Wednesday, July 17, 2013

పసిఫిక్ రిమ్ అనబడే ఓ ఆంగ్ల చిత్రరాజము

బ్లాగ్మిత్రుల ప్రోద్బలంతో వారి సహవాసంలో, మామూలుగా థియెటర్ కి వెళ్ళి సినిమాలు చూడని నేను, బెంగుళూరులోని బెల్లందూరు సెంట్రల్ లో ఈ సినిమా చూడటం జరిగింది. 3D సినిమా అనుకొని వెళితే ఆ హాలువాడు అటూ ఇటూ కత్తిరించి తెరలో మూడులో రెండితల తెరపైనే సినిమాను నడిపాడు. చిన్న తెర, పైగా అటూఇటూ కత్తిరించేసి, ఓ పెద్ద సైజు 40" స్క్రీనున్న హోం థియేటర్ లో సినిమా చూసిన ఫీల్ వ్వచ్చింది. ఇక ఆ థియేటర్ లోని ఇతర సదుపాయాలు పరమ చెత్తగా ఉన్న విషయం గుర్తుంచుకోవాలి. సినిమా తెరల ప్రాంగణంలో ఒక పెద్ద కొలాజ్ ఏర్పాటు చేసాడు. అది అందరు సినీ తారలను పెట్టాలని చేసాడో, లేక ఆ హాలులో ఆడిన సినిమాల నటీ నటూల ఫుటోలో తెలీదు కానీ, ఫుటోల ఎంపికలో చాలా లోటు ఉంది, మా అన్నయ్య తన అభిమాన నటుడి ఫుటో కోసం ఓ నాలుగు మార్లు అన్ని ఫుటోలు పరికించి లేడని నిర్ధారించుకున్నాక ఆ నటుడు వీరెవరికీ సాటి రాడు, అందుకని వీరి మధ్య అతనికి స్థానం అనవసరమని సంతృప్తి పడ్డాడు. థియేటర్ వాడి మరో పొదుపు చిట్కా మధ్యమధ్యలో ఏసీ ఆపివేయటం మాత్రం నాకూరికే ఉక్కపోసేలా చేసింది. ఇక సినిమా కథలోకి వస్తే, కైజూలనబడే గ్రహాంతరవాసులు సమీప భవిష్యత్తు(అంటే 2017 ప్రాంతంలో) పసిఫిక్ సముద్రం అడుగులోని మహాద్వీపాంతర భూతల పొరలనుండి పైకి వచ్చి తీరనగరాలను నాశనం చేస్తాయి. నాశనం అంటే అలా ఇలా కాదు; ఏకంగా శాన్‍ఫ్రాన్సిస్కో లోని వంతెనని కూల్చివేయడం లక్షల మంది జనాభాను చంపేయటం వగైరా. ఈ తెలీని వింత జంతువులను కట్టడి చేసి మట్టుబెట్టేందుకు భారీ స్థాయిలో యేగర్ అనే మహామఱమానవులని నిర్మించి, వాటిని నియంత్రించేందుకు ఇద్దరు మనుషులను పైలట్లుగా ఉంచి, వారి మెదడుల్లోని ఆలోచనలను ఒకరిది మరొకరితో మిళితం చేసి ఆ వచ్చిన మహా మస్తిష్క శక్తి ద్వారా ఈ యేగర్లను నడుపుతారు. (ఒంటరి పైలట్ తో చేసిన పరిశోధనలలో ఒక మనిషి మెదడు తట్టుకోలేక పోతే, ఆ యేగర్ యంత్రం కుడి భాగం ఒకరు, ఎడమ భాగం ఒకరు నియంత్రించేలా అదే సమయంలో ఒకరి ఆలోచనలు మరొకరు అన్వయించుకునేలా సిద్ధం చేస్తారు శాస్త్రజ్ఞులు). మొదట్లో కైజూలు ఒక మోస్తరుగా పుష్కరానికి ఒకటి చ్ప్పున, తర్వాత్తర్వాత మరింత తక్కువ వ్యవధిలో దాడులు చేయటం మొదలు పెడతాయి. ఈ యేగర్లు కూడా మొదట్లో కైజూలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నా, తర్వాత్తర్వాత కైజూలు యేగర్ల దాడులకి తగ్గట్టూ సిద్ధమయి రావటం మొదలుపెడతాయి. దాంతో ప్రపంచ నాయకుల సమాఖ్య యేగర్లను రద్దు చేసి తీరాల్లో గోడలు కట్టడం మొదలుపెట్టడానికి మొగ్గు చూపుతుంది. ఆ గోడల నిర్మాణం అయ్యే వరకూ రక్షణగా మిగిలిన నాలుగు యేగర్లను నియమిస్తారు. కానీ ఆ నాలుగిటినీ నడిపేందుకు సమర్ధమయిన వారు లెక్కకు సరిపోరు. దీంతో యేగర్ల కూతగాడు(కమాండర్) స్టాకర్ పెంటకోస్ట్ ఒక ప్లాన్ ను రూపొందించి అణుశక్తితో కైజూలను చంపాలని పథకమేస్తాడు. కొన్నేళ్ళ క్రితం కైజూను మట్టుపెడుతూ యేగర్ ను నడుపుతున్న వారిలో ఒకడయిన రాలీ బెకెట్ ను ఆశ్రయిస్తాడు పెంటెకోస్ట్. అదే పోరులో తన అన్నను పోగొట్టుకుని అతని ఆలోచనల సంఘర్షణలో యేగర్ ప్రాజెక్ట్ ను వదిలి గోడ కడుతున్న సిబ్బందిలో మామూలు కూలీగా ఉన్న రాలీ పెంటేకోస్ట్ అభ్యర్థన మేరకు తిరిగి వచ్చేందుకు, యేగర్ ను నడిపేందుకు ఒప్పుకుంటాడు. హాంగ్ కాంగ్ వద్ద ఉన్న గోడ కట్టే ప్రదేశం, పక్కనే ఉన్న యేగర్ల ప్రయోగశాలకు వెళతారు. అక్కడ మాకో మొరి అనే అమ్మాయి రాలీకి తారసపడుతుంది. ఆవిడని తన పక్కన యేగర్ కోపైలట్ గా ఎంచుకుంటాడు రాలీ. వీరిద్దరూ యేగర్ లోకి ప్రవేశించినప్పుడు ఆమె ఆలోచనలలో మిళితమయినపుడు ఆమె గతం గురించి తెలుసుకుని, ఆమె పెంటెకోస్ట్ పెంచుకున్నామె అని తెలుసుకుంటాడు. రెట్టించిన ఉత్సాహంతో యేగర్లను తుదముట్టించేందుకు సిద్ధమవుతాడు. అదే సమయంలో కైజూలపై పరిశోధన చేస్తున్న ఇద్దరు వైజ్ఞానికులు తమ పరిశోధన ఫలితాలను తెలిపి విస్తుపోతారు. న్యూటన్ గిజ్లర్ ఒక న్యూరోశాస్త్రజ్ఞుడు తన మెదడులోని ఆలోచనలను యేగర్లో జరిగే పద్ధతిలో కైజూమెదడుకి అనుసంధానం చేస్తాడు తద్వారా కైజూలను తుదముట్టించే ఉపాయం ఇస్తాడు. మొత్తానికి పెంటెకోస్ట్ ప్రాణార్పణ, రాలీ మికోల యేగర్ లోని అణు బాంబుతో శత్రు కైజూ స్థావరాన్ని పూర్తిగా నాశనం చేసి వీరిద్దరూ బయట పడటంతో సినిమా సుఖాంతమవుతుంది. అయితే ఎంతటి సాంకేతిక కల్పనయినా సాంకేతిక పరిమితులను 70లలోకి తీసుకుపోయి చూపించడం నాకు నచ్చలేదు. రాబోయే రోజుల్లో సాంకేతికంగా ఆయుధాలు సినిమాలో చూపించిన దానికంటే ఎన్నో రెట్లు మెరుగ్గా, మానవరహితంగా తయారవుతాయని ఇట్టే ఊహించొచ్చు. మొత్తం మీద బావుంది!

Tuesday, June 4, 2013

నిర్వాణ షట్కము

మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం,
న చ శ్రోత్ర జిహ్వే, న చ గ్రాణ నేత్రేః,
న చ వ్యోమ భూమిర్, న తేజో న వాయు,
చిదానంద రూపా శివోహం, శివోహం.

న చ ప్రాణ సంజ్ఞో, న వై పంచ వాయుః,
న వా సప్త ధాతుర్, న వా పంచ కోశ,
న వాక్ పాణి పాదం, న చోపస్థ పాయుః,
చిదానంద రూపా శివోహం, శివోహం

న మే ద్వేష రాగౌ, న మే లోభ మోహౌ,
న మే వై మదో నైవ మాత్సర్య భావః,
న ధర్మో న చార్ధో, న కామో న మోక్షః,
చిదానంద రూపా శివోహం, శివోహం

న పుణ్యం న పాపం, న సౌఖ్యం న దుఃఖం,
న మంత్రో న తీర్థం, న వేదా న యజ్ఞః,
అహం భోజనం, నైవ భోజ్యం న భోక్తా,
చిదానంద రూపా శివోహం, శివోహం

న మే మృత్యు శంకా, న మే జాతి భేదా,
పితా నైవ, మే నైవ మాతా, న జన్మః,
న బంధుర్ న మిత్రం, గురుర్ నైవ శిష్యః,
చిదానంద రూపా శివోహం, శివోహం

అహం నిర్వికల్పో నిరాకార రూపో,
విభూత్వస్చ సర్వత్ర సర్వేంద్రియణాం,
న చా సంగతం, నైవ ముక్తిర్ న మేయా,
చిదానంద రూపా శివోహం, శివోహం


Thursday, April 18, 2013

నిరంజన రాముడు


ఎటువంటి మచ్చ లేని వాడయిన(నిరంజనుడయిన) రాముడే విశిష్టమయినవాడు. మిగితా అంతా మలినమయినది. సృష్టి కళంకితమయింది. ఓంకారమూ కళంకితమే. అశుద్ధత ఈ అపవిత్రతను ఇంకా వ్యాపించేలా చేస్తోంది. విధి అయిన బ్రహ్మ, శంకరుడూ, ఇంద్రుడూ అందరూ కల్మషులు. గోవిందుడు-గోపికలతో పాటూ కళంకితుడు.
మాట-పాట-నృత్యం అశుద్ధాలు. వేదాలు కళంకితమయినవి. చదువు, పాఠం, నేర్పు, పాట, నృత్యం గ్రంథ-పుస్తకాలన్నీ మలినమయినవి.
జ్ఞానం అందరి నోళ్ళలో పడి చెడిపోయింది. కానీ రాముడు మాత్రం మలిన రహితుడు, కళంక రహితుడు, కల్మష రహితుడు. ఇదే కబీరు వాక్కు. 

Tuesday, April 2, 2013

రైళ్ళలో ఉచిత వైఫై సాధ్యాసాధ్యాలు


బిజినెస్ లైన్, హిందూ పత్రిక కథనం ఆధారంగా, రైళ్ళలో ఉచిత వైఫై సదుపాయం నేటితో ప్రారంభమయింది. మొట్టమొదటగా ఢిల్లీ-హౌరా రాజధాని ఎక్స్ప్రెస్‍లో ఈ సేవలను ప్రారంభించిన భారత రైల్వే వారు సంవత్సరాంతానికల్లా మరో 50 బళ్ళలో ఈ సదుపాయాన్ని అందిస్తామని పేర్కొన్నారట. ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తరువాత రైలు ప్రయాణికులు అంతర్జాలంలోని వివిధ జాలగూళ్ళనూ చూడటం, వేగులు పంపించుకోవటం, చాట్, యూట్యూబు వంటి దృశ్యక సేవలు ఇంకా జాలపు ఆటలు కూడా ఆడుకోవచ్చు. ప్రస్తుతానికి 4ఎంబీపీఎస్ దింపుకోలు వేగం, 512కేబీపీఎస్ ఎక్కింపు వేగం సామర్థ్యంతో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయట. భారతదేశపు కంపెనీ అయిన టెక్నోసాట్‍కమ్ ఈ సదుపాయాన్ని అందిస్తోన్న ప్రైవేటు కంపెనీ. ఈ-మెయిల్స్(వేగులు) ఇంకా ఆన్‍లైన్ ట్రాన్సాక్షన్స్(జాలపు అమ్మకాలు,కొనుగోళ్ళు) మొదటి ప్రాధాన్యత ఇవ్వబడే సేవలు. అంటే ఒకే సమయంలో ఆ 4Mbps ను రైలులో ఉన్న వాడుకరులకి సమానంగా పంచి ఇచ్చినా(సగటున 100 ప్రయాణీకులు వాడితే, ఒక్కొక్కరికి 400 Kbps వేగంతో నెట్ వస్తుంది), మిగితా సేవలు వాడే వారికి తక్కువ వేగం, పై రెండు సేవల వారికీ ఎక్కువ వేగం కల్పిస్తారుట. అలానే అశ్లీల జాలగూళ్ళు(porn sites)ను పూర్తి స్థాయిలో నిలిపివేస్తారుట. టోరెంట్ వంటి సేవలు కూడా నిలిపివేస్తారట.

సాంకేతిక వివరాలు : 
సాటిలైట్ ఆధారంగా 2G-3G హైబ్రిడ్ ఇంకా వైఫై ఆధారంగా ఈ సేవలు అందుతాయి. సాటిలైట్ అందుబాటులో ఉన్నంత వరకూ 2G-3G, సాటిలైట్ అందుబాటులో లేని అత్యవసర సమయాల్లో వైఫై రౌటర్ల ద్వారా జాలం అందుబాటులో ఉంటుంది కాబట్టీ 99శాతం జాల సంపర్కం ఉంటుంది. సాటిలైట్ ఆంటెనాను పవర్ రేక్ పై అమర్చుతారు. ఇది ప్రతి కోచ్ కు వైఫై రేడియోల ద్వారా అనుసంధానం చేయబడి ఉంటుంది.   కోచ్ వెలుపల ఉండే యాక్సెస్ పాయింట్ల ద్వారా ఇది ప్రయాణీకునికి చేరుతుంది.
రక్షణ:
ప్రభుత్వ శాఖయిన టెలికాం వారి సూచనల మేరకు ప్రతి ఒక్క వెబ్ కదలిక పంజీ చేయబడుతుంది. ప్రయాణీకులు తమ ఫోన్ నంబర్ తో పాటూ పీఎన్నార్ సంఖ్య, ప్రభుత్వం జారీ చేసిన ఏదయినా గుర్తింపు పత్రం(ఎన్నికల గుర్తింపు పత్రం లేదా ఆధార్ మొ॥) అందజేస్తే ఈ సేవలకు కావల్సిన సంకేత పదం ఇస్తారు. సంకేతపదం లేనిదే ఈ సేవను అనుభవించలేము. ఆ సంకేతపదం ఎసెమెస్ గా ఫోన్ కు వస్తుంది. త్వరలో ఇంటర్నెట్ టీవీ కూడా అందుబాటులోకి రానుందట.
ఈ తతంగమంతా వటానికి ఖర్చు దాదాపు రూ॥ 6.3 కోట్లట. ఈ సేవలు రాజధాని, శతాబ్ది ఇంకా దురొంతో రైళ్ళకు పొడిగిస్తారట.

ఇక సాధ్యాసాధ్యాల విషయానికి వస్తే, 
భారతీయులు మిక్కిలి(చాలా) వెధవతెలివి గలవారు. ఏదయినా సేవను సొంత ప్రయోజనలాకు వాడుకోక మానరు. రైళ్ళలో బాత్రూం అద్దం నుండీ కిటికీ కడ్డీల వరకూ తస్కరించే బాపతు మనం! ఈ విధమయిన దొంగతనాల నుండి ఎలా ఆయా రౌటర్, అంటెనాలను కాపాడుకుంటారో రైల్వే వాళ్ళు తేల్చుకోవాలి.
ఇక సేవల దుర్వినియోగంలోనూ మనమే అగ్రులం, మహాభారతం రామాయణం పేర్లతో porn చూడటం వీసీఆర్ల కాలంలోనే ఉంది. ఇక porn బ్లాక్ చేయటం అనేది ఈ విధంగా దాదాపు అసాధ్యం.
టారెంట్లు నిలుపు చేయటం ఒక విధంగా వ్యర్థమే, టారెంట్లు లేకపోతే నేరుగా వీడియోలు డౌనులోడ్ చేస్తారు, అందువల్ల ఇంకా బ్యాండ్ విడ్త్ పై ఎక్కువ భారం పడుతుంది.
ప్రస్తుత కథనాల ప్రకారం ఎలాంటి రక్షణలు కల్పిస్తున్నారో తెలీదు, అందువలన ప్రయాణీకుల క్రెడిట్ కార్డు, బ్యాంకు వివరాలు మొదలు ఈ-మెయిలు సంకేత పదాలు వరకూ బలహీన మరియు సున్నిత సమాచారం ఎప్పుడూ తోటి క్రేకర్ ప్రయాణికుల చేతుల్లో పెట్టి నెట్ వాడతన్నామని గమనించాలి.
ఎంత గట్టి రక్షణకయినా విరుగుడు క్షణాల్లో కనిపెట్టే సామర్థ్యం ఇండియన్ బ్లాక్ హాట్ క్రేకర్లకు గలదన్న విషయం రైల్వే వారూ ఇంకా ముఖ్యంగా ప్రయాణికులు గుర్తించాలి.
ఎంత అత్యవసరమయినా బ్యాంకింగ్ వంటి సేవలు వాడకపోవటమే సబబు.
ఇంకా దాదాపు 1000 మంది ప్రయాణికులు ప్రతి ట్రెయినులో ప్రయాణిస్తున్నపుడూ, కనీసం 500 మంది అయినా నెట్ వాడతారు, అలా 4 Mbps, ఎందుకూ సరిపోదు.
నేటి రైలు ప్రయాణాల్లో క్షుణ్ణంగా గమనిస్తే, ప్రతి 5గురిలో ఒకరు లేప్‍టాపు. ప్రతి 3గురిలో ఇద్దరు స్మార్ట్ ఫోన్ తో ఉన్నారు. అందుచేత నెట్ సౌకర్య్వంతం కాకుండా, ఇంకా ఎక్కువ తలనొప్పిగా మారటం మాత్రం ఖాయం.
ప్రత్యేకంగా చెప్పుకోదగినది పీఎన్నార్ సంఖ్య. పీఎన్నార్ సంఖ్య ఒక్కటికి ఒకే పాస్ వర్డ్ ఇస్తే, 6గురు ఒక్క సంకేతపదంతో లాగిన్ అవడం-దీనిని ఎలా సాధ్యపరుస్తారో చూడాలి.
ఈ విధంగా భారతీయ ప్రయాణికునికి ఈ సౌకర్యం సేవకన్నా పేద్ద తలనొప్పే!