Friday, May 16, 2014

கோட்டைப்புரத்து வீடு (కోట్టైప్పురత్తు వీడు - కోటపురం మహల్)

ఇందిరా సౌందర్ రాజన్ నవలలు అంటే ఎప్పుడూ నాకు తెలీని ఒక ఆసక్తి. అతీత శక్తులు - నమ్మకాలు - చరిత్ర - సమాజం ఇతివృత్తాలుగా రాసే ఈయన నవలలు బహుశా ప్రతి ఒక్కరూ తప్పక వదలకుండా చదివే శక్తి కలిగి ఉంటాయంటే అతిశయోక్తి కాదేమో! రోమాలు నిక్కబొడుచుకునే విధంగా సస్పెన్స్ థ్రిల్లర్ లు రాయటంలో ఈయనది చెప్పుకోదగ్గ పేరు.
ముఖ్యంగా ఈయన రచనల్లో అరవనాటి స్థానిక గ్రామదేవతల కథ-కథనాలు కనిపిస్తాయి. రాచరికపు వ్యవస్థలు, రాజ్యాలు, రాజకుటుంబాల గురించి ప్రత్యేకంగా రాస్తారని చెప్పనక్కరలేదు. రహస్యం వరుసలో వచ్చిన రహస్యం-మర్మదేశం మొదలగు అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ సీరియళ్ళకు ముడి సరకు ఈయన రచనలే!
ఈ నవల విషయానికొస్తే, ఇది ఆనంద వికటన్ పత్రికలో 31 వారాల పాటూ సీరియల్ గా ప్రచురించబడింది. ఒక్కో వారం కొత్త ఉత్కంఠతో, కొత్త మలుపుతో మరింత ఆసక్తి కలిగిస్తూ, వచ్చే వారపు భాగాన్ని చదివేందుకు మరింత ఆసక్తిని కలిగించేలా రాసారు.
కోట్టైపురం రాజరికవంశం వారిపై వంజియమ్మ శాపం నడుమ జరిగే అర్చన - విసు ప్రేమాయణమే ఈ నవల. 
వంజియమ్మన్ కు జరిగిన దారుణాతి దారుణమయిన అన్యాయం, ఆమె భర్త హత్య, ఆమె బలాత్కారం ఆత్మహత్య, ఆ అనుసరణలో కోట్టైపురం రాజవంశంలో పుట్టిన అమ్మాయిలు పుట్టిన వెంటనే చనిపోవటం, అబ్బాయిలు వారి ముప్ఫయ్యవ యేట చనిపోవడం అనే శాపంతో కథ మొదలవుతుంది. తన అన్న గజేంద్రన్ చావు అంచులో‌(ముప్ఫ్య్యవ యేట అడుగిడుతూ)ఉండగా బెంగుళూరు నుండి విసు ఎయిర్పోర్ట్ లో దిగడం, అర్చన అతన్ని అక్కడికి కలవడానికి రావడం, రాజ మర్యాదలంటే ఆసక్తి లేని విసు కు సంస్థానంలోని ఉద్యోగుల వినమ్రతకూ మధ్య జరిగే సంఘర్షణ ముందుగా కనిపిస్తుంది.
ఆపై విసు అన్న చనిపోవడం, అందుకు కారణం అందరూ శాపమని నమ్ముతున్నా ఒక్క అర్చన ఈ విషయాన్ని మానవకల్పితమనీ, ఒక కుట్ర జరుగుతుందనీ పసిగట్టడం, ఆపై మహల్లో మరిన్ని మరణాలు, విసుపై హత్యా ప్రయత్నాల నడుమ నవల ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. కొన్ని సందర్భాలలో పాత్రలు హేతువాదాన్ని వీడి శాపాలలో అతీత శక్తులలో నమ్మకం పెంచుకుంటారు కూడా. మళ్ళీ తిరిగి లౌక్యంగా ఆలోచిస్తారు.
అర్చన చాకచక్యంగా ఏ విధంగా విసు ను ఈ కుట్ర నుండి లేదా దేవత శాపం నుండి కాపాడుతుందో అన్నది మిగితా నవలలో ఆసక్తికర భాగం!
320 పేజీలు వదలకుండా చదివిస్తాయి!

1 comment:


  1. వదల కుండా చదివిస్తుందని ఒప్పుకుంటాను కాని, వీరి రచనలు మరీ బ్రెయిన్ వాషింగు టైపు . ఒక్కింత ఈ కాలం లో ఇట్లాంటి రచనలు చదివి బుర్ర పాడు జేసు కోవాలా అన్నది నా కర్థం కాని విషయం రెండు, వీరి రచనలు టీ వీ సీరియళ్ళ రూపం లో అరవ లోకాన్ని మళ్ళీ మూడ నమ్మకాల వైపు తిప్పుతోందని అనటం లో సందేహం ఏమాత్రం లేదు

    జిలేబి

    ReplyDelete