Tuesday, April 2, 2013

రైళ్ళలో ఉచిత వైఫై సాధ్యాసాధ్యాలు


బిజినెస్ లైన్, హిందూ పత్రిక కథనం ఆధారంగా, రైళ్ళలో ఉచిత వైఫై సదుపాయం నేటితో ప్రారంభమయింది. మొట్టమొదటగా ఢిల్లీ-హౌరా రాజధాని ఎక్స్ప్రెస్‍లో ఈ సేవలను ప్రారంభించిన భారత రైల్వే వారు సంవత్సరాంతానికల్లా మరో 50 బళ్ళలో ఈ సదుపాయాన్ని అందిస్తామని పేర్కొన్నారట. ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తరువాత రైలు ప్రయాణికులు అంతర్జాలంలోని వివిధ జాలగూళ్ళనూ చూడటం, వేగులు పంపించుకోవటం, చాట్, యూట్యూబు వంటి దృశ్యక సేవలు ఇంకా జాలపు ఆటలు కూడా ఆడుకోవచ్చు. ప్రస్తుతానికి 4ఎంబీపీఎస్ దింపుకోలు వేగం, 512కేబీపీఎస్ ఎక్కింపు వేగం సామర్థ్యంతో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయట. భారతదేశపు కంపెనీ అయిన టెక్నోసాట్‍కమ్ ఈ సదుపాయాన్ని అందిస్తోన్న ప్రైవేటు కంపెనీ. ఈ-మెయిల్స్(వేగులు) ఇంకా ఆన్‍లైన్ ట్రాన్సాక్షన్స్(జాలపు అమ్మకాలు,కొనుగోళ్ళు) మొదటి ప్రాధాన్యత ఇవ్వబడే సేవలు. అంటే ఒకే సమయంలో ఆ 4Mbps ను రైలులో ఉన్న వాడుకరులకి సమానంగా పంచి ఇచ్చినా(సగటున 100 ప్రయాణీకులు వాడితే, ఒక్కొక్కరికి 400 Kbps వేగంతో నెట్ వస్తుంది), మిగితా సేవలు వాడే వారికి తక్కువ వేగం, పై రెండు సేవల వారికీ ఎక్కువ వేగం కల్పిస్తారుట. అలానే అశ్లీల జాలగూళ్ళు(porn sites)ను పూర్తి స్థాయిలో నిలిపివేస్తారుట. టోరెంట్ వంటి సేవలు కూడా నిలిపివేస్తారట.

సాంకేతిక వివరాలు : 
సాటిలైట్ ఆధారంగా 2G-3G హైబ్రిడ్ ఇంకా వైఫై ఆధారంగా ఈ సేవలు అందుతాయి. సాటిలైట్ అందుబాటులో ఉన్నంత వరకూ 2G-3G, సాటిలైట్ అందుబాటులో లేని అత్యవసర సమయాల్లో వైఫై రౌటర్ల ద్వారా జాలం అందుబాటులో ఉంటుంది కాబట్టీ 99శాతం జాల సంపర్కం ఉంటుంది. సాటిలైట్ ఆంటెనాను పవర్ రేక్ పై అమర్చుతారు. ఇది ప్రతి కోచ్ కు వైఫై రేడియోల ద్వారా అనుసంధానం చేయబడి ఉంటుంది.   కోచ్ వెలుపల ఉండే యాక్సెస్ పాయింట్ల ద్వారా ఇది ప్రయాణీకునికి చేరుతుంది.
రక్షణ:
ప్రభుత్వ శాఖయిన టెలికాం వారి సూచనల మేరకు ప్రతి ఒక్క వెబ్ కదలిక పంజీ చేయబడుతుంది. ప్రయాణీకులు తమ ఫోన్ నంబర్ తో పాటూ పీఎన్నార్ సంఖ్య, ప్రభుత్వం జారీ చేసిన ఏదయినా గుర్తింపు పత్రం(ఎన్నికల గుర్తింపు పత్రం లేదా ఆధార్ మొ॥) అందజేస్తే ఈ సేవలకు కావల్సిన సంకేత పదం ఇస్తారు. సంకేతపదం లేనిదే ఈ సేవను అనుభవించలేము. ఆ సంకేతపదం ఎసెమెస్ గా ఫోన్ కు వస్తుంది. త్వరలో ఇంటర్నెట్ టీవీ కూడా అందుబాటులోకి రానుందట.
ఈ తతంగమంతా వటానికి ఖర్చు దాదాపు రూ॥ 6.3 కోట్లట. ఈ సేవలు రాజధాని, శతాబ్ది ఇంకా దురొంతో రైళ్ళకు పొడిగిస్తారట.

ఇక సాధ్యాసాధ్యాల విషయానికి వస్తే, 
భారతీయులు మిక్కిలి(చాలా) వెధవతెలివి గలవారు. ఏదయినా సేవను సొంత ప్రయోజనలాకు వాడుకోక మానరు. రైళ్ళలో బాత్రూం అద్దం నుండీ కిటికీ కడ్డీల వరకూ తస్కరించే బాపతు మనం! ఈ విధమయిన దొంగతనాల నుండి ఎలా ఆయా రౌటర్, అంటెనాలను కాపాడుకుంటారో రైల్వే వాళ్ళు తేల్చుకోవాలి.
ఇక సేవల దుర్వినియోగంలోనూ మనమే అగ్రులం, మహాభారతం రామాయణం పేర్లతో porn చూడటం వీసీఆర్ల కాలంలోనే ఉంది. ఇక porn బ్లాక్ చేయటం అనేది ఈ విధంగా దాదాపు అసాధ్యం.
టారెంట్లు నిలుపు చేయటం ఒక విధంగా వ్యర్థమే, టారెంట్లు లేకపోతే నేరుగా వీడియోలు డౌనులోడ్ చేస్తారు, అందువల్ల ఇంకా బ్యాండ్ విడ్త్ పై ఎక్కువ భారం పడుతుంది.
ప్రస్తుత కథనాల ప్రకారం ఎలాంటి రక్షణలు కల్పిస్తున్నారో తెలీదు, అందువలన ప్రయాణీకుల క్రెడిట్ కార్డు, బ్యాంకు వివరాలు మొదలు ఈ-మెయిలు సంకేత పదాలు వరకూ బలహీన మరియు సున్నిత సమాచారం ఎప్పుడూ తోటి క్రేకర్ ప్రయాణికుల చేతుల్లో పెట్టి నెట్ వాడతన్నామని గమనించాలి.
ఎంత గట్టి రక్షణకయినా విరుగుడు క్షణాల్లో కనిపెట్టే సామర్థ్యం ఇండియన్ బ్లాక్ హాట్ క్రేకర్లకు గలదన్న విషయం రైల్వే వారూ ఇంకా ముఖ్యంగా ప్రయాణికులు గుర్తించాలి.
ఎంత అత్యవసరమయినా బ్యాంకింగ్ వంటి సేవలు వాడకపోవటమే సబబు.
ఇంకా దాదాపు 1000 మంది ప్రయాణికులు ప్రతి ట్రెయినులో ప్రయాణిస్తున్నపుడూ, కనీసం 500 మంది అయినా నెట్ వాడతారు, అలా 4 Mbps, ఎందుకూ సరిపోదు.
నేటి రైలు ప్రయాణాల్లో క్షుణ్ణంగా గమనిస్తే, ప్రతి 5గురిలో ఒకరు లేప్‍టాపు. ప్రతి 3గురిలో ఇద్దరు స్మార్ట్ ఫోన్ తో ఉన్నారు. అందుచేత నెట్ సౌకర్య్వంతం కాకుండా, ఇంకా ఎక్కువ తలనొప్పిగా మారటం మాత్రం ఖాయం.
ప్రత్యేకంగా చెప్పుకోదగినది పీఎన్నార్ సంఖ్య. పీఎన్నార్ సంఖ్య ఒక్కటికి ఒకే పాస్ వర్డ్ ఇస్తే, 6గురు ఒక్క సంకేతపదంతో లాగిన్ అవడం-దీనిని ఎలా సాధ్యపరుస్తారో చూడాలి.
ఈ విధంగా భారతీయ ప్రయాణికునికి ఈ సౌకర్యం సేవకన్నా పేద్ద తలనొప్పే!

Monday, February 11, 2013

నీవు మాయ ద్వారా సృష్టించబడ్డావా? లేక నీవే మాయను సృష్టించావా?


ನೀ ಮಾಯೆಯೊಳಗೊ
ನಿನ್ನೊಳು ಮಾಯೆಯೊ
నీవు మాయ ద్వారా సృష్టించబడ్డావా?
లేక నీవే మాయను సృష్టించావా?

ನೀ ದೇಹದೊಳಗೊ
ನಿನ್ನೊಳು ದೇಹವೊ
నీవు శరీరంలోని అవయవానివా?
లేక శరీరమే నీలో ఒక భాగమా?

ಬಯಲು ಆಲಯದೊಳಗೊ
ಆಲಯವು ಬಯಲೊಳಗೊ
(బయట లోపలుందా? లేక లోపల బయటుందా?)
శూన్యం ఇంట్లో ఉందా?
లేక ఇల్లు శూన్యంలో ఉందా?

ಬಯಲು ಆಲಯವೆರಡು
ನಯನದೊಳಗೊ
లేక ఈ ఇల్లు ఆ శూన్యం రెండూ చూసే కంట్లో ఉన్నాయా?

ನಯನ ಬುದ್ಧಿಯೊಳಗೊ
ಬುದ್ಧಿ ನಯನದೊಳಗೊ
ఈ కళ్ళళ్ళో బుద్ధి ఉన్నదా?
లేక బుద్ధిలో కళ్ళు ఉన్నాయా?

ನಯನ ಬುದ್ಧಿಗಳೆರಡು
ನಿನ್ನೊಳಗೊ ಹರಿಯೆ
లేక ఈ రెండూ-కళ్ళు ఇంకా బుద్ధి నీలోనే ఉన్నవా?

ಸವಿಯು ಸಕ್ಕರೆಯೊಳಗೊ
ಸಕ್ಕರೆಯು ಸವಿಯೊಳಗೊ
తీపిదనం పంచదారలో ఉందా?
లేక పంచదార తీపిదనంలో ఉందా?

ಸವಿಯು ಸಕ್ಕರೆಗಳೆರಡು
ಜಿಹ್ವೆಯೊಳಗೊ
లేక ఈ పంచదార, ఆ తియ్యదనం రుచి చూసే నాలుకలో ఉన్నాయా?

ಜಿಹ್ವೆ ಮನಸಿನೊಳಗೊ
ಮನಸು ಜಿಹ್ವೆಯೊಳಗೊ
ఆ నాలుక మనసులో ఉందా?
లేక మనసు నాలుకలో ఉందా?

ಜಿಹ್ವೆ ಮನಸುಗಳೆರಡು
ನಿನ್ನೊಳಗೊ ಹರಿಯೆ
లేక ఆ నాలుకా, ఈ మనసు నీలో ఉన్నాయా?

ಕುಸುಮದೊಳು ಗಂಧವೊ
ಗಂಧದೊಳು ಕುಸುಮವೊ
పూవులలో సువాసన ఉందా?
లేక సువాసనలో పూవులున్నవా?

ಕುಸುಮ ಗಂಧಗಳೆರಡು
ಘ್ರಾಣದೊಳಗೊ
లేక వాసన చూసే ముక్కుపుటల్లో ఆ పూలూ, ఇంకా సువాసన ఉన్నాయా?

ಅಸಮಭವ ಕಾಗಿನೆಲೆಯಾದಿಕೇಶವರಾಯ
ಉಸುರಲೆನ್ನಳವಲ್ಲ ಎಲ್ಲ
ನಿನ್ನೊಳಗೊ
నేను చెప్పలేకపోతున్నాను
కాగినెలెలోని ఆదికేశవా!
ఇవన్నీ నీ ఒక్కడిలోనే ఉన్నాయా?



రచన : కనకదాసు
తెలుగు అనువాదం : రహ్మానుద్దీన్ షేక్

చంద్రకళ గారి పొడిగింత :


భాష లో మాధుర్యం ఉందా , మాధుర్యం లో భాష ఉందా ?
లేక ఆ భాష, ఆ మాధుర్యం,  వినగలిగే చెవుల్లో ఉన్నాయా?

ప్రేమ లో స్పర్శ ఉందా ? లేక స్పర్శ లో ప్రేమ ఉందా ?
లేక ఆ ప్రేమ , ఆ స్పర్శ , ముట్టుకుని చేతుల్లో ఉన్నాయా ?


Sunday, January 27, 2013

విద్యార్థులకి వికీపీడియా

విద్యార్థులు-బడికెల్లేవారయినా, కాలేజీకి వెళ్ళేవారయినా- వికీపీడియాను ప్రాథమికంగా ఒక విజ్ఞాన నిధిగా వాడుకుంటున్నారు.
కానీ ఈ పోకడను విద్యానిపుణులు, అలానే ఉపాధ్యాయులు మొదలు ఆచార్యులందరూ విరోధిస్తున్నారు, గమ్మత్తయిన విషయమేమిటంటే ఆ ఉపాధ్యాయులు కూడా వికీపీడియానే. కారణలేమయినా కానీ, సమగ్రంగా ఉన్న విషయాలను కాకుండా వివిధ మూలాల నుండి విషయ సంగ్రహం కావాలి అన్నదే వీరి ఉద్దేశ్యం-చాలా సందర్భాలలో.
కొందరు గురువుల ప్రకారం నిత్యం మార్పులు చెందుతూ ఉండేది వికీపీడియా కనుక ఇది వాడకూడనిది!
సరే, విద్యార్థులు వికీపీడియా గురించి తెలుసుకోవలసిన విషయాలు కొన్ని పరిశీలిద్దాం :
1. ప్రతి ఒక్కరూ నిత్యమూ వికీపీడియాను వాడతారు. ఇందుకు ఉపాధ్యాయులూ మినహాయింపు కారు. ఏదయినా విషయం గురించి అవలోకనం చేసుకునేందుకు ఇది చాలా మంచి వనరు. సాధారణంగా ఇది దోషరహితంగా, విస్తారంగా ఇంకా తాజా సమాచారంతో నిండిన అంశాలను అందిస్తుంది.
2. ఇది ఎవరో కొందరు విద్యావేత్తలు తూతూ మంత్రంగా రాసి పడేసిన పరిశోధనా పత్రాలు కావు. కానీ ఆ పరిశోధనా పత్రాలను మీరు ప్రామాణికంగా చూపవచ్చు. అదే వికీపీడియాను ఈ విధంగా ప్రామాణికంగా వాడలేము. నిజానికి అమెరికాలో కొన్ని విశ్వవిద్యాలయాలు వికీపీడియాను ప్రామాణిక వనరులుగా వాడటంపై నిశేధం విధించాయి. గమనించాల్సిన విషయమేమిటంటే ముద్రిత ఎన్సైక్లోపీడియానూ, నిఘంటువునూ, వార్తా పత్రికను, బ్లాగునూ మొ॥వాటిని వనరులుగా వాడరాదు.
3. వికీపీడియా నిబంధన ప్రకారం ప్రతి వ్యాసమూ కచ్చితంగా ప్రామాణిక వనరులను చూపాలి. ఆ విధంగా ఒక విషయం గురించి పరిశోధన చెయ్యాలనుకునేవారు, వికీపీడియాలో ఆ వ్యాసం యొక్క ప్రామాణిక వనరులు(మూలాలను) వాడి పరిశోధన మొదలుపెట్టవచ్చు.
4. వికీపీడియాలోని వాక్యాలను నేరుగా అభ్యాసాల్లో, ప్రకరణ పత్రాల్లో, పరిశోధన పత్రాల్లో రాయటం బుద్ధి తక్కువ పనే అవుతుంది.
5. ముందుగా పరిశోధనకు సంబంధించిన వ్యాసాలను వికీపీడియాలో అభ్యసించి, వాటి చర్చలను క్షుణ్ణ్ణంగా పరిశీలించి ఆపై మీ పరిశోధనలను మొదలు పెట్టవచ్చు. ఇది మీ పరిశోధనలో భాగంగా కూడా చేసుకోవచ్చు. 

Tuesday, December 11, 2012

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్త్వం విడుదల చేసిన సరికొత్త తెలుగు ఖతులు

౨వ అంతర్జాతీయ తెలుగు
అంతర్జాల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విడుదల చేసిన ఖతులు :

ఈ ఖతులను తెలుగు విజయం జాలగూడు నుండి దింపుకోవచ్చు. 


Thursday, October 11, 2012

లలితమ్మకు నీరాజనం


శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు।
మా తల్లి లత్తుకకు నీరాజనం
కెంపైన నీరాజనం - భక్తి పెంపైన నీరాజనం ॥

యోగీంద్ర హృదయాల మ్రోగేటి మాతల్లి।
బాగైన అందెలకు నీరాజనం
బంగారు నీరాజనం - భక్తి పొంగారు నీరాజనం ॥

నెలతాల్పు డెందాన  వలపు వీణలు మీటు
మాతల్లి    గాజులకు నీరాజనం 
రాగాల   నీరాజనం - భక్తి తాళాల   నీరాజనం ॥

మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు
మాతల్లి నవ్వులకు  నీరాజనం 
ముత్యాల  నీరాజనం - భక్తి  నృత్యాల నీరాజనం ॥

చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి  అలరారు
మా తల్లి ముంగెరకు నీరాజనం 
రతనాల నీరాజనం - భక్తి జతనాల నీరాజనం ॥

పసి బిడ్డలను చేసి  -  ప్రజనెల్ల పాలించు
మాతల్లి చూపులకు నీరాజనం 
అనురాగ నీరాజనం - భక్తి కనరాగ నీరాజనం  ॥ 

దహరాన కనిపించు ఇనబింబ మనిపించు
మాతల్లి కుంకుమకు భక్తి నీరాజనం 
నిండిన నీరాజనం  భక్తి మెండైన నీరాజనం॥

తేటి పిల్లలు వోలె గాలి కల్లలలాడు
మాతల్లి కుఱులకూ నీరాజనం 
నీలాల నీరాజనం - భక్తి భావాల నీరాజనం ॥

జగదేక మోహిని  సర్వేశ గేహిని
మా తల్లి రూపునకు నీరాజనం
నిలువెత్తు   నీరాజనం - భక్తి నిలువెత్తు   నీరాజనం  ॥