Thursday, May 1, 2014

వీరవల్లడు

కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారి రచనలకు సంబంధించి పాఠకులలో ఎన్నో అపోహలు. ఆ అపోహల వల్ల అసలు ఆయన సాహిత్యాన్ని చదివే అదృష్టాన్ని కోల్పోవడం పరిపాటి.
కవి సామ్రాట్ రచనల గురించి జనబాహుళ్యంలో ఉన్న కొన్ని అంశాలు:

  1. ఈయన రచనలన్నీ అర్ధం కాని భాషలో ఉంటాయి.
  2. చదవటానికి సాధ్యం కానంత పెద్ద పరిమాణంలో ఉంటాయి. (కనీసం వెయ్యి పేజీలుంటాయి)
  3. ఒక కులాన్ని సాహిత్యం ద్వారా గ్లోరిఫై చేయడం. నిమ్న కులాల ఊసు ఆ సాహిత్యంలో ఉండదు.
ఇలాంటివి ఇంకెన్నో...
అయితే
ఈ వీరవల్లడు నవల పైన చెప్పుకున్న అంశాలను పటాపంచలు చేసే పుస్తకం.
వ్యావహారిక భాషలో రాయబడి, చదవటానికెలాంటి ఇబ్బందీ ఉండదు (విశ్వనాథ వారి సాహిత్య భాష గురించి కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై గారి వద్ద సరికొత్త వాదన విన్నాను - ఆ చర్చ వేరే టపాలో).
62 పేజీలు (అదీ చిన్న పేజీలు- ఇప్పుడున్న పుస్తకంలో 40 పేజీలే) గల పుస్తకం. ఒక నిమ్న కుల వ్యక్తిని గ్లోరిఫై చేస్తూ రాయబడిన పుస్తకం.

కథలోకి వెళితే ఒక విద్యార్థి పేరును వాళ్ళ మాస్టారు హేళన చేయడం "వల్లడా, వల్లకాడా" అనడంతో ఆ విద్యార్థికి రోషం వచ్చి ఇంటికొచ్చి పేరు మార్చుకోవాలనుందని పట్టుబట్టడం- ఆ పేరు ఒక పాలేరు పేరని తెలిసి మరింతా మారం చేయడం జరుగుతుంది. ఆ పేరు, ఆ పేరుగల వ్యక్తి వీరవల్లడి కథను ఆ పిల్లోడికి తండ్రి చెబుతాడు.
బ్రాహ్మణ కుల పెద్దల దొంగ న్యాయాలకు తన యజమాని మరణానంతరం యజమాని కుటుంబం వీధిపాలవటం సహించలేక, ఊరంతటినీ ఒక్క తాటి మీదకి తెచ్చి సరియయిన న్యాయం ఇప్పించడం ఆ కథ. ఆనాటి కుల కట్టుబాట్లూ, గ్రామ్య జీవనం, భూమి వ్యవహారాలు రచయిత కథ ద్వారా చక్కగా చెప్పగలిగాడు.
కృష్ణమ్మను ఎంతో మనోహరంగా చిత్రీకరించి కళ్ళముందుంచడం నాకు చాలా నచ్చింది.

ఇక ఆలస్యం దేనికీ వెంటనే మీరూ ఈ పుస్తకాన్ని చదివేయండి.

  

No comments:

Post a Comment