Thursday, March 20, 2014

మనీషా పంచకం

మనీషా పంచకం ఆదిశంకర విరచితం.
ఎందరో పాశ్చాత్య విమర్శకులు ఆదిశంకరులు అగ్రకుల పక్షపాతి అనీ, ఆయన అద్వైతం కేవలం బ్రాహ్మణులకే అన్నట్టుగా ఆయన రచనలన్నీ ఉన్నాయని నిందిస్తారు.

కానీ ప్రస్థానత్రయ భాష్యం రాసేప్పుడు భాష్యకారుల చేతులు కట్టుబడి ఉంటాయన్న సంగతి వాళ్ళకు తెలీదు.
శంకరులు వారి అద్వైతం - సర్వ మానవ సౌభ్రాతృత్వం గురించి చెప్పుకునేందుకు వీలు కలిగేలా కొన్ని శాస్త్ర విషయ అనుబంధం లేని రచనలు చేసారు. వాటిలో ఈ మనీషా పంచకం ఒకటి.

అద్వైతం అనగా భగవంతుడు-భక్తుడు ఒకటే అని నమ్మే సిద్ధాంతం. అహం బ్రహ్మాస్మి తత్త్వం. అద్వైతానికి కుల, మత, స్త్రీ/పురుష, చిన్నా/పెద్దా, తేడాలు లేవు. ఎందుకంటే ఒకే పరబ్రహ్మ యొక్క వివిధ స్వరూపాలమందరమూను.

ఈ శ్లోకాల వెనుక సన్నివేశం కాశీ (వారాణసి) లో జరిగినది.
స్నాన-సంధ్యాదులు ముగించుకుని శంకరులు శిష్యగణంతో గుడి వైపుకు వస్తూ ఉంటారు. దారిలో ఎదురుపడి ఒక చండాలుడు (తక్కువ జాతి వ్యక్తి) వస్తూ ఉంటాడు. అతన్ని చూసి దూరం జరిగి దారికి పక్కగా పొమ్మని శంకరుడు అంటాడు. ఆ చండాలుడు స్వయానా శివుడే!

అలా శంకరులు అనిన మాటలకు చండాలుని రూపంలో ఉన్న శివుడు ఇలా అంటాడు :

అన్నమయాదన్నమయం హ్యథవా చైతన్యమేవ చైతన్యాత్,
ద్విజవర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛ గచ్చేతి॥

ఓ మహానుభావా! చెప్పు. నన్ను దారికి పక్కగా తొలిగిపొమ్మని నువ్వన్నది, నేను తక్కువ జాతికి చెందినవాడననా? అన్నంతో రూపొదిన ఒక శరీరం, అన్నంతోనే రూపొందిన మరో శరీరాన్ని పక్కకు తొలగమంటుందా లేక
ఒక శరీరంలో ఉన్న ఆత్మ, మరో శరీరంలోని ఆత్మను పక్కకి తొలగిపొమ్మని చెబుతుందా?
ఈ రెండిటిలో ఏది పక్కకి తప్పుకొని దూరంగా ఉండాలి? చెప్పు మహానుభావా, చెప్పు!

ప్రత్యగ్వస్తుని నిస్తరంగసహజానందావబోధాంబుధౌ
విప్రోఽయం శ్వపచోఽయమిత్యపి మహాన్ కో యం విభేదభ్రమః॥ 
కిం గంగాంబుని బింబితేఽంబరమణౌ చాండాలవీథీపయః
పూరే వాఽంతరమస్తి కాంచనఘటీమృత్కుంభయోర్వాఽంబరే॥
నాకు జవాబు చెప్పు, ఓ మహానుభావా! నీటి ఉమ్మతో సహా అన్ని చోట్లా నీటిలో మెరిసే సూర్యుడి ప్రతిబింబం లాగానే ఆ పరమాత్మ అయిన పరబ్రహ్మ ప్రతి జీవిలోనూ ప్రతిబింబిస్తాడు. మరి ఈ విభేదాలెందుకు? ఈ ఎక్కువ తక్కువలెందుకు? ఒకడు బ్రాహ్మణుడా, చండాలుడా అనెందుకు చూడాలి? ఎవరిద్దరిలో గొప్ప? గంగలో కనిపించే సూర్యుడి ప్రతిబింబానికీ, చండాలుడి వీధులలో కనిపించే నీటిపై పడే సూర్యుడి ప్రతిబింబానికీ తేడా ఉందా?
నీటి పాత్ర బంగారందో లేదా మట్టిదో అయితే అందులోని నీరు కూడా మారిపోతుందా?

(ఈ స్పందన వచ్చిన వెంటనే శంకరులకు ఎదుటున్నది సాక్షాత్ పరమశివుడే అన్న బోధ కలుగుతుంది. ఆ పరవశంలో శంకరులు ఈ కింది ఐదు శ్లోకాలను మనీషా పంచకంగా మలిచి అందించారు!)

జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృంభతే
యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ,
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞా పి యస్యాస్తిచే-
చ్చండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ
ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో- మెలకువగా, నిద్రపోతూ, కలలో విహరిస్తూ - అన్ని సందర్భాలలో కనిపించే ఆత్మను తానేనని గుర్తిస్తాడో, విధియయిన బ్రహ్మ మొదలు అతి చిన్నదయిన చీమ వరకూ అన్ని జీవాలలో, అన్ని వస్తువులలో ఉన్న పరమాత్మనే తానని అర్ధం చేసుకుంటాడో. అన్నిఁటా ప్రతిధ్వనించే, కనపడని, అందరినీ గమనించే ఆ పరమాత్మను తానుగా భావించి - తనను అన్నిటిలో చూసుకొనే వ్యక్తిని - అతడు ద్విజుడయిన బ్రాహ్మణుడే కానీ, చండాలుడే కానీ - నా పరమ గురువుగా అతడిని నేను నమ్ముతాను.

బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్రవిస్తారితం
సర్వం చైతదవిద్యయా త్రిగుణయా శేషం మాయా కల్పితం,
ఇత్థం యస్య దృఢామతిస్సుఖతరే నిత్యే పరే నిర్మలే
చండాలో స్తు స తు ద్విజో స్తు గురురిత్యేషా మనీషా మమ  
ఈ జగత్తంతా ఆ పరమాత్మ పరబ్రహ్మ యొక్క స్వరూపమే. అజ్ఞానం వలనో, త్రిగుణాల‌(సత్త్వరాజసతమో గుణాలు) ప్రభావం వలనో ఈ ప్రపంచమంతా వివిధ వస్తువుల చేత రూపొందించబడిందని అనిపిస్తుంది - ఆ ప్రభావంతో పరబ్రహ్మ స్వరూపాన్ని చూడలేము. వీటికి అతీతంగా ఎవ్వరయితే తనని తాను నిర్మలమయిన, అనంతమయిన పరమాత్మ పరబ్రహ్మగా గుర్తిస్తాడో, అతడు ద్విజుడయిన బ్రాహ్మణుడే కానీ, చండాలుడే కానీ - నా పరమ గురువుగా అతడిని నేను నమ్ముతాను. 

శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో-
ర్నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజశాంతాత్మనా,
భూతం భాతి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే
ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ
ఈ లోకం మాయతో రూపొందించబడింది. ఇది అశాశ్వతము, నశించిపోతుంది. ఈ శరీరము ఆ పరమాత్మను శాంతముతో, పూర్తి నమ్మకంతో (ఎలాంటి అనుమానాలు లేకుండా) ధ్యానంలో దర్శించి, కర్మఫలము ద్వారా సంపాదించుకున్న ఫలాలను (అవి పాపాలే గానీ, పుణ్యాలే గానీ) పరమాత్మ యొక్క పవిత్రమయిన అగ్నియందు కాల్చివేస్తారు. ఈ విషయాలు చెప్పిన పరమగురువుల బోధనలను నేను నమ్ముతాను.

యా తిర్యజ్ఞరదేవతాభిరహమిత్యంతః స్ఫుటా గృహ్యతే
యద్భాసా హృదయాక్షదేహవిషయా భాంతి స్వతో చేతనాః
తాం భాస్యైః పిహితార్క మండలనిభాం స్ఫూర్తిం సదా భావయన్
యోగీ నిర్వృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ
ఏ విధంగా యితే మేఘాలు సూర్యుడిని కనిపించకుండా కప్పేస్తాయో, అదే విధంగా అజ్ఞానం పరమాత్మను జీవాత్మకు కనిపించకుండా చేస్తుంది. ఈ ప్రపంచంలో జరిగే ప్రతీదీ ఆ పరమాత్మ పరబ్రహ్మ వలనే అవుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్న యోగులు ఉత్తములని నేను నమ్ముతాను.

యత్సౌఖ్యాంబుధిలేళలేశత ఇమే శక్రాదయో నిర్వృతా
యచ్ఛిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః
యస్మిన్నిత్యసుఖాంబుధౌ గళితధీర్ బ్రహ్మైవ న బ్రహ్మావి
ద్యః కశ్చిత్స సురేంద్రవందితపదో నూనం మనీషా మమ
ఇంద్రాది దేవతలచే పూజించబడే పరబ్రహ్మముతో నిరంతర ధ్యానములో ఉండేవాడు, పరిపూర్ణ శాంతుడై  ఉంటాడు. అతను ఆ పరబ్రహ్మమును తెలిసికున్నాడని, అతనే ఆ పరబ్రహ్మ అని నా పూర్తి నమ్మకము.

Saturday, December 28, 2013

జెండాపై కపిరాజు : పాటల పరిచయం

ఇవాళ అనగా డిసెంబర్28నవిడుదలయిన జెండాపై కపిరాజు పాటల పరిచయం!

తొలిపాట - ఇంతందంగా ఉందా లోకం...
షాషా, జీవీ ప్రకాశ్ (హమ్మింగ్ గొంతు), మరియు జావెద్ అలీ గాత్రం.
మంచి సంగీతం, ఇదే వరసలో కొన్ని ఇతర భాషా పాటలు విన్నాను కాబట్టీ, ఇది సొంత ట్యూన్ అని చెప్పలేను. అమ్మాయి పాట శ్రావ్యంగా ఉంది. అబ్బాయి పాడేపుడు అసహజత్వం కొట్టొచ్చినట్టు కనిపించింది. కొన్ని పదాలు పలకడంలో ఇబ్బంది, అస్పష్టత కనిపిస్తుంది.

రెండోది - డోంట్ వర్రీ బీ హ్యాపీ
జ్జైశ్రీనివాస్, ప్రియా హేమేశ్ గాత్రం.
మొత్తానికి సినిమా పాటల్లోకి రోజువారీ కుఱ్ఱకారు మాటాడుకునే మాటలు చొచ్చుకొస్తున్నాయనడానికి మరో ఉదాహరణ.
ఆ డప్పులు, సన్నాయి, ఈల, సాక్సఫోన్, ఘటం వాడకం ఈ మధ్య సినిమా పాటల్లో సామాన్యమయిపోయింది. 

మూడోది - మన అభిమాన గాయకుడు హేమచంద్ర పాడాడండోయ్
రాజాధిరాజాధి రాజా నేనే...
ఇది ఆ ఒక్కటి అడక్కు సినిమాలోని రాజాధిరాజాను నేనురా అన్న పాటకు దగ్గర పోలికతో ఉంది.
ఈ పాటంతా కూడా డప్పుల శ్రవణయోగమే!

నాల్గవది - తెలిసినది నువ్వంటే ఏంటో...
హరిచరణ్, సైంధవి గాత్రం
రొమాంటిక్ అని వినబోతే తత్త్వాలు చెప్పే పాట!

ఐదవది - భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు
పాడింది హరిచరణ్ ట!
ఇవి విన్నాక ఒక రకమయిన విరక్తి కలుగుతుంది. అనుష్టుప్ ఛందస్సును ఎలా పాడాలో తెలీని గాయకులు ఉంటారా అని అనుకునేవాణ్ణి. కొన్ని శ్లోకాలయితే ఎక్కడ తుంచకూడదో అక్కడే తుంచారు. విసర్గం ఒకటి ఉంటుందని పాపం వీళ్ళకి తెలీదు! గీతను శ్రవణవిరుద్ధం చేస్సారు.

Saturday, December 14, 2013

కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం

విశ్వనాథ, తన  విశ్వనాథ పంచశతిని కొమర్రాజు లక్ష్మణరావు పంతులుగారికి అంకితమిస్తూ పుస్తకం మొదట్లో తొలి ఆంధ్రవిజ్ఞానసర్వస్వ నిర్మాతకిచ్చిన నీరాజనం!

అధునాతన సంస్కృతికిని
ప్రధానబీజమ్మ వీవు పాండిత్యపయో
నిధి వీవు మార్గదర్శక
సుధారుచివి నిన్ను మఱవఁజొచ్చిరి యాంధ్రుల్

ఆంధ్ర విజ్ఞానసర్వస్వ మద్ది నీవు
మొదలువెట్టితి మా కది కుదురలేదు
ఆంగ్ల విజ్ఞానసరస్వ మట్లు దాని
వెలయఁజేతుము క్షమియింపవే!మహాత్మ!

నీ రచిత వ్యాసంబు లు
దారంబగు నీదు నాత్మదర్పణముల్ నీ
సారమతి ముదగల్గిన
యారంభంబులకు విజయ మగుత మహాత్మా!*


ఇదే స్ఫూర్తితో తెలుగు వికీపీడియా సభ్యులలో కొందరిని తెలుగు వికీపీడియా దశాబ్ది సందర్భంగా విశిష్ట వికీపీడియన్ గా గుర్తించి సన్మానింప తలఁచాము. ఆసక్తి ఉన్నవారు ఈ నిర్ణయంలో పాలు పంచుకోగలరు.

https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%95%E0%B1%8A%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81_%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A3%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AE%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE_%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82

Friday, November 15, 2013

సుపరిచిత గొంతు

ఇవాళ పొద్దున పాల వాడి దగ్గర ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. మాకు ఇక్కడ కోరమంగలలో పాలూ, పళ్ళూ, కూరగాయలు అన్నీ ఒక కొట్టులోనే ఉంటాయి. నేను పాలు కొనేసి తిరిగి వస్తుంటే, పరిచయమున్న ఒక గొంతు వినిపించింది - అరటి పళ్ళ కోసం బేరమాడుతున్నాడో పెద్ద మనిషి, కొంచెం ముఖం చూసి ఏమీ గుర్తు రాకపోయే సరికి, ఎవరో ర్యాండం మనిషి అని అనుకుని రూం కి వచ్చేసాను. కానీ రూంకి వచ్చి కాఫీ పెట్టుకుంటుంటే గుర్తొచ్చింది ఆ వాయిస్ ఎవరిదో. చాలా పరిచయమున్న వాయిస్. మూడో తరగతి నుండి, తొమ్మిదో తరగతి వరకూ రోజూ మార్నింగ్ అసెంబ్లీలో వింటూ వచ్చిన వాయిసాయే! నేను తొమ్మిదో తరగతిలో ఉండగా కాసర్గోడ్ కి ట్రాన్స్ఫర్ మీద బదిలీ అయి వెళ్ళారు. ఈ మధ్య బెంగుళూరు వచ్చిన కొత్తలో వాళ్ళబ్బాయిని కలిసాను, నాకన్నా ఒక సంవత్సరం సీనియర్ ఇతను. స్కూల్ లో ఏ క్విజ్ పోటీ జరిగినా, రూపకం జరిగినా నేనూ, ఈ అభిజిత్ భయ్యా, ఇంకా తేజశ్విని దీదీ అని (ఈమె ఎనిమిదో తరగతిలో ఉండగా వీళ్ళ నాన్నకు మాస్కో ట్రాన్స్ఫర్ అయింది, ఈమె కూడా ఇప్పుడు బెంగుళూరులోనే!) మేం ముగ్గురం టీం అప్ అయితే ప్రత్యర్ధులుండే వారు కాదు. గుర్తొచ్చి అభిజిత్ భయ్యాకి కాల్ చేసాను, అవును సార్ ఇప్పుడు సిలిగురిలో ఉంటున్నారు నన్ను చూద్దామని వచ్చారు అన్నడు. అయ్యో, ఆయనను ప్రత్యక్షంగా గుర్తించల్క పోయానే అని దిగులు పడి, తిరిగి ఎప్పుడు కలవవచ్చో కనుక్కున్నాను, వచ్చే వారం ఖాళీ అన్నారు. ఆయన్ని కలిసొచ్చాక ఆ విశేషాలతో ఇంకొక పోస్టు!

Wednesday, October 30, 2013

తెలుగు పుస్తకాల యూనీకోడీకరణపై సింపోజియం

నిన్న హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్-జూబిలీ హాల్‍లో "తెలుగు పుస్తకాల యూనికో(క్రో)డీకరణ" పై సింపోజియం జరిగింది.
 ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార సాంకేతిక శాఖ, అధికార భాషా సంఘం మరియు సిలికానాంధ్ర - ఈ మూడు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. పీవీఆర్కే ప్రసాద్ గారు లాంటి ఎందరో ప్రముఖులను మొదటి సారి చూసే అవకాశం కలిగింది.

సదస్సులో మొదటి ప్రశ్న ఏ ఏ పుస్తకాలను యూనీకోడ్ లో అందుబాటులోకి తేవాలి అని. దానికి వచ్చిన సమాధానాలు నాకు గమ్మత్తుగా అనిపించాయి: సూచనలు - ఆంధ్ర మహాభారతం, భాగవతం, క్షేత్రయ్య పదాలు మొ॥
- ఇవన్నీ ఇప్పటికే తెలుగు వికీసోర్స్( te.wikisource.org ) లో అందుబాటులో ఉన్నాయి. మనకు కావాల్సిన విధంగా HTML, pdf, doc, txt, epub, mobi మొదలగు రూపాలలో పుస్తకాన్ని దింపుకునే మార్గం కూడా ఇప్పటికే అందుబాటులో ఉన్న వికీసోర్స్ లో మహాభారతం(వ్యాస, కవిత్రయ), రామాయణం(మొల్ల, వాల్మీకం), కవిత్వం(నీతిచంద్రిక, ఊర్వశి, గురజాడ గారి కవిత్వం, చలం కవిత్వం), నాటకములు(పూర్ణమ్మ, కన్యాశుల్కం, మిణుగురులు మొ॥), పురాణాలు(భాగవతం, పద్మపురాణం), వేదాలు(ఋగ్వేదం అన్ని మండలాలు, అధర్వణ వేదం అన్ని కాండాలు, సామవేదం అర్చికలు, శుక్ల యజుర్వేద అధ్యాయాలు, కృష్ణ యజుర్వేదం కొంత భాగం)-తెలుగులిపిలో, క్షేత్రయ్య పదాలు, సంకీర్తనలు, స్తోత్రములు, శతకములు, తెలుగులో కురాన్, ఇంకా ఆంధ్రుల చరిత్రము మొదలు తెలుగువారితో సంబంధమున్న స్వేచ్ఛా లైసెన్స్ లేదా పబ్లిక్ డొమెయిన్ లో ఉన్న ఎన్నో పుస్తకాలున్నాయి.
వికీసోర్స్ మొదటి పేజీ
ఇంకా ఎన్నో పుస్తకాలు తెచ్చేందుకు కృషి జరుగుతుంది. మీరూ ఇందులో పాలుపంచుకోవచ్చు. వికీసోర్స్ మనందరిలాంటి ఔత్సాహికులు రాసే స్వేచ్ఛా గ్రంథాలయం. వికీసోర్స్ లో ప్రూఫ్ రీడ్ పొడిగింత వాడి చాలా సులువుగా పాఠ్యాన్ని టైపు చేసుకోవచ్చు.
వికీసోర్స్ లో ఇప్పటికే ఉన్న పుస్తకాల వర్గాలు

ప్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్ వాడుకలో

ప్రూఫ్ రీడ్ పొడిగింత టైపుచేస్తున్నపుడు

ప్రూఫ్ రీడ్ పొడిగింత, గులాబీ పెట్టెలోనిది మనం టైపు చేసే పాఠ్యం, పచ్చ పెట్టెలోది స్కాన్ పుస్తకపు పేజీ, ఎరుపు వృత్తంలోనిది టైపు పద్ధతిని ఎంచుకునే ఉపకరణం

epub గా ఎగుమతి చేసేందుకు


ప్రతి పుస్తకాన్నీ పీడీఎఫ్గా, ముద్రణకు అనువుగా దింపుకోవచ్చు, అలానే ఎక్కువ పుస్తకాలను ఒకే పుస్తకంగా రూపొందించవచ్చు 

వికీసోర్స్ మాత్రమే కాక ఎన్నో ఇతర జాలగూళ్ళలో ఉన్న ఎన్నో పుస్తకాలు కూడా సభికులు యూనికోడ్ లోకి రావాలి అని అడగటం గమనార్హం.
 ఏదయినా చర్చకు/సభకు వెళ్ళే ముందు అవి ఇప్పటికే అందుబాటులో ఉన్నవో లేదో నిర్ధారించుకుని అడగాలి కదా! అది వేరే విషయం అనుకోండి.

మరికొందరు అడిగినవి - గణితసార సంగ్రహం, విజ్ఞానేశ్వరం, వ్యాకరణాలు, ఛందస్సు, నందకరాజ్యం, మొ॥, జానపదుల మాటలను భద్రపరిచి అందులోనుండి వారి వాడుక పదాలను సేకరించాలని శ్రీరమణ గారో, ఇంకెవరో అడిగారు. ఇవి బాగున్నాయి.
అయితే ఏ ఒక్కరూ కూడా సమకాలీనుల పుస్తకాలను గుర్తించలేదు!
స్వేచ్ఛా లైసెన్స్‍ల అవగాహన రచయితలలో పెరగాలి. వారి కాపీరైట్లు వారితోనే ఉంచుకుని హక్కులు ప్రచురణకర్తలకు ఇవ్వటానికి బదులు సమాజానికి ఉపయోగపడే విధంగా క్రియేటివ్ కామన్స్ లాంటి లైసెన్స్ ను ఆపాదించుకోవడం మన రచయితలూ నేర్చుకోవాలి.

ఒకటి రెండు అంశాలు, తెలుగులో టైపు చేయటం ఎలా, యూనికోడ్ మా డీటీపీ వాడికి తెలీదు అనే కొన్ని ఎప్పుడూ ఉండే సాగతీత అంశాలు తప్ప మిగితా చర్చ అంతా బాగానే సాగింది.

నేను ఒక ప్రదర్శన(presentation) తయారుచేసి తీసుకెళ్ళాను. జరుగుతున్న చర్చలకి నా ప్రదర్శన జరక్కపోవచ్చు అనుకుని, నా ప్రదర్శన ఇంకా వీవెన్ ప్రదర్శనలోని స్లైడ్స్ డిస్ప్లే చేయటం మొదలుపెట్టాను. ఆఖరున ఒక 20 నిమిషాలు నాకూ వీవెన్ గారికి అవకాశం వచ్చింది, కానీ అప్పటికే డిజిటైజేషన్ కి సంబంధించిన అన్ని అంశాలు అందరూ చర్చించేసారు, అవి మినహా ఉన్న సమయంలో చెప్పదగినవి చెప్పేసాను. నా ప్రదర్శన కింద ఇవ్వబడింది.

ఈ సింపోజియంలో సిలికానాంధ్ర వారి telugupustakam.org అనే వెబ్సైట్ లాంచ్ చేసారు. ఇందులో కొన్నిపుస్తకాలు ఇప్పటికే అందుబాటులో ఉంచారు. నేను ఆసక్తిగా ఎదురుచూసేది - ఈ సైటులోకి త్వరలో వచ్చి కొలువుండబోయే టీటీడీ వారి పుస్తకాలు, కొన్ని వర్సిటీలు సంస్థల పుస్తకాలు. ఇంకా తెలుగు కోర్పస్ ప్రాజెక్టు సన్నాహాలు కూడా చేసారు.