Tuesday, May 27, 2014

మోసగాళ్ళుంటారు జాగ్రత్త

సుజాత గారి ప్లస్ పోస్ట్ (https://plus.google.com/u/0/photos/113352906292796986132/albums/6017926039705877633 మీరావిడ సర్కిల్స్ లో ఉంటే కనిపిస్తుంది) చూసి అందులో అజ్ఞాత వ్యక్తులతో మోసపోయిన రాధిక గారి వృత్తాంతం చదివాక, నా తిరుపతి అనుభవం చెప్పాలనిపించి ఇక్కడ రాస్తున్నాను.

విజయవాడ నుండి బెంగుళూరు వెళ్ళాలి. హౌరా-బెంగుళూరు ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 3-4 ప్రాంతంలో ఎక్కాను. రైలు కిక్కిరిసి ఉంది. ఓఢ్ర దేశం వారు కుక్కినట్టూ ఉన్నారు, ముగ్గురి బెర్త్ లో ఐదుగురం కూర్చొని ప్రయాణిస్తున్నాం. "రిజర్వేషన్ పెట్టె కదా మీరు పక్కకు వెళ్ళండి" అనే కర్కశ కఠోర మనసు కాదు మనదేమో! పైగా ఒకే కుటుంబంలో ముగ్గురు మగరాయుళ్ళు, ఇద్దరు పురిటి నొప్పులు తీరని ఆడవాళ్ళు, వెరసి ఇద్దరు చంటిపిల్లలు, మరో ముగ్గురు పిల్లలూను.
ఉయ్యాల(లు) కట్టారు, పిల్లల అరుపులు, ఏడుపులు, ఒడియా వారి సహజ దేహ దుర్వాసనలు, ఉమ్ములూ, కిళ్ళీ నవలటాలూ, వారి ఆహారపు వాసనలు వెరసి ఆ రైలు ప్రయాణం ఇక దండగ, నిద్ర పట్టదు అని నిశ్చయించుకున్నా (కొంచెం అడ్జస్ట్ అయి కూర్చోగలరు, మిడిల్ బెర్త్ బెడ్ తీస్తే ఉయ్యాలలు డిస్టర్బ్ అవుతాయి అని అభ్యర్థన - నాది మిడిల్ బెర్తే!) మరుసటి రోజు ఆఫీసులో పొద్దున్నే ప్రోయాక్టివ్ గా ఉండాలి అందుకని తిరుపతి రాగానే రైలు దిగేసి, బస్సు పట్టుకుని బెంగుళూరు వెళదామని నిశ్చయించుకున్నాను.
అర్ధరాత్రికి తిరుపతి వచ్చింది, స్టేషన్ లో దిగేసి, తిరుమల అందాలను చూసుకుంటూ స్టేషన్ బయటకు వచ్చాను. బస్ స్టాండ్ దగ్గరే (ఓ అర కిలోమీటర్ ఉంటుందేమో) కదా అని నడిచి వెళదామనుకున్నాను. విష్ణు నివాసం తరువాత సన్నని మలుపు ఉంది. అక్కడ ఒక 25-30 యేళ్ళ వ్యక్తి ఎదురయ్యాడు. తాగి ఉన్నాడు. పలకరించాడు. తాగి ఉన్న వాళ్ళంటే నాకెందుకో చాలా అసహ్యం. చిన్నప్పుడు మా నాన్న గారు ఇంకెవరికో ఇద్దామని ఆర్మీ క్యాంటీన్ లో కొని తెచ్చిన రెండు బాటిల్స్ ని కింద ఘాట్టిగా పడేసి పగలకొట్టాను. ఆ తరువాత మరెందరితోనో కాలేజీ రోజుల్లో మాట్లాడ్డం, పలకరించడం మానేసాను - వాళ్ళు ఆల్కహాలిక్కులు అనీ. కచేరీల్లో చేరాక వారితో కో-ఎగ్జిస్ట్ అవటం నేర్చుకున్నాను కానీ, అసహ్యమే.
సరే చిరాగ్గానే ఏమిటి అని అడిగాను. ఆ వ్యక్తి చెప్పటం ఆరంభించాడు.

"నా పేరు ఫలానా, నేను హైదరాబాదులో ఉంటున్నాను. ఫలానా కచేరీలో పని చేస్తున్నాను. తిరుమలకు దర్శనానికి వచ్చాను. నా పర్సు, డబ్బులూ అన్నీ పోయాయి అన్నాడు. "
మరి తాగున్నావు, అదేమిటీ అని అడిగాను.
"అదా! నాకు వారాంతాలు తాగడం అలవాటు."
"భగవంతుని సన్నిధిలోనే!"
"చెప్పాగా, టెంప్ట్ అయ్యాను, అలవాటు మానుకోలేక పోయాను."
(వీడెవదో దొరికాడు, ఇప్పటికిప్పుడు బెంగుళూరు బస్సెక్కితే ఏ 5 గం॥లకో చేరతాను, మళ్ళీ మంచమెక్కానంటే నిద్రలోకి వెళ్ళి ఈ రోజు ఆఫీసు వెళ్ళలేను, నిద్రెలాగూ పోయింది, కాస్త ఎంటర్టెయిన్మెంట్ మిగిలిద్ది, వీడితో 3 వరకూ ఉండి ఆ పై బస్సెక్కుదాం అని అనిపించింది, అనిపించినదే తడవు సంభాషణ పెంచాను)
"సరే అబ్బాయీ ఇప్పుడేం కావాలి?"
"అదే పర్సు పోయింది, హైదరాబాదు దాకా వెళ్ళాలి, డబ్బు సాయం చేస్తే మీ ఫోను బ్యాలెన్స్ వేస్తాను."
"నాకు పోరిదోస్తులు లేరబ్బా, ఫోనులో 10 రూ వేసినా నెలంతా ఉంటాది. ఇంకో మాట చెప్పు."
"సరే, నీ అకౌంట్ నంబర్ ఇప్పిచ్చావనుకో, బ్యాంకులో డబ్బులు జమ చేస్తాను."
"ఏమయ్యా సాఫ్టువేరీవంటున్నావు, ఆ మాత్రం తెలీదా నెట్ బ్యాంకింగ్ వగైరా ల గురించి."
"ఆఁ! తెలుసు తెలుసు, ఎందుకు తెలీదూ. నీ బ్యాంక్ డీటెయ్ల్స్, ఐఎఫెస్సీ కోడ్ తో సహా చెప్పు, రేపు హైదరాబాదు చేరంగానే వేసేస్తాను."
"ఎప్పుడు ప్రయాణం"
"ఏం చెప్పమంటారు, పర్సు ఖాళీ అ<... పర్సు పోయింది, మీరు డబ్బిప్పిస్తే వెంటనే ఏ రైలు అందితే అది, జెన్రల్ లో ఎక్కి వెళ్ళిపోతాను. హైదరాబాదు వెళ్ళంగానే మొదటి పని నెట్ ఓపెన్ చేసి మీకు డబ్బు పంపటమే."
"సరే, ఎంత డబ్బు కావాలి?"
"ప్రయాణానికి సరిపడా!"
"ప్రయాణం టికెట్ కొనిస్తే సరిపోద్దా?"
"అంటే జేబులో పైసా లేదు, రోజు ప్రయాణం, తిండికీ, నీళ్ళకీ...."
"సరే అబ్బాయీ, చూద్దాం పద. నా వద్ద జేబులో డబ్బు లేదు. ఏటీఎం నుండి తియ్యాలి. బస్ స్టాండ్ కీ రైల్వే స్టేషన్ కీ మధ్య ఉన్నాం. నువ్వెలాగో ట్రెయిన్ లో వెళతానంటున్నావు, టికెట్ నేనే తీసిస్తాను. పై ఖర్చులకు ఇంకో రెండొందలిస్తాను."
"సరే!"
"సరే, ఇంతకీ సాఫ్టువేరీలో ఏం చేస్తున్నావు?"
"మీరూ సాఫ్టువేరేనా?"
"నేనేమైతే ఎందుకు? అయినా చెబుతున్నాను విను. నేను సాఫ్టువేరు వాడినే, కానీ బకానాం హంసః గాడిని. సాఫ్టువేరుకి మించే పని చేస్తున్నానులే!"
వాడికి కాసేపు నేనేమన్నానో అర్ధం కాలేదు. బిక్కమొహం పెట్టేసాడు.
"నా సంగతి సర్లే ఏదో భాషాభిమానమూ యౌవన ఆవేశం కలిసొచ్చి ఏదో చేస్తున్నాను, నీ సంగతి చెప్పు"
"నేనా, టెస్టింగ్ ఇంజనీర్ ని."
"ఇంకా?"
"ఈ మధ్యనే ఒక ఆర్నెల్ల క్రితం పెళ్ళయింది. అమ్మాయి వాళ్ళ నాన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఆఫీసరు. బాగానే కట్నం ముట్టింది. హైదరాబాదులో 3 బెడ్ రూం ఫ్లాట్ వచ్చింది. అమ్మాయి గ్రూప్స్ కి సిద్ధమవుతుంది. నా ప్యాకేజీ కేవలం నెలకు పాతిక, మిగితా ఖర్చులన్నీ మామగారే ఇస్తున్నారు. ఇంట్లో పప్పు-ఉప్పు అన్నీ మాకు ఊరు నుండే పంపిస్తున్నారు. జీతం తక్కువగా ఉందని, ఆన్సైటు ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళాలని అనుకున్నాను. వైజాగ్ లో ఒక కన్సల్టెన్సీ ఉంది స్నేహితుడే దానికి సీఈఓ. మూడు అడిగారు పంపడానికి. అంతా ఓకే అయి ఇలా మంచి జరిగిందని స్వామి వారిని చూద్దామని వచ్చాను. అలవాటు ప్రకారం పబ్ కి వెళ్ళాను, పర్స్ అవీ అలా టేబుల్ మీద పెట్టి బార్ టెండర్ దగ్గరికి వెళ్ళి షాట్స్ తీసుకున్నాను?"
"షాట్స్ అంటే?"
"తరువాత చెబ్తాను. తిరిగి వచ్చి చూస్తే పర్సు లేదు. ఇదే హైదరాబాదు అయి ఉంటే తీసుకున్నవాడి తోలు వలిపించే వాడ్ని. రేపు స్వామి వారి దర్శనానికి వెళ్ళాలనుకున్నాను. ఇప్పుడంతా వృథా. తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. స్వామి దర్శనం చేసుకోకుండా తిరుపతి వచ్చి వెళ్ళిపోతున్నాను. ఏం ఉపద్రవం తల మీదకు వస్తుందో!"
నాకూ అలా అనిపించింది. కాస్సేపు ఆలోచించాను.
"సరే, మీరంత బాధ పడవద్దు, ఇద్దరం కలిసే దర్శనానికి వెళదాం. నేను ఖర్చులన్నీ పెట్టుకుంటాను."
"అయ్యో అంత శ్రమ మీకెందుకు. డబ్బిప్పించండి, హైదరాబాదు వెళ్ళి తిరిగి వచ్చి దర్శనం చేసుకుంటాను. నా డబ్బుతో నేనే దర్శనానికి రావాలి."
"దేవుడే మిమ్మల్ని రప్పించుకుంటున్నాడనుకోండి. కాలి నడకన పైకి వెళదాం. ఆపై వసతి అవసరం లేదు. నడకకు ముందు, విష్ణు నివాసంలోనో, శ్రీనివాసం లోనో డార్మ్స్ లో పడుకుందాం, ఫ్రీ. తిరిగి వచ్చాక హైదరాబాదు వరకూ వెళ్ళే రైలు ఎక్కించే బాధ్యత నాది. కావాలంటే మీతో పాటుగా హైదరాబాద్ వస్తాను."
వాడు సంశయిస్తూ ఓకే అన్నాడు.
"సరే అలిపిరి కి వెళ్దామా, శ్రీవారి మెట్టుకా"
"నాకు తెలీదు, నేనెప్పుడు నడిచి వెళ్ళలేదు."
ఈ లోపు ఏటీఎం వచ్చింది. డబ్బు డ్రా చేసాను. టికెట్ తీసి ఇచ్చాను.
తెల్లవారున కృష్ణా ఎక్స్ప్రెస్ కి వెళ్ళిపోతానన్నాడు. అదేమిటీ ఇప్పుడేగా దర్శనం చేసుకోవాలనుకున్నాం, అంటే లేదు నాకు మూడ్ లేదు, తిరుపతి వచ్చి తాగాను, ఘోర పాపం చేసాను. ఈ పాపి దర్శనానికి అనర్హుడు అన్నాడు. సర్లెద్దు, నేను నీ పాపాన్ని మూటగట్టుకుంటా, పద ముందు దర్శనానికి వెళదాం అన్నాను. కాస్సేపు స్టేషన్ లో కూర్చుందాం అన్నాడు. ఇంకొంచెం చెప్పుకొచ్చాడు.
"మాది చాలా బీద కుటుంబం, కానీ చౌదరింట పుట్టాను. రోషం-పౌరుషం ఎక్కువ. డబ్బు కోసం దిగజారే కుటుంబం కాదు మాది. అడుక్కోటం అస్సలు రాదు. " ఇంకేదేదో చెప్పాడు.
"ఇదంతా ఇప్పుడెందుకు?"
"ఆఁ, మీకు నా మీద అనుమానం గా ఉంది. అందుకనే డబ్బు బదులు టికెట్ ఇస్తున్నారు."
"లేదు, లేదు. నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. తాగి ఉన్నావు. నీ వద్ద ఎవరయినా రుబాబు రాయుళ్ళు వచ్చి ఉన్న డబ్బంతా తీసుకుపోతే? టికెట్ అయితే ఏ కానిస్టేబులూ తీసుకుపోడుగా..."
"సరే, ఇంకా దర్శనానికి వెళదామా"
"ఇప్పుడేగా దర్శనం వద్దు రేపు ఉదయం తెల్లవారుఝాము రైలెక్కుతానన్నావు?"
"లేదు, వెళదాం"
"సరే, పద"
విష్ణు నివాసం ముందు వైపుకు ఆటోలు ఉంటాయని అటు నడుస్తుండగా, గోవిందరాజస్వామి కోనేరు ముందున్న గేటు లోంచి లోపలికి పోదాం అని సంజ్ఞ చేసాడు. నేను ఫాలో అయ్యాను.
అక్కడ అరుగు మీద నడుము వాల్చుదామన్నాడు, సరే అన్నాను.
ఒక గాలి ఆడే చోట మెట్ల మీద కూర్చున్నాం. అతడు ఒక వేపు చూపించి అక్కడ సీసీ కెమెరా ఉంది, ఒకవేళ మనం నిద్ర మగతలో ఉన్నా మన సామానులు సేఫ్ అన్నాడు. అలిపిరి తెలీని వాడికి ఈ విష్ణునివాసంలో కెమెరాలు ఎలా తెలుసబ్బా అని అనుకుంటూ ఉండగా.
"లేదు సర్, నేను హైదరాబాద్ వెళ్ళాలి. నా ఫోనులో బ్యాలెన్స్ అయిపోయింది, మా ఆవిడ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు."
"నేను బ్యాలెన్స్ వేయిస్తాగా, అయినా దర్శనం అయినంత సేపూ ఫోన్ వాడముగా, కౌంటర్ లో ఉంటుంది. మీ వాళ్ళు అర్ధం చేసుకుంటారులే. దర్శనానికి మనం ఎంత త్వరగా మొదలయితే అంత మేలు."
"లేదు, నాకు చాలా పనులు ముందుకు వెళ్ళవు."
అప్పుడే నాకు ఏదో తోచి, ఫోన్ చూసుకున్నాను. ఆఫీసుకు త్వరగా రావాలని మెసేజ్ ఉంది. సర్లే అని నేను కూడా తగ్గాను.
"సరే, పద. నన్ను బస్ స్టాండ్ వద్ద విడిచి, నువ్వు రైల్వే స్టేషన్ కి వెళ్దూ."
"అన్నట్టూ మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు."
"పర్వాలేదయ్యా!"
"లేదు ఇవ్వండి"
"సరే!"
అతనో పుస్తకం చేతిలో పెట్టాడు. అందులో పేజీలో మూణ్ణాలుగు చోట్ల పేరూ-ఫోన్ నంబర్ లేదా పేరూ-బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇంకా ఏవేవో అంకెలూ రాసున్నాయి. మధ్యలో ఓ ఖాళీ పేజీ ఇచ్చి రాయమన్నాడు. మళ్ళీ అనుమానం పడితే వీడు ఏడ్చేస్తాడేమో అని ఏం అనలేదు. వ్రాస్తూ ఆలోచిస్తున్నాను ఏ అకౌంట్ వివరాలివ్వాలా, అమ్మదా లేక నాదా అనీ.
అంతలో అంత అనుమానమెందుకు ఇవీ నా సెర్టిఫికేట్స్ చూడండి అని నా చేతికిచ్చాడు.
"ఎంబరాస్ చెయ్యకురా స్వామీ!"
అన్నీ తిరుపతివి, వాడేమో వైజాగ్ వాడిని, హైదరాబాదులో ఉంటున్నాను అని చెప్పాడు. సర్లే మళ్ళీ ఏడుస్తాడేమో అని ఏం అనలేదు.
ఇక వీడు మోసగాడే అని రూఢీ చేసుకుని, పై డబ్బు ఏమీ ఇవ్వలేదు.
వీడి శోకులు మరీ ఎక్కువయ్యాయి, బస్ స్టాండ్ కి వెళ్ళే దారిలో ఓ పాన్ షాప్ వద్ద సిగరెట్ ఇంకా గమ్  కొన్నాడు. వాటి డబ్బులూ నన్నే అడిగాడు, అయిష్టంగానే ఇచ్చాను. తాగే వాళ్ళంటే ఎంత అసహ్యమో స్మోక్ చేసే వాళ్ళంటే అంతకు రెట్టింపు కోపం నాకు. వాళ్ళు చావక ఎదుటి వాళ్ళను చంపుతారు.
సర్లే నిండా మునిగాక చలి ఉంటుందా?
ఎలాగూ 200 టికెట్ కిచ్చి మోసబోయాను అని అనుకున్నాక ఈ పదీ పరకా ఒక లెక్కా?
బస్ స్టాండ్ వచ్చింది.
ఇద్దరం కృత్రిమంగా నవ్వులు మార్చుకొని, టాటాలు చెప్పుకున్నాం.
ఆ అబ్బాయి మెల్లి మెల్లిగా నా కనుచూపు నుండి మాయమవుతున్నాడు, దూరంగా దూరదూరంగా వెళిపోతన్నాడు.
నేను వెంబడించాను. రైల్వే స్టేషన్ వైపుకి వెళుతున్నాడు.
"ఛ! జెన్యున్ అబ్బాయే! అనవసరంగా అనుమాన పడ్డాను."
అని నా మీద నాకే అసహ్యం వేసింది.
సర్లె ఆ రెండొందలూ ఇద్దామని వెళ్ళాను. పిలుపుకందనంత దూరంలో ఉన్నాడు.
ఇంకాస్త దూరం వెళ్ళాక అతను రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించాడు.
నేను మరింత సమీపించాను. అతడి మాటలు వినపడేంతగా.
టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు.
కౌంటర్ లో నేను కొనిచ్చిన టికెట్ ఇచ్చి.
"క్యాన్సిల్ చెయ్యండి. ఎంత డబ్బు వస్తుంది?"
"190"
"ఇవ్వండి."
నా కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. కాళ్ళ కింద నేల జారినంత పనయ్యింది... 

16 comments:

 1. ఎలా బతుకుతావో ఏమో తమ్మీ... ;(

  ReplyDelete
  Replies
  1. చూస్తున్నావుగా అన్నయ్యా, మళ్ళీ అడుగుతావే?

   Delete
 2. ఇలాంటి వారివల్ల, నిజంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళకి సహాయం చేయాలి అన్నా సంకోచించాల్సివస్తుంది. పైగా తిరుపతిలో ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ. కాబట్టి మీరు, ఇకపై ఇటువంటి వారిని కరుణించకండి.

  ReplyDelete
  Replies
  1. జెన్యూనా కాదా అని తేల్చుకోవడానికి చాలా మార్గాలనుసరించి ఆపైనే డబ్బులిస్తాను.
   ఆకలిగా ఉంది డబ్బివ్వమంటే ఆహారం కొనివ్వడం, ఇలా ప్రయాణానికి టికెట్ డబ్బుల్లేవంటే నేనే టికెట్ కొనివ్వడం చేస్తాను. అందువల్ల మోసపోవటానికి ఆస్కారం తక్కువే.

   Delete
 3. ఇలాంటి వారివల్లే, నిజంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలన్నా సంకోచించాల్సివస్తుంది. పైగా తిరుపతిలో ఇటువంటి వాళ్ళు చాలా ఎక్కువ. కాబట్టి ఇక పై మీరు, ఇటువంటి వారిని కరుణించకండి.

  ReplyDelete
 4. అదేంటో అందరు పర్స్ లు తిరుపతి లోనే పోతాయి , మీరు నడిచి వెళ్ళే దారిలో ఇంకొంతమంది కలిసేవారేమో మిమ్మల్ని . ఇదేదో కుటీర వ్యాపారం అనుకుంట , మొగుడు ఆఫీసు కి, ఆడాళ్ళు పిల్లల్ని తీసుకుని ఇలా మెట్ల దారిలో కూర్చుంటారు. దేవుని సన్నిధి కాబట్టి మన పాప భీతి వాళ్లకి అలా ఉపయోగపడుతుంది .

  :venkat

  ReplyDelete
  Replies
  1. వీరిలో చాలా మంది నిజంగానే డబ్బులు పోగొట్టుకున్నవారుంటారు. అందరినీ ఒకే గాటుకి కట్టలేం. కాకపోతే మోసం చేసే వారి సంఖ్యా హెచ్చే!

   Delete
 5. hmm నమ్మడం మన తప్పు కాదులే రెహ్మాన్ . కొన్ని సార్లు ఎన్ని విధాలా కూపీ లాగిన , అవతల వాడు చెప్పేది నిజమా కాదా అని అంచనా వేయడం కష్టం .మరీ టికెట్ కొనిస్తె కాన్సెల్ చేసి డబ్బు కాచేసే వాళ్ళుంటారని కల కంటామా !!! ఇలాంటివి వినప్పుడు అసలు నిజంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళకి నమ్మి సహాయం చేయడం కష్టం .

  ReplyDelete
  Replies
  1. సహాయం డబ్బు రూపేణా చెయ్యనంత వరకూ ఓకే!

   Delete
 6. రెహమానూ,

  గత 40 ఏళ్ళలోనూ నాకూ అలాటి అనుభవాలు ఎదురయ్యాయి. అందులో ఒకటైతే తిరుపతిలోనే. ఒకాయన వచ్చి పర్సుకొట్టేశారూ కొద్దిగా సహాయం చేస్తారా అని అడగ్గానే నేను ఆరోజుల్లో ( 1980s లో) afford చేయగలిగినంత అంటే 100 రూపాయలిచ్చాను. ఎడ్రసు ఇమ్మంటే ఇవ్వలేదు. అందరూ నవ్వుకున్నారు. కానీ అదే ప్రయాణంలో నేను తణుకు బస్ స్టాండులో నా పర్సు పోగొట్టుకున్నా. కానీ ఆశ్చర్యకరంగా ఒకబ్బాయి ఆ పర్సు పువ్వుల్లోపెట్టి తీసికొచ్చి ఇచ్చాడు. బహుశా, నేను తిరుపతిలో చేసిన సహాయానికి అ రూపంలో దేవుడు నన్ను కరుణించాడేమో అనుకున్నాను. ఇంకోసారి తాను తీసికున్న 100 రూపాయలూ ఏడాది తరువాత పంపించాడు. What do you say for this? By the way, అపాత్ర సహాయాలగురించి యాదృచ్చికంగా ఒక టపా వ్రాశాను నిన్ననే.. చూడు..

  ReplyDelete
  Replies
  1. ఒకసారి పులివెందుల నుండి మడకసిర వెళుతున్నపుడు, బస్సు హిందూపురం లో మారాల్సి వచ్చింది. అక్కడ బస్సులో నా పర్సు పడిపోతే, దానిని ఆ బస్సు కండక్టర్ బస్ స్టాండ్ బయట కాస్త దూరం నన్ను అనుసరించి మరీ తెచ్చిచ్చాడు. అందులో డబ్బూ, కార్డ్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ లోకంలో మోసగాళ్ళకూ కొదవ లేదు. టికెట్ కొనిచ్చినా అమ్ముకునే వారిని మొదటి సారి చూసానని అందరికీ చెబ్దామని ఈ టపా. అన్నట్టూ వాడిని నేను తిరుపతి లో దాదాపు 7-10 కి.మీ నడిపించాను.

   Delete
 7. ఇలాటివి చూసి చూసి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకు కూడా సాయం చేయాలంటే ఆలోచించాలి

  ఇలాటివే బ్లైండ్ స్కూల్స్ అని physically challengedవాళ్ళకి స్కూల్ అని, గుళ్ళకని అని ఇంటికి వచ్చి చూపించి మరీ డబ్బులు అడుగుతారు. అదేంటో సాయం చేసటపుడు తెలుస్తుంది వీడు టోపీ పెడుతున్నాడు అని intuition వల్లో లేక ఇంకో విధంగానో కానీ చెయ్యకుండా ఉండలేము

  చేసాక అపాత్ర దానం చేసామా అని అనిపిస్తుంది.

  ReplyDelete
 8. అసందర్భ ప్రేలాపన : ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళకి ఎన్నికలలో ఉత్తుత్తి హామీలు చేసే నాయకులకి తేడా లేదు.

  ReplyDelete
 9. నాకు కొండ మీద తిరుమలలో ఒకసారి ఇటువంటి అనుభవమే ఎదురయింది. ఈ రకంగా మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్న మనుష్యులు చాలా మంది కనిపించారు కూడా. తిరుమల తిరుపతుల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేవాలయాలున్న చోట కూడా ఈ పరిస్ధితి దురదృష్టకరం కాని వాస్తవం.

  అన్నట్లు మీ బ్లాగర్ ప్రొఫైల్ పిక్చర్ లో విశ్వనాధ సత్యనారాయణ గారి పోలికలు బాగా కనిపిస్తున్నాయే.

  ReplyDelete
  Replies
  1. అది రెహమాన్ ఫోటో కాదండీ. విశ్వనాథ వారిదే. అభిమానంతో అట్టా పెట్టుకున్నారాయన.

   Delete
 10. రెహమాన్ గారూ మరీ అంత మంచితనం ఐతే ఎలాగండీ. తిరుపతిలో దిగారంటే స్వామి దర్శనం కోసం ఓకే. ఓఢ్రుల కోసం మధ్య సీటు ఎందుకు వదిలేశారు మీరు?

  ReplyDelete