Tuesday, September 10, 2013

వేయి పడగలు-విశ్వనాథ మరియు నేనూను

ఒక చిన్ననాటి జ్ఞాపకం
ఒక చిన్న పుస్తకం, మామయ్య పుస్తకాల్లో కనిపించింది. అందులోని కొన్ని; కాదు కాదు చాలా పదాలు నాకు అర్ధమవలేదు, ఆ పుస్తకాన్ని ఒక పక్కన పెట్టేసాను.
***
పాత పుస్తకాల దుకాణంలో ఒక లావుపాటి పుస్తకం ఉంది, తెరిచి చూడాలేదు తెలుగు కాబట్టీ - ఇది నేను తొమ్మిదో తరగతి చదివే రోజుల సంగతి. స్కూల్ లో తెలుగు లేదు కాబట్టీ తెలుగు చదవాలనే ఆసక్తి - ఎక్కువ బొమ్మలున్న చందమామలాంటి పుస్తకాలకే పరిమితం, బొమ్మల్లేని పుస్తకాలు సుద్ద-దండగ అనిపించేవి. ఆ పుస్తకం వేయిపడగలు! అదే మొదటి సారి చూడటం.
***
దూరదర్శన్ లో సుమ ఒక సీరియల్ లో వచ్చేది. అందులో భర్త ఉప్పివ్వమన్నప్పుడు లవణం అని అంటుంది. ఈమేంటి ఉప్పుని లవణం అంటుంది అని హేళనగా చెప్పుకున్న రోజులు; ఉన్నట్టుండి ఒకమ్మాయి జుట్టు విరబోసుకొని వేపమండలతో పరుగెడుతున్న సన్నివేశం చూసి భయపడటం - పదో తరగతి పరీక్షల తరువాతి శెలవు దినాలు. అది వేయి పడగలు సీరియల్!
 ***
ఇంజనీరింగ్ చదువుతున్న రోజులు, కాలేజీ ఉన్న ఊళ్ళో ఇతర వ్యాపకాలు లేకపోవడంతో జిల్లా గ్రంథాలయంలో చేరి అన్ని రకాల తెలుగు పుస్తకాలు చదువుతున్న రోజులు. స్నేహితుల ప్రభావం వల్ల ఎన్నో విలువయిన పుస్తకాలు తెలుగువీ-ఇంగ్లిష్ వీ కనుగొని చదివి మురిసిపోతున్న రోజులు. వేయి పడగలు పుస్తకం గురించి ఇక్కడ స్నేహితులలో ఒకడు కచ్చితంగా చదవాల్సిన పుస్తకం అనడంతో పుస్తకంపై కాస్త ఆసక్తి కలిగింది, కానీ పుస్తకం ఎప్పుడూ ఎవరో ఒకరి ఖాతాలో ఉండేది - మళ్ళీ అనాసక్తి.
***
2009 పుస్తక ప్రదర్శన, మొదటిసారి ఇలాంటి ప్రదర్శనకు రావటం జరిగింది. ఈ-తెలుగు సభ్యులను కలవడం - వీవెన్ ని అంతకు ముందే కలిసినా, సుజాతగారినీ, సతీశ్ యనమండ్ర గారినీ, చక్రవర్తి గారినీ కలిసింది మొదట అక్కడే, పక్కనే నవోదయ స్టాల్ లో మొట్ట మొదటి సారి పూర్తి పుస్తకం చూసాను - వేయి పడగలు విశ్వనాథ సత్యనారాయణ అనే పేర్లను, కొందామని పుస్తాం చేతులోకి ఎత్తుకొని, ధర చూసి తిరిగి పెట్టేసాను. విద్యార్థులకు కథల పుస్తకాలు చదువుకునేందుకిచ్చే డబ్బుకు ఆ పుస్తకం అందలేదు మరి-ఆ రోజుల్లో!
***
2010 పుస్తక ప్రదర్శన సంపాదన చేతికొచ్చిన రోజులు, ఈ-తెలుగు స్టాల్ కి ఇంతకు ముందు ఒక రోజు వెళితే, ఈ మారు వారం రోజులు వెళ్ళిన సందర్భం, కానీ ఏ స్టాల్ లోనూ వేయిపడగలు దొరకలేదు, జీతం అందిన మొదటి రోజు నుండీ సరిగ్గా ఆరు నెలలు, పుస్తకం కొందామని తెచ్చిన డబ్బుతో హ్యారీ పాటర్, మరికొన్ని పుస్తకాలు కొని నిరాశతో ఇంటికి చేరాను.
ఒక రోజు పుస్తక ప్రదర్శనకు భరణి గారు రావడం, నా ల్యాపీలో కౌటిల్య తన బ్లాగులో విశ్వనాథ గారి పై రాసిన విషయాలు సిగ్గుపడుతూ భరణి గారికి చూపించడం గమనించాను. ఈ కుఱచబ్బాయితో స్నేహం చేసి ఎలాగయినా వేయిపడగలు సాధించి చదవాలనుకున్నాను. 
తరువాతి రోజు అడిగితే ప్రస్తుతం నా వద్ద లేదు గుంటూరొస్తే ఇస్తా అన్నాడు. 
లేదు నాకిప్పుడే కావాలి అని నిలదీస్తే నాగ ప్రసాద్ అనే సాములోరు వద్ద ఉంది తీసుకో అన్నాడు.
***
పుస్తక ప్రదర్శన ముగిసింది. ఈ నాగ ప్రసాద్ విలాసం అగమ్యగోచరంగా ఉంది.
మొత్తానికి ఒక రోజు సాములోరు ఉండే స్థావరానికి దగ్గరలో ఉన్న హాస్టల్లో నేను చేరడంతో ఏ జన్మ సుకృతి ఫలమో వేయిపడగలు మొదటి సారి నా చేతికందింది. అందిందే తడవుగా మొదటి మూడు అధ్యాయాలు చదివేసాను.
భాష కొత్తగా-వింతగా ఉంది, చదవగా చదవగా మరింత రుచించింది. కానీ నాలుగవ-అయిదవ అధ్యాయాలు కొంచెం మందచదువుగా చప్పగా సాగాయి. ఎనిమిదో అధ్యాయం వరకూ చదివాక పుస్తకం కొన్ని రోజులు కనపడకుండా పోయింది.  చెప్పలేనంత దిగులు వచ్చింది. రోజువారీ పనుల్లో మళ్ళీ పడిపోయి పుస్తకం సంగతి మరిచాను.
మళ్ళీ కొన్ని రోజులకి పుస్తకం దొరికింది మందకొడిగా చదువుతూ ఆసక్తిగానే మొత్తానికి ఒక ఆరు నెలల్లో పుస్తకం చదవడం ముగించాను.
గుంటూరు తరచు వెళ్ళడం మొదలయ్యాక కుఱచబ్బాయిని కలవటం ఎక్కువయింది. విశ్వనాథ గురించిన జ్ఞానమూ పెరిగింది. డీఎల్ఐ, కౌటిల్య, పాత పుస్తకాల కొట్ల పుణ్యమా అని విశ్వనాథ వారి సాహిత్యం మరింత చదవగలిగాను.
వేయిపడగలు ఎంత నచ్చిందంటే, ఇప్పటికీ ఎవరయినా ఏదయినా తెలుగు పుస్తకం చదవడానికి సలహా అడిగితే మొదటగా ఈ పుస్తకాన్నే చదమంటాను.
మా ఇంట్లో మామయ్యతో-అమ్మతో చదివించాను. ఓ మూడు కాపీలు కొని మరీ స్నేహితులకిచ్చాను కూడా.
ఇప్పటికీ ఏదో ఆలోచిస్తూ వేయిపడగలు తెరిచి చదివితే ఆ రోజు తలతొలిచేస్తున్న సమస్యకు సమాధానం దొరుకుతుంది.
విశ్వనాథ వారు రాసిన ఎన్ని గ్రంథాలున్నా, అన్నిట్లో పెక్కు గొప్పదీ వేయి పడగలు.
నా అవగాహనలో పుస్తకం చదవకుండానే పుస్తకం పై విమర్శలు గుప్పించొచ్చు అని నిరూపించిన పుస్తకాలలో వేయిపడగలు మొదటిది, రెండవదయిన చెలియలికట్ట కూడా విశ్వనాథ రచనే అవటం గమనార్హం. 
వేయిపడగల రచనా శైలి చాలా సులువు, భాష అలవాటయ్యాక చదవనలవవుతుంది.
పాత్రలు మనకూ, మన జీవితాలకూ ఎంతో దగ్గరగా ఉంటాయి. ఒక్కో పాత్రపైనా మరో పుస్తకమే రాయవచ్చు. 
ప్రతి సన్నివేశాన్ని ఊహించుకొని సంతోషించి, నాలో నేనే నవ్వుకున్న రోజులున్నాయి.
ఒక తెలీని ఉద్వేగం వేయిపడగలు చదివిన ప్రతి సారీ నాలో కలుగుతుంది.
ఒకానొక వ్యక్తి ఒక రచయిత రచనొకటి చదివి మిగితా రచనలు దీనికి తీసిపోయేవిగా ఉంటే ఆ రచయితను నిందించవచ్చనే భయంతో సదరు రచయిత మిగితా రచనలు చదవలేదుట. వేయిపడగల విషయంలో నేను మొదట అదే అనుకున్నాను. కానీ కామకోటి వారి సైట్ లో నా రాముడు చదివాక అలాంటి ఆలోచనలకి దూరంగా నిలవాలనుకున్నాను.

హాహాహూహూ, విష్ణుశర్మ ఇంగ్లిష్ చదువు, మా స్వామి, ఆంధ్ర ప్రశస్తి, ఏకవీర, ప్రళయనాయుడు, చిన్న కథలు ఇప్పటి వరకూ చదివిన ఇతర రచనలు.
2011 లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు విజయవాడ వెళ్ళినపుడు, కస్తూరి మురళీకృష్ణ గారు, కోడిహళ్ళి మురళీమోహన్ గారూ, శ్రీకాంత్ గారూ, నేను ఇంకా కుఱచబ్బాయి కౌటిల్య కలిసి విశ్వనాథ గారి ఇంటిని సందర్శించాము కూడా. అక్కడ మురళీకృష్ణ గారూ, మురళీమోహన్ గారి నుండి విశ్వనాథ వారి గురించి మరింత తెలుసుకోగలిగాను.
ఆ ఇంటిని స్మారకం చేయాలని కృష్ణాజిల్లా రచయితల సంఘం వారు ప్రతిపాదిస్తే, అది తిరస్కరించి అక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్ ను నడుపుతూ ఇటివలే విశ్వనాథ వారి జైవిక వారసులు ఆ ఇంటి వద్దే ఉంటున్నారని తెలిసింది. త్వరలో వారి రచనలు అందరికీ అందుబాటులో తెస్తామని మాటిచ్చారట కూడానూ!
ఆ మహానుభావుడి రచనలు జనబాహుళ్యానికి చేరేలా చేయటం ప్రతి తెలుగువాడీ కర్తవ్యం.
కొన్ని కారణాల వలన వారి రచనలు అన్నీ చదవలేకపోయాను.
మిగితా రచనలు కూడా కుఱచబ్బాయి దయతో చదవగలనని ఆశిస్తున్నాను.

14 comments:

  1. Chala nijayitiga rasav rehaman.. Naku chadavalani anipistundi..

    ReplyDelete
  2. బాగుంది. 2011లో విశ్వనాథ యింటిని సందర్శించిన విషయం కూడా గుర్తు చేసుకుని వుంటే ఇంకా బాగుండేది.

    ReplyDelete
    Replies
    1. చేర్చానండీ! గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

      Delete
  3. వేయిపడగలు గ్రంధం మీద వివరంగా మీరొక రివ్యూ రాయండి.చదవాలని ఉంది. ప్రస్తుతం నేను ఆ గ్రంధం చదువుతూ ఉన్నాను.

    ReplyDelete
    Replies
    1. రాయాలనే ఉందికానీ బద్ధకం, సమయాభావం వెరసి రాయలేకపోతున్నాను.
      అందుకని ఒక బ్లాగ్ మొదలుపెట్టి నా వేయిపడగల అనుభవాలు రాద్దామనుకున్నాను, అదీ ఫలించలేదు.
      వేయిపడగలు గురించి రాయాలంటే అది నా శక్తికి మించినదని అనుకుంటాను, విమర్శనాత్మకంగా వేయిపడగలును చూడలేకపోవడం ఒక కారణం.
      సమగ్రంగా ఇంత మహాగ్రంథం గురించి కొన్ని వాక్యాల్లో రాయటం అసంభవం కూడానూ!

      Delete
  4. eppatinuncho korika.. veyipadagalu chadavalani..

    ReplyDelete
    Replies
    1. ఎందుకాలస్యం, వెంటనే చదివేయండి మరి!

      Delete
  5. బాగుంది రెహ్మాన్ గారు ...ఎప్పుడూ వినడమే కానీ చదవటం లేదు ..మొన్న ఎక్కడో తృప్తి గురించి చెప్తూ వేయి పడగల్లో "మర చెంబు " గురించి చదవలేదా అని విన్నాను ....వంద టపాలకి కంగ్రాట్స్

    ReplyDelete
  6. ఆ విశ్వనాథుని కౌటిల్య, నేనూ భామాకలాపం చూసొచ్చాకా ఏకవీరలో భామాకలాప ఘట్టం నా పక్కనే పడుకుని చదివి వినిపించడం ప్రారంభించారు. భామాకలాప ప్రదర్శన గురించి చెప్పడానికి కృష్ణాతీరంలో కూచిపూడి అనే బ్రాహ్మణాగ్రహారంలో సిద్దప్ప అనెడి అమాయక, మందబుద్ధి ఐన బ్రాహ్మణుడి నుంచి మొదలుపెట్టి భామాకలాప ప్రశస్తి నుంచి మొదలుపెట్టుకుని భామాకలాపం ప్రదర్శన ఘట్టానికి రావడం వరకూ వినిపించారు. నాకు మతిపోయింది. ఓహో ఆ కళ ఎంత ఉదాత్తమో చెప్పాలంటే ఇదా పద్ధతి. ఇంత అపూర్వమైన శిల్ప ప్రావీణ్యత కలవారా ఆ మహాస్రష్ట అనిపించింది. పైగా ఆ కౌటిల్య,"సిద్ధప్ప అని మొదలుపెట్టాడు, సిద్ధశాస్త్రి అన్నాడు. మళ్ళీ సిద్ధపండితుడనే పదం ప్రయోగించాడు. చివరకు సిద్ధేంద్ర యోగి అన్నాడు. చూడండి ఈ పదప్రయోగ ఔచిత్యం" అని వివరించి, "ఇది నేను ఏ వందోసారో "ఏకవీర" చదవడం. కానీ ఇప్పుడు కూడా ఈ కొత్త విశేషం స్ఫురించింది. అదీ ఆయన రచనలో లోతు. ఒక్క విశ్వనాథనే అర్థం చేసుకోలేకపోతుంటే మిగిలినవెందుకని మళ్లీ మళ్లీ ఆయననే చదువుతున్నా"నన్నారు.
    అంతే అప్పటివరకూ ఎక్కడో తగిలితే "మాక్లీ దుర్గంలో కుక్క", "విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు" చదివి ఊరుకున్న నాకు దిమ్మదిరిగింది. అలా ఏకవీర మొదలుపెట్టాను.
    ఆయన వినిపించిన ఘట్టమే మళ్లీ నాకుగా చదువుకుంటే ఇంకెన్నో మణిమాణిక్యాలు దొరికాయి. భామ వియోగ బాధకు మీనాక్షీ సుందరేశ్వరుల ఉత్సవమూర్తులు కన్నులు తెరచి చూస్తూండగా, సుందరేశ్వరుని హృదయం కదిలి కనులనుండి వచ్చిన వేడిమికి ఓ బ్రాహ్మణుని పైపంచ, భామ కొంగు అంటుకోవడము చదవగానే ఆహా అనిపించింది. తన నవలానాయిక హృదయం చలించింది అని రాయాలంటే, ఏకంగా సుందరేశ్వరుని మనస్సే చెదరాలన్నమాట. ఏం ఔచితీ, ఏం ఊహలు, ఏం ఉత్ప్రేక్ష, ఏం విశ్వనాథ అని దిమ్మెరపోయాను. ఇంతా జేసి ఇవన్నీ ఆశువుగా చెప్పడమే తప్ప కూచొని రాయడం. రాసింది కొట్టి మళ్లీ రాయడం వంటిదేమీ లేదు(ట).
    విశ్వనాథుడు సామాన్యుడు కాడు. విశ్వనాథుని కౌటిల్యుడూ సామాన్యుడు కాడు. ఇక మీరు కుఱచబ్బాయని కౌటిల్యుణ్ణి అభివర్ణించడమేమీ ఔచిత్యపోషకంగా లేదు. విశ్వనాథ సత్యనారాయణ గారే ఉండుంటే "సాహితీ వామనుడ"నేవారు. రాబోయే త్రివిక్రమావతారం స్ఫురింపజేస్తూ.

    ReplyDelete
    Replies
    1. సర్లెద్దూ, కుఱచబ్బాయిని సాహితీ వామనుడని అనడానికి నాకింకా సమయం పట్టొచ్చులెండి.
      అన్నట్టూ మీ పేరు రాయొచ్చు కదా. అనామకంగా ఎందుకీ వ్యాఖ్య?

      Delete
  7. నేను సూరంపూడి పవన్ సంతోష్ ని. ఏదో వేరేవారి కంప్యూటర్ లో పుస్తకం.నెట్ తెరిస్తే వీక్షణంలో విశ్వనాథ్ గారి గురించి మీ వ్యాసమూ, కస్తూరి మురళీకృష్ణగారి బ్లాగులో వరుసటపాలు, అబ్బరాజు మైథిలి గారు పుస్తకం.నెట్లోనే రాసిన వ్యాసమూ చూసి, ఆహా కరువు తర్వాత వరద అనుకుని ఆనందంలో, అక్కణ్ణించి వెళ్లిపోవాల్సిన హడావుడీ ముప్పిరిగొన్నప్పుడు లాగిన్ అవ్వకుండా కనీసం పేరుకూడా సైన్ చేయకుండా టకీమని ఉద్వేగంతో పెట్టిన వ్యాఖ్య అది. ఈరోజు కౌటిల్య గారితో మాట్లాడుతుంటే మీరు ఆ అనామకుడెవరా అని ఆసక్తి కనపరిచారని చెప్పారు. అందుకే మళ్లీ వచ్చి వ్యాఖ్య పెడ్తున్నాను తీరిగ్గా.

    ReplyDelete