకూలంగా ఉంది.
దర్శన-తీర్థ-ప్రసాదాల తరువాత గుడి బయటకు వచ్చాను. ఈ క్షేత్ర లడ్డూ పులిహోర ప్రసాదాలు ఈ ఆలయంలోనే దొరుకుతాయి.
నేను కొనుక్కున్నా ప్రసాదాలు మర్కటార్పణం అయ్యాయి.
ఇక్కడి నుండి నేను సంగ్రహాలయానికి అలానే శిథిలాల్లో ఉన్న ఇతర దేవాలయాలను చూడటానికి ఉపక్రమించాను.





సంగ్రహాలయం చాలా చిన్నది కేవలం ౩ రూఁ రుసుము తో ఇది చూడొచ్చు. ఇక్కడ శిథిలాల్లో బయలపడిన విగ్రహాలను ఉంచారు. మహిశాసుర మర్ధినీ, శివుడు, నటరాజు, సూర్యుడు, విష్ణువు, సప్త మాతృకలు, గంధర్వులు, యక్షులు, అష్ట దిక్పాలకులు, లకులేశుడు, మునులు, ఇంకా ఎన్నో శిలాశాసనాలు, ఇక్కడ ఉన్నాయి.
నన్నిక్కడ అన్నిటికంటే ఎక్కువగా ఆకట్టుకున్నది, దక్షిణా మూర్తి, ఇంకా నటరాజ శిల్పాలు, వివిధ రకాలుగా ఉన్న మహిశాసుర మర్ధిని, విష్ణువు.























తరువాత నేను సంగ్రహాలయం బయటకు వచ్చి, తుంగభద్రా పుష్క్ర గట్టు వైపుకు వెళ్ళను. కర్నూలులో లా కాక ఇక్కడ పుష్కరాలకు నిర్మించిన మెట్లు ఇంకా యథాప్రకారం ఉన్నాయి. వరదల ప్రభావం వీటిపై లేదు. 
నీరు కూడా బాగానే ఉంది. 
అక్కడ తెప్ప పై ఇక్కడుండే మత్స్యకారులు నదీ విహారానికి తీసుకెళ్తారు. సమయాభావం వల్ల నేను వెళ్ళలేదు. ఇక్కడి నుండి ఒక ౨౦ కి.మీ. ల దూరంలో త్రివేణీ సంగమం ఉందట. అక్కడకూ వెళ్ళేందుకు సమయం సరిపోదని వెళ్ళలేదు. ఇప్పుడిక్కడొక వంతెన నిర్మాణం లో ఉంది, మరో పది పిల్లార్లు వేస్తే నిర్మాణం పూర్తవుతుందట, ఈ వంతెన ద్వారా శ్రీశైలం కు హైదరాబాద్ కు మధ్య ప్రత్యామ్నాయ మార్గం వస్తుందని ఇక్కడి మత్స్యకారులు చెప్పారు.
కాసేపయ్యాక తిరుగుప్రయాణానికి కర్నూల్ చేరుకున్నాను.






6 comments:

  1. బావుంది. అదృష్టవంతులు

    ReplyDelete
  2. well written, thanks for writing it

    ReplyDelete
  3. Very informative. బాగా రాసారు.
    అవును, కొన్ని చోట్ల రౌద్ర రూపాలను శాంతమూర్తులని చెప్పడం నేనూ విన్నాను. ఎందుచేత? అని నేను అడిగినప్పుడు మంచి సమాధానాలేవీ దొరకలేదు.
    కోతుల అల్లరి మాత్రం చెప్పలేనిది :(.

    ReplyDelete
  4. కొత్త పాళీ గారూ, కిరణ్ గారూ ధన్యవాదాలు.

    మానస గారూ ధన్యవాదాలు. ఇక్కడ అసలు విగ్రహం ఇంకా భయంకరంగా ఉంటుందట, ఆ విగ్రహం యొక్క ప్రతిరూపాలను ద్వారపాలకులుగా చూడొచ్చు. అలా పోల్చుకుంటే అమ్మవారి రౌద్ర మూర్తి శాంత మూర్తనే చెప్పుకోవచ్చు. ఈ విషయం నాకూ సరిగ్గా తెలీదండీ. :(. ఔను కోతుల అల్లరి చాలా ఎక్కువ!

    ReplyDelete
  5. వెళ్ళాల్సిన ప్లేసస్ లిస్టులో ఇంకో చోటు చేరుకుంది. ఇంట్రెస్టింగా వర్ణించావు. ఫోటోలు ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా గుడీ, నదీ ఫోటోలు భలే ఉన్నాయి.

    రాసి మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు, రహ్మాను :)

    ReplyDelete
  6. రహ్మాన్ గారు, మీ ఆసక్తి అత్యంత ముదావహం.

    ముందుగా

    విశిష్టాద్వైతం అంటే

    శ్రీమన్నారాయణుడు ప్రకృతి (తల్లి), జీవుడు ముగ్గురు కలిసి ఉంటారని ప్రతిపాదించేది.

    ఎందరో తమకు నచ్చింది చెబుతున్నారు. అలా కాక వేదమే ప్రమాణంగా తీసుకుని వివరించిన కింది లింక్ చూడండి.

    మీ సందేహాలు ఎమైనా ఉంటె పూర్తిగా తీరుతాయి.

    https://sites.google.com/site/jaisrimannaaraayana/veda-margam/vaidhika-dharma-vivida-siddantalu

    ReplyDelete