Showing posts with label సమస్య. Show all posts
Showing posts with label సమస్య. Show all posts

Tuesday, May 27, 2014

మోసగాళ్ళుంటారు జాగ్రత్త

సుజాత గారి ప్లస్ పోస్ట్ (https://plus.google.com/u/0/photos/113352906292796986132/albums/6017926039705877633 మీరావిడ సర్కిల్స్ లో ఉంటే కనిపిస్తుంది) చూసి అందులో అజ్ఞాత వ్యక్తులతో మోసపోయిన రాధిక గారి వృత్తాంతం చదివాక, నా తిరుపతి అనుభవం చెప్పాలనిపించి ఇక్కడ రాస్తున్నాను.

విజయవాడ నుండి బెంగుళూరు వెళ్ళాలి. హౌరా-బెంగుళూరు ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 3-4 ప్రాంతంలో ఎక్కాను. రైలు కిక్కిరిసి ఉంది. ఓఢ్ర దేశం వారు కుక్కినట్టూ ఉన్నారు, ముగ్గురి బెర్త్ లో ఐదుగురం కూర్చొని ప్రయాణిస్తున్నాం. "రిజర్వేషన్ పెట్టె కదా మీరు పక్కకు వెళ్ళండి" అనే కర్కశ కఠోర మనసు కాదు మనదేమో! పైగా ఒకే కుటుంబంలో ముగ్గురు మగరాయుళ్ళు, ఇద్దరు పురిటి నొప్పులు తీరని ఆడవాళ్ళు, వెరసి ఇద్దరు చంటిపిల్లలు, మరో ముగ్గురు పిల్లలూను.
ఉయ్యాల(లు) కట్టారు, పిల్లల అరుపులు, ఏడుపులు, ఒడియా వారి సహజ దేహ దుర్వాసనలు, ఉమ్ములూ, కిళ్ళీ నవలటాలూ, వారి ఆహారపు వాసనలు వెరసి ఆ రైలు ప్రయాణం ఇక దండగ, నిద్ర పట్టదు అని నిశ్చయించుకున్నా (కొంచెం అడ్జస్ట్ అయి కూర్చోగలరు, మిడిల్ బెర్త్ బెడ్ తీస్తే ఉయ్యాలలు డిస్టర్బ్ అవుతాయి అని అభ్యర్థన - నాది మిడిల్ బెర్తే!) మరుసటి రోజు ఆఫీసులో పొద్దున్నే ప్రోయాక్టివ్ గా ఉండాలి అందుకని తిరుపతి రాగానే రైలు దిగేసి, బస్సు పట్టుకుని బెంగుళూరు వెళదామని నిశ్చయించుకున్నాను.
అర్ధరాత్రికి తిరుపతి వచ్చింది, స్టేషన్ లో దిగేసి, తిరుమల అందాలను చూసుకుంటూ స్టేషన్ బయటకు వచ్చాను. బస్ స్టాండ్ దగ్గరే (ఓ అర కిలోమీటర్ ఉంటుందేమో) కదా అని నడిచి వెళదామనుకున్నాను. విష్ణు నివాసం తరువాత సన్నని మలుపు ఉంది. అక్కడ ఒక 25-30 యేళ్ళ వ్యక్తి ఎదురయ్యాడు. తాగి ఉన్నాడు. పలకరించాడు. తాగి ఉన్న వాళ్ళంటే నాకెందుకో చాలా అసహ్యం. చిన్నప్పుడు మా నాన్న గారు ఇంకెవరికో ఇద్దామని ఆర్మీ క్యాంటీన్ లో కొని తెచ్చిన రెండు బాటిల్స్ ని కింద ఘాట్టిగా పడేసి పగలకొట్టాను. ఆ తరువాత మరెందరితోనో కాలేజీ రోజుల్లో మాట్లాడ్డం, పలకరించడం మానేసాను - వాళ్ళు ఆల్కహాలిక్కులు అనీ. కచేరీల్లో చేరాక వారితో కో-ఎగ్జిస్ట్ అవటం నేర్చుకున్నాను కానీ, అసహ్యమే.
సరే చిరాగ్గానే ఏమిటి అని అడిగాను. ఆ వ్యక్తి చెప్పటం ఆరంభించాడు.

"నా పేరు ఫలానా, నేను హైదరాబాదులో ఉంటున్నాను. ఫలానా కచేరీలో పని చేస్తున్నాను. తిరుమలకు దర్శనానికి వచ్చాను. నా పర్సు, డబ్బులూ అన్నీ పోయాయి అన్నాడు. "
మరి తాగున్నావు, అదేమిటీ అని అడిగాను.
"అదా! నాకు వారాంతాలు తాగడం అలవాటు."
"భగవంతుని సన్నిధిలోనే!"
"చెప్పాగా, టెంప్ట్ అయ్యాను, అలవాటు మానుకోలేక పోయాను."
(వీడెవదో దొరికాడు, ఇప్పటికిప్పుడు బెంగుళూరు బస్సెక్కితే ఏ 5 గం॥లకో చేరతాను, మళ్ళీ మంచమెక్కానంటే నిద్రలోకి వెళ్ళి ఈ రోజు ఆఫీసు వెళ్ళలేను, నిద్రెలాగూ పోయింది, కాస్త ఎంటర్టెయిన్మెంట్ మిగిలిద్ది, వీడితో 3 వరకూ ఉండి ఆ పై బస్సెక్కుదాం అని అనిపించింది, అనిపించినదే తడవు సంభాషణ పెంచాను)
"సరే అబ్బాయీ ఇప్పుడేం కావాలి?"
"అదే పర్సు పోయింది, హైదరాబాదు దాకా వెళ్ళాలి, డబ్బు సాయం చేస్తే మీ ఫోను బ్యాలెన్స్ వేస్తాను."
"నాకు పోరిదోస్తులు లేరబ్బా, ఫోనులో 10 రూ వేసినా నెలంతా ఉంటాది. ఇంకో మాట చెప్పు."
"సరే, నీ అకౌంట్ నంబర్ ఇప్పిచ్చావనుకో, బ్యాంకులో డబ్బులు జమ చేస్తాను."
"ఏమయ్యా సాఫ్టువేరీవంటున్నావు, ఆ మాత్రం తెలీదా నెట్ బ్యాంకింగ్ వగైరా ల గురించి."
"ఆఁ! తెలుసు తెలుసు, ఎందుకు తెలీదూ. నీ బ్యాంక్ డీటెయ్ల్స్, ఐఎఫెస్సీ కోడ్ తో సహా చెప్పు, రేపు హైదరాబాదు చేరంగానే వేసేస్తాను."
"ఎప్పుడు ప్రయాణం"
"ఏం చెప్పమంటారు, పర్సు ఖాళీ అ<... పర్సు పోయింది, మీరు డబ్బిప్పిస్తే వెంటనే ఏ రైలు అందితే అది, జెన్రల్ లో ఎక్కి వెళ్ళిపోతాను. హైదరాబాదు వెళ్ళంగానే మొదటి పని నెట్ ఓపెన్ చేసి మీకు డబ్బు పంపటమే."
"సరే, ఎంత డబ్బు కావాలి?"
"ప్రయాణానికి సరిపడా!"
"ప్రయాణం టికెట్ కొనిస్తే సరిపోద్దా?"
"అంటే జేబులో పైసా లేదు, రోజు ప్రయాణం, తిండికీ, నీళ్ళకీ...."
"సరే అబ్బాయీ, చూద్దాం పద. నా వద్ద జేబులో డబ్బు లేదు. ఏటీఎం నుండి తియ్యాలి. బస్ స్టాండ్ కీ రైల్వే స్టేషన్ కీ మధ్య ఉన్నాం. నువ్వెలాగో ట్రెయిన్ లో వెళతానంటున్నావు, టికెట్ నేనే తీసిస్తాను. పై ఖర్చులకు ఇంకో రెండొందలిస్తాను."
"సరే!"
"సరే, ఇంతకీ సాఫ్టువేరీలో ఏం చేస్తున్నావు?"
"మీరూ సాఫ్టువేరేనా?"
"నేనేమైతే ఎందుకు? అయినా చెబుతున్నాను విను. నేను సాఫ్టువేరు వాడినే, కానీ బకానాం హంసః గాడిని. సాఫ్టువేరుకి మించే పని చేస్తున్నానులే!"
వాడికి కాసేపు నేనేమన్నానో అర్ధం కాలేదు. బిక్కమొహం పెట్టేసాడు.
"నా సంగతి సర్లే ఏదో భాషాభిమానమూ యౌవన ఆవేశం కలిసొచ్చి ఏదో చేస్తున్నాను, నీ సంగతి చెప్పు"
"నేనా, టెస్టింగ్ ఇంజనీర్ ని."
"ఇంకా?"
"ఈ మధ్యనే ఒక ఆర్నెల్ల క్రితం పెళ్ళయింది. అమ్మాయి వాళ్ళ నాన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఆఫీసరు. బాగానే కట్నం ముట్టింది. హైదరాబాదులో 3 బెడ్ రూం ఫ్లాట్ వచ్చింది. అమ్మాయి గ్రూప్స్ కి సిద్ధమవుతుంది. నా ప్యాకేజీ కేవలం నెలకు పాతిక, మిగితా ఖర్చులన్నీ మామగారే ఇస్తున్నారు. ఇంట్లో పప్పు-ఉప్పు అన్నీ మాకు ఊరు నుండే పంపిస్తున్నారు. జీతం తక్కువగా ఉందని, ఆన్సైటు ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళాలని అనుకున్నాను. వైజాగ్ లో ఒక కన్సల్టెన్సీ ఉంది స్నేహితుడే దానికి సీఈఓ. మూడు అడిగారు పంపడానికి. అంతా ఓకే అయి ఇలా మంచి జరిగిందని స్వామి వారిని చూద్దామని వచ్చాను. అలవాటు ప్రకారం పబ్ కి వెళ్ళాను, పర్స్ అవీ అలా టేబుల్ మీద పెట్టి బార్ టెండర్ దగ్గరికి వెళ్ళి షాట్స్ తీసుకున్నాను?"
"షాట్స్ అంటే?"
"తరువాత చెబ్తాను. తిరిగి వచ్చి చూస్తే పర్సు లేదు. ఇదే హైదరాబాదు అయి ఉంటే తీసుకున్నవాడి తోలు వలిపించే వాడ్ని. రేపు స్వామి వారి దర్శనానికి వెళ్ళాలనుకున్నాను. ఇప్పుడంతా వృథా. తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. స్వామి దర్శనం చేసుకోకుండా తిరుపతి వచ్చి వెళ్ళిపోతున్నాను. ఏం ఉపద్రవం తల మీదకు వస్తుందో!"
నాకూ అలా అనిపించింది. కాస్సేపు ఆలోచించాను.
"సరే, మీరంత బాధ పడవద్దు, ఇద్దరం కలిసే దర్శనానికి వెళదాం. నేను ఖర్చులన్నీ పెట్టుకుంటాను."
"అయ్యో అంత శ్రమ మీకెందుకు. డబ్బిప్పించండి, హైదరాబాదు వెళ్ళి తిరిగి వచ్చి దర్శనం చేసుకుంటాను. నా డబ్బుతో నేనే దర్శనానికి రావాలి."
"దేవుడే మిమ్మల్ని రప్పించుకుంటున్నాడనుకోండి. కాలి నడకన పైకి వెళదాం. ఆపై వసతి అవసరం లేదు. నడకకు ముందు, విష్ణు నివాసంలోనో, శ్రీనివాసం లోనో డార్మ్స్ లో పడుకుందాం, ఫ్రీ. తిరిగి వచ్చాక హైదరాబాదు వరకూ వెళ్ళే రైలు ఎక్కించే బాధ్యత నాది. కావాలంటే మీతో పాటుగా హైదరాబాద్ వస్తాను."
వాడు సంశయిస్తూ ఓకే అన్నాడు.
"సరే అలిపిరి కి వెళ్దామా, శ్రీవారి మెట్టుకా"
"నాకు తెలీదు, నేనెప్పుడు నడిచి వెళ్ళలేదు."
ఈ లోపు ఏటీఎం వచ్చింది. డబ్బు డ్రా చేసాను. టికెట్ తీసి ఇచ్చాను.
తెల్లవారున కృష్ణా ఎక్స్ప్రెస్ కి వెళ్ళిపోతానన్నాడు. అదేమిటీ ఇప్పుడేగా దర్శనం చేసుకోవాలనుకున్నాం, అంటే లేదు నాకు మూడ్ లేదు, తిరుపతి వచ్చి తాగాను, ఘోర పాపం చేసాను. ఈ పాపి దర్శనానికి అనర్హుడు అన్నాడు. సర్లెద్దు, నేను నీ పాపాన్ని మూటగట్టుకుంటా, పద ముందు దర్శనానికి వెళదాం అన్నాను. కాస్సేపు స్టేషన్ లో కూర్చుందాం అన్నాడు. ఇంకొంచెం చెప్పుకొచ్చాడు.
"మాది చాలా బీద కుటుంబం, కానీ చౌదరింట పుట్టాను. రోషం-పౌరుషం ఎక్కువ. డబ్బు కోసం దిగజారే కుటుంబం కాదు మాది. అడుక్కోటం అస్సలు రాదు. " ఇంకేదేదో చెప్పాడు.
"ఇదంతా ఇప్పుడెందుకు?"
"ఆఁ, మీకు నా మీద అనుమానం గా ఉంది. అందుకనే డబ్బు బదులు టికెట్ ఇస్తున్నారు."
"లేదు, లేదు. నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. తాగి ఉన్నావు. నీ వద్ద ఎవరయినా రుబాబు రాయుళ్ళు వచ్చి ఉన్న డబ్బంతా తీసుకుపోతే? టికెట్ అయితే ఏ కానిస్టేబులూ తీసుకుపోడుగా..."
"సరే, ఇంకా దర్శనానికి వెళదామా"
"ఇప్పుడేగా దర్శనం వద్దు రేపు ఉదయం తెల్లవారుఝాము రైలెక్కుతానన్నావు?"
"లేదు, వెళదాం"
"సరే, పద"
విష్ణు నివాసం ముందు వైపుకు ఆటోలు ఉంటాయని అటు నడుస్తుండగా, గోవిందరాజస్వామి కోనేరు ముందున్న గేటు లోంచి లోపలికి పోదాం అని సంజ్ఞ చేసాడు. నేను ఫాలో అయ్యాను.
అక్కడ అరుగు మీద నడుము వాల్చుదామన్నాడు, సరే అన్నాను.
ఒక గాలి ఆడే చోట మెట్ల మీద కూర్చున్నాం. అతడు ఒక వేపు చూపించి అక్కడ సీసీ కెమెరా ఉంది, ఒకవేళ మనం నిద్ర మగతలో ఉన్నా మన సామానులు సేఫ్ అన్నాడు. అలిపిరి తెలీని వాడికి ఈ విష్ణునివాసంలో కెమెరాలు ఎలా తెలుసబ్బా అని అనుకుంటూ ఉండగా.
"లేదు సర్, నేను హైదరాబాద్ వెళ్ళాలి. నా ఫోనులో బ్యాలెన్స్ అయిపోయింది, మా ఆవిడ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు."
"నేను బ్యాలెన్స్ వేయిస్తాగా, అయినా దర్శనం అయినంత సేపూ ఫోన్ వాడముగా, కౌంటర్ లో ఉంటుంది. మీ వాళ్ళు అర్ధం చేసుకుంటారులే. దర్శనానికి మనం ఎంత త్వరగా మొదలయితే అంత మేలు."
"లేదు, నాకు చాలా పనులు ముందుకు వెళ్ళవు."
అప్పుడే నాకు ఏదో తోచి, ఫోన్ చూసుకున్నాను. ఆఫీసుకు త్వరగా రావాలని మెసేజ్ ఉంది. సర్లే అని నేను కూడా తగ్గాను.
"సరే, పద. నన్ను బస్ స్టాండ్ వద్ద విడిచి, నువ్వు రైల్వే స్టేషన్ కి వెళ్దూ."
"అన్నట్టూ మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు."
"పర్వాలేదయ్యా!"
"లేదు ఇవ్వండి"
"సరే!"
అతనో పుస్తకం చేతిలో పెట్టాడు. అందులో పేజీలో మూణ్ణాలుగు చోట్ల పేరూ-ఫోన్ నంబర్ లేదా పేరూ-బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇంకా ఏవేవో అంకెలూ రాసున్నాయి. మధ్యలో ఓ ఖాళీ పేజీ ఇచ్చి రాయమన్నాడు. మళ్ళీ అనుమానం పడితే వీడు ఏడ్చేస్తాడేమో అని ఏం అనలేదు. వ్రాస్తూ ఆలోచిస్తున్నాను ఏ అకౌంట్ వివరాలివ్వాలా, అమ్మదా లేక నాదా అనీ.
అంతలో అంత అనుమానమెందుకు ఇవీ నా సెర్టిఫికేట్స్ చూడండి అని నా చేతికిచ్చాడు.
"ఎంబరాస్ చెయ్యకురా స్వామీ!"
అన్నీ తిరుపతివి, వాడేమో వైజాగ్ వాడిని, హైదరాబాదులో ఉంటున్నాను అని చెప్పాడు. సర్లే మళ్ళీ ఏడుస్తాడేమో అని ఏం అనలేదు.
ఇక వీడు మోసగాడే అని రూఢీ చేసుకుని, పై డబ్బు ఏమీ ఇవ్వలేదు.
వీడి శోకులు మరీ ఎక్కువయ్యాయి, బస్ స్టాండ్ కి వెళ్ళే దారిలో ఓ పాన్ షాప్ వద్ద సిగరెట్ ఇంకా గమ్  కొన్నాడు. వాటి డబ్బులూ నన్నే అడిగాడు, అయిష్టంగానే ఇచ్చాను. తాగే వాళ్ళంటే ఎంత అసహ్యమో స్మోక్ చేసే వాళ్ళంటే అంతకు రెట్టింపు కోపం నాకు. వాళ్ళు చావక ఎదుటి వాళ్ళను చంపుతారు.
సర్లే నిండా మునిగాక చలి ఉంటుందా?
ఎలాగూ 200 టికెట్ కిచ్చి మోసబోయాను అని అనుకున్నాక ఈ పదీ పరకా ఒక లెక్కా?
బస్ స్టాండ్ వచ్చింది.
ఇద్దరం కృత్రిమంగా నవ్వులు మార్చుకొని, టాటాలు చెప్పుకున్నాం.
ఆ అబ్బాయి మెల్లి మెల్లిగా నా కనుచూపు నుండి మాయమవుతున్నాడు, దూరంగా దూరదూరంగా వెళిపోతన్నాడు.
నేను వెంబడించాను. రైల్వే స్టేషన్ వైపుకి వెళుతున్నాడు.
"ఛ! జెన్యున్ అబ్బాయే! అనవసరంగా అనుమాన పడ్డాను."
అని నా మీద నాకే అసహ్యం వేసింది.
సర్లె ఆ రెండొందలూ ఇద్దామని వెళ్ళాను. పిలుపుకందనంత దూరంలో ఉన్నాడు.
ఇంకాస్త దూరం వెళ్ళాక అతను రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించాడు.
నేను మరింత సమీపించాను. అతడి మాటలు వినపడేంతగా.
టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు.
కౌంటర్ లో నేను కొనిచ్చిన టికెట్ ఇచ్చి.
"క్యాన్సిల్ చెయ్యండి. ఎంత డబ్బు వస్తుంది?"
"190"
"ఇవ్వండి."
నా కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. కాళ్ళ కింద నేల జారినంత పనయ్యింది... 

Monday, September 19, 2011

మన ప్రస్తుత సామాజిక దుఃస్థితి

ప్రశాంత్ గారి ఆంగ్ల బ్లాగు "No green grass on the other bank" సౌజన్యంతో


http://prasanthias.wordpress.com/2011/09/13/the-long-pole/ అను ఈ బ్లాగు చదివిన వెంటనే నన్ను ఎంతో ప్రభావితం చేసింది, ఇది మన తెలుగు లో కూడా ఉండాలని ఈ టపా రాస్తున్నాను.

అనగనగా ఒక సుదూరపు పల్లె లో ఒక సింహం సివంగి దంపతి నివసించేది. ఆ సింహం ఒక కృషీవలుడు, పొలంపని తప్ప మరేమీ తెలీనివాడు. సివంగి ఒకప్పుడు NREGA, తరువాత రోజుల్లో MGNREGA ద్వారా కూలి పని చేసుకునేది.
అదే గ్రామంలో ఉన్న పిల్లి షావుకారు గారి 50 ఎకరాల వరి పొలాన్ని సాగు చెయ్యడం మన సింహం గారి జీవని. ఇలా పిల్లి షావుకారు గారి వద్ద కౌలు చెయ్యటం వలన దిగుబడి లో సగభాగం షావుకారి వాటా అయ్యేది. ధాన్యం సాగులోని నష్టాలకు భరించలేక ఏ అరటో, చెఱుకో లేక పొగాకో సాగు చేద్దమనుకున్నాడు సింహం రైతు, కానీ భారత ప్రభుత్వ ధాన్యం భూమి మరియు మాగాణి రక్షణ చట్టం దీనిని అనుమతించదు. (కానీ అదే భూమిని ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేర ప్రైవేటు సంస్థలకు అప్పగించి అందులో ఎంత హానికరమయిన ఫ్యాక్టరీ ని పెట్టినా ప్రభుత్వానికి సమ్మతమే).
ఉడుత సేటు గారి వద్ద అతి ఎక్కువ మొత్తంలో అప్పు చేసినందుకు రైతు సింహం తన ఇల్లును ఉడుతకు SARFAESI Act. కింద అప్పగించాల్సి వచ్చింది.
పంచాయతీ ప్రెసిడెంటు పంది గారు రైతు సింహం కౌలు తీస్కున్న పొలంలోనే బస్టాండు, షాపింగు కాంప్లెక్సు, ఇంకా ఎయిర్పోర్ట్ ఉండాలని నిర్ణయించాడు. ఎందుకంటే ఆ పొలం చుట్టు పక్కల భూములన్నీ అప్పటికే పంది కులంలోని ఇతర పందులు కొనెయ్యటం లేదా కబ్జా చెయ్యటం చేస్సాయి.  ధాన్యం భూమి మరియు మాగాణి రక్షణ చట్టం ప్రకారం సాగు భూమి లో వాణిజ్యపరమయిన పనులు చేయరాదు, కేవలం ధాన్యం సాగుకు మాత్రమే ఆ భూమిని వాడాలి. కానీ సింహం-సివంగి తప్ప ఊరందరికీ ఎయిర్పోర్టు అవసరం కావల్సిన ఆవశ్యకత తెలిసొచ్చింది. అర్జెంటుగా ఊరికొక ఎయిర్పోర్టు కావాలి అన్నదై అందరి వాదన. ఆఖరికి ఊరి బిచ్చగాడయిన ఏనుగుకి కూడా తన సమీప భవిష్యత్తు దృష్ట్యా బస్టాండు-షాపింగ్ మాల్-ఎయిర్పోర్టు కావలని అనిపించింది. బహుళ సమ్మతి ఉంది కాబట్టి వెంటనే చట్టాన్ని రద్దు చెయ్యాలని గ్రామ పెద్దలంతా నిర్ణయం తీస్కున్నారు. టెండరు పిలిపించి ఎల్&టీ సంస్థకు చట్టాల దాగుడుమూతలు మొదలు బస్టాండు-షాపింగ్ కాంప్లెక్సు-ఎయిర్పోర్టు కట్టడం వరకూ అన్ని బాధ్యతలు అప్పగించారు. దీనిని కేవలం దోమ దళితులు మాత్రమే నిరసించారు, కానీ వారు మైనారిటీ లో ఉండటం వలన వారికి కావల్సినంత బలం లేనందున వారి మాటను ఎవరూ పట్టించుకోలేదు. పై పెచ్చు కొన్ని దోమలు చంపివేయబడ్డాయి. ఇదంతా చూస్తున్న మైనారిటీ కమిషన్ షాక్ వ్యక్తపరిచింది, ఆ షాక్ ద్వారా వచ్చిన కరెంటుని గ్రామంలోని అన్ని విద్యుద్దీపాలు వెలిగించడానికి ఉపయోగించారు గ్రామ పెద్దలు.
పోస్టుమ్యాను జెర్రి అప్పుడన్నాడు బలం-స్థాయి అన్నవి మురికి కూపాలు అవినీతి తో కూడుకున్నవి, మరియు పూర్తి బలం-పూర్తి స్థాయి పూర్తి మురికి కూపాలు పూర్తి అవినీతి తో కూడుకున్నవి. అందువల్ల ఊళ్ళో అవినీతి అనేది ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. ఊరికి వాయవ్యంలో గల చిట్టడవిలో ఉండే పెళ్ళికాని-ఎటువంటి బాంధవ్యాలు లేని గుడ్లగూబ ఈ పెరిగిపోతున్న అవినీతికి విరుద్ధంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. దీక్ష వలన ఆ ఊరి దశ మారింది. దీక్షాపరమయిన మార్పులు ఆ ఊర్లో చోటు చేస్కున్నాయి. ఆ ఊరు ఇంకా ఊరులా లేదు(గుడ్లగూబ దీక్ష ను చూడటానికి వచ్చే వాళ్ళ వల్ల, ఊరికి రోడ్లొచ్చాయి, సర్వ వసతులు సమకూరాయి, మీడియా వాళ్ళ సందడి అంతా ఇంతా కాదు. ఊర్లో పిల్ల వాడు తుమ్మినా ది న్యూస్ చానళ్ళు లైవ్ కవరేజ్ ఇవ్వటం మొదలేట్టాయి, ఊరి ప్రాచుర్యాన్ని చూసి అడుగు భూమి ధర అర కోటి అయింది). గుడ్లగూబ ఈ అవినీతి నంటటినీ చూడటానికి, చూసి నిర్మూలించటానికి ఒక పేద్ద స్తూపాన్ని ఊరి నడిబొడ్డున పెట్టమని ఊరిపెద్దలను కోరింది, ఊరిపెద్దలు సరేనన్నారు. గుడ్లగూబ తిరిగి తన చిట్టడవికి చేరింది. ఈ స్తూపాన్ని సింహాలు, పులులు, దోమలు ఉండే వీధులు మాత్రమే కనపడేలా ప్రతిష్టించిన ఊరి పెద్దలయిన పందులు ఉడుతలు, ఎప్పుడు పులులు , సింహాలు, దోమలు తప్పు చేసినా అప్పుడు స్తూపానికి ఒక పేద్ద భూతద్దాన్ని పెట్టి గుడ్లగూబకు జరిగిన తప్పును పది రెట్లు పెద్దదిగా చూపేవి. ఆ విధంగా పందుల నేపధ్యంలో మొత్తం పాలనా వ్యవస్థ సాగుతోంది.
కొద్ది రోజులకి సింహం చనిపోయింది. ఇంకొన్ని రోజుల తరువాత సివంగి కూడా చనిపోయింది. చనిపోని వారంతా ఆ ఊరిలో సుఖంగా బ్రతుకు జీవనం సాగించారు. పది సంవత్సరాల తరువాత ఆడిటర్లు 25 సింహాలు అంతరించిపోయాయి అన్న నివేదిక ను సమర్పించాయి.

Tuesday, October 5, 2010

కొత్తవారికి లినక్స్ పంపకం

ఇదివరకే  లినక్స్ పంపకాల గురించి ఇక్కడ చర్చ జరిగింది చూడగలరు.
అయితే విండోస్ కంటే ఎన్నో రెట్లు మేలయినదని అనుకుంటున్నాం కదా లినక్స్ ను
అందుకని లినక్స్ కు మారదామా అంటే ఒక పెద్ద చిక్కుప్రశ్న ఏపంపకం వాడాలి అని
పక్కింటి శ్రీను డెబియన్ ది బెస్ట్ అంటాడు ఎదురింటి రాజు ఫెడోరా బెటర్ దాన్ ది బెస్ట్ అంటాడు ,
ఇక మన హేచోడీ లేదా ప్రొఫెసర్ ఆయన వాడిన రెడ్ హ్యాట్ మాత్రమే ఒక అసలైన పంపకమనీ
మిగతావి వేస్ట్ అని కొట్టిపారేస్తాడు.
అయితే లినక్స్ వాడే వారికి అన్నిరకాల వేసులుబాట్లూ ఉంటాయి.
ఇన్ని చాయిస్లు ఉన్నయ్యంటే అది ఎంత బెస్ట్ అన్నది మీరే చెప్పగలరు
ఆ మధ్య ఒక టపాలో ఎవరో ఫ్రీ సాఫ్ట్వేర్ అంటున్నారు జీవితం లో అన్ని ఫ్రీగా రావు కదా అని
ఆయనకు ఈ టపా ఎలాగోలా చేరాలి ఆయన దీన్ని చదవాలి
ఆంగ్లం చాలా చిన్ని భాష, వారి దేశం ఎంత చిన్నదో బ్రిటీష్ వారి భాష కూడా అంటే చిన్నది
వారికి ఎక్కువ పదాలు లేవు
మనం స్వాతంత్ర్యం అన్నా, స్వేచ్ఛ అన్నా, ఉచితం అన్నా
ఈ మూడింటికీ వారి దగ్గర ఒక ఫ్రీ అన్న పదమే ఉంది
(ఇంకా చెప్పాలంటే మాకు ఒక ౬ పేజీల పాఠం హిందీ ౮వ తరగతిలో ఉంది అందులో కూడా ఇండెపెండెన్స్ డే అంటే  అపరతంత్ర దినోత్సవం అన్న అర్థం వస్తుంది కానీ మనం స్వాతంత్ర్యదినోత్సవం అంటాం అంటూ ఆరు పేజీల సుత్తి)
చెప్పొచ్చేదేమిటంటే ఫ్రీ అంటే అర్థం ఉచితం కాదు తండ్రీ, ఫ్రీ అంటే స్వేచ్ఛ


అయితే నా స్వంత పూచీ మీద మీరు ఉబుంటు ని కళ్ళు మూస్కుని సారీ కళ్ళు తెరిసే అనుసంధానం చేసేస్కోండి
ఒక వేల మీరు పూణే వాసులైతే నేనే మీ వద్దకొచ్చి ఉచిత(ఫ్రీ)ముగా చేసి పెడతాను
ఉబుంటు డెబియన్ ఆధారిత పంపకం
మనం గమనించాల్సిన విషయాలు ఏమిటంటే
ప్రతీ పంపకానికి కొన్ని ప్యాకేజేస్ ఉంటాయి
అవి ఎప్పుడెప్పుడు అప్డేట్ అవుతున్నాయి
వాడుకరులు ఎంతమంది ఉన్నారు వీరిలో ఎంతమంది అంతర్జాలంలో సహాయం చేస్తున్నారు
మనకు కావాల్సిన సాఫ్ట్వేర్లు ఆ పంపకంలో ఉన్నాయా
ఇవన్నీ ముందు తెలుసుకోండి
ఇక పొతే నా సలహా ఏమిటంటే ఒక వేల మీ వద్ద అంతర్జాలం అనుసంధానించి ఉంటే ఉబుంటు మేలు
లేదా డెబియన్ బావుంటుంది.
ఉబుంటూ లో మీరు కావాల్సిన అన్ని ప్యాకేజ్లను డౌన్లోడ్ చేస్కొని మీ డెస్క్టాప్ తో ఎన్నో చెయ్యవచ్చు
తెలుగు స్థానికీకరణ కూడా ఉబుంటు లో బాగుంటుంది
నేను ప్రస్తుతం 9.10 వాడుతున్నాను
ప్రతి ఏడు ఏప్రిల్ మరియూ అక్టోబర్లలో కొత్త వెర్షన్ వస్తుంది
ప్రస్తుతం 10.04 చలామణి లో ఉంది
ఇవాలో రేపో 10.10 రాబోతోంది
అయితే చాలా మంది 10.04 లో కొన్ని అవగుణాలున్నాయని చెప్పారు
సో 9.10 లో నాకేమి గ్లిచెస్ కనపడలేదు
మీరూ అదే వాడండీ !!!!