Wednesday, July 17, 2013

పసిఫిక్ రిమ్ అనబడే ఓ ఆంగ్ల చిత్రరాజము

బ్లాగ్మిత్రుల ప్రోద్బలంతో వారి సహవాసంలో, మామూలుగా థియెటర్ కి వెళ్ళి సినిమాలు చూడని నేను, బెంగుళూరులోని బెల్లందూరు సెంట్రల్ లో ఈ సినిమా చూడటం జరిగింది. 3D సినిమా అనుకొని వెళితే ఆ హాలువాడు అటూ ఇటూ కత్తిరించి తెరలో మూడులో రెండితల తెరపైనే సినిమాను నడిపాడు. చిన్న తెర, పైగా అటూఇటూ కత్తిరించేసి, ఓ పెద్ద సైజు 40" స్క్రీనున్న హోం థియేటర్ లో సినిమా చూసిన ఫీల్ వ్వచ్చింది. ఇక ఆ థియేటర్ లోని ఇతర సదుపాయాలు పరమ చెత్తగా ఉన్న విషయం గుర్తుంచుకోవాలి. సినిమా తెరల ప్రాంగణంలో ఒక పెద్ద కొలాజ్ ఏర్పాటు చేసాడు. అది అందరు సినీ తారలను పెట్టాలని చేసాడో, లేక ఆ హాలులో ఆడిన సినిమాల నటీ నటూల ఫుటోలో తెలీదు కానీ, ఫుటోల ఎంపికలో చాలా లోటు ఉంది, మా అన్నయ్య తన అభిమాన నటుడి ఫుటో కోసం ఓ నాలుగు మార్లు అన్ని ఫుటోలు పరికించి లేడని నిర్ధారించుకున్నాక ఆ నటుడు వీరెవరికీ సాటి రాడు, అందుకని వీరి మధ్య అతనికి స్థానం అనవసరమని సంతృప్తి పడ్డాడు. థియేటర్ వాడి మరో పొదుపు చిట్కా మధ్యమధ్యలో ఏసీ ఆపివేయటం మాత్రం నాకూరికే ఉక్కపోసేలా చేసింది. ఇక సినిమా కథలోకి వస్తే, కైజూలనబడే గ్రహాంతరవాసులు సమీప భవిష్యత్తు(అంటే 2017 ప్రాంతంలో) పసిఫిక్ సముద్రం అడుగులోని మహాద్వీపాంతర భూతల పొరలనుండి పైకి వచ్చి తీరనగరాలను నాశనం చేస్తాయి. నాశనం అంటే అలా ఇలా కాదు; ఏకంగా శాన్‍ఫ్రాన్సిస్కో లోని వంతెనని కూల్చివేయడం లక్షల మంది జనాభాను చంపేయటం వగైరా. ఈ తెలీని వింత జంతువులను కట్టడి చేసి మట్టుబెట్టేందుకు భారీ స్థాయిలో యేగర్ అనే మహామఱమానవులని నిర్మించి, వాటిని నియంత్రించేందుకు ఇద్దరు మనుషులను పైలట్లుగా ఉంచి, వారి మెదడుల్లోని ఆలోచనలను ఒకరిది మరొకరితో మిళితం చేసి ఆ వచ్చిన మహా మస్తిష్క శక్తి ద్వారా ఈ యేగర్లను నడుపుతారు. (ఒంటరి పైలట్ తో చేసిన పరిశోధనలలో ఒక మనిషి మెదడు తట్టుకోలేక పోతే, ఆ యేగర్ యంత్రం కుడి భాగం ఒకరు, ఎడమ భాగం ఒకరు నియంత్రించేలా అదే సమయంలో ఒకరి ఆలోచనలు మరొకరు అన్వయించుకునేలా సిద్ధం చేస్తారు శాస్త్రజ్ఞులు). మొదట్లో కైజూలు ఒక మోస్తరుగా పుష్కరానికి ఒకటి చ్ప్పున, తర్వాత్తర్వాత మరింత తక్కువ వ్యవధిలో దాడులు చేయటం మొదలు పెడతాయి. ఈ యేగర్లు కూడా మొదట్లో కైజూలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నా, తర్వాత్తర్వాత కైజూలు యేగర్ల దాడులకి తగ్గట్టూ సిద్ధమయి రావటం మొదలుపెడతాయి. దాంతో ప్రపంచ నాయకుల సమాఖ్య యేగర్లను రద్దు చేసి తీరాల్లో గోడలు కట్టడం మొదలుపెట్టడానికి మొగ్గు చూపుతుంది. ఆ గోడల నిర్మాణం అయ్యే వరకూ రక్షణగా మిగిలిన నాలుగు యేగర్లను నియమిస్తారు. కానీ ఆ నాలుగిటినీ నడిపేందుకు సమర్ధమయిన వారు లెక్కకు సరిపోరు. దీంతో యేగర్ల కూతగాడు(కమాండర్) స్టాకర్ పెంటకోస్ట్ ఒక ప్లాన్ ను రూపొందించి అణుశక్తితో కైజూలను చంపాలని పథకమేస్తాడు. కొన్నేళ్ళ క్రితం కైజూను మట్టుపెడుతూ యేగర్ ను నడుపుతున్న వారిలో ఒకడయిన రాలీ బెకెట్ ను ఆశ్రయిస్తాడు పెంటెకోస్ట్. అదే పోరులో తన అన్నను పోగొట్టుకుని అతని ఆలోచనల సంఘర్షణలో యేగర్ ప్రాజెక్ట్ ను వదిలి గోడ కడుతున్న సిబ్బందిలో మామూలు కూలీగా ఉన్న రాలీ పెంటేకోస్ట్ అభ్యర్థన మేరకు తిరిగి వచ్చేందుకు, యేగర్ ను నడిపేందుకు ఒప్పుకుంటాడు. హాంగ్ కాంగ్ వద్ద ఉన్న గోడ కట్టే ప్రదేశం, పక్కనే ఉన్న యేగర్ల ప్రయోగశాలకు వెళతారు. అక్కడ మాకో మొరి అనే అమ్మాయి రాలీకి తారసపడుతుంది. ఆవిడని తన పక్కన యేగర్ కోపైలట్ గా ఎంచుకుంటాడు రాలీ. వీరిద్దరూ యేగర్ లోకి ప్రవేశించినప్పుడు ఆమె ఆలోచనలలో మిళితమయినపుడు ఆమె గతం గురించి తెలుసుకుని, ఆమె పెంటెకోస్ట్ పెంచుకున్నామె అని తెలుసుకుంటాడు. రెట్టించిన ఉత్సాహంతో యేగర్లను తుదముట్టించేందుకు సిద్ధమవుతాడు. అదే సమయంలో కైజూలపై పరిశోధన చేస్తున్న ఇద్దరు వైజ్ఞానికులు తమ పరిశోధన ఫలితాలను తెలిపి విస్తుపోతారు. న్యూటన్ గిజ్లర్ ఒక న్యూరోశాస్త్రజ్ఞుడు తన మెదడులోని ఆలోచనలను యేగర్లో జరిగే పద్ధతిలో కైజూమెదడుకి అనుసంధానం చేస్తాడు తద్వారా కైజూలను తుదముట్టించే ఉపాయం ఇస్తాడు. మొత్తానికి పెంటెకోస్ట్ ప్రాణార్పణ, రాలీ మికోల యేగర్ లోని అణు బాంబుతో శత్రు కైజూ స్థావరాన్ని పూర్తిగా నాశనం చేసి వీరిద్దరూ బయట పడటంతో సినిమా సుఖాంతమవుతుంది. అయితే ఎంతటి సాంకేతిక కల్పనయినా సాంకేతిక పరిమితులను 70లలోకి తీసుకుపోయి చూపించడం నాకు నచ్చలేదు. రాబోయే రోజుల్లో సాంకేతికంగా ఆయుధాలు సినిమాలో చూపించిన దానికంటే ఎన్నో రెట్లు మెరుగ్గా, మానవరహితంగా తయారవుతాయని ఇట్టే ఊహించొచ్చు. మొత్తం మీద బావుంది!

2 comments:



  1. Please share for our future

    https://www.change.org/en-IN/petitions/government-of-india-ministry-of-finance-department-of-financial-services-not-to-keep-a-criteria-of-60-marks-in-grad-for-hring-of-officers-in-psbs#share

    ReplyDelete
  2. తమ్మీ.. నీ తెలుగు ఎంత బాగుందో.. పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పావు గా.. ;)

    సినీమాక్స్ వాడూ రేట్లు తగ్గించాడుట. వీక్డేస్ లో 50,80 రూపాయలే టిక్కెట్టు అట. అందుకే సగం ఏసీ.

    ఇహ మా అభిమాన హీరో కుఠో లేనందుకు ఆనందించాను ;)

    ReplyDelete