Thursday, July 17, 2014

"తెలుగు భాషకు ప్రాచీన హోదా వలన ఒరిగిందేమన్నా ఉందా?" అన్న ప్రజ లోని చర్చకు నా ఆలోచనలు

యాదృచ్ఛికంగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నా తరఫున ఏం చెయ్యవచ్చు అన్న సందర్భంలో ఈ చర్చ నాకు తారసపడడం జరిగింది.
ఆ చర్చ పై నా విమర్శ వ్రాసే ముందు, అందరికీ ఒక విన్నపం
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా భావ గీతాలు వ్రాసి నా మెయిల్ ఐడీకు పంపగలరు. పాటకు కావాల్సిన అంశం - తెలుగు ప్రముఖులు, తెలుగు ప్రదేశాలు, తెలుగు విశేషాలు. మీ ప్రాంతం (జిల్లా-గ్రామ) స్థాయిలో ప్రసిద్ధులైన వ్యక్తుల గురించి తెలుసుకొని, మీ ప్రాంతంలోని ప్రముఖ ప్రదేశం గురించి తెలుసుకొని, మీ ప్రాంతపు వంటకాల గురించి తెలుసుకొని, ఇంకా ఇతర సాంస్కృతికాంశాల గురించి తెలుసుకొని, ఏవయినా పుస్తకాలు లభ్యమయితే చదివి. ఆపై ఆ విషయమై కవితలు/పాటలు/వ్యాసాలు వ్రాసి nani1only@gmail.com కు వేగు (విద్యుల్లేఖ) పంపగలరు.

ఇక పోస్టులో చెప్పబదిన విషయాల గురించి :
తెలుగు భాషా విశిష్ట కేంద్రం అనేది తెలుగు వారి సొత్తు. అది ప్రాంతాలకతీతం. ఆంధ్ర-తెలంగాణలకన్నా, ఈ రాష్ట్రాల వెలుపల ఒక అంచనా ప్రకారం అంతే మంది తెలుగు మాట్లాడే వారు నివసిస్తున్నారు[నిరూపణ అలభ్యం]. అంటే తెలుగు వారి కోసం నెలకొల్పే సంస్థకు తెలుగు వారికీ కచ్చితంగా భౌతిక సంబంధం అనవసరం. అరవ వాళ్ళు నెలకొల్పుకున్న తమిళ్ వర్చువల్ యూనివర్సిటీ తరహాలో ఒక పూర్తి ఆన్లైన్ లో పని చేసే సంస్థను నెలకొల్పుకోవాలి. అలా చేసిన వాళ్ళం మనమే మొదటి వాళ్ళం కావచ్చును కూడా. ఇక నిధులూ గట్రా ఏమయినా ఖర్చు చెయ్యాలంటే అంతర్జాలం కంప్యూటర్ అందుబాటులో లేని వారికి అవి అందించే ప్రయత్నాలకు వాడాలి. స్వామి కార్యం స్వకార్యమూ నెరవేరుతాయి. కాదూ లేదూ ఒక గుమస్తా కచేరీ కావాలంటే రెండు పెట్టుడు కార్యాలయాలు రెండు ప్రాంతాల్లో పెట్టుకోవచ్చు. మిగితా ప్రభుత్వ కార్యాలయాల సంగతేమో కానీ, విశిష్ట భాషా కేంద్రం ఒకవేళ కన్నడ, అరవం, ఓఢ్రం లా స్థాపిస్తే ఆ రెండు ప్రాంతాల కచేరీల్లో సందడే సందడి. తిరుమలకు మించిన కోలాహలం.
కేంద్రప్రభుత్వ వాటాలో 100 కోట్లు విడిగా కేవలం భాషాభివృద్ధికి ఖర్చు పెట్టేందుకు విడుదల అవుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమ పధకాల సరసన ఏనాటికీ భాషాభివృద్ధి సరితూగలేదు. ఏ నాయకుడికీ భాషాభివృద్ధి అత్యావశ్యక అంశం కాదు కాబట్టీ. పైగా మొత్తం తెలుగు వారికీ జవాబుదారీ పుచ్చుకున్న కొద్ది మంది మధ్య తరగతి తల్లిదండ్రులు స్కూళ్ళేంటి, ఇళ్ళేంటి, ఆఖరుకి ఏడుపు కూడా ఆంగ్లంలోనే ఏడవమని పిల్లలని ఉరుముతున్నారు. వీరే ప్రభుత్వానికి మార్గదర్శకం చేసేవారూను. ఈ నాయకులంతా వాళ్ళకి నిష్పూచీ - ఏనాటికీ ఆంగ్లానికి పైచేయిగా తెలుగును ఒప్పుకోరు.
అందువల్ల పై నుంచి వచ్చిన డబ్బు అయితే సక్రమంగా ఖర్చు అయ్యే   అవకాశాలు ఎక్కువ కదా!
సాహిత్య అకాడమీ పుస్తకాలనే తీసుకోండి. ఇక్కడ బెంగుళూరులో అన్ని భాషలకన్నా అతి తక్కువ పుస్తకాలు తెలుగువే, పైగా ఒక సారి ముద్రణ పొందిన పుస్తకాలకు మళ్ళీ మోక్షం లేదు. ఆ డబ్బు ప్రభుత్వం ఖర్చు పెట్టే బదులు పాత పుస్తకాల పునర్ముద్రణకు ఏ సంస్థకు అప్పగించినా కొందరికి ఉపాధి, నాలాంటి వారికి ఆ పుస్తకాల అందుబాటూ కలుగుతాయి. తెలుగులో ప్రారంభ స్థాయి-బాలసాహిత్యం-ఇతర భాషల నుండి తెలుగులోకి అనువాదాలు చాలా తక్కువ. ఇవి లేనిదే తెలుగు మీద ఆసక్తి కలుగదు, ఇవి మొట్టమొదట రూపొందించాల్సినవి!
ఇవి లేకుండా ఎన్ని విశ్వవిద్యాలలో పీఠాలు ఏర్పరిచినా లాభం లేదు.
అయినా ఎంత కాడికీ ప్రభుత్వం ఏదో చేసిపెడుతుంది, చేసిపెట్టాలి అన్న ధ్యాసే కానీ, సామాన్యులుగాఅ మనం తెలుగుకు ఏం చేయగలము, భాషను ప్రాచీన భాషగా చూసేందుకు ఏం ఏం ఋజువులున్నాయి అన్న సంగతి సామాన్యుడికి పడుతుందా? అసలు ఇలాంటి విషయాలు తెలుసుకోడం సామాన్యుడికి ఎంతవరకూ అవసరం?
నేడు అంతర్జాలం వాడుతున్న వారు ప్రధానంగా ఆంగ్ల మాధ్యమంలో నిత్యం సంభాషణలు జరిపే వారు కాబట్టీ మనకు పెద్ద ఇబ్బంది కనిపించడం లేదు. కానీ ఈ సంఖ్య అసలు తెలుగు వారి సంఖ్యలో అత్యల్పం అనీ మనం గుర్తించం అది మన అజ్ఞానం. దాదాపు 95% మంది ఇంకా తెలుగులోనే ఆలోచిస్తారు, కూడికలు, తీసివేతలూ చేస్తారు. వీరంతా అంతర్జాలం వాడాలంటే తెలుగులో సమాచారం అంతర్జాలంలోకి వాడుకునే రీతిలో‌(యూనికోడ్)లోకి రావాలి. ఇతర భాషల వారు చెయ్యలేనిది తెలుగు వారు చేసి చూపించే అవకాశం చాలానే ఉంది. ఇంక ఏ భారతీయ భాషలో లేనంత సాహిత్యం జాతీయంగా తెలుగులో ఉంది. అదంతా అంతర్జాలానికి వికీసోర్స్ లాంటి వేదికల ద్వారా తరలించగలిగితే ఆ 95% మందికి కాస్త ఊరట కలుగుతుంది. మనందరి కసరత్తు ఈ దిశలో ఉండాలి. ఇక ఇవన్నీ బాహ్య సౌందర్యాన్ని పెంచుతాయి, కానీ లోలోపలి భావ సౌందర్యం పెంచాలంటే?
తెలుగు భాషా వైభవాన్ని తెలిపే పాటలూ, కథలూ, కవితలూ జనాల నరనరాల్లోకి వెళ్ళాలి. భాషాభిమానం అనేది ప్రతిఒక్కరికీ ఉండాల్సిన గుణం. భాషలేందే భావమే లేదు కదా!

ఇక వ్యాఖ్యలలో వ్రాసిన అంశాలపై నా ఆలోచనలు :
అసలు తెలుగు భాష ప్రాచీనమా అనే విషయంలో ఎన్నో తగాదాలు ఉన్నాయి. వేరేవారికి ఈ హోదా దొరికింది కాబట్టి మనకూ కావాలని అర్రులు చాచడం వ్యర్ధం. అలాగే ప్రాచీన భాషగా కాక ఆధునిక భాషగా పోసిషన్ చేస్తే మంచిదా అన్న ఆలోచనను తేలిగ్గా కొట్టేయలేము.
వేరే వారికి దొరికిందన్న సందర్భంలో మనమూ అడిగామన్నది చర్చనీయమే కానీ నిజంగానే తెలుగు ప్రాచీనమా కాదా అని ప్రశ్నించుకుంటున్నామంటే అది మన అజ్ఞానమే, హాలుడి గాథా సప్తశతి నాటికే తెలుగుందని మనకు తెలియవస్తుంది. కొత్తె యుగం 500 నాటికే తెలుగు ఉందన్న నిరూపణలు కలవు.  1000 కొ.యు. నాటికి నన్నయ్య వాగనుశాసనం వ్రాయగలిగాడంటే అప్పటికే తెలుగు పూర్తి వాడుకలోకి వచ్చేసింది. తెలుగు ఎంత అభివృద్ధి చెందిన భాష అంటే దక్షిణ భారత శాస్త్రీయ సంగీతపు రాగాలకు ఏ రాగానికైనా తగిన పదాలతో వినసొంపుగా సాగే భాష మనది, అంతగా భాషలోని పదాలు అభివృద్ధి చెందాయి అంటే ఏనాటి నుండీ భాష అభివృద్ధి చెందుతూ వస్తుందో అంచనా వెయ్యడమే కష్టం. నేటికీ కావ్యాల సంఖ్యలో కానివ్వండి, గద్య-సాహిత్యాల పరంగా చూడండి, లిపి అభివృద్ధి పరంగా చూడండి తెలుగు చాలా పరిణామానికి గురి అయిన భాష-ఈ విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఇక తెలుగు పూర్తి ఆధునిక భాష కూడా! ఏ శబ్దాన్నైనా తెలుగులో ఆ భాష మాతృక కలవారు పలికే విధంగా వ్రాసే అవకాశం ఉంది! (భారతీయ భాషా లిపుల మీద నేను గమనించిన చిన్న విషయం)
ప్రభుత్వ రంగ బడ్జెటులను గమనిస్తే వంద కోట్లు పెద్ద మొత్తం కాదు. ఉ. చౌక బియ్యం పథకానికి రెండున్నర వేల కోట్లు కేటాయింపులు ఉన్నాయి. కేంద్రం ఇవ్వకపోయినా వంద కోట్లు పెట్టుకోలేనంత బీద స్థితిలో ఎవరూ లేరు.
 కానీ భాషాభివృద్ధికి ఖర్చుపెట్టే విధానం ప్రభుత్వం వద్ద లేదు. ఎలా ఖర్చు పెట్టాలో ప్రభుత్వానికి తెలీదు. ఏం విషయమై ఖర్చు పెట్టాలో తెలీదు. భాషాభివృద్ధికి ప్రభుత్వ పరంగా ఏం చేయవచ్చో అన్న విధి విధానాలు లేవు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (లేదా ఇంకో అందమయిన పేరు) అంటూ భవనాలకు ఇతర హంగులకు ఖర్చు పెట్టడం ప్రభుత్వాలకు మాంచి సరదా. ఉచిత పబ్లిసిటీ, ఏదో సాదించామన్న ఊకదంపుడుతో బాటు కాంట్రాక్టర్లకు వడ్డింపులు ఉంటాయి మరి. ఆయా సంస్థలలో ఎలాంటి పరిశోధన జరగాలి, వాటి ద్వారా వచ్చే ప్రయోజనం ఏమిటి అనే విషయాలపై ఎవరికీ ధ్యాస ఉండదు.
ఈ విషయమై తెలుగు బ్లాగరులు, జాలరులకు మంచి అవకాశం ఉంది. అంతర్జాలం వేదికగా ప్రభుత్వానికి ధీటుగా ఇలా కూడా భాషాభివృద్ధికి తోడ్పడవచ్చా, ఔరా!, అని అనుకునేలాంటి పనులు మనమే చేసి చూపవచ్చు. అదీ సున్నా ఖర్చుతో.
తెలుగు భాష పునరుజ్జీవనం అంశంలో ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకు భాషాభిమానులు, పండితులు మరియు భాషాశాస్త్ర నిపుణులు (linguistic experts) కలిసి మేధోమధనం చేయాలి.
నేను ఈ విషయంతో ఏకీభవిస్తున్నాను.
లిపి/వ్యాకరణ సంస్కరణ, నిఘంటువులు, భాషా సరళీకరణ, మరుగున పడ్డ తేటతెలుగు పదాలను తిరిగి వాడకంలో తీసుకురావడం, పద్య రచన పునర్వైభవ ప్రాప్తి, కోల్పోయిన పద్య/గద్య సంపద పునర్నిర్మాణం, చేతిరాతల (manuscripts) స్కానింగ్/డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్/కీబోర్డు వ్యవస్థ లాంటి స్తూలాంశాలను (broad headings) ముందుగా గుర్తించాలి. ప్రతిదానిలో కొన్ని కొన్ని ముఖ్యమయిన సూక్ష్మ పరిశోదనా విషయాలను (specific research outline) ఖరారు చేయాలి. ఆయా పరిశోధనల లక్షాలు, మానవ & ధన వనరులు, కాల పరిమితి వగైరా విషయాలను రికార్డు చేసుకోవాలి.
లిపి/వ్యాకరణ సంస్కరణ : తెలుగులిపి చాలా వరకూ తాళపత్రాలపై త్వరగా వ్రాసేందుకు అనువుగా రూపుదిద్దుకుంది. అందరిలో బాగా జీర్ణించుకుపోయిన అంశం. ఇది మారాలంటే క్షేత్ర స్థాయిలో ప్రక్షాళన జరగాలి. అరవంలో ఇలా రెండు పర్యాయాలు జరిగింది. మొదట అరవంలో లేని వర్ణాలన్నీ (శ, విసర్గం, క-ఖ లకు 1,2 ద్వారా తేడా మొ॥) స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో భాషా నిపుణుల ద్వారా చేర్చబడ్డాయి, ఇవి జీర్ణించుకునేందుకు దాదాపు మూడు తరాలు పట్టింది, వెంటనే అన్నా దురై నుండి వచ్చిన సంస్కృత-హిందీ వ్యతిరేక ఉద్యమం వలన ఇవి మళ్ళీ లుప్తాక్షరాలుగా చెయ్యాలి అనీ, అంతకు ముందు వాడిన వర్ణాలనే వాడాలనే నిర్ణయం జరిగింది. ఇప్పటికీ ఈ అంశం వారిలో చాలా అయోమయాన్ని నింపుతుంది. అంతర్జాలమే అన్నీ అని నమ్ముతున్న నేటి తరానికి ఇది అవరోధం కాదు. తెలుగులిపి కష్టతరం అనుకునే వారు పూర్తి రోమన్ లిప్యంతరీకరణ వాడుతున్న రోజులివి. ఈమాట లాంటి జాలస్థలాలు RTS లో చదివే విధానాన్ని అదనంగా ఇస్తున్నాయి. లిపి పరంగా సంస్కరణలు తేవాల్సిన అగత్యం అయితే లేదు. ఇక వ్యాకరణ పరంగా ఏ విధమైన సంస్కరణలు రావాలని చూస్తున్నదీ వ్యాఖ్య రచయిత తెలుపలేదు.
నిఘంటువులు : ఇవి అత్యంత అవసరం. పారిభాషిక పదకోశాలు, మాండలిక పదకోశాలు, యాస పదకోశాలు, బూతుల పదకోశాలు, సాంకేతిక నిఘంటువులు రూపొందించడమే గాక అన్ని రకాలుగా (అంతర్జాలంలో, పుస్తకాలుగా, దృశ్యక శ్రవ్యకాలుగా) అందుబాటులోకి తేవాలి.
భాషా సరళీకరణ : తెలుగు ఇప్పటికే సరళమయిన భాష. కానీ ఎందరో సంస్కృత మోహం కలిగిన పండితుల వలన సాహిత్యంలో తేట తెలుగు మాటలు చోటు చేసుకోలేక పోయాయి. సినిమాలు ఈ విషయంలో నిరాశను ఇస్తున్నాయి. అందువలన సరళ పదాలతో సాహిత్యం రావాల్సిన అవసరం ఉంది. ప్రారంభ స్థాయి సాహిత్యం ఉండటం ఆ భాష నిలకడకు ఉపకరించే ప్రధాన తొలిమెట్టు, తెలుగులో చాలా తక్కువ ప్రారంభ స్థాయి సాహిత్యం ఉంది. ఇది బాగా అభివృద్ధి చెందాలి.
మరుగున పడ్డ తేటతెలుగు పదాలను తిరిగి వాడకంలో తీసుకురావడం : జనాలకు నిత్యం వినపడే, కనపడే వనరుల ద్వారానే ఇది జరుగుతుంది, అందుకని సినిమాలు, ఎఫెం రేడియో, వార్తా పత్రికలు, బ్లాగులు, సంభాషణలు అన్నింటా మెల్లి మెల్లిగా కొన్ని పదాలను చొప్పించాలి. సంభాషణలలోకి తేట తెలుగు పదాలను ఇమిడ్చి మాట్లాడుకోవాలి.
 పద్య రచన పునర్వైభవ ప్రాప్తి : ఇప్పటికే ఆంధ్ర ప్రభుత్వం 100 కవితలు వ్రాసిన కవులకు ముద్రించుకునేందుకు డబ్బు సహాయం అందిస్తామని వారి మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇంకా ఎన్నో సంస్థలు, ఎందరో పెద్దలు కవులకు సత్కారాలు చేస్తూ పురస్కారాలు అందిస్తున్నారు. ఈ సంస్థలు లేదా ఆ సహాయం అందించే ప్రభుత్వ అధికారులు నెల నెలా కవి సమ్మేళనాలను వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తూ కవితకు ఉండాల్సిన స్వరూపాన్ని వక్కాణిస్తూ సూచనలు పంపగలిగితే బాగుంటుంది.
కోల్పోయిన పద్య/గద్య సంపద పునర్నిర్మాణం : ఇప్పటికే ఎందరో ఈ విషయమై కృషి చేస్తున్నారు. కోల్పోయిన సాహిత్యంతో పాటూ ప్రస్తుతం ఉన్న సాహిత్యాన్ని శాశ్వత పరిచే దిశగా అందరూ కృషి చేయాలి. కానీ శాశ్వత పరచడమంటే స్కాన్ చేసి పెట్టడమనే అల్పబుద్ధి గల వారున్నంత వరకూ ఏమీ చేయలేము. పూర్తి యూనికోడ్ పాఠ్యం చేసి భద్రపరచడమే సరియయిన మార్గం. లాభాపేక్షతో కొందరు సంగ్రహ కర్తలు స్వార్ధంతో వారి వద్దనే కొన్ని అపురూప రచనలను జనసామాన్యానికి దూరంగా ఉంచుతున్నారు. వారు చనిపోవడంతో ఆ రచనలూ నాశనమవుతున్నాయి, తెలుగువారు ఈ అలవాటును విడనాడాలి.
చేతిరాతలచేతివ్రాతల (manuscripts) స్కానింగ్/డిజిటల్ లైబ్రరీ : ఒక రాష్ట్రానికి చెందిన చేతివ్రాతలను వేరే రాష్ట్రం వారు కనీసం బొమ్మల రూపంలోనైనా తీసుకుపోరాదు అన్న నిబంధనలు పెట్టే కుచించుకుపోయిన మనస్తత్వం కల వారి మధ్య మనమున్నాము. ఏం చేయగలం? కుదిరినన్ని విధాలలో వీటిని పలుచోట్ల భద్ర పరచాలి.
కంప్యూటర్/కీబోర్డు వ్యవస్థ లాంటి స్తూలాంశాలను స్థూలాంశాలను (broad headings) ముందుగా గుర్తించాలి. ప్రతిదానిలో కొన్ని కొన్ని ముఖ్యమయిన సూక్ష్మ పరిశోదనా విషయాలను (specific research outline) ఖరారు చేయాలి. : ఈ దిశగా ఎందరో ఇప్పటికే పని చేస్తున్నారు (IIT-M వారి imli, IIITH, HCU, JNTU వారి పరిశోధనలు). ఇక ఎందరో కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను (వీవెన్ గారు, ఇతర e-తెలుగు సభ్యులు, నేనూను) సంప్రదించేలా ఒక వ్యవస్థ ఏర్పడాలి.
ఆయా పరిశోధనల లక్షాలు, మానవ & ధన వనరులు, కాల పరిమితి వగైరా విషయాలను రికార్డు చేసుకోవాలి. : ఇది పరోక్షంగా, ప్రత్యక్షంగా కొన్ని సందర్భాలలో జరుగుతోంది.
ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు భాషకు ఒక మానిఫెస్టో కావాలి. ఇదంతా చేయడానికి ఎందరో పెద్దల సహకారం అవసరం. ఈ ప్రక్రియకు ఖర్చు ఆట్టే కాదు కానీ అందరినీ ఒకదగ్గర జమా చేయడం, వారి చర్చలను రికార్డు చేయడం మరియు వారి నిర్ణయాలను ప్రచురించడం కోసం ఎంతో ఓర్పు & శ్రమ పడుతుంది. Coordination, not funds, is the key to this exercise.
ఇది జరిగితే మొదటి అడుగు నాదే అవ్వాలని, పూర్తి సహకారం అందిస్తాననీ హామీ ఇస్తున్నాను.

కనీసం తెలుగుభాషయొక్క వినియోగం సరియైన దిశగానైనా జరిగేలా మనం చర్యలు తీసుకోలేని స్థితిలో ఉన్నాం. 
ఈ విషయాన్ని నేను ఖండిస్తున్నాను. ఇందుకు సరియయిన ఋజువు ఉందా? నిరూపించగలరా?
ఇక తెలుగు భాషకు ఆధునిక హోదా తేవడానికి మరో ప్రజా ఉద్యమమే రావాలి. పైన వ్యాఖ్యలో జై గొట్టిముక్కల సూచించినట్టు ఒక మానిఫెస్టో కావాలి. జాలమూ బ్లాగులూ వేదికగా మనందరమూ ఆ దిశగా ప్రయత్నం మొదలుపెట్టవచ్చు.
ఇదే మనం చెయ్యగలిగీ, ఇప్పటిదాకా చెయ్యని పని. బ్లాగరులకు ఎంతటి అవకాశం ఉందో, ఏ దిశలో పనిచేయవచ్చో తెలిసీ ఆ దిశగా బ్లాగరులు పని చేయలేకపోతున్నారు.
ఇలాంటి వారు ఒక సత్పరిమాణం కోసం సత్సంకల్పం చేస్తే మంచే జరుగుతుంది. ఫలితాలు వచ్చాక ప్రస్తుతం దూరంగా ఉన్నవారిలో చలనం వస్తుంది.
ఇదే నా మాట కూడా!

  



  

5 comments:

  1. గబగబా చదివాను, తీరికలేక!
    మరలా నిదానంగా చదివి విపులంగా స్పందించవలసి ఉంది.
    ఏమైనా మీ చొరవకు నా అభినందనలు.
    అందరూ తెలుగుపట్ల అభిమానమూ నిబధ్ధతా కలిగిఉంటే తెలుగుకు నేటి దుస్థితి రాకపోయేది.
    ఇప్పటికైన ప్రయత్నిస్తే తెలుగుకు మంచిరోజులు వస్తాయ్యి.
    నిన్నో మొన్నో తెలుగులో మాట్లాడిన చిన్నారులను దారుణంగా హింసించిన ఉపాధ్యాయురాలి నిర్వాకం తెలియవచ్చింది! ఇలాంటివి జరుగరాదు.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారూ,
      "తెలుగుకు నేటి దుస్థితి" అన్నారు కదా, అది ఏమిటో తెలిపితే మెల్ల మెల్లగా ఆ స్థితిని మెరుగు పరచవచ్చేమో.
      మొత్తం విద్యార్థుల సంఖ్య గణాంకాలను పరిశీలించాక. నగరాల్లో, ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో చదివే పిల్లలను భూతద్దం వేసుకుని వెతికితే ఇలాంటి సంఘటనలు కనిపిస్తూనే ఉంటాయి. డబ్బులిచ్చి మరీ ఆంగ్లంలో చదివించుకుంటున్నారు తల్లిదండ్రులక్కడ, ఆంగ్లంలో మాట్లాడకపోతే జవాబుదారీ అదే ఉపాధ్యాయులది మరి.
      అదే సమయంలో తెలుగు మాధ్యమంగా చదువుతున్న ఎంత మంది ప్రతిభావంతులను ఇవే సమాచార వాహికలు వార్తలుగా చూపిస్తున్నాయి?
      ముందు భావ స్సౌందర్యం ముఖ్యం అని నేను నమ్ముతాను. ముందు తెలుగు భాషను గ్లోరిఫై చేసినప్పుడే జనాలు ఆకర్షితులవుతారు.
      తెలుగులో ప్రారంభ దశ (entry level) సాహిత్యం అన దగ్గా సాహిత్యం లేదు. అక్కడా అడుక్కుతినే వ్యవస్థే. మన తాతలు, బామ్మలు చెప్పిన కథలను పుస్తకీకరించినదెవరు? పుస్తకాల అంగడికెళ్ళి ఏదయినా బాల సాహిత్యం కొందామనుకున్నా, సరళ సాహిత్యం కొందామనుకున్నా ఎదురయ్యేవి మళ్ళీ ఆ ఆంగ్ల మోజుతో వ్రాయబడ్డ అనువాదాలే!
      తెలుగు మాధ్యమంలో చదివితే ఉపాధి లేదు, అదేదో తక్కువ స్థాయి వాఉ చదివే విధానం అనే అపోహ క్షేత్ర స్థాయిలో నాటుకు పోయింది. ఇది సమూలంగా నిర్మూలిస్తే తప్ప ఇలాంటి సంఘటనలు జరగవు.

      Delete
    2. "నిన్నో మొన్నో తెలుగులో మాట్లాడిన చిన్నారులను దారుణంగా హింసించిన ఉపాధ్యాయురాలి నిర్వాకం తెలియవచ్చింది! ఇలాంటివి జరుగరాదు"

      ఈ కిరాతక చర్యకు పాల్పడ్డ వారికి కఠిన శిక్ష పడాల్సిందే. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా వీటికి దోహదం చేసే కారణాలను కూకటి వేళ్ళతో తప్పక వెలికి వేయాల్సిందే.

      అయితే ఆ నేరాన్ని తెలుగు అనే కళ్ళజోడుతో చూడకూడదు. పిల్లలను కొట్టే హక్కు వారికి ఎవరిచ్చారు? పిల్లల క్షేమం అభివృద్ధి మాత్రమె కేంద్ర బిందువులుగా ఉండాల్సిన బడులలో వారికి నీచస్థాయి ఎలా వచ్చింది? భావి భారత పౌరులను తీర్చి దిద్దాలసిన పద్దతి ఇదేనా? తల్లి తండ్రుల తరువాత అంతటి స్థానం ఉన్న గురువులు తమకు ఇచ్చిన గౌరవాన్ని ఇలాగేనా నిలబెట్టుకోవడం? ఆలోచిస్తూ పొతే ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. None of these is even remotely connected to language in general or Telugu in particular.

      తెలుగు భాష మీద మక్కువ ఉన్నవారు అనవసరమయిన విషయాలకు భాష అనే రంగు పులమడం వల్ల భాషకు మంచి జరగదు సరికదా అసలు లక్ష్యానికి హాని జరిగే ప్రమాదం.

      Delete
    3. ఇక్కడ రెండు విషయాలున్నాయి.
      1. తెలుగు అనేది ఈ హింస వెనుక 'కళ్ళజోడు' వంటి కారణమా అన్నది.
      2.. పిల్లల్ని కొట్టే హక్కు ఉపాధ్యాయులకు ఎవరిచ్చారు?

      మొదటి విషయం చూదాం. ఒకవేళ పిల్లలు హాయిగా ఆంగ్లంలో మాట్లాడుతూ ఉండి ఉంటే వారికా హింస తప్పేదే కదా? అంటే ప్రధానకారణం వాళ్ళంతా ఒక నిషిధ్ధభాష అయిన తెలుగులో సంభాషించుకోవటమే. పిల్లలకు వారి వారి మాతృభాషలు వ్రాయనూ చదవనూ దేవుడెరుగు మాట్లాడను కుడా రాకపోయినా ఫరవాలేదూ ఆంగ్లంలో మాత్రం మంచి ప్రావీణ్యత రావాలీ అన్న పొరబాటు సామాజిక దృక్పధమే ఈ హింసకు దారితీసిన నేపధ్యం. ఈ రోజు ఆవేదన చెందుతున్న పెద్దలంతా బిడ్డల్ని ఇంగ ఇంగ్లీషుభిక్ష పెడతారూ దిక్కుమాలిన తెలుగు నేపఋఊ అన్న భ్రాంతితోనే అందులోనూ అలాంటి అంగ్లమాధ్యమం బడుల్లోనూ వేస్తున్నారు. కొందరు పెద్దలైతే ఎక్కడ పిల్లలు తెలుగుకు అలవాటు పడిపోతారో అని ఇంట్లోనూ (ఆ వచ్చీరాని) ఇంగ్లీషులోనూ సంభాషిస్తూ ఉంటారు. అలాంతి కుటుంబాలను స్వయంగానే చూసాను. అటువంటి పెద్దల జాతికి చెందిన వారే ఈ కిరాతక ఉపధ్యాయులు కూడా. అంతే కాని బయటినుండి ఊడిపడలేదు. బిడ్డలకు ఇంగిలీషు సరిగ్గా రావటం లేదని వాళ్ళని కోప్పడే, దండించే, హింసించే తల్లిదండ్రులూ పెద్దలూ ఇదే సమాజంలో కొల్లలు కొల్లలు. అందుచేత ఈ కళ్ళజోడు సమాజం అంతా పెట్టుకొని తమను తాము మోసం చేసుకుంటూ అభంశుభం తెలియని చిన్నారుల్ని క్షోభపెడుతున్నారు.

      ఇక రెండవ విషయం. దండం దశగుణం భవేత్ వంటి పాతుకుపోయిన నమ్మకాలు పెద్దలకు పిల్లల్ని దండించేందుకు పురికొల్పు తున్నాయి. మా గురువులు మాకు ఇలాగే నేర్పారు, మేమూ ఇలాగే నేర్పుతున్నాం అనీ, మొన్నో కలెక్టరు కనబడి మాష్టారూ మీరు కొట్టిన దెబ్బలు ఇంకా గుర్తున్నాయీ అన్నాడనీ ఒక ముసలి పంతులు సగర్వంగా అంటాడో పాతసినిమాలో. అకారణంగా దండించే గురువులకూ, ఆ మాటకు వస్తే అకారణంగా దండించే తల్లిదంద్రులూ ఇతర కుటుంబసభ్యులకూ ఈ దేశంలో కొదవ లేదు. పిల్లలకు సముదాయించి మంచిచెడ్దలు నేర్పాలని నేటి సామాజికశాస్త్రం అంటున్నా అలా చేస్తే వాళ్ళు మొండిగా తయారైపోతారని పెద్దలభయం. ఇది అర్థం లేనిది. నిజానికి కొడితేనే మొండికెక్కుతారన్నదే వాస్తవం. ఏది ఏమైనా పిల్లల్ని దండించే పెద్దలపట్ల కొంచెం కఠినంగానే చట్టాలు వ్యవహరించితే కాని ఈ‌జాడ్యం దారికి రాదు.

      ఇకపోతే‌ ఇక్కడ భాష అనే రంగుపులమటం చేసింది పొరబడ్డ ఉపాద్యాయులు కాని స్పందించిన సమాజం కాదు. తెలుగుభాష మీది మక్కువకూ ఈ విషయంలో స్పందనకూ పరస్పరాశ్లేషం ఏమీ లేదు కాని అస్సలు సంబంధం‌ లేదనటం‌ అంత భావ్యం కాదు.

      జైగారూ, ప్రత్యేకించి ఆంగ్లంలో ఉటంకించటం వల్ల గాంబీర్యం పలుకుతుందని మీరు అనుకోవటం లేదని ఆశిస్తాను. ఎంతో చక్కగా వ్రాస్తూ మీరు మధ్యలో అక్కడక్కడ ఇంగ్లీషులో చెప్పటం ఎందుకన్నది బోధపడటం లేదు.

      Delete
  2. రహ్మానుద్దీన్ షేక్ గారూ, మీరు ప్రజ అనే చర్చా వేదిక/బ్లాగు నుండి ఉటంకించిన వాక్యాలలో ఎన్నోకొన్ని నావి. అంచేత నేను మీ టపాపై వ్యాఖానం చేస్తున్నాను.

    ముందుగా నా గురించి కొన్ని విషయాలు.

    1. నేను తెలుగు పండితుడిని కాను. నాకు తెలుగు భాష మీద కానీ ఈ టపాకు సంబందించిన ఇతర అంశాల గురించి కానీ పెద్ద అవగాహన లేదు.
    2. నేను తెలుగు వాడినని ఎప్పుడూ చెప్పుకోను. భాష అనేది identification parameter గా గుర్తించడం తప్పని నా అభిప్రాయం.

    మీరు రాసిన కొన్ని విషయాలు సమర్తించారు సంతోషం. తెలుగు ప్రాచీనమా కాదా అన్న నా సందేహాన్ని మీ దృక్పధం మీది.

    అయితే నాకు తెలిసి వేరే భాషల నుండి పదాలు స్వీకరించడం ఆధునిక భాషల లక్షణం. పన్నెండో శతాబ్దంలో ఒక రూపానికి వచ్చినట్టు భావించబడుతున్న ఉర్దూ నుండి వందలాది పదాలు తెలుగులో వాడడాన్ని ఎలా పరిగణించాలి?

    నిజానికి ప్రాచీనం అనే మాటకు వయసుతో నిమిత్తం లేదు. The correct term is "classical", not ancient. ఉ. ఇంగ్లీషు భాష పాత ఇంగ్లీషు (Old English) రూపంలో అయిదవ శతాబ్దం నుంచే ఉంది. ఇదొక్క విషయం ఆధారంగా ఇంగ్లీషు ప్రాచీన భాష అనలేము.

    ఇక మరుగున పడ్డ పదాలకొస్తే వాటిని బయటికి తీయడం ఎలా? గ్రామాలలో తిరిగి అక్కడ ప్రజల భాష గమనిస్తేనే ఇది సాధ్యం. నిఘంటువులు జనం గుండెల నుండి రావాలి, "మేధావుల" మేజుల నుండి కాదు.

    అన్నిటి కంటే ముఖ్యంగా భాషను రాజకీయాలను వేరు చేయాలి. భాషను భాషగానే చూడాలి. జాతి, రాష్ట్రం లాంటి కాన్సేప్తుల ప్రభావం నుండి బయట పడితేనే భాష అభివృద్ధి చెందుతుంది.

    ReplyDelete